పాలమూరు పదాలు రసాలూరు

  • 1474 Views
  • 102Likes
  • Like
  • Article Share

    పల్లెర్ల రామమోహనరావు,

  • మహబూబ్‌నగరు,
  • 9177840278
పల్లెర్ల రామమోహనరావు,

మహబూబ్‌నగర్‌ పూర్వనామం పాలమూరు. ఈ జిల్లా అనాదిగా పండితస్థలి. ముఖ్యంగా భాషాపరంగా విశేష పరిశ్రమ చేసిన విద్వన్మణులెందరికో విహారభూమి. అష్టభాషావిదుల ఆటపట్టు. అష్టభాషలంటే ‘సంస్కృతం, తెలుగు, ప్రాకృతం, శౌరసేని, మాగధి, పైశాచి, చూళిక, అపభ్రంశం’. ఆత్మకూరు సంస్థాన ఆస్థాన కవి ‘బాలసరస్వతి’ తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసాచార్యులు అష్టభాషాకోవిదులు. 1903లో మద్రాసులో అష్టభాషల్లో ‘శతఘంటకవనమ్‌’ చేశారు. అందులో కందుకూరి వీరేశలింగం పృచ్ఛకులుగా పాల్గొన్నారు. వనపర్తి సంస్థానాధీశ్వరులు ‘అష్టభాషా బహిరి’ గోపాలరావు సంస్కృతంలో శ్లేషకావ్యం రచించారు. జటప్రోలు సంస్థాన ఆస్థానకవి ఎలకూచి బాలసరస్వతి తెలుగులో మొదటి త్య్రర్థి కావ్య నిర్మాత. ‘యాదవ రాఘవ పాండవీయం’ ఈయన కృతి. నన్నయ ఆంధ్రశబ్ద చింతామణికి ‘టీక’ రాశారు. చింతలపల్లి ఛాయాపతి సంస్కృతాంధ్ర భాషల్లో ‘నవఘంట సురత్రాణ’ బిరుదాంకితులు. విశేష భాషా ప్రతిభతో అవధాన రంగంలో ఉజ్జ్వల కీర్తి కిరీటాలను ధరించిన అవధానులెందరో ఈ గడ్డ మీద జన్మించారు. దక్షిణభారతంలోనే అగ్రశ్రేణి వైయాకరణిగా లబ్దప్రతిష్ఠులైన ఖండవల్లి నరసింహశాస్త్రి, ‘స్ఫోటవాదం’ మీద గట్టిపట్టున్న అచ్చంపేట నరసింగయ శాస్త్రి ఇక్కడివారే. దాదాపు పదమూడు భాషల్లో పండితులైన డా।। బూర్గుల రామకృష్ణారావు ‘పారసీక వాఙ్మయ చరిత్ర’ రాశారు. ‘కన్నడ సాహిత్య చరిత్ర’ను రచించిన గడియారం రామకృష్ణశర్మ, ప్రాకృతంలో ప్రత్యేక కృషి చేసిన కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, ఆయన కుమార్తె కె.కమల, ‘అచ్చతెలుగు’లో శతకం రాసిన మణిమణి గోపాల కవి... ఇలా ఎందరెందరో తెలుగు సారస్వత మాగాణాన్ని సంపద్వంతం చేశారు.
ఈ జిల్లా భాషా స్వరూపాన్ని ప్రధానంగా మూడు విభాగాలుగా పరిశీలించాలి. అవి.. శాసనభాష, కావ్యభాష, వ్యవహారభాష. ఇక్కడ సంస్కృత, హళెకన్నడ (ప్రాచీన కన్నడం), కన్నడ, తెలుగు భాషల్లోని వందల శాసనాలు వెలుగు చూశాయి. పూడూరులో లభించిన ఏడో శతాబ్దికి చెందిన బాదామీ చాళుక్య శాసన చివరి భాగంలో బెంగాలీ లిపి ఉంది. తెలుగు శాసనాలను పరిశీలిస్తే శైలీభేదం కనిపిస్తుంది. క్రీ.శ.1106 నాటి ఉప్పునూతల శాసనంలో ‘‘శ్రీమన్మహామండలేశ్వర కందూరి సోమనాథదేవ చోడ మహారాజులు శ్రీ కేదారేశ్వర దేవరకు ఆచంద్రతారార్క స్థాయిగా ఇచ్చిన వెలిపొలము ఖ12 ప్రోలె నాయకుని చెర్వు వెనుక నీరుపొలము...’’ అని ఉంది. దాదాపు వెయేళ్ల కిందటే ఇంత సరళ భాష ఉండటం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. క్రీ.శ. 1272 నాటి మల్యాల గుండసేనాని బూదపుర శాసనం- ‘‘కుప్పాంబా మానససరోవర విహారమాణ రాజహంసుండును, నిజకులోత్తంసుండును, శ్రీ విశ్వనాథదేవ దివ్యశ్రీ పాదపద్మారాధకుండును, రిపుకుల భేదకుండునునైన శ్రీమన్మల్యాల గుండ దండాధీశ్వరుండు...’’ అని సాగుతుంది. ఇందులోని భాష గ్రాంథికం, ఆలంకారికం.
