నాటి జనజీవన గాథలు!

  • 1397 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కల్లూరు రాఘవేంద్రరావు

  • హిందూపురం
  • 9493271620
కల్లూరు రాఘవేంద్రరావు

కావ్యమునందు అన్ని భావములును హృద్యములుగానే యుండును. మనకు దేనిపై కోపమో ప్రీతియో కలదో దానిపై కవికిని అట్టే యుండువలయునని తలచుట యన్యాయము, అసాధ్యము. మనకు గావలిసినది ఆ భావమును కవియెంత నిజముగా తీవ్రముగా తాననుభవించి, మనలననుభవింప జేసినాడనుటయే కాని వేఱుకాదు.

- రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ

అనంతకృష్ణశర్మ సంగీత సాహిత్య కళాకోవిదులు. చక్కటి అనువాదకులు. గొప్ప విమర్శకులు. వచన రచనకు వీరి ‘రాయల నాటి రసికత, రాయల వైదుష్యం, నాచన సోముని నవీన గుణములు, నిగమశర్మ అక్క’ లాంటివి మచ్చుతునకలు. రాళ్లపల్లి ‘వేమన ఉపన్యాసాలు, నాటకోపన్యాసాలు, సంగీత శాస్త్ర చర్చల’తో పాటు ఆయన చేసిన అనేక గ్రంథవిమర్శలు తెలుగు సాహిత్యంలో మేల్బంతులు. అనంతకృష్ణశర్మ తెలుగులోనే కాదు.. ప్రాకృత, సంస్కృత, కన్నడ, తమిళ భాషల్లో కూడా పండితులు.
రాళ్లపల్లి రచనల్లో ‘శాలివాహన గాథాసప్తశతి’కి ఓ విశిష్ట స్థానముంది. ఈ అనువాద కృతి మూలం ప్రాకృత భాషలో ‘ఆర్యా’ వృత్తాల్లో విరచితమైంది. ఏడు వందల పద్యాల ఈ సంకలనాన్ని రెండు వేల ఏళ్ల కిందట తెలుగునేలను ఏలిన శాతవాహన చక్రవర్తి హాలుడు కూర్చాడు. ఈ పద్యాలను చెప్పిన వాళ్లలో రోహ, రేవా, మాధవి, అణులచ్చి, అసులద్ది, పహయీ, ససిప్పహా, భేజ్జా, వద్దావహీ, వోహా అనే పదిమంది కవయిత్రులు కూడా ఉన్నారు.
ప్రాకృతం ప్రజలభాష. ఆ భాషలో కూర్చిన ఈ కృతిని వాళ్లు ‘సత్తసఈ’ అని పిలిచారు. సంస్కృతంలో ఇది ‘శాలివాహన సప్తశతి’గా ప్రచారంలోకి వచ్చింది. ఇందులోని పద్యాలు వేటికవి స్వతంత్రాలు. పరస్పర సంబంధం లేనివి. ఒక్కొక్క పద్యం ఒక్కొక్క గాథను తెలియజేస్తుంది. ఈ గాథల్లో విపరీతపు ఊహలు, అధిక వర్ణనలు కనిపించవు. విషయం సహజంగా ఉంటూ.. జీవిత యథార్థంగా గోచరిస్తుంది. ‘‘పల్లెటూరి జీవితం, పొలాల పక్కన గుడిసెలు, అందులో జీవించే బీదసాద, వారి మనోహర ప్రేమ చర్యలు, గుట్టు దాచి నర్మగర్భంగా పలికే తీపి మాటలు, చిరునవ్వుతో కూడిన హాస్య ప్రసంగాలు, శృంగార రసచ్ఛాయలు, సామాన్య ప్రజల దైనందిన జీవితాలు, దారిద్య్రం, కరవు కాటకాలు, వాగులు, వరదలు, వాన కాలపు బురద వీధులు, ఎండకాలపు మృగతృష్ణలు, దప్పిగొన్న బాటసారులు, చలివెందళ్లు, చపలాక్షులు, చలికాలపు నెగళ్లు, గొంగళ్లు, అక్కరలేని నెరజాణల మొగుళ్లు, వసంతోత్సవాలు, మొయిళ్లను చూచి మూతి విరుస్తూ, మూడు నిట్టూర్పులు వదిలే వనితలు, ఫాల్గుణోత్సవాలు, పెండ్లిండ్లు-పేరంటాలు, సతులు-అసతులు, విధవలు-వేశ్యలు, జారులు-పూజారులు, పంటలు-వంటలు, నగలు-నాణేలు; ఒక్కటేమిటి గ్రామాల్లోని ప్రతిదీ కావ్య వస్తువైంది ఇందులో. ధర్మశాస్త్రం నిషేధించిన ఋతుమతీ సంస్పర్శన, సంగమాలను కూడా ఈ కవులు వదల్లేదు...’’ అంటూ ఈ గాథల గురించి చెప్పారు తిరుమల రామచంద్ర.
