మానవతామూర్తి.... చైతన్యాక్షర స్ఫూర్తి

  • 284 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వి.రాజారామమోహనరావు

  • విశ్రాంత రైల్వే ఉద్యోగి,
  • హైదరాబాదు
  • 9394738805
వి.రాజారామమోహనరావు

కాలక్రమేణా మంచి రచయితగా ఎదుగుతూ ఉండటం కష్టం. అంతకన్నా మంచి మనిషిగా జీవితమంతా ఎదగటం ఎంతో కష్టం. అలా ఎదిగిన మనీషి మునిపల్లె రాజు. అలాంటి వ్యక్తి రచనలు సాధారణంగానే ఉదాత్తంగా ఉంటాయి. దానికి తోడు బాల్యం నుంచే విస్తృతపఠనం, వివిధ భావధారల ఆకళింపు, గతం- వర్తమానాల సంయమనం ఆయన్నొక ఆధునిక తాత్విక రచయితగా మలిచాయి.
ఏదో మెప్పు పొందటానికో, ఎదుటివారి పొగడ్తల కోసమో మునిపల్లె రాజు రచనలు చేయలేదు. తనకి కనిపించిన జీవితాన్ని విశ్లేషించి, అర్థవంతంగా తన అనుభవాన్ని వ్యక్తీకరించటానికి అనవరతం తపించిన విశిష్ట వ్యక్తిత్వం ఆయనది. రసన నిండిన అభివ్యక్తి అంటే మునిపల్లెకు ప్రాణం. మన జీవితాలను నడుపుతున్న శక్తి తాలూకు తాత్వికాన్వేషణ ఆయన నైజం. సౌమ్యత ఆయనకి సహజాతం. మెత్తని మాట, మంచి మనసు ఆయన స్వభావం. ఆయన వ్యక్తిగా, సృజనశీలిగా... మొత్తం ఓ సాత్విక స్వరూపం.
మునిపల్లె రాజు జీవితం పలు దశల్లో సాగుతూ, ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ గడిచింది. ఆయన మార్చి 16, 1925న గుంటూరు జిల్లా గరికపాడులో పుట్టారు. వాళ్ల పూర్వికులది మునిపల్లె గ్రామం. ఆ తర్వాత వారి కుటుంబం దగ్గరలోని తెనాలికి తరలివెళ్లింది. రాజు అక్షరాభ్యాసం, ప్రాథమిక విద్య ఆ పట్టణంలోనే. ఆ తర్వాత పొన్నూరు, నిడుబ్రోలులో ఉన్నత పాఠశాల, కళాశాల విద్య సాగింది. ఎఫ్‌ఏలో చేరారు కానీ, పూర్తి చెయ్యలేదు. అయితే ఆయన చేసిన పలు భాషా సాహిత్యాల అధ్యయనం, అన్ని డిగ్రీ చదువులకన్నా మించింది. మునిపల్లె రాజు జననం రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలం. అప్పటి ఆర్థిక మాంద్యం వల్ల ఆ కాలానికి ‘హంగ్రీ థర్టీస్‌’ అని పేరు. వాళ్ల తరాన్ని ‘వూండెడ్‌ జనరేషన్‌’ అనేవారు. బాల్యంలోనే అంత కఠినమైన సామాజిక జీవితం ఆయన అనుభవంలో ఉంది. బ్రిటిష్‌ పాలనకి, బెంగాల్‌ కరవుకి, రెండో ప్రపంచ యుద్ధపు సంక్షోభానికి, బియ్యంగింజ బంగారు తునకలా చెలామణీ అయిన రేషన్‌ రోజులకి ఆయన సజీవసాక్షి.
కుటుంబ ప్రభావంతో...
