కొండెక్కుతున్న అక్షరజ్యోతులు

  • 535 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కొట్టి నాగాంజనేయులు

  • హైదరాబాదు
  • 9394450007
కొట్టి నాగాంజనేయులు

పొరుగు రాష్ట్రాల్లో ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. పరాయి ప్రాంతాల్లోని తెలుగు పాఠశాలలు అతివేగంగా అంతర్ధానమవుతున్నాయి. స్థానిక ప్రభుత్వాల సహాయ నిరాకరణకు మన పాలకుల నిష్క్రియాపరత్వం తోడవటమే ఈ పరిస్థితికి కారణం. స్పందించి చేయూతనందించకపోతే... అమ్మభాషలో చదువుకోవాలనుకుంటున్న లక్షల మంది  తెలుగు చిన్నారుల ఆశ అడియాసవుతుంది.
నిమిది లక్షలు... మన రాష్ట్ర సరిహద్దులకవతల ఉంటూ తెలుగు చదువుకునే వారి సంఖ్య ఇది. అయితే, ఇది ఒకప్పటి మాట. ఇతర రాష్ట్రాల్లో ఉంటూ తెలుగును ప్రథమ/ ద్వితీయ/ తృతీయ భాషగా చదువుకునే విద్యార్థుల సంఖ్య ఇప్పుడు రెండు లక్షలకు కొంచెం అటూ ఇటూగా మాత్రమే. హైదరాబాద్‌లోని మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం, ప్రవాస తెలుగు సంఘాలు తేల్చిన లెక్కలే ఇవి. తెలుగేతర రాష్ట్రాలు తమ సొంత భాషలకు ప్రాధాన్యతనిస్తూ మన భాషను పక్కనపెట్టడం ఈ దుస్థితికి ఒక కారణమైతే... పరాయి రాష్ట్రాల్లోని తెలుగు విద్యార్థులనూ, వారి ద్వారా ఆయా ప్రాంతాల్లో తెలుగునూ రక్షించాల్సిన బాధ్యతను మన రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోవడం మరో ప్రధాన హేతువు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లోని పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని పూర్తిగా నిలిపివేశాయి. తెలుగు ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలను మూసివేస్తున్నాయి. తెలుగు పాఠ్యపుస్తకాల తయారీపై కూడా శ్రద్ధ చూపించట్లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో నవోదయతో పాటు సీబీఎస్‌ఈ పాఠ్యాంశాలతో నడుస్తున్న కొన్ని విద్యాలయాల్లో మినహా ఇతర పాఠశాలల్లో తెలుగు కనుమరుగయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
      తొంభయ్యో దశకం చివరి వరకూ పొరుగు రాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగిన తెలుగు పాఠశాలలు ఇప్పుడు అంపశయ్యపై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రల్లో పదమూడేళ్ల కిందట 800 వరకూ ఉన్న తెలుగు మాధ్యమ పాఠశాలల సంఖ్య ఇప్పుడు 200కు పడిపోయింది. ప్రస్తుతం తమిళనాడులో 80, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటకల్లో 40 చొప్పున మాత్రమే పాఠశాలలు నడుస్తున్నాయి. మిగిలిన ఉత్తరాది రాష్ట్రాల్లో మరో వంద వరకూ తెలుగు మాధ్యమ బళ్లు ఉండవచ్చని అంచనా.