ఎంత సరసమో..!
మంచి మాఘమాసపు చలి. అంత చలిలో ఏ వెర్రివాడైనా తన దగ్గరున్న పచ్చడాన్ని అమ్మి ఎద్దును కొంటాడా? కానీ, ఓ రైతు అలాగే చేశాడట. ఎందుకయ్యా అలా చేశావంటే... ‘‘చెంతన చెలి ఉండగా ఈ పచ్చడమెందుకు?’’ అన్నాడట. ఆ పద్యాన్ని మూలభావం చెడకుండా రాళ్లపళ్లి ఎంత చక్కగా అనువదించారో! ‘‘పొగయకుండు కుమ్ము బోలెడు చానచ/ న్గవను బడసి శీతకాలమందు/ పల్లెసేద్యగాడు పచ్చడంబును నిచ్చి/ కొత్తయెద్దుదెచ్చుకొనియె జూడు’’- ఇక్కడ ‘పొగయకుండు కుమ్ము’ అంటే పొట్టు నిప్పు అని అర్థం. పొట్టుతో నింపిన పొయ్యి నుంచి పొగ రాదు. కాని లోపలే ‘కుమ్ము’ మాత్రం అతివేడిగా ఉంటుంది. ఆ కుమ్ము అంత త్వరగా ఆరిపోదు. అలాంటి ‘వెచ్చని కుమ్ము బిగి కౌగిలిలో’ ఉన్నప్పుడు ఇంక పచ్చడమెందుకని అతని భావన!!
మరో సుందరమైన దృశ్యాన్ని చూద్దాం. అల్లుడు అత్తగారింటికి మంచి మిట్టమధ్యాహ్నం వచ్చాడు. అప్పుడతని ఇల్లాలు పెరట్లో తీరిగ్గా స్నానం చేస్తూంది. ఒకటే గాజుల గలగలలు. వాకిట్లో అరుగు మీద కూర్చున్న అల్లుడి మనసు ఎంతగా ఆరాటపడిపోతూ ఉంటుందో- వయసులో ఉన్నవాళ్లకి తెలిసిందే. అతని ఉత్కంఠ రెండింతలు మూడింతలుగా పెరిగిపోతోంది. ‘ఉదయమే రాకపోయావా! ఈ వేళలో రావడమేంటి!’ అని ఆ అమ్మాయి అనుకుంటూ ఆటపట్టించాలని మరింత తీరిగ్గా గాజులు గలగలమనిపిస్తూ స్నానం చేస్తోంది. ఆ గలగలలు అతడి గుండెలో దడ పుట్టిస్తున్నాయి. ‘‘ఇంటికపరాహ్ణ వేళలో నేగుదెంచి/ నట్టి యల్లుని కోర్కె రెండింతలయ్యె/ పెరటి జలదారి దిగియున్న పెండ్లికూతు/ జలకముల దెల్పు గాజుల గలగలలకు’’... ఇదీ అనంతకృష్ణశర్మ అనువాదం! ‘జలదారి’ అంటే స్నానాల కోసం బండలు పరచి నీళ్లు పోవడానికి తూము ఉన్న స్థలం. ఇది రాయలసీమ వ్యవహారపు మాట. శర్మ తన రచనల్లో రాయలసీమ నుడికారాన్ని విరివిగా ప్రయోగించారు. సీమ పలుకుబడినెవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఆయనకెక్కడలేని కోపం వచ్చేది. అప్పుడాయన అందులోని సొగసుల్ని ఎత్తి చూపిస్తూ పెద్ద ఉపన్యాసమే చేసేవారు. అది ఆయన స్వస్థాన భాషాభిమానం. స్వాభిమానం కూడా.
ఓ ప్రియురాలు తన ప్రియుణ్ణి తామెంచుకున్న రహస్య స్థలంలో కలవాలనుకుంటుంది. కానీ, హఠాత్తుగా ఓ మంచి అవకాశం లభిస్తుంది. ఏ పత్తి చేనుకో, మరో చోటికో పోవాల్సిన అవసరం తప్పుతుంది. ‘ఇంటికే రమ్మని చెప్పేదెలా? ఎవరు చెబుతారు?’ అని ఆలోచిస్తుంది ఇలా... ‘‘అత్తపడినదింట మత్తెక్కి, పతి పొరు/ గూరుకేగె, కుక్కదోరిపోయె,/ పత్తి చేను విరుగబడి మేసెనెనుబోతు,/ దీనినతని కెవడు తెలుపువాడు?’’! మరో ప్రేయసి ప్రియుడికి ఇలా తెలియజేస్తుంది... ‘‘ఇచటనే పరుందు నిచ్చట నత్తగా/ రిచట పరిజనంబు లెల్ల వినుము/ రాత్రి నీకు కానరాదు; నా పడకపై/ తప్పి పడెదవేమొ దారికాడ’’! ఒక్కమాటైనా మార్చడానికి వీల్లేని అచ్చుకట్టయిన అనువాదమిది అని తిరుమల రామచంద్ర శ్లాఘించారు.