తెనాలి పట్నం ఓ సాంస్కృతిక కేంద్రం. ఆంధ్రాపారిస్‌ అని దానికి పేరు. అదో రాజకీయ చైతన్య క్షేత్రం.. ప్రశ్నభూమి. చలం, కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్‌ లాంటి మేథావి రచయితలు; స్థానం నరసింహారావు, గోవిందరాజు సుబ్బారావు మరెంతమందో రంగస్థల నటీనటులు అక్కడివారే. అలాంటి పట్నంలో పెరిగినందుకు మునిపల్లెకు ఎంతో ఆనందం. అదీకాక వారి కుటుంబంలో రాజకీయ చైతన్యం, పుస్తకపఠన ప్రియత్వం, సామాజిక సంస్కరణలపట్ల గాఢ అనురక్తి ఉండేవి. దివ్యజ్ఞాన సమాజం, బ్రాహ్మణ సమాజం, మహాత్మాగాంధీ బోధనలు, మార్క్సిజం, చార్వాకం, బౌద్ధవచనాలు, పురాణప్రవచనాలు- వీటన్నింటి మీద నిత్యం చర్చలు జరుగుతూండేవి. అవన్నీ శ్రద్ధగా వినటం, ఆలోచించటం, ఏకాంతంగా విశ్లేషించుకుని అధ్యయనం చెయ్యటం ఆయనకు అలవాటైంది. పునర్వివాహ సంస్థతోనూ, కళావంతుల సంస్కరణ సంఘంతోనూ ఆ కుటుంబం వారికి సంబంధం ఉంది. వీటన్నింటివల్ల వ్యక్తులు పడే రకరకాల బాధలు మునిపల్లెకు లోతుగా అవగతమయ్యాయి. కాశీ విశ్వవిద్యాలయం నుంచి కమ్యూనిస్టుగా తిరిగివచ్చిన మునిపల్లె రామారావు, రాజుకు దగ్గరి బంధువు. ఆయన ప్రభావంతో మునిపల్లె మార్క్సిజంవైపు ఆకర్షితులయ్యారు. ఆ ప్రభావమే ఆయనతో ‘బిచ్చగాళ్ల జెండా’ లాంటి దోపిడీ వ్యవస్థ వ్యతిరేక కథలు రాయించింది.
మునిపల్లె రాజు తండ్రి హఠాత్తుగా మరణించారు. కుటుంబ ఆర్థికపరిస్థితి బాగా దిగజారింది. మానసికంగా ఒంటరితనం ఆయన్ని కుంగదీసింది. కుటుంబ బాధ్యతని తన మీద వేసుకుని ఉద్యోగం వెతుక్కుంటూ విశాఖ వెళ్లారు. అక్కడ ఓ మిలటరీ క్యాంటీన్‌లో చిన్న ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ఆయన విజ్ఞాన ప్రతిభ వల్ల మిలటరీ సివిల్‌ సర్వీసులో ఉద్యోగం దొరికింది. 1943 నుంచి 1983 వరకూ, నలభై సంవత్సరాలు భారత రక్షణశాఖలో వివిధ హోదాల్లో పనిచేసి ఏఓ గ్రేడ్‌ 1గా పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత సికింద్రాబాదు, సైనికపురిలో స్థిరపడ్డారు. మధ్యలో కొంతకాలం ఆయన రచనా వ్యాసంగం ఆగింది. తొలి రోజుల్లో కవిత్వం అభిమాన విషయంగా ఉన్నా, రానురానూ వచన రచనే ఆయన ప్రధాన వ్యాసంగం అయింది. ఎన్నో కథలు (నాలుగు కథాసంపుటాలుగా వచ్చాయి), ‘పూజారి’ నవల, ‘వేరొక ఆకాశం-వేరెన్నో నక్షత్రాలు’ (కవిత్వసంపుటి), ‘అలసిపోయినవాడి అరణ్యకాలు’ (తెలుగు, ఇంగ్లీషులో కవిత్వం), ‘జర్నలిజంలో సృజనరాగాలు’, ‘సాహితీమంత్ర నగరిలో సుస్వరాలు’ (వ్యాస సంపుటాలు) మునిపల్లె రాజు