ఎందులోనైనా ఆ తీయదనమే!
ఈ జిల్లాలో లెక్కకు మిక్కిలి కావ్య, ప్రబంధాలు పురుడు పోసుకున్నాయి. దాదాపు అన్ని సాహిత్య ప్రక్రియల్లో రచనలు వెలువడ్డాయి. తెలుగులో తొలి రామాయణం ‘రంగనాథ రామాయణం’ ద్విపదరూపంగా అవతరించిందిక్కడే. ద్వ్యర్థి, త్య్రర్థి, నిరోష్ఠ్య కావ్యాలు వచ్చాయి. చిత్ర, గర్భ కవితలు రూపుదాల్చాయి. ఇవన్నీ ఇక్కడి కవుల భాషాక్రీడా సామర్థ్యానికి గీటురాళ్లు. మచ్చుకు జటప్రోలు సంస్థానాధీశ్వరులు సురభి మాధవరాయలు రచించిన ‘చంద్రికాపరిణయము’ కావ్యంలోని ఓ పద్యం... ‘‘కలితారాతి విరామ రామరుచిసంగ ప్రస్పురద్భామ భా/ మల వక్త్రాహత సోమ సోమనుత శుంభద్భూరి సంగ్రామ గ్రా/ మలసద్వేణు సకామ కామకలి సంపల్లాలసశ్యామ శ్యా/ మల రోచిశ్చయ వామ వామనతనూ మాన్యత్రిలోకీ క్రమా’’! ఆధునిక కాలంలో సురవరం ప్రతాపరెడ్డి, ఆచార్య పాకాల యశోదారెడ్డి, డా।। ఇరివెంటి కృష్ణమూర్తి లాంటివారు అటు గ్రాంథిక భాషను, ఇటు వ్యావహారిక భాషను సమర్థంగా రాసిన ‘డబుల్‌ ఇంక్‌ పెన్నులు’.
ఇక వ్యవహార భాష విషయానికొద్దాం. ఇక్కడ తెల్లవారుజామున అనే అర్థంలో ‘నస్కుల’ను ప్రయోగిస్తారు. పొద్దున్నే ‘పొద్దుగాల’వుతుంది. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతాన్ని ‘అంబటాల’, ‘అంబడేల’గా వ్యవహరిస్తారు. కూలిపని చేసేవారు అంబలి తాగే సమయం అది. ఈ సమయ సూచకంగా ‘సన్నాల’ అనే చక్కని ప్రయోగముంది. ‘చన్నువేళ’ ఇది. చిన్నపిల్లల తల్లులు కూలిపని నుంచి ఇంటికి వెళ్లి పిల్లలకు చన్నిచ్చి వచ్చే సమయం. సాయంత్రం ‘పొద్దుమింకల’ అవుతుంది. రాత్రి ‘నాతిరి’, ‘నాత్రి’గా మారుతుంది. ‘మాపు అనీ అంటారు. పగలు తక్కువ ఉండే కాలాన్ని ‘మాయిపొద్దు’ అని ముద్దుగా పిలుచుకుంటారు. ‘మాయిపొద్దు కూలీకి మరువక పోవాలె’ అని వాడుక. ఎందుకంటే కూలీ సమయం తక్కువగా ఉండటమేగాక ఎండతీవ్రత కూడా అంతగా ఉండదు.
‘సుశీల’ అంటే తెలుసా!
