దూరాన.... దూరాన తారాదీపం

  • 590 Views
  • 0Likes
  • Like
  • Article Share

    - భాను

ఆమె రాకతో తెలుగు పల్లెదనానికి పదహారేళ్లు నిండాయి. ఆమె నవ్వులు పంటచేలో పాలకంకులై, పల్లకీలో పిల్ల ఎంకి కులుకులై ఊరేగాయి. చక్రాల్లాంటి ఆ కళ్ల లోగిళ్లలో పూతరెల్లు చేలు దాటిన వెన్నెల, లేత పచ్చ కోనసీమ ఎండ ఒకేసారి మెరిసి, కురిశాయి. మనువాడే తనవాడి జాడ కోసం సిరిమల్లెపూవును, చిన్నారి చిలకమ్మనూ అడిగి, ‘‘దేవుడా... దేవుడా’’ అంటూ ‘క్షణ క్షణం’ భయం నటించాయి. అందుకే తెలుగు ప్రేక్షకుల దృష్టిలో శ్రీదేవి ‘పదహారేళ్ల వయసు’న్న ఇంద్రజ. ‘మానవా’ అంటూ వచ్చి, మనసిచ్చిన ‘జగదేకవీరుడి’ కోసం అంగుళీకాన్ని వదులుకున్న ‘అతిలోకసుందరి’.
దక్షిణాదిలో వికసించిన అభినయ వైవిధ్యం ఉత్తరాదిలో రాణించడం చరిత్రలో ఉన్నదే. కానీ చరిత్ర సృష్టించడం మాత్రం శ్రీదేవికే సాధ్యమైంది. లోగడ వైజయంతిమాల, వహీదారెహ్మాన్‌ లాంటి తారలు ఇక్కడి నుంచి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వారికి భిన్నంగా శ్రీదేవి రెండుచోట్లా నటించి, మెండుగా అభిమానుల్ని సంపాదించడం విశేషం. నటించిన భాషలు ఏవైనా, ధరించిన పాత్రలు ఎలాంటివైనా వాటికి తన గొంతునే పంచి, ప్రతీ ప్రాంతాలవారికీ తాను సొంతమనిషిననిపించారామె. కేవలం అందాల విందుకే పరిమితం కాకుండా భాషకూ, సంస్కృతికీ ప్రాధాన్యమివ్వడం వల్లనే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానాన్ని శ్రీదేవి చూరగొన్నారు.
      శ్రీదేవి సినిమా ప్రస్థానంలో మలుపులూ, ఎత్తుపల్లాలూ, సవాళ్లూ ఉన్నాయి. తమిళ చలనచిత్ర రంగం ఆమెలోని వైవిధ్యభరితమైన నటిని ముందుగా గుర్తించింది. ఆవిడలోని ప్రతిభను వెలికితీసి, వయసుకు సరిపడే విభిన్నమైన పాత్రాలతో మంచి అవకాశాలు కల్పించింది. కానీ బాలీవుడ్‌ వాకిలి తట్టి, అగ్రపథంలోకి దూసుకుపోవడానికి సోపా నాలు వేసింది మాత్రం తెలుగు చిత్రాలే. అన్ని భాషా చిత్రాల్లోనూ ఆమె జయ కేతనం ఎగరేసినా తమ అభిమాన తారగా శ్రీదేవికి తెలుగువారిచ్చిన స్థానం ప్రత్యేకం.
రెండు పార్శ్వాలు
తెలుగు చిత్రాల్లో శ్రీదేవి ప్రయాణాన్ని పర్యవలోకిస్తే రెండు పార్శ్వాలు కనిపిస్తాయి. మొదటిది బాలనటిగా పరిచయమవడం, రెండోది యుక్తవయసు కథానాయికగా అడుగుపెట్టి అగ్రస్థానానికి చేరుకోవడం. చిన్నారి శ్రీదేవి తెలుగులో నటించిన తొలి తెలుగు చిత్రం ‘మా నాన్న నిర్దోషి’ (1970). అందులో కృష్ణ, విజయనిర్మల జోడీకి కుమార్తెగా నటించిన శ్రీదేవి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా ‘ఎంతెంతదూరం..’ పల్లవితో సాగే పిల్లల పాటలో శ్రీదేవి అభినయం ప్రశంసలు అందుకుంది. ఆమె ముఖంలోని వసివాడని పసితనం, అందమైన అమాయకత్వం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. కథానాయికగా ఎదిగిన తర్వాత కూడా వాటి ఛాయలు కొనసాగడం ఓ నటీమణిగా ఆవిడ చేసుకున్న అదృష్టం కాగా అదే మొదట్లో అవరోధంగా మారింది కూడా! ‘పదహారేళ్ల వయసు’, ‘వసంత కోకిల’ లాంటి చిత్రాల్లో అద్భుతంగా నటించడానికి ఆ పసితనపు ఛాయలు శ్రీదేవికి ఎంతగానో దోహదం చేశాయనిపిస్తుంది.