శ్రీనాథుడితో మొదలు..
ఈ గాథా సప్తశతిని శ్రీనాథుడు కూడా అనువదించాడు. ఆ పద్యాలు మూడు మాత్రమే లభిస్తున్నాయి. ఆ తర్వాత ఆధునికుల్లో దిగుమర్తి సీతారామస్వామి, తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి, తల్లావజ్ఝల కోదండరామయ్య, మల్లంపల్లి శరభయ్య, ఘట్టి లక్ష్మీ నరసింహశాస్త్రి, వాసిరెడ్డి తదితరులు వీటిని తెలుగులోకి తెచ్చారు. కానీ, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ అనువాదమే జనప్రియంగా నిలిచింది. మరోవైపు... పాకృత గాథాసప్తశతిలో తెలుగు పదాలూ బోలెడు కనిపిస్తాయి. అవేంటో చెబుతూ తిరుమల రామచంద్ర ఓ పరిశోధనాత్మక పుస్తకాన్నీ వెలువరించారు.
శాలివాహన గాథాసప్తశతికి సంబంధించిన వివిధ మాతృకలను జర్మన్‌ పండితుడైన వీబరు పరిశోధించి, సరిచూశారు. 1881లో జర్మన్‌ భాషలో విపుల పీఠిక, టీక, తర్జుమాలతో ముద్రించారు. ‘‘ఆ ముద్రణపు అందచందాలు వర్ణనాతీతములు. తనకు దొరికిన మాతృకలందలి వివిధ పాఠ భేదములు, అధిక పాఠాలు మొదలగునవన్నియు తు.చ. తప్పకుండా చేర్చి, ఏర్చి, కూర్చిన కూర్పరి ఆయన. సప్తశతి అనుపేరుతో అతనికి దొరికిన గాథలు మొత్తం 964. ఇది చాలదని ఆ చాదస్తపు పండితుడు కొన్ని అలంకార గ్రంథాల నుంచి మరో 36 పద్యాలు చేర్చి, గాథా సంఖ్య మొత్తానికి సహస్రం సరిచేశాడు. అందులో ఆంధ్రదేశానికి చేరిన మాతృకలే రెండు వందలు గలవట. ఈ గాథావాఙ్మయమున తెలుగు వారికి గల అమితప్రీతి కొంతవరకైనా వారి కైవాడమును పైవిషయం స్థాపించును. పైముద్రణము నుంచి నాకు నచ్చిన, చేతనైన, కొన్ని గాథలను తెలిగింపు చేసితిని’’ అని రాళ్లపల్లి స్వయంగా రాసుకున్నారు. ఆయన వీటిని 1918లోనే అనువదించడానికి పూనుకున్నారు. 1924లో ‘భారతి’ ప్రారంభమైన తర్వాత ఇవి ఆ పత్రికలో ప్రచురితమయ్యాయి. 1931లో 395 గాథలను చిన్న పొత్తంగా ముద్రించారు. ఆ తర్వాత 1964లో ఆంధ్ర సారస్వత పరిషత్తు (ప్రస్తుత తెలంగాణ సారస్వత పరిషత్తు) వీటిని సమగ్రంగా ప్రచురించింది. 1986లో ఈ కృతి రెండో ముద్రణ కూడా వాళ్లే వెలువరించారు. తొలి ముద్రణలో డా।। కట్టమంచి రామలింగారెడ్డి విపుల పీఠిక రాశారు.
గాథాసప్తశతిలోని గాథలన్నీ గ్రామీణ జనజీవిత ప్రతిబింబాలు. సరస శృంగార, హాస్య, గంభీర శ్లేషార్థరస ప్రబంధాలు. చతుర, చమత్కార, ఛీత్కార విలాస కథాకండికలు. ఈ పద్యాల్లోని సౌకుమార్య, మాధుర్య సౌలభ్యాలు కోకొల్లలు. వీటిని అర్థం చేసుకోవడానికి సులభతరమైన ఆటవెలది, తేటగీతి, కంద పద్యాల రూపంలో అనువదించారు రాళ్లపల్లి. ఈ అనుసృజనలో ఆయన అచ్చతెనుగు నుడికారాలను కుండపోతగా గుమ్మరించారు. అయితే.. దురదృష్టకర విషయం ఏంటంటే.. ఈ అమూల్య గ్రంథం నేడు అలభ్యం! సాహిత్య పోషకులెవరైనా ఆ ప్రతిని పునర్ముద్రిస్తే తెలుగు సాహిత్యానికి గొప్ప సేవ చేసిన వారవుతారు.

*   *    *  

 


వెనక్కి ...

మీ అభిప్రాయం