బహుముఖ ప్రజ్ఞా తరంగం

  • 347 Views
  • 0Likes
  • Like
  • Article Share

ధవళవర్ణంలో వస్త్రాలు, పూర్తిగా తెల్లబడిపోయిన జుత్తు, పొడవైన గడ్డంతో ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ మౌన మునిలా కనిపించే నాయుని కృష్ణమూర్తి.. అంతే నిశ్శబ్దంగా అక్షర సేద్యం చేసుకుంటూ వెళ్లారు. రచయితగా, ఉపసంపాదకుడిగా, నిఘంటుకర్తగా, భాషా ప్రేమికుడిగా, ప్రచురణకర్తగా ఆయన ప్రతిభ బహుముఖం.
కృష్ణమూర్తి పేరు వినగానే ‘మాబడి, పాఠశాల’ పత్రికలు గుర్తొస్తాయి. పిల్లలకు విజ్ఞానాన్ని సులభతరంగా అందించాలన్న ఒక మహా వ్యక్తి సంకల్పం మదిలో మెదులుతుంది.  చిత్తూరు జిల్లాలో మారుమూల గ్రామం నడిమిచెర్లలో  ఉపాధ్యాయుడు నాయుని రామయ్య, నరసమ్మ దంపతులకు 1951 నవంబరు 12న కృష్ణమూర్తి జన్మించారు. వీరు మొత్తం ఏడుగురు సంతానం. కృష్ణమూర్తి చిన్నతనంలోనే తండ్రి చౌడేపల్లె మండలం మేకలచిన్నేపల్లెకు బదలీ అయ్యారు. కృష్ణమూర్తి ప్రాథమిక విద్య అక్కడే జరిగింది. చౌడేపల్లె, మదనపల్లెల్లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో, మద్రాసులో పైచదువులు చదువుకున్నారు. ఇరవై మూడో ఏట కృష్ణమూర్తి తన మొదటి నవల ‘యామినీ కుంతలాలు’ రాశారు. దీనికి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక నిర్వహించిన ఉగాది నవలల పోటీలో మూడో బహుమతి లభించింది. తర్వాత ఆయన పత్రికా రంగంలోకి అడుగుపెట్టారు. బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలకు ఉపసంపాదకుడిగా పనిచేశారు. ఒక మిత్రుని భాగస్వామ్యంతో స్నేహబాల అనే పిల్లల పత్రికను నిర్వహించారు. పలు నవలలు, కథలు, నాటికలు రాశారు.
      కృష్ణమూర్తి రచనలన్నీ సామాజిక మార్పును ఆకాంక్షిస్తాయి. ఆయన రాసిన ‘యామినీ కుంతలాలు, మనసు గుర్రమురోరి మనిషి, ప్రలోభం’ నవలలు వాస్తవిక సమాజానికి ప్రతిబింబాలు. ఆయన రాసిన ‘తెలు(గు)గోడు, టెలుగు వెలుగు’ తదితర కథలు ఆధునిక కాలంలో తెలుగు భాషా సంస్కృతులు ఎదుర్కొంటున్న దుస్థితిని కళ్లకు కడతాయి. తెలుగు మీద ఆయనకున్న మమకారాన్ని ఇవి చాటుతాయి. ‘ఏంలేదు’ పేరుతో కథా సంపుటిని ఆయన వెలువరించారు. అంతేకాకుండా చిన్నపిల్లల కోసం 125 పుస్తకాలు రచించారు. వాల్మీకి రామాయణం, బమ్మెర పోతన భాగవతాన్ని వ్యవహారిక భాషలో అందించారు. మహాభారతానికి మూల గ్రంథమైన జయమ్‌ కావ్యాన్ని 2016లో సరళ తెలుగులో వెలువరించారు. ఆయన రాసిన ‘ఈ కోతి డ్రామాకు పనికొస్తుందా..?, వియోగ విభావరి, మాయామృగం’ నాటికలు ప్రేక్షకాదరణ పొందాయి. మహర్షి సినిమాలో ‘సుమం ప్రతి సుమం సుమం..’ పాటను కృష్ణమూర్తే రాశారు. అప్పట్లో ఈ పాట తెలుగు నేలను ఉర్రూతలూగించింది. అలాగే స్వరకల్పన చిత్రంలో ‘పలుకేమైనా సాయంవీణా’ పాటను, విడుదల కాని మరో చిత్రం కోసం లతా మంగేష్కర్‌ పాడిన ‘నీనామం మధురం.. సుధామయం’ పాటలకు సృష్టికర్తగా నిలిచారు.
విజయవాణి ముద్రణాలయం
పిల్లలు ఎదుర్కొంటున్న మానసిక వ్యధను గుర్తించిన కృష్ణమూర్తి వారికి సులభ రీతిలో చదువును అందించాలని సంకల్పించారు. పాఠ్యపుస్తకాలను చదివి సూక్ష్మరూపంలోకి మార్పుచేశారు. అలా ఏడో తరగతి పిల్లల కోసం ‘మాబడి’, పదో తరగతి పిల్లల కోసం ‘పాఠశాల’ పత్రికలు రూపొందించారు. తెలుగు నాట వీటికి విశేష ఆదరణ లభించింది. దాంతో కృష్ణమూర్తి తన సోదరులతో చర్చించి చౌడేపల్లిలో విజయవాణి ముద్రణాలయాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు ఉపయోగపడేలా ‘తెలుగు-ఇంగ్లీషు బొమ్మల నిఘంటువు, సచిత్ర నిఘంటువు, ఇంగ్లిషు విద్యార్థి నిఘంటువు’లు కూడా ఆయన రూపొందించారు.
      1990-91లో ప్రారంభమైన సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమంలో కృష్ణమూర్తి చురుగ్గా పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో జిల్లా సాక్షరతాసమితి అకడమిక్‌ ఛైర్మన్‌గా పదిహేనేళ్లు పనిచేశారు. అలాగే రాష్ట్ర సాక్షరతా మిషన్‌ సభ్యుడిగా, కేంద్రస్థాయిలో జాతీయ అక్షరాస్యతా సంస్థ సభ్యుడిగా సేవలందించారు. నిరక్షరాస్యుల కోసం ‘వెలుగుబాట’ పత్రికను కూడా నిర్వహించారు. పాఠశాల విద్యార్థుల కోసం ‘చదువు’ అనే మాసపత్రికను తెచ్చారు. తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా విద్యార్థుల మేధోవికాసానికి ఎంతో కృషి చేసిన ఆయన 2018 మార్చి 1న తుదిశ్వాస విడిచారు.