      ‘మా నాన్న నిర్దోషి’ తర్వాత శ్రీదేవికి తెలుగులో అవకాశాలు కలిసివచ్చాయి. అనేక చిత్రాల్లో బాలపాత్రలు ఆమె కోసం వరసకట్టాయి. ముఖ్యంగా పాటల్లో ఆ చిన్నారి చక్కని ప్రతిభను కనపరచడంతో అప్పటి దర్శకులు తన కోసం ప్రత్యేకంగా పాటలకు వీలున్న సన్నివేశాలను కల్పించేవారు. ఆ కోవలో ‘అమ్మను నేనంటా...’ (పట్టిందల్లా బంగారం), ‘చిన్నారి పాపల పొన్నారి తోటలో..’ (నా తమ్ముడు), ‘చిట్టిపొట్టి బొమ్మలూ..’ (శ్రీమంతుడు), ‘చక్కనయ్యా చందమామా..’ (భార్యాబిడ్డలు), ‘తారంగం తారంగం..’ (బాలభారతం), ‘బూచాడమ్మా బూచాడు..’ (బడిపంతులు), ‘ఈశా మహేశా..’ (మల్లమ్మ కథ), ‘పొన్నలు విరిసే వేళలో..’ (యశోదాకృష్ణ) లాంటి పాటలలో శ్రీదేవి భేష్‌ అనిపించుకుంది.
సమస్య తప్పలేదు..
బాల పాత్రదారులకు ఎదిగే వయసులో ఓ సమస్య ఎదురవుతుంది. ఇటు పిల్లల పాత్రల్లో ఇమడలేరు. అటు పెద్ద పాత్రలకు సరిపోరు. ఇది శ్రీదేవికీ తప్పలేదు. శారీరకంగా ఎదిగినా ముఖంలో పసితనపు ఛాయల వల్ల ఆమెకు హీరోయిన్‌గా అవకాశాలు పెద్దగా రాలేదు. 1975-78 సంవత్సరాల మధ్య శ్రీదేవి నటించిన చిత్రాలను గమనిస్తే ఇది తెలుస్తుంది. అవకాశాల కోసం ఎదురుచూసే దశలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన ‘దేవుడులాంటి మనిషి’ చిత్రంలో ‘ద్రాక్షపండు తీయన’ పాటలో హాస్యనటుడు రాజబాబు పక్కన నటించిందామె. ఆ పరంపరలోనే ‘అనురాగాలు’ చిత్రం ద్వారా శ్రీదేవికి తెలుగులో కథానాయికగా తొలి అవకాశం లభించింది. దీనికి మూలం మౌసమీఛటర్జీ నటించిన ‘అనురాగ్‌’ హిందీ చిత్రం. శ్రీదేవి బాగా నటించిందని జనం చెప్పుకొన్నా వాణిజ్యపరంగా అవకాశాలు కలిసి రాలేదు. ‘ఈ కాలపు పిల్లలు’ లాంటివి వచ్చినా గుర్తింపు రాలేదు. ‘బంగారక్క’లో వయసుకు తగ్గ పాత్రలో కథానాయికగా కనిపించినా జయప్రద, జయసుధ లాంటి కథానాయికల వేపే మొగ్గు కనిపించింది. సరిగా ఈ సమయంలోనే తమిళ చిత్రాలు శ్రీదేవికి కలిసివచ్చాయి.
      ప్రయోగాల వైపు మొగ్గు చూపించే బాలచందర్‌, భారతీరాజా లాంటి దర్శకులు అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న కమల్‌హసన్‌, రజనీకాంత్‌ల సరసన శ్రీదేవి కథానాయికగా ‘మూండ్రం పిరై’, ‘16 వయదినిలే’ లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. తమిళ చిత్రాల్లో శ్రీదేవి విజయాలు తెలుగు దర్శకులకు స్ఫూర్తినిచ్చాయి. దర్శకుడు రాఘవేంద్రరావు ‘16 వయదినిలే’ చిత్రానికి తెలుగు వాతావరణానికి అనువుగా మార్పులు చేశారు. శ్రీదేవిలోని పల్లెటూరి తెలుగమ్మాయిని తెరపైన చూపించారు. అంతకుమునుపు మూడేళ్లపాటు తెలుగులో సరైన అవకాశాల కోసం ఎదురుచూసిన శ్రీదేవికి ‘పదహారేళ్ల వయసు’ (1978)తో విజయ కవాటాలు తెరిచినట్లయింది. అంతకుమునుపు మూడేళ్ల వ్యవధిలో తెలుగులో శ్రీదేవి ధరించిన యుక్తవయసు పాత్రలన్నీ మరుగునపడ్డాయేమో ‘పదహారేళ్ల వయసు’ శ్రీదేవికి తొలి చిత్రమన్నంతగా పేరు తెచ్చింది. అందులోని ‘సిరిమల్లె పూవా...’ పాటలో ఉయ్యాలలూగిన ‘మల్లి’ పాత్రే అభిమానులకు గుర్తుండిపోయింది.
మరో విజయం
