తెలుగు దీపం...మలయా ద్వీపం...

  • 1497 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। టి.ఎస్‌.రావు

  • మానసిక వైద్యులు
  • విజయవాడ
  • 9440150731
డా।। టి.ఎస్‌.రావు

అది మలేసియా ప్రధానమంత్రి నజీబ్‌ రజాక్‌ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీ. ఈ ఏడాది మార్చి 30న దాని గోడపై ఓ సందేశం ప్రత్యక్షమైంది. దాని సారాంశం... తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఆంగ్లంలో అభినందన సందేశాన్ని రాస్తూనే ‘ఉగాది శుభాకాంక్షలు’ అనే రెండు పదాలను మాత్రం తెలుగులోనే చెప్పారాయన.
      ఓ విదేశీ ప్రధాని మనకెందుకు శుభాకాంక్షలు చెప్పారు? అదీ మన భాషలో? ఎందుకంటే... ఆయన పరిపాలిస్తున్న దేశంలో మనవాళ్లు నాలుగు లక్షలకు మందికి పైగా ఉన్నారు కాబట్టి!
      నూటయాభై ఏళ్ల కిందట విశాఖ పట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి ప్రాంతాల నుంచి ఎక్కువగా, చిత్తూరు జిల్లా నుంచి ఓ మోస్తరుగా మలేసియాకు వలస వెళ్లిన తెలుగు వారి వారసులు వారు. తరాల కిందటే తెలుగు నేలను వదిలినా... తెలుగు భాష, సంప్రదాయాలను మాత్రం వారు వదులుకోలేదు. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే మలయా సమాజంలో భాగమయ్యారు. ఉన్నత శిఖరాలకు ఎదిగారు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ప్రత్యేకంగా పండగ శుభాకాంక్షలు చెప్పారంటే అదే కారణం.
      మలయా తెలుగు వారు బయట ఏ భాషలో మాట్లాడినా ఇంట్లో మాత్రం అమ్మభాషలోనే మాట్లాడుకుంటారు. వారాంతాలు, సెలవుల్లో పిల్లలకు తెలుగు బోధన చేయిస్తారు. జానపద కళలు నేర్పిస్తారు. తెలుగుపై వారి అభిమానం అనుపమానం. తెలుగు సంస్కృతిపై వారి ప్రేమ అనిర్వచనీయం. మూడు రోజుల మలేసియా పర్యటనలో మేం ప్రత్యక్షంగా గమనించిన విషయమది అంటున్నారు విజయవాడకు చెందిన మానసిక వైద్యులు డా।। టి.ఎస్‌.రావు. మలయా ద్వీపంలో వీస్తున్న తెలుగు మలయమారుతం గురించి ఆయన ఇంకేం చెబుతున్నారంటే....
‘బెర్సెకుటు బెర్తంబాహ్‌ ముటు’  
      మలయా భాషలో దీనికర్థం ఐకమత్యమే మహాబలం. మలేసియా జాతీయ నినాదమిది. మలయన్లు, చైనీయులు, తమిళులు, తెలుగువారు... ఇలా విభిన్న జాతులు, సంస్కృతుల సమ్మేళనం మలయా ద్వీపం. గత ఒకటిన్నర శతాబ్దాల్లో మలేసియాలో రబ్బరు పరిశ్రమ అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి వలసలెక్కువయ్యాయి. కష్టపడి పని చేయడం, విలువలకు కట్టుబడి జీవించడం... తెలుగు వారిలో కనపడే ఈ లక్షణాలను మలేసియా ప్రజలు అభిమానిస్తారు.
      మలేసియా తెలుగు ప్రజల జీవన విధానం గురించి తెలుసుకోవడంతో పాటు, అక్కడి తెలుగు చిన్నారులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇవ్వాలన్న ఆలోచనతో వ్యక్తిత్వ వికాస నిపుణులు డా।। ఎం.వి.రావు, ‘విక్టరీ’ ప్రచురణకర్త ఇమ్మడిశెట్టి రామ్‌కుమార్‌, నేను అక్కడికి బయల్దేరాం. చెన్నై విమానాశ్రయం నుంచి మూడున్నర గంటలు ప్రయాణించి రాత్రి 12.30కు ఆ దేశ రాజధాని కౌలాలంపూర్‌ చేరుకున్నాం.
‘నమస్కారమండీ.... మలేసియాకు మీకు స్వాగతం’ అంటూ మమ్మల్ని అచ్చతెలుగులో పలకరించి పరిచయం చేసుకున్న మనిషిని చూసి ఆశ్చర్యపోయాం. అక్కడ స్థిరపడిన ఓ తెలుగు కుటుంబానికి నాలుగో తరం ప్రతినిధి ఆయన. మలేసియా తెలుగు సంఘం(టామ్‌) అధ్యక్షుడు. తెలుగు సంస్కృతీ, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న ఆ వ్యక్తి డా।। అచ్చయ్య కుమార్‌ రావు. వృత్తిరీత్యా వైద్యుడైన ఆయనకు స్థానికంగా మంచి పేరుంది. మలేసియా పౌరులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా అక్కడి ప్రభుత్వం నుంచి ఉన్నత పౌరపురస్కారం ‘డటక్‌’ను అందుకున్నారాయన.