బంధుత్వాల విషయానికొస్తే నాన్న ‘అయ్య’ అయిపోతాడు. పెదనాయినలు ఇద్దరు ముగ్గురుంటే వారిలో పెద్దవాడు ‘పెదనాయిన’గా గౌరవమందుకుంటాడు. చిన్నాయిన ‘కక్కయ్య’గా మారతాడు. పెద్దమ్మ ‘ఆయమ్మ’ అవతారమెత్తుతుంది. ఎలాగూ కుటుంబంలోకి వచ్చాం కదా! భోజన విషయాలు చూసుకుంటే ఓ పనైపోతుంది. భోజనం ‘బోనం’గా మారుతుంది. పొడివస్తువులను నోట్లో వేసుకోవడం ‘బొక్కడం’ అవుతుంది. ఆకలిని ‘పొట్టాపతి’ అని అందంగా పిలుచుకుంటారు. కొద్దిగా తినడాన్ని ‘ఎంగిలిపడ’మంటారు. బాగా తింటుంటే ‘ఏసుడేస్తున్నాడు’, ‘ఇగ్గుడిగ్గుతున్నాడు’ అని ముచ్చటపడతారు. పీకల దాకా తినడాన్ని ‘కుత్కెల దాకా మింగడ’మని చెబుతారు.
ఎప్పుడూ తిండి చింతే అయితే ఎలా? బుక్కెడు బువ్వ పుట్టడానికి కారణం వ్యవసాయం కాదూ! పదండి బాయికాడికి పోదాం. అక్కడ నాగలి కాదు ‘గడెం’ కట్టిన్రు. ‘వలపల’ (కుడివైపు), ‘దాపల’ (ఎడమవైపు) ఎడ్లనుకట్టి ఎంతమంచిగా తోలుతున్నారో- కాదు ‘అల్లిస్తున్నరో’. ఆ రెండెడ్లకు ‘లెంక’ (జత) బాగా కుదిరింది. వ్యవసాయం చేయని భూమిని ‘పడావు’ వడ్డదంటారు. ఎండలో పని చేస్తుంటే దప్పిక అవుతుంది కదా. దాన్ని ఇక్కడ ‘దూప’ అంటారు. దూరడాన్ని ‘జొర్రడం’గా వ్యవహరిస్తారు (వానింట్లెందుకు జొర్రినవ్‌). ‘జోలి’ అన్నపదం ‘విషయం’, ‘ముచ్చట’ అనే అర్థాల్లో ప్రయోగిస్తారు. వాళ్ల జోలి మీకెందుకు, వానితో ఏం జోలివెట్టినవురా... ఇలా అన్నమాట. చక్రం ‘పయ్య’గా తిరుగుతుంది. బడి ‘సాలె’ అవుతుంది. ఇది ‘శాల’ శబ్దభవం. గుర్తూ, జ్ఞాపకం అనే అర్థంలో ‘కూనం’ వచ్చి చేరుతుంది (నిన్ను కూనం బట్టలే). కనడం అనడాన్ని ‘ఉత్కులాడు’, ‘నీళ్లాడు’ అంటారు (నా బిడ్డ నిన్న ఉత్కులాడింది). షావుకారును ‘ధణి’ అని పిలుస్తారు. ధనవంతుడు అనే అర్థంలో ప్రధానంగా ఇది నారాయణపేట ప్రాంతంలోనే వాడుకలో ఉంది. ఇక్కడే కనిపించే మరో విశేషపదం ‘సుశీల’. బొంగులు (మురుమురాలు) తడిపి పోపువేసే వంటకం పేరు ఇది.
