మానవల్లి...పరిశోధనా కల్పవల్లి

  • 305 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా.బోయినిపల్లి ప్రభాకర్‌,

  • తెలుగు సహాయ ఆచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
  • ఆర్మూర్‌, నిజామాబాద్‌ జిల్లా.
  • 9490901050
డా.బోయినిపల్లి ప్రభాకర్‌,

మానవల్లి రామకృష్ణ కవి... తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్నవాళ్లందరూ స్మరించుకునే పేరు. తన కాలంనాటికి చరిత్రకు ఎక్కకుండా, తాళపత్రాల్లోనే మరుగున పడిపోతున్న సాహితీ సంపదను వెలికితీసిన కీర్తి ఆయనది. నన్నయకు పూర్వమే తెలుగు సాహిత్యం కాంతులీనిందన్న వాదనకు ఆధారమైన నన్నెచోడుడు అనేవాడు ఒకడున్నాడని లోకానికి చాటింది మానవల్లి కవే. ఒక్క కుమారసంభవమే కాదు.. కాలమాళిగలోంచి ఎన్నో కావ్యాలు, కవులను వెలుగులోకి తెచ్చిన మహా పరిశోధకులాయన.
సాహిత్యచరిత్ర వికాసానికి మూలం ‘మౌలిక పరిశోధనే’ అని నిరూపించిన వ్యక్తి మానవల్లి రామకృష్ణకవి. ‘‘ఆనాడా వాఙ్మయతపస్వి విస్మృతకవులు అనుపేర సాహిత్యపు ప్రపంచమంతకుముందు కనివిని యెఱుగని కావ్యములను ప్రకటింపబట్టియే నేటి మన సారస్వత చరిత్ర యిట్టి పరిణత స్థితికి వచ్చినది. ఆయన జన్మించి యుండకపోయిన యెడల ఆంధ్ర సాహిత్యచరిత్ర అంధకారబంధురమై యుండెడిదనుటలో అతిశయోక్తి లేదు’’ అన్నారు నిడుదవోలు వెంకటరావు. నిజంగానే మానవల్లి జీవితమంతా చరిత్ర విస్మరించిన కవులు, కావ్యాల పరిశోధనకే అంకితమైంది.
      మానవల్లి రామకృష్ణ కవి 1866లో మద్రాసులోని నుంగంబాకంలో జన్మించారు. ఆయనది పండిత కుటుంబం. తండ్రి నాట్యశాస్త్రానికి వ్యాఖ్యానం రాశారు. ఇక రామకృష్ణ బాల్యంలోనే కవితాశక్తిని ఒడిసిపట్టుకున్నారు. తెలుగు, సంస్కృతం, తమిళ, కన్నడ, ఆంగ్ల భాషల్లోనూ ప్రావీణ్యం సాధించారు. ఆ పాండిత్యం, తాళపత్ర గ్రంథాలపట్ల ఆసక్తి ఆయన్ను గొప్ప మౌలిక పరిశోధకునిగా నిలబెట్టాయి.
      రామకృష్ణకవి సంస్కృతం, తెలుగు ప్రధానంగా ఎమ్మే చదివారు. మౌలిక పరిశోధనపట్ల ఆసక్తితో తంజావూరు సరస్వతీమహల్‌ను ఆశ్రయించారు. అందులో లభ్యమైన కావ్యాలను ఎలా ప్రచురించాలి అనుకుంటున్న తరుణంలో, ఆయనకు 1904లో వనపర్తి సంస్థానంలో ఉద్యోగం లభించింది. అక్కడి ‘బ్రహ్మవిద్యా విలాస ముద్రాక్షరశాల’ ద్వారా ‘విస్మృతకవులు’ ధారావాహికలో భాగంగా, అపూర్వమైన కావ్యాలను వెలుగులోకి తెచ్చారు. ఈ సమయంలో సంస్థాన ఉద్యోగులు కొంతమంది ఆయన మీద అపవాదులను ప్రచారం చేశారు. దాంతో 1912లో వనపర్తిని వదిలిపెట్టి మళ్లీ మద్రాసు చేరుకున్నారు.
