కృష్ణమూర్తి తత్వగీత

  • 264 Views
  • 0Likes
  • Like
  • Article Share

తన అసమాన నైపుణ్యాలు, వ్యక్తిత్వంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతమందినో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేసిన వ్యక్తి బ్రూస్‌లీ. అలాంటి మహావీరుడి ఆలోచనలను తన తాత్విక చింతనా దృక్పథంతో ప్రభావితం చేసిన గురువు...  తత్వదర్శనంలో తొలి తెలుగు వెలుగు... జిడ్డు కృష్ణమూర్తి. విభిన్న విషయాల మీద ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ ఎంతమందికో వెలుగుదారులను చూపిస్తూనే ఉన్నాయి.  
‘‘జీవితంలో గెలుస్తామా, ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు. సరైంది, సక్రమమైంది అనుకున్న పంథాలో నడవండి. ఫలితాల కోసం పన్నుగడలు లేకుండానే కార్యకలాపాలు సాగించటానికి వీలులేదా?’’ అని ప్రశ్నిస్తారు జిడ్డు కృష్ణమూర్తి.
      ఇది ‘కర్మణ్యేవాధి కారస్తే...’ గీతా ప్రబోధానికి వ్యాఖ్యానంగా లేదూ?
      ‘సమయ ప్రభావం, ఆలోచనల జాడలు లేనిదే నిజమైన ధ్యానం’ అన్నదీ ఆయనే...
      ‘స్పర్శాన్‌ కృత్వా బహిర్బాహ్యాం...’ అనే గీతా వాక్యానికి వివరణగా లేదా ఇది? వీతరాగ భయక్రోధాః... అనే గీతాచార్యుని వాక్యానికి అంతర్లీనంగా సంబంధం లేదూ?
      అయితే ఇక్కడ నన్ను, నా భావం అనే వాక్యాలున్నాయి. ఇక్కడ నేను అంటే ఎవరు శ్రీకృష్ణులా? భగవానులా? అంటే భగవానువాచ అనే ఉంది. అది భగవచ్ఛక్తి. విష్ణుశక్తి, అంటే విశ్వవ్యాపక శక్తి. అది పరిమితం కాదు. అనంతం.
      ‘ఆలోచన, కాలం, ద్రవ్యం- వీటన్నిటికి అతీతమైన వాతావరణంలో వెల్లివిరిసి ఉన్న సజీవశక్తి మూలకంగా ఈ అంతఃస్ఫూర్తి లభిస్తుంది’ అంటారు జిడ్డు కృష్ణమూర్తి. మెదడు కొత్త రూపుకట్టుకునే ‘అంతఃస్ఫూర్తి’ని వర్ణిస్తూ.. ఆ ‘అంతఃస్ఫూర్తి’, ఈ ‘భగవచ్ఛక్తి’ ఒకటి కాదా? ఇక్కడ కృష్ణమూర్తి ‘‘నేను చెబుతున్నాను గనుక ఇది యథార్థం అని గుడ్డిగా నమ్మకండి, మీకు ‘సత్యం’ అనిపిస్తేనే వీటిని గురించి ఆలోచించండి’’ అంటారు. అక్కడ భగవానుడే వక్త కాబట్టి ‘అన్ని ధర్మాలూ వదిలిపెట్టి నన్ను మాత్రమే శరణువేడుకోండి’ అనగలిగాడు.
      ఇంతకీ ఈ కృష్ణమూర్తికీ, ఆ కృష్ణుడికీ సంబంధం ఏమిటంటారా?
      ఇద్దరూ తత్వాచార్యులే. ఇద్దరూ చింతాగ్రస్తులైన ‘నరుల్ని’ ఉద్ధరించడానికి పూనుకున్నవారే. ఇద్దరిదీ ఒకే లక్ష్యం. మానవజాతిని పతనావస్థ నుంచి కాపాడాలని, బాధల బందిఖానా నుంచి బయట పడేయాలని. ఇద్దరూ ఎనిమిదో గర్భంలో ఉదయించినవారే! అంతేకాదు, ఇద్దరూ పెంపుడుతల్లి దగ్గర పెరిగినవారే! ఇద్దరి పుట్టుక, పుట్టుక లక్ష్యం ఒక్కటే!
