తాళపత్రాలకు సాంకేతిక దన్ను

  • 1786 Views
  • 22Likes
  • Like
  • Article Share

    పి.వెంకటేష్‌

  • హైదరాబాదు
  • 8978219264
పి.వెంకటేష్‌

‘శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో’ అంటూ నన్నయ ఆర్తిగా పలికినా, ‘శ్రీయన గౌరినాఁబరఁగు చెల్వకుఁ జిత్తము’ అంటూ తిక్కన హరిహర రూపమైన పరతత్వమును కొలిచినా, ‘స్ఫురదరుణాంశు రాగరుచి బొంపిరివోయి’ అంటూ ఎర్రన ప్రకృతి చిత్రం చిత్రించినా, ‘చిన్నారిపొన్నారి చిఱుత కూఁకటినాఁడు’ అంటూ శ్రీనాథుడు తన రచనా పాటవాన్ని చెప్పుకున్నా, ‘పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుండట’ అంటూ పోతన అంతా దైవేచ్ఛ అని చెప్పినా.. ఆనాడు ఎవరు ఏమి రాసినా అంతా తాళపత్రాల మీదే. అలాంటి తాళపత్రాలను పరిరక్షించి పరిశోధనలకు ఊతం ఇచ్చేందుకు, భావితరాలకు అందించేందుకు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నడుం బిగించింది. తన పరిధిలోని ప్రాచ్య పరిశోధనా సంస్థ (ప్రాపస)లో ఉన్న తాళపత్రాల డిజిటలీకరణకు శ్రీకారం చుట్టింది.
మన ప్రాచీన సాహిత్య, విజ్ఞాన సంపదలకు ఆలవాలాలు తాళపత్రాలు. వందల ఏళ్ల క్రితం రాత మొదలైన తర్వాత ఎందరో మహాకవులు, మేధావులు ఘంటం చేతపట్టి తమ పాండిత్యం, అనుభవాలను తాళపత్రాల్లో నిక్షిప్తం చేశారు. ఇవే లేకుంటే కొన్ని శతాబ్దాల నాటి సారస్వత పెన్నిధి మనకు లేకుండా పోయేది. కొన్ని తరాల వికాస క్రమం అంధకారంలోకి వెళ్లిపోయేది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఎన్నో తాళపత్రాలకు నెలవు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లోని ప్రాచ్య పరిశోధనా సంస్థ.
      ఓఆర్‌ఐలో 16 వేల పైచిలుకు తాళపత్రాలు ఉన్నాయి. వాటిలో సింహభాగం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అందించినవే. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోయిన సమయంలో కొన్ని తాళపత్రాలు ఇక్కడికి వచ్చి చేరాయి. మిగిలిన వాటిని ‘ప్రాపస’ స్వయంగా సేకరించింది. వెంకటగిరి రాజా సంస్థానం నుంచి ‘గోపీనాథ రామాయణం’, ‘వెలుగోటి వంశ చరిత్ర’లు, బెంగళూరుకు చెందిన ఎస్వీయూ పూర్వ విద్యార్థి తంగిరాల వెంకట సుబ్బారావు నుంచి పల్నాటి వీరచరిత్ర, కాటమరాజు లేఖ తదితరాలను సేకరించారు. ఇక్కడున్న వాటిలో అధిక భాగం తెలుగు లిపివి కాగా, సంస్కృతం, తమిళ భాషలకు చెందినవీ ఉన్నాయి. వందల ఏళ్లనాటి ఈ తాళపత్రాల పరిరక్షణకు విశ్వవిద్యాలయం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. తాళపత్రాలతో పాటు వాస్తు, ఖగోళ శాస్త్ర గ్రంథాలు, బ్రహ్మంగారి కాలజ్ఞానానికి సంబంధించిన అరుదైన పుస్తకాలు, స్వదేశీ, విదేశీ నిఘంటువులు, ముద్రణ ఆగిపోయిన పుస్తకాలను కూడా ఇక్కడ భద్రపరిచారు. ఇవి దాదాపు 42 వేలకు పైగా ఉన్నాయి. వీటిని కూడా డిజిటలీకరించే కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయం ప్రారంభించింది.
      డిజిటలీకరణలో భాగంగా ముందుగా నిమ్మగడ్డి తైలంతో తాళపత్రాలను శుభ్రపరుస్తారు. తర్వాత స్కానింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకోసం బెడ్‌ స్కానర్‌, ఓవర్‌ హెడ్‌ స్కానర్‌ (బుక్‌ స్కానర్‌)లు తెప్పించారు. స్కానింగ్‌ పూర్తయ్యాక మొత్తం సమాచారాన్ని సీడీల్లో నిక్షిప్తం చేయనున్నారు. దీనికోసం ప్రత్యేక కంప్యూటర్లను కూడా ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య దామోదరం నేతృత్వంలో ‘ప్రాపస’ సంచాలకులు ఆచార్య కె.దామోదర నాయుడు, సహాయ సంచాలకులు డా।। పీసీ వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారు ఆచార్య గోవిందరాజులు ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
