అమ్మభాష అవమానపడినప్పుడు తలపక్కకు తిప్పుకొని వెళ్లిపోయే వారితో జాతికి ప్రమాదం. ఉమ్మనీటిలో ఉన్నప్పుడే ఊపిరిలో భాగంగా మారిన అమ్మభాషను తక్కువ చేసి మాట్లాడిన వారి మదమణచే వీరపుత్రులున్నప్పుడు జాతి యావత్తూ తలెత్తుకుని తిరుగుతుంది. స్పానిష్ భాష మాట్లాడే అమెరికాలోని హిస్పానిక్ జాతీయులు ఇలాగే అభిమానధనుల్లా జీవిస్తున్నారు. తమ నెత్తిన ఆంగ్లాన్ని రుద్దాలని చూస్తున్న వారికి ఐకమత్యంతో బుద్ధి చెబుతున్నారు.
వందల ఏళ్ల కిందట నుంచి నిన్న మొన్నటి వరకూ అమెరికాకు వలస వచ్చిన స్పెయిన్, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాల వారే హిస్పానిక్లు. గణనీయమైన సంఖ్యలో ఉన్న వీరి మాతృభాష స్పానిష్. అమెరికాలోని అన్నిచోట్లా వీరు నివసిస్తున్నా న్యూమెక్సికోలో మాత్రం వీరి ప్రాబల్యం అధికం. ఈ రాష్ట్ర జనాభాలో 46.7 శాతం మంది హిస్పానిక్లే. వారందరూ తమ మాతృభాషను కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారు. వారి భాషాభిమానాన్ని నిరూపించే పరిణామమొకటి ఇటీవల చోటుచేసుకుంది.
అమెరికాలోని అతిపెద్ద సేంద్రియ ఆహార దుకాణాల సముదాయం హోల్ఫుడ్స్ ఇన్కార్పొరేటెడ్. ఈ సంస్థకు న్యూమెక్సికోలోని అల్బుకర్క్ నగరంలో ఓ దుకాణం ఉంది. బ్రయాన్ బల్దిజాన్, ల్యూప్ గొంజాలెస్ అనే ఇద్దరు హిస్పానిక్లు అందులో పని చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట వారిని యాజమాన్యం విధుల నుంచి ఒకరోజు పాటు తాత్కాలికంగా తొలగించింది. ఇంతకూ వారు చేసిన నేరం ఏంటంటే... విధుల్లో ఉన్నప్పుడు తమ అమ్మభాషలో మాట్లాడుకోవడమే. అవును... వారిద్దరు చేసిన పాపమదే. విధినిర్వహణలో ఉన్న ఉద్యోగులు తమలో తాము కానీ, వినియోగదారులతో కానీ ఆంగ్లంలో మాత్రమే మాట్లాడాలన్నది సంస్థ నిబంధన. దాన్ని ఉల్లంఘించారని చెప్పి బ్రయాన్, ల్యూప్లను శిక్షించారు సంస్థ పెద్దలు. ఈ విషయం బయటకురాగానే న్యూమెక్సికోలో భూకంపం పుట్టింది. హిస్పానిక్లు మండిపడ్డారు. వారం రోజుల్లో తన భాషావిధానాలను మార్చుకోకపోతే హిస్పానిక్, లాటిన్ అమెరికన్ సంతతి ప్రజలు హోల్ఫుడ్స్ దుకాణాలను బహిష్కరిస్తారని న్యూమెక్సికో రాష్ట్ర లాటిన్ అమెరికన్ ప్రజల ఐక్య సంఘం హెచ్చరించింది. అంతర్జాలంలోనూ హోల్ఫుడ్స్ తెంపరితనంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. హిస్పానిక్ జాతీయురాలైన న్యూమెక్సికో మహిళా గవర్నర్ సుజానా మార్టినెజ్ తన వారికి అండగా నిలబడ్డారు. పద్ధతుల్ని మార్చుకోవాలని హోల్ఫుడ్స్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చారు. భాషాపరమైన వివక్షను ఈసడించుకునే శ్వేతజాతి అమెరికన్లు కూడా సంస్థకు వ్యతిరేకంగా గళమెత్తారు. దాంతో హోల్ఫుడ్స్ యాజమాన్యం దిగివచ్చింది. ‘భాషకు సంబంధించి మేం రూపొందించిన నియమావళి లోపభూయిష్టంగా ఉండి అపార్థాలు సృష్టించినందుకు క్షమాపణలు చెబుతున్నా’మంటూ ప్రకటించింది. ఆంగ్లానికి అగ్రతాంబూలమిచ్చే సంస్థ భాషావిధానాన్ని సవరించింది. ఇది హిస్పానిక్ల విజయం. మాతృభాషాప్రేమికుల విజయం. కలిసిన గడ్డిపోచల ధాటికి ఎంతటి మదగజమైనా లొంగిరావాల్సిందేనని నిరూపించిన ఘటన ఇది. తెలుగు నేలపై తెలుగుకు పెద్దపీట దక్కాలని తపించే వారికి ఇంతకు మించిన స్ఫూర్తి ఏముంటుంది!