ఆదివాసీ అక్షరానికి ‘అమ్మ’

  • 738 Views
  • 0Likes
  • Like
  • Article Share

    బిల్లాడి భాస్కర్‌రెడ్డి

  • హైదరాబాదు
  • 8008001948
బిల్లాడి భాస్కర్‌రెడ్డి

నాలుగు దశాబ్దాల కిందట అంతర్ధానానికి అడుగు దూరంలోకి వెళ్లిపోయిన ఆ ఆదివాసీ అక్షరం ఇప్పుడు అజరామరమైంది. ఒకప్పుడు జాతిజనుల నోటికీ దూరమైన ఆ ప్రాచీన పలుకు తిరిగి ప్రాణం పోసుకోవడమే కాదు... అమ్మభాషలో చదువు, నిఘంటువుల కొలువు, సాంకేతికమైన హొయలతో నవతరానికి నేస్తమైంది. కెనడా భూమిపుత్రుల భాషను బతికించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన డా।। మార్గరెట్‌ మెకంజీ కృషి ఫలితమిది. భాషోద్యమకారులకు స్ఫూర్తినిచ్చే ఓ మహిళ ప్రస్థానమిది.
సామ్రాజ్యవాదం ఆ సంచార తెగ సంస్కృతిని ఛిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా ఆ జాతి మాతృభాషను మరణం అంచులకు తీసుకెళ్లింది. ఆంగ్లం, ఫ్రెంచి భాషల ఉమ్మడి ఆధిపత్యానికి తలొగ్గక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ జాతీయులు తమ సొంత భాషకు దూరమయ్యారు. తరాలు గడిచేకొద్దీ అమ్మభాషలో మాట్లాడటమూ ఆపేశారు. ఆ పరిస్థితుల్లో మార్గరెట్‌ మెకంజీ వచ్చారు. ఆ జాతి భాషను బతికించడానికి కంకణబద్ధులయ్యారు. ఆదివాసీ పిల్లలకు అమ్మభాషను చేరువ చేయడానికి పాఠ్యపుస్తకాలను రూపొందించారు. పాఠశాలల పెద్దలను ఒప్పించి మాతృభాషలో విద్యాబోధనను ప్రారింభింపజేశారు. ఆ జాతి వాడుక భాషలో ఉన్న పదాలన్నింటినీ సేకరించి నిఘంటువులను తయారు చేశారు. పారిభాషిక పదనిధులను సృష్టించారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా మొబైల్‌ యాప్స్‌ను రూపొందించారు. ఇంకా ఎన్నో చేస్తున్నారు. మూడు పుష్కరాల కిందట విద్యార్థిగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన తన కృషిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారీ న్యూఫౌండ్‌ల్యాండ్‌ స్మారక విశ్వవిద్యాలయ భాషాశాస్త్ర విభాగాధిపతి.
ఆ జాతి... ‘ఇన్ను’
కెనడాలోని లాబ్రాడర్‌, క్యుబెక్‌ ప్రాంతాల్లో ‘ఇన్ను’ తెగ ప్రజలు వేలాది సంవత్సరాలుగా నివసిస్తున్నారు. వారి మాతృభాష ఇన్ను-ఐమున్‌ (ఆల్గొంక్వియన్‌ భాషాకుటుంబం). వేటాడుకుంటూ, కొండ ప్రాంతాల్లో సంచార జీవితం సాగిస్తూ బతికేవారు ఒకప్పుడు. మూడువందల ఏళ్ల కిందట వారి జీవితాల్లోకి యూరోపియన్లు వచ్చారు. వస్తూ వస్తూ యుద్ధాలను, వ్యాధులను వెంటబెట్టుకొచ్చారు. వాటి ధాటికి ‘ఇన్ను’ తెగ తట్టుకోలేకపోయింది. దాంతో చివరికి ఏ కొద్దిమంది ప్రజలో మిగిలారు. (అప్పట్లో వారి జనాభా 8 - 9 వేల లోపే. ఇప్పుడు 18 వేలు) మారిన