వెండి తీగలే కీర్తి పతాకలు

  • 886 Views
  • 2Likes
  • Like
  • Article Share

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడి గారాలపట్టి ఇవాంకాకు మన దేశం తరఫున వెండి నెమలి, కాకతీయ తోరణం, చార్మినార్‌ లాంటివి కానుకలుగా ఇచ్చారు. ప్రధానమంత్రి మోదీకి వెండి హంస జ్ఞాపిక.. అలాగే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, అమితాబ్‌ బచ్చన్‌, రతన్‌ టాటా తదితరులు హైదరాబాదుకు వచ్చినప్పుడు ఈ వెండి కానుకలు అందుకుని మురిసిపోయారు. వాళ్లందరినీ అంతలా ఆకట్టుకున్న ఆ వెండి వస్తువులు... తరాల చరిత్ర కలిగిన కరీంనగర్‌ ఫిలిగ్రీ కళాకృతులు. అనితర సాధ్యమైన ఏకాగ్రత, ఓపికలతో వీటిని రూపొందించే ఆ స్వర్ణకారుల హస్తకళా నైపుణ్యం... తెలుగు జాతికే గర్వకారణం.
కరుఁగను బోఁతఁబోయఁగను గ్రాఁచి కదించను గమ్మిదీయఁగా
నొరయఁగ వన్నియల్నిగుల నుండఁగఁ జూపఁగ  బూదెఁగట్ట రే
కఱుఁగఁగఁ దీయుఁజెక్కఁగను నచ్చునవ్రేయఁగ సుద్దగించఁగా
సొరిది విచిత్రచిత్రములు సొమ్ములు సేయ నతండు నేరిచెన్‌