పాలకులే శత్రువులు
తమిళనాడులోని తిరువళ్లూరు, మధురై, తంజావూరు, శివకాశి, వెల్లూరు, కృష్ణగిరి, ధర్మపురి, చెన్నై, సేలం జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో తెలుగు పాఠశాలలు ఉండేవి. కృష్ణగిరి, ధర్మపురి జిల్లాల్లోనే 40 వరకూ బళ్లు తెలుగులో అక్షరాలను దిద్దించేవి. చెన్నై నగరంలోనైతే 20 వరకూ నడిచేవి. అయితే, వీటిలో తెలుగు ఉపాధ్యాయుల భర్తీని అక్కడి ప్రభుత్వం 1985 నుంచి నిలిపివేసింది. దీంతో ఒక్కో పాఠశాల కనుమరుగవుతోంది. అరకొరగా ఉన్న పాఠశాలల్లోనూ తెలుగు మాధ్యమంలో పరీక్ష రాయాలంటే ప్రత్యేక ప్రశ్నాపత్రాలకు ఒక్కో విద్యార్థి రూ.500 చెల్లించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ 60 వేల మంది విద్యార్థులు తెలుగు మాధ్యమంలో చదువుతున్నారు. 2006 ముందు వరకూ తెలుగు పాఠ్యపుస్తకాలను తమిళనాడు ప్రభుత్వమే రూపొందించి విద్యార్థులకు అందజేసేది. ఆ తరువాత వచ్చిన కరుణానిధి ప్రభుత్వం త్రిభాషా సూత్రానికి తిలోదకాలిచ్చింది. ద్వితీయ, తృతీయ భాషలుగా రాష్ట్ర పాఠశాలల్లో కొనసాగుతున్న తెలుగు, మలయాళం, కన్నడ భాషల పుట్టిముంచే ఉత్తర్వులను వెలువరించింది. రాష్ట్ర విద్యార్థులందరూ తప్పనిసరిగా తమిళ మాధ్యమంలోనే చదవాలని ఆదేశించింది. దీనిపై అన్యభాషా విద్యార్థుల నుంచి నిరసన వ్యక్తమైనా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఈ పరిస్థితి వల్ల రాబోయే పదేళ్లలో తమిళనాడులో తెలుగు పాఠశాలలే కనిపించని ప్రమాదం ముంచుకొస్తోంది. తమిళనాడు పాలకుల నిర్ణయం వల్ల మలయాళ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై కేరళ ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మన రాష్ట్ర ప్రభుత్వంలోనైతే ఈమాత్రం కదలిక కూడా కరవైంది.  
మనం మంచే చేస్తున్నా...
ఒడిశాలో తెలుగు జనాభా 40 లక్షల పైమాటే. ఒకప్పుడు తెలుగు విద్యార్థుల సంఖ్య ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండేది. అయితే పుస్తకాల ముద్రణకు ఒడిశా ప్రభుత్వం ముందుకు రాకపోవడం, ఉపాధ్యాయుల నియామకాన్ని నిలిపివేయడంతో తెలుగు చదవాలనుకునే విద్యార్థుల సంఖ్య రానురాను తగ్గిపోతోంది. ఇతర రాష్ట్రాల్లో చదువుకునే ఒడియా విద్యార్థుల కోసం శాసనసభా సంఘాన్ని ఏర్పాటు చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం... తమ దగ్గర ఉన్న తెలుగు విద్యార్థులను కనీసం పట్టించుకోవట్లేదు. జూన్‌ 21, 1986న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా విద్యామంత్రుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఆయా భాషల విద్యార్థుల రక్షణకు రెండు రాష్ట్రాల్లోనూ డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌(డీఐ) స్థాయి అధికారులను నియమించాలి. ఆంధ్రప్రదేశ్‌లోని ఒడియా విద్యార్థుల కోసం ఆ అధికారి పనిచేస్తున్నా ఒడిశా ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ డీఐని నియమించలేదు. ఒడిశాలోని పర్లాకిమిడి, రాయఘడ, కోరాపుట్‌, జైపూర్‌, బరంపురం, గజపతి, గంజాం, నవరంగ్‌పూర్‌, సంబల్‌పూర్‌, బర్గాడ్‌ జిల్లాలోని అట్టుబీరా ప్రాంతాల్లో ఒకప్పుడు ఎక్కువ సంఖ్యలో తెలుగు పాఠశాలలు ఉండేవి. ఇరవై ఏళ్ల కిందట కటక్‌లో అయిదు తెలుగు విద్యాలయాలుంటే ప్రస్తుతం ఉందిఒక్కటే. పూరిలో 75వేల మంది తెలుగువారున్నా అక్కడ ఒక్క తెలుగు బడి కూడా లేదు.