పరిస్థితుల్లో వారు సంచార జీవితాన్ని వదిలిపెట్టి గ్రామాల్లో స్థిరపడ్డారు. కానీ, కొత్త సంస్కృతుల మధ్య ఇమడలేకపోయారు. దానికి తోడు నిర్బంధ ప్రాథమిక విద్యా విధానం అమలులోకి రావడంతో మరికొంత చితికిపోయారు. చదువు మంచిదే కానీ, పాఠశాలల్లో ఆంగ్లం, ఫ్రెంచి భాషల్లో మాత్రమే బోధన సాగడమే సమస్య. ఇంట్లో ఇన్ను-ఐమున్‌ మాట్లాడే పిల్లలు బళ్లో అన్యభాషలను అభ్యసించాల్సి వచ్చేసరికి (అదీ హఠాత్తుగా) ఠారెత్తిపోయేవారు. ఉన్నత పాఠశాలలకు వచ్చేసరికి 70 శాతం మంది బడి మానేసే వారు. దాంతో ఇన్నులు చాలా వేగంగా పేదరికపు లోయల్లోకి పడిపోయారు. అదే సమయంలో తమదైన సంస్కృతినీ కోల్పోయారు.
అడకత్తెరలో పోకచెక్కలు
ఇన్ను-ఐమున్‌ భాషకు మొదట్లో లిపి లేదు. క్రైస్తవ మిషనరీ ఫాదర్‌ బ్రస్సీ 1769లో ఇన్నుకు లిపి తయారు చేశారు. దాని సాయంతో ఇన్ను పిల్లలకు చదువు చెప్పేవారు. తర్వాత బైబిల్‌ ఇన్ను-ఐమున్‌లోకి వచ్చింది. 1851కి నాటికి దాన్ని చదవగలిగే స్థాయిలో ఇన్నులు అక్షరజ్ఞానం సంపాదించుకున్నారు. తర్వాత పరిణామాల్లో వారు చెల్లాచెదురు కావడంతో వారి భాష ‘రాత’లో ఎదగలేదు. 1940వ దశకంలో ఇన్నులు స్థిరనివాసం ఏర్పరచుకోవడం ప్రారంభించారు. వారి పిల్లలు ఆంగ్ల, ఫ్రెంచి భాషా పాఠశాలలకు వెళ్లేవారు. అక్కడ చదువు ‘అర్థం’కాక మధ్యలోనే మానేసేవారు. కానీ, దైనందిన జీవితంలో భాగంగా యూరోపియన్లతో మాట్లాడటానికి ఆంగ్లం, ఫ్రెంచి భాషల్లో ఏదో ఒకదాన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి! పరస్పర విరుద్ధమైన ఈ సంక్లిష్ట పరిస్థితుల సంధి యుగంలో ఇన్నులు నలిగిపోయారు. రాను రానూ ఇన్ను-ఐమున్‌ ఇంటికే పరిమితమైంది. 1970వ దశకం నాటికి    ఇన్ను యువత ఆంగ్లం, ఫ్రెంచి భాషలకు మాత్రమే అలవాటుపడిపోయింది. అప్పుడే మార్గరెట్‌ మెకంజీ రంగంలోని దిగారు.
వేగుచుక్క
మార్గరెట్‌ తన చిన్నతనంలో కొద్దికాలం పాటు ఉత్తర క్యూబెక్‌ ప్రాంతంలోని మిస్టిస్సీనీ సమీపంలో నివసించారు. అప్పుడే ఆమె మొదటిసారి ‘ఇన్ను’లను చూశారు. క్రమంగా వారి సంస్కృతిపై ఆసక్తి పెంచుకున్నారు. తర్వాత భాషాశాస్త్రంలో పరిశోధన విద్యను పూర్తి చేశారు. ప్రస్తుతం న్యూఫౌండ్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ ఇన్ను-ఐమున్‌ కోసం కృషి చేస్తున్నారు. ఈ నాలుగు దశాబ్దాల్లో ఆమె, ఇన్నులు నివసించే పల్లెలన్నింటిలో పర్యటించారు. వారి భాషలో వాడుకలో ఉన్న పదాలన్నింటినీ సేకరించారు. వాటిని ఇన్ను పెద్దలతో పలికించి ఉచ్చారణ విధానాన్ని రికార్డు చేశారు. ఇన్ను - ఆంగ్లం, ఇన్ను - ఫ్రెంచి నిఘంటువులు ఏడింటిని ప్రచురించారు. ఇటీవలే, 27 వేల