తూర్పుదిక్కున వెలసిన తార
జిడ్డు కృష్ణమూర్తి చిత్తూరు జిల్లా మదనపల్లిలో 1895 మే 11న జన్మించారు. తండ్రి నారాయణయ్య జిల్లా న్యాయమూర్తి. తల్లి సంజీవమ్మ. పదకొండు మంది సంతానంలో కృష్ణమూర్తి ఎనిమిదోవారు. ఆయన తల్లి... కొడుకు కడుపులో ఉన్నప్పుడే పుట్టబోయేవాడు అత్యుత్తమ వ్యక్తి, సమున్నతమైన మనిషిగా తయారవుతాడని భావించారు. అందువల్లే ఆమె తన పూజాగృహంలో కాన్పు జరిపించుకున్నారు.
      చిన్నతనంలో కృష్ణమూర్తిది విచిత్రమైన మనస్తత్వం. అయోమయంగా కనిపించేవాడు. ప్రకృతిలో లీనమైపోయేవాడు. దానగుణం ఎక్కువ. తన బడి పుస్తకాలు, పలకా బలపాలు బీద పిల్లలకు ఇచ్చేవాడు. ఇంటిముందుకు వచ్చిన బిచ్చగాళ్లకు దోసిళ్లతో బియ్యం పోసేవాడు. ఈ తత్వాన్ని ఒక్కోసారి తల్లిదండ్రులు భరించలేకపోయేవారు కూడా!
      కృష్ణమూర్తికి పదేళ్లప్పుడే తల్లి చనిపోవడంతో ఆయనకు ఏకాంతం మరీ ఎక్కువైంది. పెద్ద కుటుంబానికి చెందినవాణ్ననీ, తండ్రి ప్రభుత్వాధికారనీ ఏమాత్రం దర్పం, ఆడంబరం చూపించేవారు కాదాయన. ఆయనకు పసితనం నుంచే తల్లి సంజీవమ్మ.. భారతదేశానికి అనిబిసెంట్‌ చేస్తున్న సేవలను కథలు కథలుగా చెప్పేవారు.
      అనిబిసెంట్‌కు ఆధ్యాత్మిక రంగంలో ఛార్లెస్‌ డబ్ల్యూ లెడ్‌ బెటర్‌ అనే వ్యక్తి కుడి భుజంగా ఉండేవారు. ఆయన కూడా యోగదృష్టితో అనేక పరిశోధనలు చేసేవారట. నారాయణయ్య కూడా అనిబిసెంటు- లెడ్‌బెటర్‌ దివ్యజ్ఞాన సమాజం పట్ల ఆకర్షితులయ్యారు. 1882లో ఉద్యోగ విరమణ చేసిన కొద్ది కాలానికే మద్రాసుకు వెళ్లిపోయి సంస్థలో సేవకునిగా చేరిపోయారు.
      అడయార్‌ సముద్రతీరంలో ఆడుకుంటున్న కృష్ణమూర్తిని, అతని తమ్ముడు నిత్యానందను చూసిన లెడ్‌బెటర్‌ ఆశ్చర్యచకితులయ్యారట. ముఖ్యంగా కృష్ణమూర్తి సూక్ష్మశరీరంలోని అతి సున్నిత లక్షణాలు ఆయనను విభ్రాంతుణ్ని చేశాయి. ముందుముందు చాలా గొప్పవ్యక్తి అవుతాడని, జగద్గురువు ఆ పిల్లవాడి శరీరాన్ని వాడుకొనే అవకాశం ఉందని భావించారట. ఆయన ప్రోద్బలంతోనే అనిబిసెంటు కృష్ణమూర్తిని, అతని తమ్ముణ్ని తన పోషణలోకి తీసుకుంది. 1910 మే 10న పిల్లల బాధ్యత ఆమెకు అప్పగిస్తూ నారాయణయ్య పత్రం రాసిచ్చారు.
      లెడ్‌బెటర్‌ గురువైన కుథూమి మహర్షే కృష్ణమూర్తి ఆధ్యాత్మిక గురువు. ఆయన బోధనల సంపుటీకరణమే దివ్యజ్ఞాన సమాజం ప్రచురించిన ‘పరమ గురుచరణ సన్నిధి’. ఇది 1910లో ప్రచురితమైంది.