      దేశం కాని దేశంలో మమ్మల్ని ఎవరు ఎలా పలకరిస్తారోనని కొద్దిపాటి ఆందోళనకు గురవుతున్న మాకు.... ఆ స్థాయి వ్యక్తి ఎదురొచ్చి స్వాగతించడం ఆశ్చర్యంగా అనిపించింది. ఆయన మాత్రం ఎలాంటి భేషజమూ లేకుండా మా సామాన్లను కారులో పెట్టడానికి సాయపడుతున్నారు. ఎక్కడ ఉన్నా, ఎన్ని తరాలు గడిచినా తెలుగు వారి ఆప్యాయతలు, పలకరింపుల్లో ఇసుమంతైనా మార్పు ఉండదు కదా!
ఎటు చూసినా తెలుగే
మా పర్యటనలో తొలి మజిలీ... రవాంగ్‌లోని సుప్రసిద్ధ బౌద్ధ దేవాలయం. ఉదయాన్నే ఆ గుడికి వెళ్లాం. ఆలయ నిర్మాణశైలి అద్భుతం. అక్కడి ప్రశాంత వాతావరణం మా ప్రయాణ బడలికను పూర్తిగా తొలగించింది. దేవాలయానికి ఆనుకునే, అయిదు ఎకరాల్లో మలేసియా తెలుగు సంఘం కేంద్ర కార్యాలయం ఉంది. అక్కడ తెలుగు పిల్లలకు వారాంతపు తరగతులు నిర్వహించడానికి గదులున్నాయి. వాటి గోడల నిండా తెలుగు తిథులు, వారాలు, నక్షత్రాలు, సూక్తులు, శతక పద్యాల వంటివి అందంగా రాసి ఉన్నాయి. తెలుగు సంఘం సభ్యులు, వారి పిల్లలు మా కోసం అక్కడ ఎదురు చూస్తున్నారు. మేం వెళ్లగానే చక్కటి తెలుగులో పలకరించారు. అక్కడి వాతావరణమంతా సుసంపన్న తెలుగుతో ఆహ్లాదభరితంగా ఉంది.
మలేసియాలోని తెలుగు నవతరానికి నాలుగు దశల్లో తెలుగు భాషా కోర్సులను నిర్వహిస్తోంది పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. దానికిగాను వారాంతాల్లో తరగతులు నిర్వహిస్తారు. పిల్లలకు తెలుగు నేర్పడంలో గొట్టాపు దుర్గాప్రియ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆమె భర్త గొట్టాపు నాగేశ్వరరావు కెమికల్‌ ఇంజినీర్‌. పదేళ్ల కిందట ఆయనతో కలిసి మలేసియా వచ్చారు దుర్గాప్రియ. ఈ దంపతులు తెలుగు సంఘంలో స్వచ్ఛంద సేవకులుగా పని చేస్తూ పిల్లలకు భాషను బోధిస్తున్నారు.
మలేసియాలోని తెలుగువారిలో ప్రతిఒక్కరూ తమ కుటుంబసభ్యులతో, తెలుగు సంఘం సభ్యులతో తప్పనిసరిగా తెలుగులో మాట్లాడతారు. దాని వల్ల అక్కడి తెలుగు పిల్లలంతా చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు. స్థానిక భాషల ప్రభావం అక్కడక్కడా ధ్వనించినా... మన యాసలు వారి మాటల్లో స్పష్టంగా వినిపిస్తాయి. ఇప్పుడిప్పుడే చదవడం, రాయడం నేర్చుకుంటున్నారు.
స్థానిక మానసిక వైద్యులు అప్పుడప్పుడూ తమ పాఠశాలల్లో కౌన్సిలింగ్‌లు నిర్వహిస్తారని పిల్లలు చెప్పారు. అయితే, మేం తెలుగులో చెప్పడం వల్ల అన్ని విషయాలూ మరింత బాగా అర్థమయ్యాయన్నారు. మాతృభాష మహిమ అది. అన్నట్లు అక్కడి వాళ్లు మన రాష్ట్రంలోని ఊళ్లు, నదుల పేర్లను గుర్తుపట్టగలరు. ఆయా ఊళ్లను గురించి ఎంతోకొంత సమాచారం చెప్పగలరు.
మధ్యాహ్నం 20 ఏళ్లలోపు పిల్లలతో మాట్లాడాం. ప్రతి అంశంపైనా చక్కని అవగాహన, స్పష్టత కనిపించాయి వారిలో. మన దేశ యువత విద్య ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళుతున్నారు. కానీ, మలేసియాలో పుట్టి పెరిగిన తెలుగు యువతీ యువకులు మాత్రం భారత్‌లో చదువుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. భారతదేశమే మా మాతృభూమి అనే భావన వారిలో బలంగా ఉంది. వారాంతపు తరగతులకు హాజరైనప్పుడు కూడా మొదట ‘తెలుగు భాషా, సంప్రదాయాలను గౌరవిస్తాం. పరిరక్షిస్తాం’ అంటూ ప్రతిజ్ఞ చేస్తారు. తెలుగు నాట ప్రతి రోజూ ఉదయం అన్ని పాఠశాలల్లో ఈ మాట వినిపిస్తే ఎంత బాగుంటుందో అనిపించింది మాకు!