      ఆ తర్వాత రామకృష్ణకవి తన దృష్టిని సంస్కృత సాహిత్యం మీదికి మరల్చారు. 1915లో మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో ఉద్యోగంలో చేరారు. భాండాగారం తరఫున కేరళలో పర్యటించి అమూల్యమైన సంస్కృత సాహితీ సంపదను పోగుచేశారు. ఆ ప్రయత్నంలో నంబూద్రి బ్రాహ్మణుల దగ్గర భాసుని రచనల జాబితాలో చేరని ‘డమరుకం’ అనే నాటకాన్ని సంపాదించారాయన. 1926 వరకు అక్కడే పనిచేశారు. అయితే భాండాగారం నిబంధనలకు విరుద్ధంగా కుందమాల, కౌముది మహోత్సవం నాటకాలను స్వయంగా ప్రకటించి ఉద్యోగం కోల్పోయారు. తర్వాత 1932 వరకు రాజమండ్రిలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అది తాత్కాలిక ఉద్యోగం కావటంతో పింఛనుకు నోచుకోలేదు. దాంతో తన 66వ ఏట మళ్లీ ఉద్యోగ ప్రయత్నం చేశారు. అలా మద్రాసు విశ్వవిద్యాలయంలో ఏడాదిపాటు ఉండి 50 మెకంజీ సంపుటాలను తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువదించారు. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం విద్యాశాఖ అధికారిగా, 1940- 54 మధ్య శ్రీవేంకటేశ్వర ప్రాచ్య పరిశోధన సంస్థలో సంస్కృత శాఖాధ్యక్షులుగా ఉద్యోగాలు నిర్వహించారు. పరిశోధన కోసం తన సంపదనంతా వెచ్చించిన రామకృష్ణకవి చివరిదశలో దుర్భర పేదరికాన్ని అనుభవించారు. ఈ స్థితిలో ప్రభుత్వం ఆయనకు నెలకు రూ.150 గౌరవభృతిని మంజూరుచేసింది. 1957 సెప్టెంబర్‌ 20న ఈ ‘మౌలిక పరిశోధనా దురంధరుడు’ కీర్తిశేషులయ్యారు.
అదో యజ్ఞం
సాహిత్యచరిత్ర పరిణత స్థితికి ప్రధానపాత్ర పోషించేది మౌలిక పరిశోధనే. అంటే చరిత్రకెక్కని ప్రాచీన కావ్యాలను, కవులను గురించి ప్రకటించడంలో భాగంగా- తాళపత్రాలను సేకరించడం, వాటిని సరిపోల్చడం, పాఠ్యభేదాలలో సరైన దాన్ని గ్రహించి పరిష్కరించడం, కవి దేశ కాలాలను నిర్ణయించి, విపులమైన పీఠికతో ఆ కావ్యాన్ని ప్రకటించడం లాంటివి. ఇదెంతో కష్టమైన పని. అలాంటి మౌలిక పరిశోధనను ఓ యజ్ఞంలా భావించి, తన జీవితాన్ని అర్పించారు రామకృష్ణకవి. ఆ కృషిలోంచి మొగ్గతొడిగిందే ‘విస్మృత కవులు’ గ్రంథమాల. 1908లో ‘కుమార సంభవం’ మొదటిభాగంతో మొదలుపెట్టి ‘క్రీడాభిరామం, నీతిసార ముక్తావళి, ప్రబంధమణిభూషణం, పరతత్త్వ రసాయనం, అనర్ఘరాఘవం, త్రిపురాంతకోదా హరణం, శ్రీరంగమాహాత్మ్యం, కుమార సంభవం రెండోభాగం, సకలనీతి సమ్మతం’ తదితర గ్రంథాలను విపులమైన పీఠికలతో తొలిసారిగా ప్రకటించారు. ఆయన రాసిన పీఠికలు ప్రత్యేక సాహిత్య ఖండాలుగా స్థిరపడ్డాయి. పుస్తకానికి ఉన్నంత ప్రసిద్ధి సాధించాయి. కుమారసంభవం, క్రీడాభిరామం పీఠికలు ఈ కోవలోవే.
