తెలుగు తరంగాలై ఎగసి...

  • 399 Views
  • 0Likes
  • Like
  • Article Share

తెలుగు రాష్ట్రాలు మాతృభాషా పరిరక్షణ నినాదాలతో హోరెత్తాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, భాషాభిమానులు, మేధావులు, నాయకులు భాషాస్ఫూర్తిని దశదిశలా చాటారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (ఫిబ్రవరి 21) సందర్భంగా రెండు రాష్ట్రాల్లో జరిగిన వివిధ కార్యక్రమాలు మన భాషను మనం కాపాడుకుని తీరాలన్న సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి.
ఏ వ్యక్తికైనా తొలి వికాస దీపిక మాతృభాషే. అమ్మ నుంచి వచ్చిన ఆ భాష నరనరాన ఇంకిపోయి ఉంటుంది. అందుకే ఎవరైనా సరే.. తమ భావాలు, ఆలోచనలను అమ్మభాషలో చెప్పినంత సమర్థంగా మరే ఇతర భాషల్లోనూ వ్యక్తీకరించలేరు. కానీ, తెలుగునాట అమ్మభాష అంటే ఓరకమైన నిర్లక్ష్యం తాండవమాడుతోంది. తెలుగులో చదువుకుంటే ఉపాధి కష్టమన్న అపోహతో మొత్తంగా భాషనే నవతరానికి దూరం చేస్తున్నారు. మన గడ్డ మీదే కాదు, ఒకప్పుడు సామ్రాజ్యవాద కబంధకోరల్లో అలమటించిన అనేక దేశాల్లో ఇదే పరిస్థితి. ఎక్కడికక్కడ స్థానిక భాషలు అంతర్థానమైపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భాషాపరమైన వైవిధ్యం కనుమరుగైపోయి... జాతుల అస్తిత్వాలే మసిబారిపోతాయని ‘యునెస్కో’ ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు ప్రస్తుతం మనుగడలో ఉన్న అన్ని భాషలనూ పరిరక్షించుకోవాలనే సందేశంతో ఏటా ఫిబ్రవరి 21ని ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా జరుపుతోంది ఆ సంస్థ. ఆ స్ఫూర్తితో తెలుగునాట కూడా ఫిబ్రవరి 20, 21 తేదీల్లో అనేక కార్యక్రమాలు జరిగాయి. అమ్మభాష విషయంలో తెలుగువాళ్ల బాధ్యతలను ఇవి గుర్తుచేశాయి.
      ఏ మాతృభాష అయినా చిరస్థాయిగా నిలవాలంటే ముందుగా ఆ జాతి చిన్నారు లకు దానిమీద మమకారం ఉండాలి. నవతరంలో భాష పట్ల ఆ అనురక్తిని కలిగించేందుకు పెద్దలే చొరవ తీసుకోవాలి. అందుకే మాతృభాషా దినోత్సవం సందర్భంగా పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ‘మాతృభాషలో విద్యాబోధన, పాలనా భాషగా తెలుగు, మాతృభాష - తెలుగు’ తదితర అంశాల మీద వ్యాసరచన పోటీలు ఏర్పాటుచేశారు. వక్తృత్వం, పద్యపఠనం, కథలు, కవితలు, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే వేషధారణలు లాంటి పోటీలు కూడా పెట్టారు. గ్రంథాలయాలు, పురపాలక సంస్థ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరిగాయి.
అన్నిచోట్లా అదే చైతన్యం
‘‘మాతృభాష ఔన్నత్యాన్ని కాపాడుకుంటాం. అమ్మను ప్రేమించినట్లే భాషనూ ప్రేమిస్తాం. అందులోనే మాట్లాడతాం. అన్యభాషలను గౌరవిస్తాం. దేశ భాషలందు తెలుగు లెస్స అని చాటుతాం’’ లాంటి ప్రతిజ్ఞలు, నినాదాలు ఫిబ్రవరి 21 నాడు రెండు రాష్ట్రాల్లో మార్మోగాయి. జయశంకర్‌ జిల్లా తాడ్వాయి ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు 400 మంది మాతృభాష గొప్పతనం గురించి నినదిస్తూ జాతీయ రహదారి మీద ర్యాలీ, మానవహారం నిర్వహించారు. తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల గ్రంథాలయ సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నగర పాలక సంస్థ కార్యాలయ ఆవరణలో, అలాగే స్థానిక పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు. శ్రీకాకుళం జిల్లా బారువ జిల్లాపరిషత్తు బాలికోన్నత పాఠశాల విద్యార్థులు తెలుగు సాహితీవేత్తలు, ప్రముఖులు, భాషకు సంబంధించిన అంశాలతో నిర్వహించిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మాతృభాష మీద అవగాహన ఉంటేనే ఇతర భాషలు నేర్చుకోవడం సాధ్యమవుతుందని వివరిస్తూ విజయనగరం జిల్లా బొద్దాం మండలం జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ప్రేమ రామచంద్రరావు గీసిన చిత్రం అందరినీ ఆలోచింపజేసింది. అనంతపురం జిల్లా హిందూపురంలో రచయితలు, కవులు తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, అందరూ అమ్మభాషలోనే మాట్లాడాలని పిలుపునిచ్చారు. పురపాలక సంఘం కార్యాలయంలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో చిన్నారులు వివిధ వేషధారణలు, తెలుగు పద్యాలతో ఆకట్టుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 18 పురపాలక పాఠశాలల్లో వివిధ రకాల పోటీలు నిర్వహించారు. కడపలోని సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో భాషాసేవకులను సత్కరించారు.