‘గంటు’కు మూడర్థాలు
ఈ జిల్లాలో పొంకాలను ‘గప్పాల’ంటారు. ‘గప్పాల పోతురెడ్డికి మూడెడ్లు, ముప్పైమూడు దొడ్లు’ అని చురక పెడతారు. ప్రశాంతతను ‘కుదార్థం’ అంటారు. (నాకిప్పుడు కుదార్థంగుంది). ఈ జిల్లాలో అంగడి అంటే ‘సంత’. దుకాణమనే అర్థంలో వాడరు (అంగట్లో అన్నీ అగ్వయినయంట గద). దుకాణం ‘మడిగె’గా పిలుచుకుంటారు. కట్టుబట్టలను శుభ్రంగా ఉతక్కపోవడం వల్ల వాటిలో పుట్టే సన్నని పురుగులను ‘సీరపేండ్లు’, ‘చీరపోతులు’ అంటారు. చీర అంటే ‘వస్త్రం, బట్ట’ అనే అర్థం. కాని ఈనాడు స్త్రీలు ధరించే వస్త్ర విశేషంగా అది స్థిరపడింది. చెవిలోని గుబులును ‘జీవిలి’ అనడం ఆనవాయితీ. నిధి (దాచిన ధనం) అన్న అర్థంలో ‘గంటు’ను ఉపయోగిస్తారు. (ఇస్తె నీఅబ్బ గంటేమయిన పోతదా). ఇది కన్నడం నుంచి వచ్చింది. ఈ గంటును ‘మొండితనం’ అనే అర్థంలో కూడా వాడతారు (ఎడ్లు గంటువెట్టినయ్‌, నా కొడుకు సైకిల్‌ కొనిస్తె గాని బడికివోనని గంటువెట్టిండు). కొన్ని సందర్భాల్లో ‘జత’ అనే అర్థంలోనూ ప్రయోగిస్తారు (దానికి దీనికి గంటువెట్టకు).
ఇక్కడ చెడువాసన వస్తే ‘గత్తు’ కొడ్తది ‘గబ్బు’గొడ్తది. గారాబం చెయ్యాలనుకొంటే ‘గార్వం’ చెయ్యొచ్చు (వాణ్ని గార్వంజేసి చెడగొట్టినవ్‌). కొంతమంది ఏ పనినైనా పాడు- ‘చెర్వాకం’ చేస్తారు (వాడు చెర్వాకం జెయడంల మశూర్‌). చెల్లాచెదురు చేయాలనుకునేవారు ‘చిల్లంపొల్లం’ చేసేస్తారు (వడ్లన్నీ చిల్లంపొల్లం జేసిండు). గుంజిళ్లు తీసేవారు ఇక్కడ ‘బింగిళ్లు’ తీస్తారు. ఇక తీసుకుపోవడం ‘కొంచవోడం’ అవుతుంది (వాడిప్పుడే కొంచవొయిండు). ఏదైనా కఠినమనిపిస్తే ‘గొట్టు’గుందంటారు (లెక్కలు గొట్టుగున్నయ్‌). గొప్పలకు పోవడమేమో ‘ఏతులు గొట్టేడం’ అవుతుంది (వానికి ఏతులెక్కువ).
ఇమానంగ జెబుతున్న...
గదిని ‘అర్ర’ (మాది మూడర్రల ఇల్లు), స్నానాలగదిని ‘జాలాడు’ అని అంటారు (జాలాట్ల జారిపడిన). ఇంటిముందు ప్రత్యేకంగా చేసిన నిర్మాణాన్ని ‘బంకులు’గా పిలుస్తారు. బయటివాళ్లు వస్తే కూర్చోవ డానికి నిర్దేశించిన గది ఇది. ముఖ్యంగా పల్లెల్లో ధనవంతుల ఇండ్లలో మాత్రమే ఇది కనిపిస్తుంది (నిన్ను కల్వనీకె వచ్చిండ్రు. బంకుల్ల కూసోవెట్టిన). ఇక కాళ్లు దగ్గరగా మడచుకుని (పద్మాసన భంగిమలో) కూర్చోవడాన్ని ‘సకిల ముకిలం’ అంటారు. ఇది ‘సకలం ముకుళం’ నుంచి వచ్చిన రూపం.
యువకుణ్ని ‘దుడ్డెగాడు’ అంటారు (ఇయ్యాల రేపు దుడ్డెగాండ్లకేం పనిలేదు).  కోపాన్ని ‘తామసం’ అంటారు (వానికి తామసం ఎక్కువ). ఎంత మంచిమాట. కోపం తమోగుణ ప్రకోపమే కదా! జారిపోవడాన్ని ‘దుస్కిపోవడం’ అంటారు. ‘తుసికిల’ శబ్దం నుంచి పుట్టిన మాట ఇది. ప్రమాణం (ఒట్టు) చేయాల్సి వస్తే ‘ఇమానం’ పెడతారు. (ఇమానంగ జెపుతున్న నాకేందెల్వదు). ప్రేమ చూపాలనుకుంటే ‘ఆరివారం’ చూపిస్తారు. గట్టిగా, పెద్దస్వరంతో పలకాలంటే ‘లాసిగ’, ‘లాజిగ’ ఒర్లుతారు.