      అంతవరకు సాహితీ ప్రపంచంలో తెలియని ప్రాచీనకవుల విశిష్టతను వివరిస్తూ వైజయంతి, భారతి, ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, శ్రీవేంకటేశ్వర ప్రాచ్యపరిశోధన పత్రికల్లో రామకృష్ణ కవి వ్యాసాలు రాశారు. ‘ఆంధ్ర రాజకవులు’ (1910) వ్యాసంలో నన్నెచోడుడు నుంచి పాలవేకరి కదిరీపతి వరకుగల రాజకవులను గురించి స్థూలంగా తెలపడంతోపాటు, ముకుందమాల కర్త సాయప వేంకటపతి; ద్విపద రామాయణ రచయిత కట్టా వరదరాజ కవులను సాహితీలోకానికి పరిచయం చేశారు. ఇంకా ఈ వ్యాసంలో ఆముక్తమాల్యదను రాయలు రచించలేదనీ, ఎవరో వైష్ణవుడు రచించాడని ప్రతిపాదించారు. ఇది నాటి పండితుల్లో చర్చకు దారితీసింది. ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి రావడానికి తోడ్పడింది. 1915లో ‘తెనాలి కవులు’ వ్యాసంలో రామకృష్ణుడితోపాటు ఆ వంశపు ఇతర కవులను, వారి గ్రంథాలను గురించి రాశారు. ‘పాండురంగ మాహాత్మ్యం, ఉద్భటారాధ్య చరిత్రం, ఘటికాచల మహాత్మ్యాలే కాకుండా హరిలీలా విలాసం, కందర్పకేతు విలాసం’ అనే ప్రబంధాలనూ తెనాలి రామకృష్ణుడు రచించాడని చెప్పారు.
మధుర కవి కూడా
కందుకూరి వీరేశలింగం ‘కవులచరిత్ర’లో లేని కవులను వెలుగులోకి తేవడానికి ఎక్కువ కృషిచేశారు రామకృష్ణకవి. 1916లో వసుచరిత్రను గురించి రాస్తూ- దీనికి సంస్కృతంలోనేకాక తమిళ అనువాదం కూడా ఉందన్నారు. సంస్కృతంలోని కొన్ని విస్మృత నాటకాలు, తెలుగు- సంస్కృత నరసభూపాలీయాలు, కొన్ని కాకతీయ శాసనాలు, రామకృష్ణార్జున రూప నారాయణీయం, తుక్కాపంచకం, ఎలకూచి వేంకటకృష్ణరాయకవి, శ్రీకృష్ణ లీలాశుకకవి, కాళకలభకవి, ఉదయనోదయం, లీలావతికథ, కవికంఠపాశం లాంటి కావ్యాలు, కవుల గురించి తొలిసారి వ్యాసాలు రాసింది మానవల్లే. రఘునాథ రామాయణం, కవి గజాంకుశాలను ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రికలో, శుకసప్తతి కావ్యావతారికను, వాల్మీకిచరిత్రను ‘సరస్వతీ’ పత్రికలో తొలిసారిగా ప్రకటించారాయన. తరిగొండ వెంగమాంబ, గణపవరపు వేంకటకవి, పట్టమెట్ట సోమనాథ సోమ యాజి, కస్తూరి భట్టురాజు, చింతలపల్లి కవులనూ వెలుగులోకి తెచ్చారు.