      విశాఖపట్నానికి చెందిన ‘పరవస్తు పద్యపీఠం’ సంస్థ ఆధ్వర్యంలో ‘అమ్మ భాషకు వందనం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తల్లిదండ్రులే మాతృభాష గొప్పదనాన్ని తమ పిల్లలకు తెలియజెప్పాలని సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని మాంటిస్సోరి పాఠశాల విద్యార్థులు ‘శతక పద్య సహస్ర గళార్చన’ (వేమన శతకం) చేశారు. 1008 మంది విద్యార్థులు 108 వేమన పద్యాలను 45 నిమిషాల్లో ఆలపించడం విశేషం. ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో ఒంగోలులోని గౌతమీ మోడల్‌ స్కూల్‌ ఆవరణలో మాతృభాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల వేషధారణలు, పద్య, కవితా పఠనాలు ఆకట్టుకున్నాయి. పలు చోట్ల విద్యార్థులు ‘అ’, ‘తెలుగు వెలుగు’, ‘మాతృభాష’ తదితర ఆకృతుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. విజయవాడ ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ భాగస్వాములయ్యారు. ప్రపంచ అనుసంధాన భాష ఆంగ్లం అయినా, మాతృభాషను పరిరక్షించుకోవాలన్నారు.
ఈనాడు, ఈటీవీల ఆధ్వర్యంలో
‘ఈనాడు, ఈటీవీ’ల ఆధ్వర్యంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో చిన్నారులతో భాషా ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. జయశంకర్‌ జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి ఆదర్శ పాఠశాలలో అమ్మభాష పరిరక్షణపై చర్చా వేదిక నిర్వహించారు. భూపాలపల్లిలోని కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ‘అమ్మభాష పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు’ అంశంపై నిర్వహించిన సదస్సులో జిల్లా విద్యాశాఖాధికారి బి.శ్రీనివాస్‌రెడ్డి పాలుపంచుకున్నారు.  
      ‘ఈనాడు’, తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో ‘మాతృభాష- పరిరక్షణకు చర్యలు’ అనే అంశం మీద సదస్సు నిర్వహించారు. చిత్తూరులో ‘ఈనాడు’, ‘విజయం’ విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ ‘‘ఇతర భాషలు ఎన్ని నేర్చినా మాతృభాషను మర్చిపోకూడదు’’ అని అన్నారు. తెలుగును మరిచిపోతే కన్నతల్లిని మరిచినట్లేనని హెచ్చరించారు. ఈ సందర్భంగా స్థానిక గాంధీ విగ్రహ కూడలి వద్ద విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. చిత్తూరు జిల్లా పాలనాధికారి పీఎస్‌ ప్రద్యుమ్న ట్విటర్‌లో ‘‘మాతృభాష మృతభాష కాకుండా కాపాడుకుందాం’’ అనే సందేశాన్ని ఉంచారు. శ్రీకాళహస్తిలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు.
న్యాయమూర్తుల చొరవ
వేల ఏళ్లుగా ఆధిపత్య భాషలను ధిక్కరించి నిలిచిన భాష తెలుగు అని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.నందిని సిధారెడ్డి అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. ‘‘తొలుత తెలుగుపై సంస్కృతం దండెత్తింది. ఆ భాషలోని కొన్ని సౌకర్యాలు కలుపుకొని తనదైన అస్తిత్వంతో తెలుగు సగర్వంగా తలెత్తుకుని నిలబడింది. అలాగే అరబ్బీ, పార్సీ పదాలను కలుపుకుని తెలుగు తన సౌందర్యాన్ని ఇనుమడించుకుంది’’ అని సిధారెడ్డి చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని ఘంటసాల వేంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో వేడుకలు నిర్వహించారు. వీటికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ‘‘మనందరి గుండె చప్పుడు తెలుగు కావాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు ఎ.బి.బాలకొండలరావు, వెన్నా వల్లభరావు, అన్నాబత్తుల మంగతాయారు, లీలా సాయి, పసుమర్తి మృత్యుంజయ శర్మలను సత్కరించారు. కళాకారులు ప్రదర్శించిన తెలుగుతల్లి నృత్యరూపకం, ఇతర నృత్యాలు అలరించాయి.