- కవరకుంట్ల శంకరయ్య, చౌడేపల్లె


మహారాష్ట్రలో తెలుగు కిరణం

చదివింది పదివరకే, అదీ మహారాష్ట్రలో మరాఠీ మాధ్యమంలో. అయినా కవిగా, రచయితగా, అనువాదకుడిగా, నాటక కర్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డా. బొల్లి లక్ష్మీనారాయణ. ముఖ్యంగా తెలుగు మీద మమకారంతో ఈ భాషను నేర్చుకొని తెలుగు-మరాఠీ భాషలకు వారధిగా నిలిచారు. మహారాష్ట్రలో తెలుగు భాషాభివృద్ధికీ కృషి చేశారు. ఆయన ప్రముఖ చిత్రకారుడు కూడా. లక్ష్మీనారాయణ పూర్వికులది సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామం. ఆయన కుటుంబం బతుకుతెరువు కోసం షోలాపూర్‌ వెళ్లి చేనేత వృత్తిలో స్థిరపడింది. అక్కడే పుట్టారాయన. పదివరకూ చదివారు. తెలుగు సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేశారు. ఆయనకు గొప్ప కవిగా పేరు తెచ్చిన కావ్యం ‘మైఫల్‌’. మరాఠీలో రాసిన ఈ గ్రంథం పి.ఎల్‌.దేశ్‌పాండే, బి.బి.బోర్కర్‌లాంటి మరాఠీ సాహితీవేత్తల మన్ననలందుకుంది. దాదాపు 28 గ్రంథాలు వెలువరించారాయన. పంచపది (సినారె పంచపదులు), సంత్‌కవి వేమన, ఏకా పండితాచ్యే మృత్యుపత్ర్‌ వంటి వాటితో పాటు పలు ఆధ్యాత్మిక అనువాదాలు కూడా చేశారు. లక్ష్మీనారాయణ రాసిన ఒకే ఒక్క తెలుగు పుస్తకం ‘యకృత్‌’. మహారాష్ట్రలో తెలుగు పాఠ్య పుస్తకాల ముద్రణ కోసం ఎంతో కృషి చేశారాయన. ‘బాలభారతి తెలుగు పాఠ్య పుస్తక సమితి’ స్థాపించి అధ్యక్షుడిగా సేవలందించారు. ‘తెలుగు భాషా రక్షణ సమితి’ ప్రారంభించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన రచనల మీద పుణె విద్యాపీఠం, ముంబై సాహిత్య అకాడమీ, గోవా విద్యాపీఠం, కాకతీయ విశ్వవిద్యాలయం, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేస్తున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయన్ని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఆయన రచనలు ఎంఏ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఆయన తుదిశ్వాస విడిచారు.