కొన్ని పదాలు ప్రత్యేకార్థంలో ప్రయోగంలో ఉండటం ఈ ప్రాంతంలో చూడవచ్చు. ‘వద్ద’ అనే అర్థంలో ‘తోన’ను ఉపయోగిస్తారు (వానితోన దుడ్లు లేవంట). ఈ తోనకు ‘చోటు’ అనే అర్థం కూడా ఉంది (ఇంగోతోన సూద్దంపద). కూడ అనే అర్థంలో ‘గిన’ వాడతారు (జాతరకు మనంగినవోదం). వెంటకు బదులుగా ‘పొంటి’ని వాడతారు (బాట పొంటి ముండ్లున్నయ్‌). వగైరా అనాల్సినపుడు ‘గిట’ అంటారు (అంబలిగిట దాగిండు). వ్యక్తుల స్వభావాన్ని బట్టి ప్రత్యేక పదాలతో పిలుచుకొంటారు. తులువతనం ఎక్కువగా ఉన్నవాణ్ని ‘గుడుమ’ అంటారు. అలాగే.. కనిపించకుండా మోసం/ చెడు చేసేవాడు ‘మునిగి రాళ్లేసెటోడు’- ‘నల్లికుట్లోడు’, అమాయకుడు ‘అంబేద’, ఎంతజెప్పినా స్పందించనివాడు ‘మానువోతు’, చేతగానివాడు ‘చప్పిడిమొగం’- ‘ఈడ్గెలవడెటోడు’, తక్కువ గుణం కలవాడు ‘తిర్రోడు’, పనికిమాలినవాడు ‘బడుప’, స్తబ్దుగా ఉండేవాడు ‘పూడుగుపాము’! ఊరికే అరిచేవాడిని ‘లొట్టిమీది కాకి’ అనీ, లోలోపలే వ్యవహారం నడిపేవాణ్ని ‘మూసిన కోళ్లు మింగెటోడు’ అనీ పిలుస్తారు.
పాపమని పచ్చిపులుసు పోస్తే..
పల్లెవాసుల నోట్లో అందమైన సామెతలెన్నో అలవోకగా పలుకుతాయి. ‘సింత లేనోడు సంతల నిద్రవొయిండంట’- సంతలో ఎంత అల్లరి ఉంటుంది. అంత లొల్లిలో కూడా హాయిగా నిద్రపోగలిగిండంటే వాడెంత చింతలేనోడో! ‘ఏం లేనోనికి ఏతులెక్కువ, చెల్లని రూపాయికి గీతలెక్కువ’- చక్కటి సామ్యం. ‘ఉన్నప్పుడు ఉలికి, లేనప్పుడు లేకి’, సంపద ఉన్నప్పుడు చాలా ఉరుకులాడుకొంటూ ఖర్చు చేస్తారు. అదే సంపదపోతే కొసరి కొసరి మరీ ఖర్చుపెడతారు. ఇది చాలామందిలో కనిపించే నైజం. ‘ఏట్ల పచ్చిపులుసు పిస్కినట్లు’- ఏరు అంటే నది. వ్యర్థం అనే అర్థంలో దీన్ని ఉపయోగిస్తారు. ‘బర్లను చెర్లకు దోలి కొమ్ములకు బ్యారం పెట్టినట్లు’- మోసాన్ని స్ఫురింపజేసే సామెత ఇది. బర్లు నీళ్లలో ఉంటే వాటి శరీర సౌష్టవం వగైరా కనిపించవు. కేవలం కొమ్ములను చూపించి బేరమాడితే కొనేవాడికి నష్టం కలగవచ్చు. ఇక ‘ఇచ్చెటోణ్ని జూస్తే, సచ్చెటోడు లేచొస్తడు’.. లోకం తీరిది. ‘పొట్టోణ్ని పొడుగోడు కొడితే, పొడుగోణ్ని పోశమ్మ గొట్టిందట’- బలహీనుణ్ని బలవంతుడు కొడితే, బలవంతుణ్ని భగవంతుడు కొడతాడనే తాత్త్వికతకు అక్షర రూపమిది.  ‘పాపమని పచ్చిపులుసు పోస్తే ఉప్పులేదని రచ్చకెక్కిందట’- దయకు దక్కిన ఫలిత మిది. ‘వావివరుసలు దెల్వనోడికి పిలిచి పిల్లనిస్తే, అద్దమరాతిరి లేసి పెద్దమ్మా అన్నడంట’ లాంటి హాస్య పరిమళాలను పంచే సామెతలూ ఎన్నో ఉన్నాయి.