వస్త్రధారణ విషయానికొస్తే సాధారణంగా మలేసియన్‌ పద్ధతిలోనే ఉంటుంది. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రం మన సంప్రదాయ కట్టుబొట్టులోనే కనిపిస్తారు. తెలుగు సంఘం తరఫున నిర్వహించే కార్యక్రమాల్లో అబ్బాయిలు పంచెలతో, అమ్మాయిలు లంగా ఓణీలతో వెలిగిపోతుంటారు. తోరణాలు కట్టడం, కోలాటమాడటంలో పోటీ పడుతుంటారు. వారి సంబరాలను కళ్లారా చూడాల్సిందే.
గాయస్‌ అంటే గాయత్రి
తెలుగు నేలకు దూరమై శతాబ్దాలు గడచినా మలేసియా తెలుగువారి ఆచార వ్యవహారాల్లో పెద్దగా మార్పు రాలేదు. ఇంకా చెప్పాలంటే... తరాల కిందట మన పెద్దలు ఆచరించిన సంప్రదాయాలు ఇప్పటికీ వీరి దగ్గర సజీవంగా ఉన్నాయి. మన ప్రాచీన సంప్రదాయ వైభవాన్ని తెలుసుకోవాలంటే చాలాకాలం కిందట ఇలా దేశాన్ని విడిచివెళ్లిన కుటుంబాలను దగ్గరగా చూస్తే సరిపోతుందేమో!
పిల్లలకు నక్షత్రాన్ని బట్టే పేర్లు పెడుతున్నారు. కాకపోతే అక్కడి పేరులాగే ధ్వనించడానికి, స్థానిక ఉచ్చారణకు అనువుగా కొన్ని మార్పులు చేస్తున్నారు. ఉదాహరణకు మేం కలిసిన వారిలో గాయస్‌ అని ఒకమ్మాయి ఉంది. గాయత్రి అనే పేరుకు రూపాంతరం ఆమె నామధేయం. ఇలాంటి తమాషా పేర్లు అక్కడ చాలానే కనిపిస్తాయి.
ఇక్కడి తెలుగు వాళ్లు వినాయక చవితి, వరలక్ష్మీవ్రతం వంటి పండగలను సామూహికంగా చేసుకుంటున్నారు. వాటితో పాటు ఏడాదిలో ఒకసారి 21 రోజులపాటు చిన్నపాటి ఉత్సవాలు నిర్వహించుకుంటారు. వాటిలో భాగంగా చిడతల భజన, జానపద నృత్యాలు, గొబ్బి పాటలు, త్యాగరాజు, అన్నమాచార్యుల కీర్తనల్లో శిక్షణ ఇస్తారు. నైపుణ్యమున్న వారు ప్రదర్శనలిస్తారు. చిన్నాపెద్దా అంతా ఉత్సాహంగా వీటిలో పాల్గొంటారు. మన దగ్గర నుంచి విశ్వవిద్యాలయ ఆచార్యులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించి కార్యశాలలను నిర్వహిస్తుంటారు.
ఎక్కడకు వెళ్లినా నమస్కారమండీ అంటూ రెండు చేతులూ జోడించి పలకరించే వారు. తర్వాత కరచాలనమూ చేసేవారు. ఆ సమయంలో వారి కళ్లలో ఏదో మెరుపు. చివరకు ఒక పెద్దాయన దానికి కారణమేంటో చెప్పారు. అది వినగానే మా మనసు పులకరించిపోయింది. ఇంతకూ ఆయనేం చెప్పారంటే... ‘భారతదేశం నుంచి వచ్చిన మిమ్మల్ని తాకినప్పుడు మళ్లీ మన దేశానికి వెళ్లివచ్చిన అనుభూతి కలుగుతోంది’.
అక్కడి వారిచ్చిన ఆతిథ్యమూ మర్చిపోలేనిదే. తెలుగు సంఘం తరఫున ఎ.డి.నాయుడు, ఆయన బృందం మాకు వసతి, భోజన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అచ్చయ్య కుమార్‌ ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ మాకు ఎలాంటి లోటూ జరగనివ్వలేదు. తెలుగు వారి ఇళ్లల్లో తెలుగు భోజనాలు చేశాం. ఆ వంటకాల ఘుమఘుమలను మనసారా ఆస్వాదించాం.
పర్యటన చివరి రెండు రోజుల్లో వ్యక్తిగత కౌన్సిలింగులు నిర్వహించాం. వాటికి వచ్చిన వారిలో చాలామంది ‘మేం భారతదేశంలోనే పుట్టుంటే బాగుండేద’ని అన్నారు. రత్నగర్భ అంటే వారికంత ప్రేమ!
మలేసియా పర్యటన పూర్తయ్యాక సింగపూర్‌ వెళ్లాం. స్థానిక తెలుగు సంఘం, తెలుగు కుటుంబాలతో కలిసి ఆనందానుభూతులను పంచుకున్నాం. ట్విన్‌టవర్స్‌, బటర్‌ఫ్లై, బర్డ్స్‌ పార్క్‌లను సందర్శించాం. యూనివర్సల్‌ స్టూడియో, ఐలాండ్‌ కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి. వాటిని చూడటానికి సమయం సరిపోలేదు. తిరుగుప్రయాణానికి విమానమెక్కేశాం.
కళ్లు మూసుకుంటే.... మలేసియాలో మొదటి సభ ప్రారంభంలో పిల్లలు పాడిన ప్రార్థనా గీతం మా మనసులో లీలగా మెదిలింది. ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అంటూ ఆ రోజు ఆ చిన్నారులు ఎంత శ్రావ్యంగా ఆలపించారో!