వృత్తి వైద్యం.. ప్రవృత్తి రచనాసేద్యం

వృత్తిరీత్యా వైద్యుడైనా తాత, తండ్రిబాటలో సాహిత్యాన్ని ప్రవృత్తిగా చేసుకొని విశేష సాహితీ సేద్యం చేశారు దేవరాజు రవి. ఆయన అసలు పేరు దేవరాజు వేంకట సత్యనారాయణరావు. స్వస్థలం ఒడిశాలోని బ్రహ్మపుర. ‘మాస్టర్‌ రవి’ కలం పేరుతో రచనలు సాగించారు. ఆయన రచయిత, నవలాకారుడు, సినీ సమీక్షుకుడు. రవి తాత దేవరాజు వెంకటరావు పంతులు సంగమవలస జమీందారు ఆస్థానంలో దివానుగా పనిచేశారు. పంచభాషా నిఘంటువును రూపొందించారు. మృచ్ఛకటికానికి తెలుగులో స్వేచ్ఛానువాదమూ చేశారు. రవి తండ్రి దేవరాజు వేంకటకృష్ణారావు తెలుగులో తొలి అపరాధ పరిశోధక నవల ‘వాడే వీడు’ రచయిత. వారి బాటలోనే రవి 12 నవలు, రెండొందలకి పైగా కథలు, వెయ్యికి పైగా సినీ సమీక్షలు రాశారు. 1959లో ‘రామం’తో మొదలు పెట్టి ‘సంగమం, ఎడారిలో కోయిల, వెన్నెల కురిసింది, కసి’ తదితర నవలలు రచించారు. కొత్త వెలుగు ఏకాంకిక; వేగుచుక్క, ఇది హృదయం కవితా సంపుటాలు, దేవరాజు రవి కథలు, బతుకే బంగారం (దేవరాజు సీతతో కలిసి) కథా సంపుటాలు వెలువరించారు. ఆయన భార్య సీత కూడా రచయిత్రే. సితార, శివరంజని, మేఘసందేశం తదితర సినీ పత్రికల్లో సమీక్షలు రాశారు. రవి రచనల్లో కొన్ని తమిళ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ సినీక్రిటిక్స్‌ అసోషియేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ సినిమా రచయితల సంఘం వంటి సంస్థల్లో సభ్యుడిగా ఆయన కొనసాగారు. నంది పురస్కార కమిటీ సభ్యుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించారు. వైద్యుడిగా కుష్టువ్యాధి నిర్మూలనకు విశేష సేవలందించారు. తన రచనల ద్వారా సర్వేపల్లి రాధాకృష్ణన్‌, వి.వి.గిరి లాంటి వ్యక్తుల మన్ననలు అందుకున్న ఆయన హైదరాబాదు మేడిపల్లిలోని తన నివాసంలో ఈ మార్చి 2న కన్ను మూశారు. రవి సాహితీ సేవ మరవలేనిది.