      ఒడిశాలో రెండువేల మంది తెలుగు ఉపాధ్యాయుల ఖాళీలున్నట్లు రెండు దశాబ్దాల కిందట ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. త్వరలోనే వాటిని భర్తీ చేస్తామని చెప్పింది. అది నేటికీ ఆచరణలోకి రాలేదు. తెలుగు పాఠ్యపుస్తకాల సమస్యను కూడా అక్కడి ప్రభుత్వం తీర్చట్లేేదు. అయినా... కారుచీకట్లలో కాంతిరేఖల్లా తెలుగుపై మమకారమున్న కొందరు తల్లితండ్రులు తెలుగు మాధ్యమ పాఠశాలల్ని వెతికి మరీ తమ పిల్లలను వాటిలో చదివిస్తున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఒడియాలో ఉండే పాఠ్యాంశాలను తెలుగులో ముద్రించి ప్రైవేటు సంస్థలు ఎక్కువ ధరలకు అమ్ముతున్నాయి. మరోవైపు... పర్లాకిమిడిలోని తెలుగు ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాన్ని ఒడిశా పాలకులు రద్దు చేశారు. అయితే, మన దగ్గర శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, మందసల్లో ఒడియా అధ్యాపక కోర్సులు నేటికీ నడుస్తున్నాయి.
తమ రాష్ట్ర విద్యార్థులకు అమ్మభాషలో చదువు అందేలా జాగ్రత్త పడటంతో మన పాలకులకూ, ఒడిశా పెద్దలకూ మధ్య హస్తమశకాంతరం ఉంది. దీనికి ఉదాహరణ... రాష్ట్రంలోని ఒడియా మాధ్యమ పాఠశాలలను రద్దు చేయడానికి కొన్నేళ్ల కింద మన ప్రభుత్వం ప్రయత్నించింది. నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది. దీనిపై ఒడిశా విద్యావేత్తలు, రాజకీయ నాయకులు అభ్యంతరాలు తెలిపారు. ఒడియా పాఠశాలలను కొనసాగించాల్సిందేనని మన ప్రభుత్వంపై ఒడిశా పాలకులు ఒత్తిడి తెచ్చారు. దాంతో మనవాళ్లు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అదే సమయంలో ఒడిశా ప్రభుత్వం తెలుగు పాఠశాలలను మూసివేత స్థితికి తీసుకెళ్తున్నా మన ప్రభుత్వ పెద్దలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లే ఉంటున్నారు.
మిగిలిన చోట్లా అంతే
కర్ణాటకలోని బళ్లారి, తుమ్‌కూర్‌, చిత్రదుర్గ, రాయచూర్‌, బెంగళూరు, కోలార్‌, బీదర్‌, గుల్బర్గా, చిక్‌బళ్లాపూర్‌ జిల్లాల్లో అత్యధికంగా తెలుగు ప్రజలు నివాసముంటున్నారు. ఇక్కడ తెలుగు పాఠశాలల నిర్వహణకు ఆ రాష్ట్రప్రభుత్వం విముఖత వ్యక్తం చేయకున్నా పుస్తకాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇదే సమస్యతో అసోంలోని దిబ్రూగఢ్‌, తీన్‌సుకియా ప్రాంతాల్లోని తెలుగు పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాష్ట్రంలోని పాఠశాలలకు మొదట్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలను పంపించేది. కానీ, 2004 తరువాత నుంచి అవి రావట్లేదని అక్కడి తెలుగు సంఘాల సభ్యులు చెబుతున్నారు. తెలుగు పాఠశాలలకు అత్యంత ఆదరణ ఉండే పశ్చిమ బెంగాల్‌లోనూ పరిస్థితులు దిగజారుతున్నాయి. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో 40 పాఠశాలలుంటే ఇప్పుడవి 25కు తగ్గిపోయాయి. గుజరాత్‌, ఢిల్లీ, హర్యానా, ఛత్తీస్‌ఘఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోనూ కొన్ని తెలుగు పాఠశాలలున్నాయి. కానీ, వాటికీ పైన చెప్పుకున్న కష్టాలు తప్పట్లేదు.