రచనలు. కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం(2007)తో సహా దాదాపు ఇరవై పురస్కారాలు ఆయన రచనలకి లభించాయి. కేంద్ర సాహిత్య అకాడమీ మునిపల్లె రాజు మీద నలభై నిమిషాల డాక్యుమెంటరీ నిర్మించింది. దాని చిత్రీకరణ పూర్తయినా ఇంకా కొంత పని మిగిలి ఉంది. రాజు గతించక ముందే (ఫిబ్రవరి 24, 2018) అది నలుగురి ముందుకీ వస్తే బావుండేది.
ఆ అసంతృప్తి ఉండేది!
ఉద్యోగరీత్యా దేశంలోని పలు ప్రాంతాల్లో నివాసం ఉన్నారు మునిపల్లె. భారతదేశపు బహుళత్వంలోని ఏకత్వం ఆయనలో బాగా ఇంకటానికి ఈ దేశాటన తోడ్పడింది. రష్యన్‌ సాహిత్యం లోతుగా చదువుకోటం వల్ల అన్ని వాదాలకన్నా మానవతావాదమే గొప్పదని, ముఖ్యమైందని ఆయన నిర్ధారణకి వచ్చారు. తన రచనల్లో దాన్ని ప్రతిఫలింపజేశారు. రాజు సహజంగా ప్రయోగశీలి. ఆయన ప్రయోగశీలత్వం రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
మునిపల్లె రాజు తన ఏకైక నవల ‘పూజారి’ని 1952లో రాశారు. ప్రఖ్యాత దర్శకులు బి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పూజాఫలం’ చిత్రానికి ఈ నవలే మాతృక. పూజాఫలం చిత్రం అన్ని రకాలుగా విజయం సాధించింది. కథాకథనం, సంగీతం, పగలేవెన్నెల లాంటి పాటలు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున, గుమ్మడి, జగ్గయ్యల చక్కటి నటనతో అది ఉత్తమచిత్రం అయింది. వ్యాపారపరంగా కూడా ఎంతో విజయం సాధించింది. దృశ్యమాధ్యమం పట్ల ఎంతో ఇష్టం ఉన్న రాజు ఈ చిత్ర విషయంలో మాత్రం కొంత అసంతృప్తి చెందారు. ‘పూజాఫలం’ చిత్రానికి మధు నాయకుడు. అతనికి అన్నీ ఉన్నా ఉత్సాహం లేదు. తల్లి చిన్నతనంలోనే గతించింది. తను గాఢంగా ఏది కోరుకున్నా అది తనకి దక్కదని అతని నమ్మకం. అతను ఒక ‘నిరాశావేదాంతి’ అంటారు మునిపల్లె రాజు. అతని జీవితం చివరికి అలాగే అవుతుంది. నవలలో ఓ ఒంటరి దేవాలయంలో ఒంటరి పూజారిగా మిగిలిపోతాడు. ‘డిఫీటిజమ్‌’ అన్న మానసిక సంక్షోభానికి ప్రతీకగా మధుపాత్రని నిర్మించారు రాజు. కానీ సినిమాలో కళాసృష్టి కోసం ఆ పాత్రని సానుకూలంగా మార్చి సినిమాని సుఖాంతం చేశారు. దానివల్లే చిత్రం అంత విజయవంతమైంది. అయితే.. ‘డిఫీటిజమ్‌’ గురించిన తన ప్రధాన ఉద్దేశం దెబ్బతిందని, కథకి హృదయంలాంటి ఆ విషయం సినిమా చిత్రీకరణలో రాలేదని రాజుగారి అసంతృప్తి. సినిమాగా ‘పూజాఫలం’ ఓ కళాఖండం. శిల్పం, శైలి, వస్తువుల రీత్యా తెలుగు నవలల్లో ‘పూజారి’ నవల అత్యంత విశిష్టమైంది.