      ఫిబ్రవరి 18న విజయవాడ సివిల్‌ కోర్టుల ప్రాంగణంలో ‘న్యాయస్థానాల్లో తెలుగు వినియోగం కోసం ఉద్యమ సమాలోచన’ పేరుతో సదస్సు ఏర్పాటుచేశారు. తెలుగుభాషోద్యమ సమాఖ్య, బెజవాడ బార్‌ అసోసియేషన్లు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ విధానం తెలుగులో లేకపోతే న్యాయస్థానాల్లో తీర్పులు మాతృభాషలో ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. భాషను అభివృద్ధి చేయడానికి పాలకుల్లో పట్టుదల ఉండాలని విశ్రాంత న్యాయమూర్తి మంగారి రాజేందర్‌ అన్నారు. ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.జి.ప్రియదర్శిని ఫిబ్రవరి 21న ఓ క్రిమినల్‌ కేసులో బెయిల్‌ ఉత్తర్వులు తెలుగులో వెలువరించారు. గతంలో ఈ జిల్లాలోని న్యాయమూర్తులు అందరూ ఒక రోజు పూర్తిగా తెలుగులో తీర్పులు వెలువరించేలా చొరవ తీసుకున్న ఆవిడ అందరి మన్ననలూ అందుకున్నారు. విజయవాడ నాలుగో అదనపు జిల్లా, కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి అచ్యుత పార్థసారథి కూడా విడాకుల కేసులో తీర్పును తెలుగులో ఇచ్చారు.
ఈ స్ఫూర్తి ఆచరణలోకి వస్తేనే...
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21న హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘తెలుగులో పాలనాభాష’ అనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. ఇందులో తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జయధీర్‌ తిరుమలరావు మాట్లాడుతూ తల్లిభాషతోనే మానసిక వికాసం సాధ్యమన్నారు. కవి, రచయిత కాలువ మల్లయ్య మాట్లాడుతూ తెలుగుభాషలో చదువుకుంటే జ్ఞానం పొందొచ్చని చెప్పారు. ఈ సందర్భంగా ‘గ్రంథాలయాల అభివృద్ధి, జిల్లాకు వంద చొప్పున రచయితల గ్రంథాలు కొనుగోలు చేసి గ్రంథాలయాల్లో ఉంచడం, పుస్తకాల ముద్రణకు రూ.25 వేల ఆర్థికసాయం, రచయితల సహకార సంస్థకు రూ.5 కోట్ల నిధులు, భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు, విశిష్ట భాషా కేంద్రాన్ని రాష్ట్రానికి తేవడం, సమగ్ర తెలుగు నిఘంటువు రూపకల్పన, తెలంగాణ వ్యాకరణం, పురాతన ఆలయాల పరిరక్షణ, శాసనాల సేకరణ, అధ్యయనం’ లాంటి పది తీర్మానాలను ఆమోదించారు. సాహిత్య, సాంస్కృతిక, భాష, కళారంగాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏలూరు వైఎంహెచ్‌ఏ హాల్లో మాతృభాషా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్సీ రాము సూర్యారావు పాల్గొన్నారు. తెలుగుతల్లి వైభవాన్ని కీర్తిస్తూ పలువురు ఆలపించిన గీతాలు మాతృభాష గొప్పదనాన్ని చాటాయి. ఐక్యవేదిక ఆధ్వర్యంలోనే ఏలూరులోని ఎస్‌పీడీబీటీ జూనియర్‌ కళాశాలలో ‘మాతృభాష పరిరక్షణ - మన కర్తవ్యం’ అనే అంశం మీద సదస్సు నిర్వహించారు. ముందుగా తెలుగుభాష ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ నగరంలో ప్రదర్శన నిర్వహించారు. 21 సంఘాలు కలిసి ఐక్యవేదికగా ఏర్పాటయ్యాయి. భాషోద్యమ కార్యక్రమాలు ప్రారంభించాయి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన శ్రీనివాస్‌ కాకినాడ సాగరతీరంలో తెలుగుతల్లి రూపంతో ఓ సైకతశిల్పం రూపొందించారు. ‘మాతృభాషను మరవొద్దు, తెలుగువాళ్లందరం తెలుగే మాట్లాడదాం’ అనే సందేశాలను ఆయన అందులో పొందుపరిచారు.
ఈ కార్యక్రమాలన్నీ మాతృభాష ప్రాధాన్యాన్ని అందరికీ తెలియజెప్పాయి. ముఖ్యంగా మన భాషను మనం కాపాడుకోవాలన్న భావనను విద్యార్థుల్లో పెంచాయి. అయితే ఏడాదికి ఒకసారి కాకుండా నిరంతరం పాఠశాలలు, కళాశాలల్లో భాషా కార్యక్రమాలను వ్యవస్థీకృతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రచించాలి. వ్యాసరచన, వక్తృత్వం, నాటికలు, కవితలు, కథలు పోటీలు నిర్వహిస్తూ నవతరంలో భాషపట్ల మమకారం పెంచాలి. అప్పుడే తెలుగు కీర్తి ఆచంద్రతారార్కమవుతుంది.

*    *    *


వెనక్కి ...

మీ అభిప్రాయం