తెలుగులో శుభారంభం లభించింది సరేగానీ కొత్త సమస్య వచ్చింది. అప్పటికి అగ్రనటులైన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు వాణిజ్యపరమైన కథానాయకులుగా కొనసాగుతున్నారు. వారి సరసన కూడా నాయికగా ఒప్పించగలిగితేనే తెలుగులో కుంభస్థలాన్ని కొట్టడం సాధ్యం. ఇక్కడ కూడా రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే అది సుసాధ్యమైంది. ‘వేటగాడు’ చిత్రం ద్వారా శ్రీదేవి వయసు అంతరాల్ని జయించి, విజయం సాధించగలదని నిరూపించుకున్నారు. ఒకప్పుడు మనవరాలు, చెల్లెలు లాంటి పాత్రలు ధరించిన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లతో కలిసి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారామె.  
      ఎన్టీఆర్‌ మొదలుకొని కృష్ణంరాజు వరకు మొదటి రెండు తరాల కథానాయకుల సరసన మెప్పించి, ఆ తర్వాతి తరానికి చెందిన చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌లకు సైతం జోడీగా ప్రేక్షకుల ఆమోదం పొందడం ఒక్క శ్రీదేవికి మాత్రమే సాధ్యమైంది. కథానుసారం రూపొందిన పాత్రలో ఒదిగిపోవడం శ్రీదేవి ప్రత్యేకత. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్‌బాబు కథానాయకుడిగా వెలువడ్డ ‘మోసగాడు’ (1980) చిత్రంలో ప్రతినాయిక లక్షణాలతో సిగరెట్‌ తాగే పాత్రను ధరించడానికి ముందుకు వచ్చి దర్శకుణ్ని సైతం ఆశ్చర్యపరిచారామె. శ్రీదేవిని అతిలోక సౌందర్యవతిగా చూపించడంలో రాఘవేంద్రరావు (జగదేకవీరుడు అతిలోక సుందరి), రాంగోపాల్‌వర్మ (క్షణ క్షణం, గోవింద గోవింద) పోటీ పడ్డారనిపిస్తుంది. ‘క్షణక్షణం’లో శ్రీదేవి ‘‘కింగులా కనిపిస్తున్నాడు...’’ అంటూ సొంతంగా పాడుకున్నారు కూడా.
      ‘హిమ్మత్‌ వాలా’ చిత్రంతో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన తర్వాత శ్రీదేవికి అక్కడ ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు వచ్చాయి. అత్యధిక పారితోషికం తీసుకున్న కథానాయికగా పేరు వచ్చింది. హిందీలో ఊపిరిసలపని రోజుల్లో కూడా తనను ‘స్టార్‌’ స్థాయికి చేర్చి, సమున్నత స్థానాన్ని తెచ్చిపెట్టిన తెలుగు చలనచిత్ర రంగాన్ని ఆవిడ విస్మరించలేదు. ఫలితంగానే ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘క్షణక్షణం’ లాంటి చిత్రాలు వచ్చాయి. అవకాశం లభించినంత మేరకు తెలుగు చిత్రాల్లో నటిస్తూ, తెలుగింటి అడపడుచుగా గౌరవాన్ని నిలుపుకొన్నారామె. యుక్తవయసు పాత్రలకు కాలం చెల్లిందన్న వాస్తవాన్ని ఓ మనిషిగా శ్రీదేవి గ్రహించారు. అందుకే నటిగా తనలోని ప్రతిభకు గుర్తింపు వయసుకు తగ్గ పాత్రల కోసం ఆవిడ ఆలోచించారు. కనుకనే ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’, ‘మామ్‌’లాంటి చిత్రాల్లో ఆమె నటించారు. నటిగా ఆవిడ భావి ప్రణాళికలు ఏమున్నాయోగానీ, వాటిని సాకారం చేసుకోకముందే దేశంకాని దేశంలో తెలుగువారి ఈ ‘పదహారేళ్ల అతిలోకసుందరి’ కన్నుమూశారు. ఒకప్పటి తన పాటల్లోని మాటల్ని గుర్తుకు తెస్తూ - కథగా కల్పనగా, దిక్కులుదాటి, చుక్కల లోకం చేరుకొని దూరాన దూరాన తారాదీపంగా మిగిలిపోయారు.

*     *     *


వెనక్కి ...

మీ అభిప్రాయం