కథలు కావవి... కళారూపాలు
మునిపల్లె రాజు అనగానే గుర్తొచ్చేది, మార్మిక వాస్తవికత (మేజిక్‌ రియలిజమ్‌). మన కళ్లముందు కనపడే వాస్తవికత వెనుక అంతర్లీనంగా ఏదో మార్మికత ఉందన్నది దాని తాత్పర్యం. దానికి ఈనాటి పాశ్చాత్య రచయితల రచనలు మూలం కాదని, అంతకు ఎన్నో వేల ఏళ్ల ముందే మన వ్యాస, వాల్మీక రచనల్లో ఈ సారం ఉందని మునిపల్లె రాజు గాఢ విశ్వాసం. తన మలి రచనల్లో ఆ విశ్వాసాన్ని నిరూపించేలా గట్టి కృషి చేశారు.
ఏడెనిమిది దశాబ్దాల అనుభవసారం మునిపల్లె రాజు కథలు. రెండో ప్రపంచ యుద్ధం, భారత స్వతంత్ర పోరాటం, బ్రిటిష్‌పాలన, బెంగాల్‌కరవు, జమీందారీ వ్యవస్థ, ధనికులు, అగ్రజాతుల ఆగడాలు, అంటరానితనం, పేదరికం, రాయలసీమ క్షామం... ఇలా ఎన్నెన్నో చారిత్రక ఘటనల ప్రతిబింబాలు ఆయన కథలు. ఇంతటి వైవిధ్యమున్న వస్తువు, దాన్ని చక్కగా విశ్లేషించే సరళ శైలి, శిల్పనైపుణ్యం, కవితాత్మక వ్యక్తీకరణలతో అవి చక్కటి కళారూపాలనిపిస్తాయి. వృత్తిరీత్యా పలు ప్రాంతాలు తిరుగుతూ, రకరకాల జీవన విధానాలని పరిశీలిస్తూ మనుషుల స్వభావ, పరివర్తన, ప్రవర్తనలని మునిపల్లె లోతుగా ఆకళింపు చేసుకున్నారు. అందుకే ఆయన కథల్లోని పాత్రలు మూస పాత్రలు కాదు. జవసత్వాలు, రక్తమాంసాలు, తీవ్ర భావోద్వేగాల ప్రతిరూపాలు.
క్లిష్ట సమయాల్లో మనుషుల అంతరంగాలు తీవ్రసంక్షోభాన్ని ఎదుర్కొంటాయి. అలాంటి సమయాల్లో కూడా ఎదుటివారి గురించి ఆలోచించాలన్నది రాజు తాత్వికత. అప్పుడే మానవత్వం మరింతగా వికసిస్తుందన్న సిద్ధాంతం ఆయనది. ఇవన్నీ ఆయన కథల్లో కనిపిస్తాయి. వాటిలో ‘వారాల అబ్బాయి’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారాలు చేసుకుంటూ చదువుకోవడంలో పసిమనసుల దైన్యం ఎంతో, అటువైపు వారి ఔదార్యం, అభిమానం కూడా అంత ముఖ్యమైనవే. ఈ ఇరుపార్శ్వాలని సమంగా చిత్రించారు. ఊరు మంచే తన మంచిగా భావించే శేషమ్మ, మన సంస్కృతి సంప్రదాయాల విలువని ప్రతిబింబించే దొడ్డమ్మ రాజు ఇతర కథల్లో పాత్రలు. ఇలాంటి పాత్రలు ఓ విషయాన్నికాక, ఓ జీవధారని మన కళ్లముందు ఉంచటం విశేషం. ‘వీరకుంకుమ’ కథలో రాయలసీమ క్షామంతోపాటు, రైతు ఇంట మెసిలే పసరం అనుబంధం ప్రతిఫలించాయి. ఓ కవితాధార లాంటి వచనం మునిపల్లెది.
నవతరానికి వెన్నుదన్ను
‘‘నా విద్యార్థి దశలో అబ్బిన రచనా వ్యాసంగం, ఇప్పటికీ నన్ను సమ్మోహితుడిని చేస్తుంది. కొత్తగా కలం పట్టిన యువకుల వ్యక్తీకరణను ప్రోత్సహించటం నాకెంతో ఆనందం’’ అని ఆయన పలు సందర్భాల్లో పలురకాలుగా వ్యక్తీకరించారు. ఎవరు తమ రచనలకి ముందు మాట రాయమన్నా కాదనేవారు కాదు. ఎవరి గురించి ప్రసంగించటానికైనా ముందుండేవారు. వారి వారి రచనల్లో కొంచెం మంచి కనిపించినా మనసారా ప్రశంసించేవారు. నచ్చని సాహిత్యాంశాలని కూడా సున్నితంగానే చెప్పేవారు. సామాజిక, సాహిత్య కాలుష్యాల విషయంగా ఆయనలో సాంద్రమైన బాధ ఉండేది. మరోవైపు ప్రచారమంటే మునిపల్లెకు ఇష్టం ఉండేది కాదు. ఫొటోలు కూడా తీస్తుంటే ‘ఎందుకులెండి’ అనేవారు. అందుకే దొరికిన ఆయన ఫొటోలన్నీ ఇంచుమించు ఒకేరకం.
తనని మంచి వైపు నడిపించింది తన రచనా జీవితమేనని పూర్తిగా నమ్మిన వ్యక్తి రాజు. ఉత్తమ వ్యక్తిత్వం, ఉన్నతశ్రేణి రచన- వెరసి మునిపల్లె రాజు. రావల్సినంత ఎక్కువ ప్రాచుర్యం రాని ఆయన రచనలని, ఏడుపదులకుపైగా సాగిన ఆయన రచనా జీవితాన్ని సజీవంగా నిలుపుకోగలిగిన అన్ని ప్రయత్నాలు చేయడమే అవశ్య కర్తవ్యం. మునిపల్లెను స్మరించుకుంటే విశ్వప్రేమని, జనహితాన్ని, మంచే నిండిన నూతన సమాజాన్ని స్మరించుకున్నట్టే.

*     *      * 


వెనక్కి ...

మీ అభిప్రాయం