జాతికి జీవం భాష
యాభై ఏళ్ల కిందటి వరకూ తెలుగు మాధ్యమంలో ఆరో తరగతి వరకూ చదువుకునే అవకాశం ఉండేదిక్కడ. ప్రస్తుతం ఆ సౌకర్యం లేదు. కానీ, ప్రభుత్వ పాఠశాలలో వారానికి ఒక్క రోజు రెండు గంటల పాటు విద్యార్థులు తమ మాతృభాషలను నేర్చుకునే అవకాశం కల్పించారు. తెలుగు నేర్చుకోవాలనుకునే వారికి దీని ద్వారా మన అక్షరాలు పరిచయమవుతున్నాయి. తెలుగు తరగతులు నిర్వహించడానికి తగిన ఆర్థిక సాయం మలేసియా ప్రభుత్వం చేస్తోంది. వారెంత తోడ్పాటునందించినా మన ఉనికిని, భాషను, సంస్కృతినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే కదా. అందుకే మలేసియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో వారాంతాల్లో దేశమంతటా ప్రత్యేక తెలుగు తరగతులను నిర్వహిస్తున్నాం. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రవేశిక పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం మాధ్యమిక పరీక్షకు తయారవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ గొప్ప పుణ్యభూమి. మా మాతృభూమి. ఆ గడ్డపై అడుగుపెట్టడానికి మలేసియాలోని తెలుగు వారు తహ తహలాడుతుంటారు. తరాలు మారినా మలేసియా తెలుగు వారికి తెలుగుతల్లిపై ఉన్న ప్రేమ తగ్గదు. కన్నతల్లిని ఎలా కాపాడుకుంటామో... మా అమ్మభాష అయిన తెలుగునూ అలాగే రక్షించుకుంటాం. ఇంట్లో అమ్మ పిల్లలతో తెలుగులో మాట్లాడుతున్నంత వరకూ ఎన్ని తరాలు గడచినా తెలుగు నిలిచే ఉంటుంది. తెలుగు నాట తెలుగుకు ఆదరణ తగ్గుతోందన్న మాట తప్పు. ప్రభుత్వంలో తగ్గుతోంది కానీ తెలుగు వారిలో భాషాభిమానం తగ్గలేదు. జాతికి జీవం భాష. భాషే లేనప్పుడు జాతి ఎలా ఉంటుంది? తెలుగు భాషను చంపుకుంటే తెలుగు జాతి నశిస్తుంది. ఇది తెలిసిన తెలుగు వారెవరూ తెలుగును వదులుకోరు.