నవ్వుల రారాజు

వెండితెరపై అమాయకత్వంతో కూడిన హాస్యంతో తనదైన ముద్ర వేసుకుని తెలుగు ప్రజల్ని నవ్వుల వానలో ముంచెత్తారు గుండు హనుమంతరావు. పద్దెనిమిదేళ్ల ప్రాయంలో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన 400 పైగా చిత్రాల్లో నటించారు.
      హనుమంతరావు స్వస్థలం విజయవాడ. పెదనాన్న కృష్ణబ్రహ్మం గాయకుడు, నటుడు. ఆయన స్ఫూర్తిగా ‘రావణ బ్రహ్మ’ వేషంతో రంగస్థలంలో తొలి అడుగు పెట్టారాయన. ఓసారి మద్రాసులో ‘ఇదేమిటి?’ నాటకంలో నటిస్తూ జంధ్యాల కంట్లో పడ్డారు. హనుమంతరావు నటనకు ముగ్ధులైన జంధ్యాల ‘సత్యాగ్రహం’ చిత్రంలో అవకాశమిచ్చారు. దానికంటే ముందు విడుదలైన ‘ఆహ నా పెళ్లంట’ చిత్రంలో పెళ్లికొడుకు తండ్రి పాత్రలో నవ్వులు పూయించారు    హనుమంతరావు. తెలుగులో చినబాబు, హైహై నాయకా, ప్రేమ, కొబ్బరి బొండాం, బాబాయి హోటల్‌, సమరసింహారెడ్డి, మృగరాజు, జల్సా; హిందీలో రక్షక్‌ తదితర చిత్రాల్లో నటించారు. ఆదితాళం, అమృతం, శ్రీమతి శ్రీ సుబ్రమణ్యం ధారావాహికలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర టీవీ నంది పురస్కారాలు అందుకున్నారు. ‘అమృతం’ ధారావాహికలో ‘అంజి’ పాత్రతో ఆయన నటన అందరినీ అలరించింది. నిజ జీవితంలో కూడా హనుమంతరావు మాటల చమత్కారి. ‘మనిషిని నడిపించేది నవగ్రహాలే కాదు, నవ్వూ - ఆగ్రహాలు కూడా! లాంటి సరదా మాటలతో అందరినీ నవ్విస్తూ ఉండేవారాయన. తన నటనతో అందరికీ హాస్యం పంచిన ఆయన ఫిబ్రవరి 19న హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు.  


వైవిధ్య నటుడు

వంకాయల సత్యనారాయణ... ఈ పేరు వినగానే ‘సీతామాలక్ష్మి’ చిత్రంలో ‘మావి చిగురు తినగానే... కోయిల పలికేనా...’ పాటను హార్మోనియంపై వేళ్లాడిస్తూ పాడే వ్యక్తి రూపం మదిలో మెదులుతుంది. ఆ చిత్రంలో స్టేషన్‌ మాస్టర్‌ పాత్రలో ఆయన నటన మర్చిపోలేనిది. విశాఖపట్నానికి చెందిన సత్యనారాయణ సహాయ, హాస్య నటుడిగా దాదాపు 180 చిత్రాల్లో నటించారు. ‘అయినవాళ్లు, అర్ధాంగి, కమలమ్మ కమతం, జానకి రాముడు, సూత్రధారులు, అత్తింట్లో అద్దె మొగుడు, ఆశయం, రుక్మిణి’ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలతో అందర్నీ ఆకట్టుకున్నారాయన.
      పాఠశాల, కళాశాల రోజుల్లో చదువులోనూ చురుగ్గా ఉండేవారు సత్యనారాయణ. విశాఖలోని ఏవీఎన్‌ కళాశాలలో బీకాం పూర్తి చేసి బంగారు పతకం అందుకున్నారు. ఎన్‌సీసీ విద్యార్థిగా ఉన్నప్పుడు 1958లో కొచ్చిన్‌లో జరిగిన ఎన్‌సీసీ క్యాడెట్ల పోటీలో ఆలిండియా ఉత్తమ జూనియర్‌ క్యాడెట్‌గా నిలిచారు. అప్పుడే ఆలిండియా ఛాలెంజ్‌ బోట్‌ రోయర్‌ బహుమతి అందుకున్నారు. 1960లో దిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల కవాతులో పాల్గొన్నారు. కొంతకాలం షిప్‌యార్డులో పనిచేశారు. 1976లో సినీరంగంలోకి ప్రవేశించారు. చాలా ఏళ్లపాటు చెన్నైలో ఉండి సినిమాల్లో, బుల్లితెర ధారావాహికల్లో నటించారు. 2001లో తిరిగి విశాఖపట్నం వచ్చేశారు.  చిన్నకుమార్తె దగ్గర ఉంటూ.. కళాకారు లను ప్రోత్సహించేవారు. సినీరంగానికి ఎంతోమందిని పరిచయం చేశారు. ఇటీవల కళాభారతిలో జరిగిన ‘గుణనిధి’ నాటికలో అద్భుతంగా నటించారు. వైవిధ్య నటనతో ప్రేక్షకులను అలరించిన ఆయన మార్చి 12న స్వర్గస్థులయ్యారు.


*     *      *


వెనక్కి ...

మీ అభిప్రాయం