      జగద్గురువు అవతరిస్తాడని, ఆయన కృష్ణమూర్తి శరీరాన్ని వాడుకుంటాడని, అందుకు కృష్ణమూర్తిని సిద్ధం చేయాలన్న ఉద్దేశంతో అనిబిసెంటు 1911లో ఆర్డర్‌ ఆఫ్‌ రైజింగ్‌సన్‌ సంస్థను ప్రారంభించింది. దీన్ని తర్వాత ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది స్టార్‌ ఇన్‌ ది ఈస్ట్‌’ (తూర్పున వెలసిన నక్షత్ర పరంపర)గా మార్చారు. తాను తానుగానే స్వయంకృషితో ఎదగాలన్న తలంపుతో కృష్ణమూర్తి తర్వాత ఆ సంస్థను రద్దుచేశారు. ‘వ్యక్తిగత ఆప్యాయతల నుంచి ఎదిగి పైకి వెళ్లిపోయారు కృష్ణమూర్తి. విశ్వవ్యాప్తమైన శక్తి తప్ప ఇంకేదీ అతణ్ని ఆకట్టుకోలేదు’ అన్నారు బిసెంటు ఆ సందర్భంలో.
చదువంటే ఇదీ
విద్య విద్యార్థి స్వేచ్ఛను హరించేదిగా ఉండకూడదని, అతణ్ని పరిపూర్ణ మానవునిగా తీర్చిదిద్దేదిగా ఉండాలన్నది కృష్ణమూర్తి కోరిక. ‘‘నేను పుస్తకాలు చదవలేదు, చదవాల్సిన అవసరం రాలేదు. పరిశీలించండి, ఆలోచించండి.. మీలో మీరు తర్కించుకోండి.. అన్నీ తెలివిడి అవుతాయి’’ అంటారాయన. అనిబిసెంటు అన్నట్లే విశ్వవ్యాప్తమైన శక్తి ఆయనలో ప్రవేశించింది- ఇక ఆయన చదవాల్సిన పనేముంది!
      1912లో ఆయన ‘సేవాకార్యంగా విద్య’ అనే పుస్తకం రాశారు. కృష్ణమూర్తి మేరీ లూటన్స్‌ అనే ఆమెను తన జీవిత చరిత్ర రాయమని ఆదేశించారు. ఆమె మూడు భాగాలుగా దాన్ని రాశారు. ‘ది ఇయర్స్‌ ఆఫ్‌ ఎవేకెనింగ్‌’ అనే మొదటి భాగం... పుట్టుక మొదలు 38 ఏళ్లవరకు నడిచిన కథనం. ‘ది ఇయర్స్‌ ఆఫ్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌’ అనే రెండో భాగం 1980 వరకు జరిగిన కథనం. అక్కడినుంచి ఆయన మరణించేదాకా సాగిన కథనం (1980-86) ‘ది ఓపెన్‌ డోర్‌’. దీన్ని 1988లో ప్రకటించారు.
      ప్రపంచమంతా అనుయాయులు గల కృష్ణమూర్తి తమ విద్యా లక్ష్యాలకనుగుణంగా భారతదేశంలో అయిదు; అమెరికా, ఇంగ్లండుల్లో రెండు పాఠశాలలు నెలకొల్పారు. వీటిలో పనిచేసిన ఉపాధ్యాయులు కూడా వీలైనంత వరకు కృష్ణమూర్తి పద్ధతుల్లోనే పాఠశాలలు స్థాపించి, నిర్వహిస్తున్నారు.
      మృత్యువును నిర్వచిస్తూ ‘మృత్యువును అతి సంకోచంగా, హుందాగా- అంతరంగ గౌరవ మర్యాదలతో చేరుకోవాలి, జననం మాదిరే మృత్యువు కూడా అద్భుతమైన విషయం’ అంటారు కృష్ణమూర్తి. 1985 నాటికి ఆయన ఆరోగ్యం దెబ్బతింది. అయినా ప్రపంచ పర్యటన మానుకోలేదు. 1986 ఫిబ్రవరి 17 ఉదయం అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓజాయ్‌లో తన నివాసగృహంలో భౌతికకాయాన్ని వదిలారు.
తమ బోధనల గురించి ‘‘నాకు ప్రతినిధులు, వారసులు ఎవరూ లేరు. ఈ బోధనలకు భాష్యకారులు ఇప్పుడు లేరు, ఇకముందు కూడా అవసరం లేదు. నేను గతించిన మీదట కూడా ఆ అవసరం రాదు.’’ అంటారాయన.
      ఆయన అలా అన్నా, ఆయన బోధనలు అందరికీ తెలియాలి కదా! అలా తెలియజేయడంలో ఎవరి సంతోషం వారిది!

*     *      *

 


వెనక్కి ...

మీ అభిప్రాయం