- డా।। అచ్చయ్యకుమార్‌ రావు, మలేసియా తెలుగు సంఘం అధ్యక్షులు
 


పాఠ్యపుస్తకాలు కావాలి
ప్రస్తుతం మలేసియాలో తెలుగు నేర్చుకుంటున్న పిల్లలు నాలుగు, అయిదు తరాల విదేశాంధ్రులు. అయిదేళ్ల నుంచి పదిహేడేళ్ల  పిల్లలు దాదాపు రెండు వేల మంది మన భాషను అభ్యసిస్తున్నారు. తెలుగంటే వారికి చాలా చాలా ఆసక్తి. కానీ, వారికి భాషా బోధన కొంచెం కష్టమైన పని. నాగలి, అరక, కడవ, పైరు వంటి చాలా పదాలు వీళ్లకు తెలియవు. వాటిని నేర్పేటప్పుడు బొమ్మలు గీయాలి. ఫొటోలు చూపించాలి. ఆకారాన్ని బట్టి తెలుగు అక్షరాలను అయిదు భాగాలుగా విడదీసి వర్ణమాల నేర్పిస్తున్నాం. ఈ పద్ధతిలో రెండో తరగతి వాచకాన్ని 21 రోజుల్లో నేర్చుకునేలా శిక్షణిస్తున్నాం. మాకు ఇక్కడ ప్రతి రోజూ తరగతులు ఉండవు. వారాంతాల్లో మూడు గంటల పాటు మాత్రమే జరుగుతాయి. పాఠశాలలకు సెలవులప్పుడు వారం రోజుల పాటు నిర్వహిస్తున్నాం. అయినా... గతేడాది తెలుగు విశ్వవిద్యాలయం ప్రవేశిక పరీక్ష రాసిన విద్యార్థుల్లో 90 శాతం మందికి ప్రథమ శ్రేణి వచ్చింది. తెలుగుతో పాటు మన సంస్కృతి సంప్రదాయాల గురించి కూడా పిల్లల్లో అవగాహన కల్పిస్తాం. చిడతలాట, దాటు భజనలు, గొబ్బిళ్ల ఆటలు, శతకాలు, కీర్తనలను నేర్పిస్తాం. ఉగాది, సంక్రాంతి తదితర పండగల విశిష్టత పిల్లలకు అర్థమయ్యేలా కార్యక్రమాలను జరిపి చూపిస్తాం.
విదేశాల్లో తెలుగును బోధించే వారికి పెద్ద సమస్య పాఠ్యపుస్తకాల కొరత. అందులోనూ మలేసియా లాంటి దేశాల్లో నాలుగు తరాలకు ముందే వచ్చిన తెలుగు వారికి ఈ పాఠ్యపుస్తకాల అవసరం చాలా ఉంది. మలేసియా తెలుగు విద్యార్థుల కోసం ఇక్కడి ఉపాధ్యాయులే ఒకటి, రెండు, మూడో తరగతి వాచకాలను రూపొందించారు. అచ్చులు, హల్లులు, గుణింతాలు, సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు, వాక్య నిర్మాణాలతో కూడిన అభ్యాస పుస్తకాలను తయారు చేశా. పాఠ్యపుస్తక రచనలో అనుభవం లేని మాలాంటి ఉపాధ్యాయులు రాసిన పుస్తకాలను ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి తప్పట్లేదు. మాకు తెలుగు వాచకాలు ఇచ్చి సాయపడాలని ఆంధ్రప్రదేశ్‌ పాఠ్యపుస్తక విభాగానికి లేఖ రాశాను. ఫలితం లేదు. నాలుగో తరగతి నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వాచకాలను వాడుతున్నాం. కానీ, అవి ఈ దేశ కాలమాన పరిస్థితులకు అనుకూలంగా లేవు.

- గొట్టాపు దుర్గాప్రియ, తెలుగు ఉపాధ్యాయిని, మలేసియా


*      *     *


వెనక్కి ...

మీ అభిప్రాయం