      మహారాష్ట్రలోని నాందేడ్‌, చంద్రపూర్‌, నాగపూర్‌, పూణే, షోలాపూర్‌, బలార్షా, ముంబయిల్లో తెలుగు పాఠశాలలున్నాయి. ఇక్కడి అంబర్‌నాథ్‌ ప్రాంతంలో ప్లస్‌టూ వరకూ తెలుగులో చదివే వీలుంది. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో దాదాపు పది తెలుగు పాఠశాలలున్నాయి. ఆ దీవుల రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌లో తెలుగులో ప్లస్‌టూ వరకూ చదువుకునే అవకాశమూ ఉంది.
      పుస్తకాలు కావాలంటూ వివిధ రాష్ట్రాల్లోని తెలుగు విద్యార్థుల నుంచి మన రాష్ట్ర ప్రభుత్వానికి అనేక అభ్యర్థనలు వస్తున్నాయి. వాటిని పరిశీలించి ఆయా ప్రాంతాల అవసరాల మేరకు పుస్తకాలను, అక్కడి ఉపాధ్యాయులకు ఉపయుక్తమైన బోధనా వనరులను తెలుగు విశ్వవిద్యాలయంలోని అంతర్జాతీయ తెలుగు కేంద్రం సమకూర్చుతోంది. అయితే, అందుకుతగ్గ ఆర్థిక వనరులు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో తెలుగు విద్యార్థులకు పూర్తి న్యాయం చేయలేని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోని ఆంధ్ర ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న అయిదు తెలుగు పాఠశాలలకు ఒకటి నుంచి అయిదో తరగతి వరకూ పుస్తకాలను తెలుగు విశ్వవిద్యాలయమే ముద్రించి పంపుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 6,7,8 తరగతులకు సైతం పుస్తకాలు తయారు చేసే పనిలో ఉంది. వీటితోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న నవోదయ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి తెలుగు కోరుకునే విద్యార్థులకు పుస్తకాలందించేందుకు అంతర్జాతీయ తెలుగు కేంద్రం సమాయత్తమవుతోంది. సీబీఎస్‌ఈ పాఠశాలల్లోనూ తృతీయ భాషగా తెలుగు ఎంచుకునే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలనూ ఆ కేంద్రం అందిస్తోంది. అయితే ఈ పుస్తకాలు, విద్యార్థుల సంఖ్య స్వల్పం. ఇతర రాష్ట్రాల్లో తెలుగు చదువుకునే విద్యార్థులకు ఆయా రాష్ట్రాల పాఠ్య ప్రణాళికల అనుగుణంగా తెలుగు పుస్తకాలను పంపిణీ చేసే పనిని రాష్ట్ర ప్రభుత్వం భుజాన వేసుకుంటే తప్ప తెలుగు విద్యార్థులకు మేలు జరగదు.  పరాయి భాషా ప్రాంతాల్లో ఉంటూ కూడా మాతృభాషను మర్చిపోకుండా... తమ పిల్లలకు అమ్మభాషలోనే చదువు చెప్పించాలని తపించే ప్రవాసాంధ్రులకు అవసరమైన సాయం చేయడం మన పాలకుల కనీస బాధ్యత. దాన్నుంచి  తప్పించుకుంటే అమ్మభాషకు అన్యాయం చేసినట్లే.


వెనక్కి ...

మీ అభిప్రాయం