దేశంలోనే పేరుప్రఖ్యాతులు
తాళపత్రాల పరిరక్షణశాలగా ‘ప్రాపస’కి దేశంలోనే పేరు ప్రఖ్యాతులున్నాయి. తాళపత్రాల సేకరణకు ఈ సంస్థ విశేష కృషిచేస్తోంది. తాళపత్రాలకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే సంబంధిత ప్రాంతాలకు చేరుకుని సేకరిస్తోంది. తాళపత్రాలు, అరుదైన పుస్తకాలను అందించిన వారిని సత్కరిస్తోంది. వాటిని సంస్థకు తెచ్చి రసాయనాలతో శుభ్రపరచి జాగ్రత్తచేస్తోంది.
      తాళపత్రాల భాండాగారమైన   ‘ప్రాపస’కి విశిష్ట చరిత్రే ఉంది. సంస్కృతంతో పాటు దేశంలోని ఇతర భాషలు, తత్వశాస్త్రం, హిందూ సంస్కృతికి సంబంధించి అత్యుత్తమ పరిశోధన, శిక్షణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానాల (తితిదే) యాజమాన్యం 1939 జులైలో శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధన సంస్థను నెలకొల్పింది. కోశం, ధర్మశాస్త్రం, వ్యాకరణం, గణితం, శైవం, పంచరాత్ర ఆగమాలు, వేదాంతం, కావ్యాలు తదితరాలకు సంబంధించి ఈ సంస్థ పలు ప్రాచ్య గ్రంథ సంపుటాలను, సంస్కృతం, ఆంగ్లం, తెలుగు, తమిళం భాషల్లో ఎన్నో పుస్తకాలను ప్రచురించింది. మానవల్లి రామకృష్ణ కవి భరతకోశము, ఎం.కృష్ణమాచారియార్‌ సంస్కృత సాహిత్య చరిత్రలను ముద్రించింది. సంస్కృత సాహిత్యంలో పరిశోధనకు, సాహితీ విమర్శకు ఈ గ్రంథాలు ప్రాథమిక ఆధారాలుగా నిలిచాయి. శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో 1940లో పదో అఖిల భారత ప్రాచ్య సదస్సు, 1955లో నాలుగో సంస్కృత విశ్వపరిషత్తు సమావేశాలు తిరుపతిలో జరిగాయి. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యాక 1956, నవంబర్‌ 1న తితిదే ఈ సంస్థను దానికి అప్పగించింది.
పరిశోధనలకు వెన్నుదన్నుగా..
ప్రస్తుతం చేపట్టిన డిజిటలీకరణ ప్రక్రియ దేశవ్యాప్తంగా భాషా పరిశోధనలకు వెన్నుదన్నుగా నిలవనుంది. తాళపత్రాలను సేకరించి, వాటిని సంరక్షించుకుంటూ పరిశోధనలు సాగించడం కష్టతరం. తాళపత్రాలను స్కానింగ్‌ చేసి సీడీల రూపంలోకి తేవడం వల్ల పరిశోధకులు సులభంగా వాటిని సేకరించుకుని, పరిశోధనలు నిర్వహించవచ్చు. డిజిటలీకరణ వల్ల దేశవ్యాప్తంగా పరిశోధనలు వేగవంతమవుతాయి. ప్రచురణ సంస్థలు సులభంగా ముద్రించడానికీ వీలవుతుంది. అంతేకాకుండా డిజిటలీకరణ చేసిన తాళపత్రాలు, ఇతర గ్రంథాలన్నింటినీ ఆన్‌లైన్‌లో ఉంచి పాఠకలోకానికి కానుకగా అందజేయాలన్న ప్రతిపాదన సైతం విశ్వవిద్యాలయ ఉన్నతాధికారుల ప్రణాళికల్లో ఉంది. స్కానింగ్‌ పూర్తయ్యాక తాళపత్రాలను లామినేషన్‌ చేసి భద్రపరచడం మంచిదని పరిశోధకులు అంటున్నారు. తాళపత్రాలకు సంబంధించి ప్రత్యేక సూచీపట్టిక (క్యాటలాగు)ను కూడా విశ్వవిద్యాలయం రూపొందిస్తోంది. అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న తాళపత్రాలను కూడా స్కానింగ్‌ చేస్తే వాటికి శాశ్వతత్వం లభిస్తుంది.
      తెలుగునాట ఇప్పటికీ వెలుగులోకి రాని తాళపత్ర గ్రంథాలు చాలా ఉన్నాయి. వీటి సేకరణకు కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ అందుబాటులోకి వస్తేనే సమగ్ర సాహిత్య చరిత్ర నిర్మాణానికి, అప్పటి సాంఘిక, ఆర్థిక పరిస్థితులను క్షుణ్నంగా తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. తెలుగు జాతి వికాస క్రమాన్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవడానికి మార్గం సుగమమవుతుంది.

*    *    * 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  గ్రంథాలయాలు