పదాలను గుదిగుచ్చి ఇన్ను - ఆంగ్లం - ఫ్రెంచి త్రిభాషా నిఘంటువును తయారు చేశారు. ఆల్గొంక్వియన్‌ భాషలకు సంబంధించి ఇదే సమగ్ర నిఘంటువు. కొన్ని ప్రైవేటు సంస్థల ఆర్థిక సాయంతో, మిత్రుల తోడ్పాటుతో ఈ ప్రాజెక్టులను పూర్తి చేశారు. ఆంగ్ల, ఫ్రెంచి మాధ్యమ చదువులకు బెదిరి బడి మానేసిన పిల్లలను బడిబాట పట్టించడానికి ఇన్ను-ఐమున్‌ పాఠ్యపుస్తకాలను రూపొందించారు మార్గరెట్‌. పాఠశాలల వర్గాలతో మాట్లాడి ఇన్ను-ఐమున్‌ బోధనకు ఒప్పించారు. ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఫలితంగా ఇన్ను పిల్లలు ఇప్పుడు ఇన్ను-ఐమున్‌లో చదువుకుంటూ ఆంగ్లం, ఫ్రెంచి నేర్చుకుంటున్నారు.
      ఇన్ను మౌఖిక సాహిత్యానికి శాశ్వతత్వాన్ని కల్పించారు మార్గరెట్‌. ఇన్ను పెద్దల నుంచి సేకరించిన కథలను పుస్తక రూపంలో ప్రచురించారు. రెండు వెబ్‌సైట్లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా భాషా బోధన చేస్తున్నారు. పదాలకు అర్థాలను చెప్పడమే కాదు వాటి ఉచ్చారణను తెలియజేసే ఉపకరణాలనూ ఆ వెబ్‌సైట్లలో పొందుపరిచారు. త్రిభాషా నిఘంటువును కూడా వాటిలో పెట్టారు. దీంతో పాటు 27 వేల ఇన్ను-ఐమున్‌ పదాలు, వాటికి సరిపోయే 60 వేల ఆంగ్ల పదాలు, ఒక్కో ఇన్ను పదానికి ఒక్కో ఉదాహరణ వాక్యం (ఉచ్చారణతో సహా), పదాల సమానార్థకాలతో సహా పూర్తిస్థాయి ఐఫోన్‌, ఐపాడ్‌ యాప్స్‌ను తయారు చేశారు. వాటిని అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచారు. ఆరోగ్య, పర్యావరణ, న్యాయ రంగాలకు సంబంధించి ఇన్ను-ఐమున్‌ పారిభాషిక పద నిఘంటువులనూ తయారుచేశారు. ప్రస్తుతం వైద్య రంగానికి సంబంధించిన పదాలపై కసరత్తు చేస్తున్నారు. దాంతో పాటు బాలసాహిత్యం, అంతర్జాల అక్షరక్రీడల రూపకల్పనలో తలమునకలై ఉన్నారు. ఇన్ను ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా మార్గరెట్‌కు కొద్దిరోజుల కిందటే ప్రతిష్ఠాత్మకమైన కెనడా సోషల్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ ‘ఇన్‌సైట్‌’ పురస్కారం లభించింది. దీంతో ఆమె భాషా పరిశోధనలకు రూ.3 కోట్ల సాయం అందబోతోంది.
      తన మూలాలు, గత చరిత్ర, సంస్కృతుల గురించి తెలియని జాతి... వేళ్లు లేని చెట్టుతో సమానం. అది నిలబడటం అసంభవం. తరాలకతీతంగా జాతి జనుల నాలుకలపై నాట్యం చేసే మాతృభాషలోనే జాతి సంస్కృతి నిలిచి ఉంటుంది. అమ్మభాష అంతరించిన నాడు జాతి అస్తిత్వం అదృశ్యమవుతుంది. ఇన్ను-ఐమున్‌ భాష కోసం మార్గరెట్‌ ఇంతగా తపన పడటానికి కారణమిదే.
      కొసమెరుపేంటంటే... ఇన్ను- ఐమున్‌ మార్గరెట్‌ అమ్మభాష కాదు!


వెనక్కి ...

మీ అభిప్రాయం