      తాళపత్ర పరిశోధనలోనే కాదు, కవిత్వంలోనూ రామకృష్ణకవిది అందెవేసిన చేయి. ‘మృగావతి, వసంతవిలాసం’ కావ్యాల్లో ఆయన ప్రౌఢ మధుర కవిత్వం బయటపడుతుంది. ఈ సామర్థ్యమే ‘కుమారసంభవ’ కర్తృత్వం విషయంలో ఆయన మీద ఆరోపణలకు కారణమైంది. ఇంకా ‘కళింగసేన’ నాటకం, ‘వత్సరాజ చరిత్ర’ నవలలను రచించడంతోపాటు భాస నాటకాలైన కర్ణభారం, అవిమారకాలను అనువదించారు. మౌలిక పరిశోధనలో భాగంగా ఆంగ్లంలోనూ వ్యాసాలు రాశారు. నిడుదవోలు వెంకటరావు, డా।। పోణంగి శ్రీరామ అప్పారావుల సంపాదకత్వంలో ‘మానవల్లి కవి- రచనలు’ పేరిట 1972లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ఓ బృహత్‌ గ్రంథాన్ని ప్రచురించింది.
వివాదాస్పదమైన కాలనిర్ణయం
రామకృష్ణకవికి తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టిన కావ్యం ‘కుమార సంభవం’. తొలిసారి దాన్ని సంపాదించి పరిష్కరించి, ప్రకటించిన ఘనత ఆయనదే. దీనిపై చెలరేగినంత వివాదం మరే కావ్యంపైనా రాలేదు. కవి కాల నిర్ణయంలో మానవల్లి అనేక శాసన, మత ప్రమాణాలు, వ్యాకరణ ఛందో విశేష అపూర్వపద ప్రయోగాల ఆధారంగా నన్నెచోడుడు నన్నయకంటె ముందువాడని ప్రతిపాదించారు. దీనిమీద జరిగిన వాదవివాదాల్లో ఆనాటి ప్రసిద్ధ పండితులంతా పాల్గొన్నారు. దాంతో నన్నెచోడుని మీద ప్రత్యేక వాఙ్మయమే వెలువడింది. కొంతమంది విమర్శకులు, కుమారసంభవాన్ని రామకృష్ణకవే రాసి, నన్నెచోడుడి పేర వెలయించారని అన్నవాళ్లూ ఉన్నారు. మొత్తానికి, మానవల్లి వాదాన్ని సమర్థించని వాళ్లు ఎక్కువగా ఉండటంతో నన్నెచోడుడు నన్నయ, తిక్కనల నడిమివాడన్న అంగీకారం సాహితీలోకంలో స్థిరపడింది.
      ఎంతోమంది ప్రసిద్ధ వ్యక్తులు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే గుర్తింపు, గౌరవం లభించడం చరిత్ర అసమగ్రతకు తార్కాణం. రామకృష్ణకవి విషయంలోనూ ఇది వర్తిస్తుంది. ఆయనకు తెలుగు సాహితీ ప్రపంచంలో రావాల్సినంత గుర్తింపు రాలేదు. పరిశోధనలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాళపత్రాలను వెలికితీయడాన్ని, ప్రచురించడాన్ని మానవల్లి మానుకోలేదు. ఒకవేళ ఆయనే గనుక ఈ పనికి పూనుకోకపోతే ఎన్నో ప్రాచీన గ్రంథాలు మనకు దక్కేవి కావు. ‘‘పగడపు పురుగులు మహాసముద్రంలో చుట్టూ గోడలను కట్టుకొంటాయి. అవి మానవులకు దీవులవుతాయి. అట్లే మానవులలో మేధావులు తమ లాభం కోసం, పొగడ్తల కోసం గాక నైసర్గికంగా పనిచేసుకొని పోతారు. దానివల్ల జాతికి మాత్రమే శాశ్వత ప్రయోజనం’’ అన్న టేకుమళ్ల కామేశ్వరరావు మాటలు మానవల్లి రామకృష్ణకవికి అక్షరాలా సరిపోతాయి.

   *   *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం