వీరభద్ర...భాషాగుణభద్ర!

  • 204 Views
  • 0Likes
  • Like
  • Article Share

    రామకృష్ణ,

  • విజయవాడ

తేట తెనుంగుమాట అది తీపిదనాన వరాలమూట, క
ర్ణాటక ఆంధ్రరాజ పరిరక్షిత శోభిత ప్రౌఢమూర్తియై 
నాటికి నేటికిన్‌ వసుధ నాణ్యత గాంచెను కీర్తినొందె, యి
ప్పాటున పల్కెదన్‌ తెలుగువాడను నేనని దర్పమొప్పగన్‌

ఆ పెద్దాయన వయసు 90 ఏళ్లు. కథ, నవల, నాటిక, కవిత... ఇలా విభిన్న ప్రక్రియల్లో అసంఖ్యాక రచనలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.. అదీ కంప్యూటరును ఉపయోగించుకుంటూ! అంతేనా!! కంప్యూటర్లో తెలుగు వినియోగం మీద ఈతరం రచయితలకు ఆయన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. అంతకు మించిన ఉత్సాహంతో భాష, సాహిత్య కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటూ ఉంటారు. ఇంతకూ ఎవరు ఆయన అంటే- ఇదే ప్రశ్నను ఆయన్ను అడిగితే- పై పద్యం చెబుతారు. ఆయన స్వీయపరిచయ పత్రం (విజిటింగ్‌ కార్డు) మీద ముందు కనిపించేది ఈ ‘ఉత్పలమాల’నే! ఇలా పేరు, ఊరు, వృత్తి తదితరాలన్నీ తర్వాత, ముందు ‘నేను తెలుగువాణ్ని’ అంటూ గర్వంగా చెప్పుకునే ఆయనే కాలనాథభట్ట వీరభద్రశాస్త్రి.
      బ్రహ్మపుర(ఒడిశా)లో 1927లో జన్మించారు శాస్త్రి. అర్థశాస్త్రంలో స్నాతకోత్తర విద్య పూర్తిచేశారు. రైల్వే ఉద్యోగిగా అనేక ప్రాంతాల్లో పనిచేశారు. పదవీ విరమణ తర్వాత విజయవాడలో స్థిరపడ్డారు. పాఠశాల స్థాయిలోనే ఉపాధ్యాయుల ప్రేరణతో సాహిత్యం వైపు ఆకర్షితులయ్యారాయన. ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యాల్ని ఆపోశన పట్టారు. షేక్స్పియర్‌, షెల్లీ, కీట్స్‌ లాంటి ఆంగ్ల కవుల రచనలనూ ఆమూలాగ్రం అధ్యయనం చేశారు. అప్పట్లో చదివిన ఆ కావ్యాల్లోని ప్రతి పద్యమూ ఇప్పటికీ ఆయనకు కంఠస్థమే. వాటిని ప్రతిపదార్థ తాత్పర్యాలతో సహా చెప్పగలిగిన జ్ఞాపకశక్తి ఆయన సొంతం.
ఎన్నెన్ని రచనలో...
సాహిత్యాధ్యయనంతో పాటు రచనలోనూ శాస్త్రిది అందెవేసిన చెయ్యి. చిన్ననాటి నుంచే ఛందోబద్ధంగా కవిత్వం రాయడం ప్రారంభించారు. వెయ్యినూటపదహారు ఆటవెలది పద్యాలతో ‘భాగవత పద్య గాథావళి’, ‘సూక్తిశతకం’, ‘శ్రీ భద్రాచల సీతారామస్వామి సుప్రభాతం’ రాశారు. అలా అని ఆయన కలం పద్యరచనకే పరిమితం కాలేదు. పదిహేను కవితా సంపుటాలు, ఆరువందలకు పైగా కథలు, యాభై నాటకాలు, ఆరు నవలలు, నాలుగు యాత్రాచరిత్రలు, పాతిక ఆధ్యాత్మిక రచనలతో పాటు అసంఖ్యాకంగా పేరడీలు, వ్యాసాలు ఆయన లేఖిని నుంచి జాలువారాయి. తెలుగులో ఈ రచనా యజ్ఞానికి తోడుగా ఆంగ్లంలోనూ కవితలు, కథలు, పది రూపకాలు, యాభైకి పైగా హాస్య ప్రహసనాలను వెలువరించారు శాస్త్రి. ‘అమెరికా ఇతివృత్తంతో ఆరు హాస్యనాటికలు’, ‘నేను చదువుకుంటా’ (నాటిక), ‘చిట్కాలు.. చిట్కాలు’ (వ్యంగ్య రచనలు) తదితరాలు ఆయన రచనల్లో ప్రసిద్ధాలు. శాస్త్రి రాసిన ‘భూమి గుండ్రంగా ఉంది’ నాటకం 2003లో అమెరికాలోని హ్యూస్టన్‌లో ప్రదర్శితమైంది. 2008లో ‘ఆటా’ నిర్వహించిన పోటీల్లో ఆయన కవిత, కథలు ప్రథమ బహుమతులు గెలుచుకున్నాయి. శాస్త్రి రచనల్లో తెలుగు సాంస్కృతిక విలువలు, కుటుంబ అనుబంధాలు, సామాజిక సమస్యలు, వర్తమాన అంశాలు విరివిగా కనపడతాయి. ‘‘సామాజిక స్పృహలేని రచనలు సమాజానికి, భాషా వికాసానికి ఏమాత్రం పనికిరావు’’ అని చెబుతారాయన.
      దశాబ్దాల అక్షర ప్రస్థానంలో వీరభద్రశాస్త్రి అనేక సాహితీసంస్థల్లో క్రియాశీలక పాత్రలు పోషించారు. సదస్సులు, చర్చావేదికలు, అష్టావధానాలు, కవిసమ్మేళనాలు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి హోదాలో 1967, 68, 70, 76ల్లో కృష్ణాజిల్లా రచయితల మహాసభలను విజయవంతం గా నిర్వహించారు. జిల్లా స్థాయిలో రచయితల మహాసభలు నిర్వహించిన మొదటి వ్యక్తి ఈయనే. ఈ సభల స్ఫూర్తితోనే 1983లో ‘కృష్ణాజిల్లా రచయితల సంఘం’ ఆవిర్భవించింది.
ఆరుపదుల వయసులో...
వీరభద్రశాస్త్రి ఎక్కడికి వెళ్లినా తెలుగు తలపుల్లోనే ఉంటారు. విదేశాల్లో స్థిరపడిన కుమారుల్ని చూడటానికి వెళ్లినప్పుడు ఆయా ప్రాంతాల్లోని తెలుగు సంస్థలతో కలిసి ఆయన వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఏడో తానా సభల సందర్భంగా (1989) వెలువరించిన ‘మధురవాణి’ ప్రత్యేక సంచికకు ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించారు. రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవడం, దాన్ని భాషా పరిరక్షణకు వినియోగించడం శాస్త్రిలోని మరో కోణం. 1986లో శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లినప్పుడు తొలిసారి కంప్యూటర్‌ నేర్చుకున్నారాయన. మూడేళ్ల తర్వాత మళ్లీ అమెరికా వెళ్లినప్పుడు కంప్యూటర్లో తెలుగు వాడకం అభ్యసించారు. అంతర్జాలంలో తెలుగు వినియోగం మీదా పట్టు సాధించారు. అప్పటి నుంచి కంప్యూటర్‌ ద్వారానే రచనలు చేయడం ప్రారంభించారు. వివిధ వెబ్‌సైట్లకు ఎనిమిది వందలకు పైగా వ్యాసాలు, ఇతరాలు రాశారు.
      తాను నేర్చుకోవడంతో సరిపెట్టుకోకుండా, వీలైనంత ఎక్కువమందికి కంప్యూటర్లో తెలుగు వాడకాన్ని నేర్పించడం శాస్త్రి ప్రత్యేకత. ఆయన వెయ్యి మంది మహిళలు, రచయితలకు అంతర్జాలంలో తెలుగు వినియోగం మీద శిక్షణ ఇచ్చారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు డీటీపీ నేర్పించారు. తద్వారా వాళ్లకు ఉపాధి చూపించడంతో పాటు వారిని తెలుగు భాషా ప్రియులుగా తీర్చిదిద్దారు. ఇప్పటికీ ఆయన ఇలాంటి కార్యక్రమాలు.. ముఖ్యంగా రచయితలకు కంప్యూటర్లో తెలుగులో రాత మీద అవగాహన కల్పించే శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, ఏటా పాఠశాల విద్యార్థులకు పద్యపఠన పోటీలు నిర్వహిస్తున్నారు. ‘‘ఎప్పటికప్పుడు ఆవిష్కృతమవుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, దాన్ని తెలుగు భాషాభివృద్ధికి సోపానంగా మార్చుకోవాలి. అప్పుడే తెలుగు విశ్వభాషగా అవతరిస్తుంది’’ అంటారు వీరభద్రశాస్త్త్రి. కాలానికి అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకోవడంతో పాటు ప్రతిఫలాపేక్ష లేకుండా తన నైపుణ్యఫలాలను పదిమందికీ పంచుతున్న ఈయన ఈతరానికో నిత్యచైతన్య స్ఫూర్తి.

*    *      *


వెనక్కి ...

మీ అభిప్రాయం