జాతీయాలు భాష సౌందర్యాన్ని ఆవిష్కరించే పదబంధాలు. వీటి ప్రయోగం వల్ల చెప్పే సందర్భానికి పుష్టి చేకూరుతుంది. ఈ జిల్లాలో తరచుగా వాడే కొన్ని జాతీయాలను చూద్దాం. లెక్కకు రానిది అన్న అర్థంలో ‘జమ్మికింద రాత’ను వాడతారు. దసరారోజు జమ్మిచెట్టు కింద కూర్చొని ఎవరికివారు తమ వివరాలు, ఆదాయ వ్యయాలను రాసి చెట్టు మొదట్లో ఉంచడం సంప్రదాయం. అయితే ఇక్కడ ఏవో లెక్కలు చూపుతారు (నిజమైనవి కాకుండా). వాటికంత ప్రాధాన్యముండదు. అవమాన పరచు అనే అర్థంలో ‘దిష్టిదీయు’ అంటారు (అందరిముందర వానికి దిష్టిదీసిండ్రు). విపరీతమైన కష్టాలు ఎదురైనప్పుడు ‘కన్నమ్మ కష్టాలు’ పడాల్సిందే. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లిపడే ప్రసవ వేదన నేపథ్యంలో పుట్టుకువచ్చిన జాతీయమిది (ఇల్లుగట్టే వరకు కన్నమ్మ కష్టాలు వడిన).
కుల్లం కుల్లాగ చెప్పేస్తా!
ప్రతి భాష మీద ఇతర భాషల ప్రభావం పడటం అనివార్యం. దీనికి ఎన్నో కారణాలు. చవక అనే అర్థంలో ఇక్కడ ‘అగ్గువ’ అని వాడతారు. ప్రాకృతంలోని ‘అగ్ఘ’ నుంచి వచ్చిన రూపమిది. నిప్పును ‘ఇంగలం’ అంటారు. ప్రాకృతంలో ‘ఇంగాల’ శబ్దం ఉంది. ప్రాకృతంలోని భోణం ఇక్కడ ‘బోనం’గా, భిచ్చ ‘బిచ్చం’గా మారింది. తమిళంలోని తళ్లియ ‘తల్లె’ అయ్యింది. తాంబాళమ్‌ ‘తాంబాళము’గానే మిగిలింది. ఇక పాలమూరు జిల్లాకు ఒకవైపు సరిహద్దుగా కర్ణాటక రాష్ట్రం ఉంది. ఆ ప్రభావం ఇక్కడి భాష మీద పడింది. దున్ననిభూమి తెలుగులోనూ, కన్నడలోనూ ‘బీడే’. కన్నడలోని ‘బిరుదు’ మాత్రం తెలుగులో ‘బిరుదము’ అయ్యింది. కన్నడలో ‘బ్యాళి’ అంటే పప్పు. కందిపప్పును ‘కందిబ్యాళ్లు’ అని పిలవడం గద్వాల, అలంపూరు ప్రాంతాల్లో కనిపిస్తుంది. నారాయణపేట ప్రాంతపు తెలుగు వాడకం మీద కన్నడ ప్రభావం మరింత ఎక్కువ. కన్నడలో ‘బందిల్ల’ అంటే రాలేదు అని అర్థం. ఈ భావాన్ని చెప్పడానికే ‘వచ్చిలేదు’ అంటారక్కడ. ‘బందుబిట్టీని’ అనే భావాన్ని చెప్పడానికి ‘వచ్చిడిచిన’ (వచ్చి+ఇడిచిన) అంటారు. ఇది యథాతథానువాదం. కన్నడలో ‘అప్ప’ అంటే అయ్య. ఇక్కడ ‘ఏమప్పా’ (ఏమయ్యా అనడానికి) అని అడుగుతారు. అలంపూరు, వనపర్తి, కొల్లాపూరులు తుంగభద్ర, కృష్ణలకు ఇటువైపైతే, అవతలివైపు రాయలసీమ (కర్నూలు). ఆ ప్రభావం ఇక్కడి భాష మీద కొద్దిగా ఉంది. అంగడి (దుకాణం), కొళాయి (నల్లా) లాంటి పదాల వినియోగం ఈ ప్రాంతాల్లో వినియోగంలో ఉన్నాయి.
నిజాం పరిపాలనలో ఉండటంతో ఇక్కడి భాష మీద ఉర్దూ ప్రభావమూ ఎక్కువే. నిత్యజీవితంలో ఉపయోగించే ‘జిల్లా, బజారు, దుకాణం, జవాబు, ఖాళీ, బదిలీ, ఖర్చు, బందు, వసూలు’ లాంటి ఎన్నో పదాలు అలా వచ్చినవే. చిత్రమేమంటే ఇవన్నీ తెలుగు ప్రాంతాలన్నింట్లోనూ వాడుకలో ఉన్నాయి. ఇక ఈ జిల్లాలో ‘నేనైతే కుల్లం కుల్లాగ చెప్పేస్తా’ అంటారు. విషయమంతా, పూర్తిగా చెప్పేస్తానని భావం. ‘కుల్లహం’ అనే ఉర్దూమాటకు మొత్తం, అంతా, పూర్తిగా అని అర్థం. ప్రస్తుతం విద్య, టీవీ, పత్రికల ప్రభావంతో ఇంగ్లీషు పదాల వినియోగం ఎక్కువైంది. అలాగే, ఇక్కడి తెలుగు మీద మరాఠీ ప్రభావం కొంతవరకు కనిపిస్తుంది. ‘పంతులు’ అనే మాట మరాఠీలోని ‘పంథ్‌’ నుంచి వచ్చిందే. శనగపిండితో అక్కడ చేసే వంటకం ‘పిట్ల’ను ఇక్కడ కూడా ‘పిట్ల’గానే పిలుస్తారు. అక్కడి ఖీర్‌ (పాయసం) ఇక్కడా అలాగే నోటికందుతోంది. అన్నట్టు, జేబు అనే అర్థంలో ‘కీస’ అని వాడతారు. ఇది ‘కీసర్‌’ అనే పార్సీ పదం నుంచి వచ్చింది.
ఇతర భాషా పదాలు తెలుగులో కలిసినట్లే తెలుగు పదాలు ఇతర భాషల్లో వినియోగించడాన్నీ ఈ జిల్లాలో చూడవచ్చు. నారాయణపేట ప్రాంతంలో ‘ఖత్రీ’ భాష ఎక్కువగా మాట్లాడతారు. వారి మాటల్లో తెలుగు కూడా చోటు చేసుకొంటుంది. ‘గడ్డపార్‌ సే ఖోద్‌’ (గడ్డపారతో తవ్వు), ‘మై బండి మే జాస్‌’ (నేను బండిలో వెళతాను)... ఇలా అన్నమాట. ఈ జిల్లాలో లంబాడీలు ఎక్కువగానే ఉన్నారు. వారి భాషలోకి కూడా తెలుగు ప్రవేశించింది. ‘కసేన్‌ వగలు కరరోచి’ (ఎందుకు వగలు వడుతున్నారు), ‘ఖేతన్‌ జాన్‌ మొలక చణకన్‌ ఆవూంచు’ (పొలానికి వెళ్లి మొలక చల్లి వస్తాను) లాంటి వాక్యాలు వారి భాషలో వినపడతాయి.
భాష ప్రధానంగా పరస్పర భావవినిమయ వాహిక. అయితే కేవలం భావ ప్రసారానికే ఇది పరిమితం కాదు. జ్ఞాన నిర్మాణానికి దోహదపడుతుంది. చైతన్య ప్రసరణకు ప్రేరణనిస్తుంది. సంస్కృతీ పరిమళాలను వెదజల్లే సుమవనమై శోభిస్తుంది. పాలమూరు జిల్లా తనదైన విలక్షణ భాషను కలిగి ఉండటమే కాదు, ఇతర భాషా పదాలను కలుపుకుని సజీవ స్రవంతిలా సాగిపోతోంది.

*    *     *


వెనక్కి ...

మీ అభిప్రాయం