      మణివరపురంలో భద్రకారకుడు అనే స్వర్ణకారుడు ఉండేవాడట. బంగారం, వెండి తదితర లోహాలను అతను కరిగించగలడు. అచ్చుల్లో పోతపోయగలడు. వాటి ముక్కలను అతికించగలడు. వాటి నుంచి సన్నటి తీగలు తీయగలడు. మొత్తమ్మీద చిత్రవిచిత్రమైన ఎన్నో ఆభరణాలను తయారుచేయగలడు. పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన ‘హంసవింశతి’ కావ్యకర్త అయ్యలరాజు నారాయణామాత్యుడు చెప్పిన పద్యమిది. ఓరకంగా ఇది ఆ కాలపు తెలుగు స్వర్ణకారుల నైపుణ్యానికి దర్పణం లాంటిది. విశేషం ఏంటంటే... ఫిలిగ్రీ కళ కూడా దాదాపు ఆ కాలంలోనే తెలుగునాట అడుగుపెట్టింది. పై పద్యంలోని ‘తీగలు తీయడం’ ఉంది చూశారూ... అదే ఈ ఫిలిగ్రీకి ప్రాణాధారం. అందుకే ఈ కళను మన స్వర్ణకారులు ‘వెండితీగ పని’ అని పిలుచుకుంటారు.
      ‘ఫిలమ్‌’ (తాడు/ తీగ), ‘గ్రానమ్‌’ (గింజ/ చిన్న పూస) అన్న లాటిన్‌ పదాల నుంచి వచ్చిన ఆంగ్ల పదం ‘ఫిలిగ్రీ’. బంగారం లేదా వెండి లోహాలను సన్నటి తీగలుగా మలచి.. వాటి ద్వారా అందమైన వస్తువులు, ఆభరణాలకు ప్రాణంపోసే కళ ఇది. ప్రాచీన మెసొపొటేమియా, ఈజిప్టుల్లో ఈ కళ పురుడుపోసుకుందన్నది ‘సాలార్‌జంగ్‌ మ్యూజియంలోని కరీంనగర్‌ ఫిలిగ్రీ కళాఖండాల’ మీద పరిశోధన చేసిన బాలగౌని కృష్ణగౌడ్‌, ఎమ్వీ సుబ్రహ్మణ్యేశ్వరశర్మల అభిప్రాయం. క్రీ.పూ.2500ల్లో ఈ కళ ఆసియాకు విస్తరించింది. ఆ తర్వాత ఐరోపా చేరింది. ఇరాన్‌లో (నాటి పర్షియా) ఇది ‘మలీల్చ్‌’ పేరిట ప్రఖ్యాతం. క్రీ.పూ.330- 550 మధ్య ఈ కళ అక్కడ బాగా వర్ధిల్లినట్టు చారిత్రకాధారాలు ఉన్నాయి. ఇప్పటికీ అక్కడి జన్‌జన్‌, అర్దెబిల్‌ ప్రాంతాల్లో ఫిలిగ్రీ వస్తువులు తయారుచేసే స్వర్ణకారులు ఎక్కువగా ఉన్నారు. వాళ్లందరూ బంగారానికి బదులు వెండినే ఉపయోగిస్తుంటారు. మన కరీంనగర్‌కు ఈ కళ ఇరాన్‌ నుంచే వచ్చింది.
నిజాంల ప్రోత్సాహంతో...
రెండు మూడొందల ఏళ్ల కిందట ఇక్కడి స్వర్ణకారులు విరివిగా పర్యటనలు జరిపేవారు. ఆయా ప్రాంతాల్లోని ఆభరణాల తయారీ విధివిధానాలను పరిశీలించి, వైవిధ్యభరితమైన వాటిని అందిపుచ్చుకునేవారు. అలా కడార్ల పనయ్య అనే స్వర్ణకారుడు పర్షియా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ వెండితీగ పనిని చూశారు. అది ఆయనకు బాగా నచ్చడంతో దాన్ని అభ్యసించారు. స్వస్థలానికి తిరిగివచ్చాక... నాటి జిల్లాకేంద్రం ఎలగందల కేంద్రంగా పని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయనకు మరికొందరు స్వర్ణకారులు జతకలిశారు. కత్తుల ఒరల నుంచి వీళ్లు వెండితీగలతో రూపొందించిన వివిధ అలంకరణ వస్తువులు నాటి నిజాం పాలకులకు బాగా నచ్చాయి. దాంతో వాళ్లు వీళ్లను ఆదరించారు. నజరానాలను, ఇనాం భూములను అందించారు. అప్పట్లో ఈ స్వర్ణకారులు తయారు చేసిన పన్నీరుబుడ్డి, తమలపాకుల పెట్టె, ఆభరణాల పెట్టె, పళ్లేలు తదితర కళాఖండాలు సాలార్‌జంగ్‌ మ్యూజియంలో కొలువుదీరాయి. నెహ్రూ (దిల్లీ), లండన్‌ వస్తు ప్రదర్శనశాలల్లోనూ ఇవి దర్శనమిస్తాయి.
      ఆ రోజుల్లో సంపన్నులకే పరిమితమైన ఈ కళ కొన్నాళ్లకు మరుగున పడింది. నవాబుల పాలన ముగిసిన తర్వాత ఇక్కడి స్వర్ణకారులను ఆదరించే వారు కరవయ్యారు. దాంతో వాళ్లు ఇతర పనుల్లోకి వెళ్లిపోయారు. చివరకు వెండితీగ పనిలో 16-20 మంది కళాకారులు మిగిలారు. వెండి ధరలు పెరగడం, పెట్టుబడులు సమస్య కావడంతో వారూ నిరుత్సాహానికి గురవడంతో ఈ కళ సుప్తావస్థకు చేరింది.
ముందుకొచ్చిన యువత
తమ తాతలు, తండ్రుల కాలం నాటి వెండితీగ పనికి పూర్వ వైభవం తీసుకురావాలన్న పట్టుదలతో కొంతమంది చదువుకున్న యువకులు ముందుకొచ్చారు. ముందుగా ఈ కళ గురించి తెలుసుకుని పని నేర్చుకున్నారు. ఆసక్తి ఉన్న 30 మందిని సమీకరించారు. ఎర్రోజు అశోక్‌, గద్దె అశోక్‌కుమార్‌, ఆకోజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో వాళ్లు వస్తువులను తయారు చేసేవారు. అయితే.. మార్కెటింగ్‌లో సమస్యలు ఎదురయ్యాయి. పైగా అమ్మకాల్లో తమలో తాము పోటీపడాల్సిన పరిస్థితి. దీంతో గిట్టుబాటు కాకపోయేది. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని చేతివృత్తులను ప్రోత్సహించాలనే ఆలోచనతో 1992లో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆంధ్రా బ్యాంకు ద్వారా వీళ్లకు రూ.40 లక్షలు రుణం ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆ క్రమంలో కళాకారులందరినీ ఓ సంఘంగా ఏర్పాటు చేశారు. శిక్షణ, మార్కెటింగ్‌ సదుపాయాలూ కల్పించారు. మొత్తం 172 మందికి సంఘం తరఫున రుణాలు అందాయి. కళాకృతుల ఉత్పత్తి, అమ్మకాలు కొంతకాలం సజావుగా జరిగినా తర్వాత కొన్ని లోపాలతో సంఘం దెబ్బతింది.
      కళాకారుల పట్టుదలతో నూతన సహస్రాబ్దిలో ఈ వెండితీగ పనికి మళ్లీ పూర్వవైభవం వచ్చింది. సిల్వర్‌ ఫిలిగ్రీ ఆఫ్‌ కరీంనగర్‌ హ్యాండిక్రాఫ్ట్‌ వెల్ఫేర్‌ సొసైటీ (సిఫ్కా) ఏర్పాటవడంతో కొత్తవారు పని నేర్చుకోవడం ప్రారంభించారు. 2007లో కరీంనగర్‌ ఫిలిగ్రీకి ‘భౌగోళిక గుర్తింపు’ (జీఐ) లభించింది. ఇప్పుడు దాదాపు రెండొందల మంది ఈ పనిలో ఉన్నారు. వారసత్వంగా అందిన కళను బతికించుకోవాలన్న తపనతో అందరూ సమష్టిగా శ్రమిస్తున్నారు. వీళ్ల సృజనకు ‘లేపాక్షి’ శిక్షణ తోడవడంతో విభిన్న కళాఖండాలు పురుడుపోసుకుంటున్నాయి. అప్పట్లో గవర్నర్‌ నరసింహన్‌ జిల్లా పర్యటనకు వచ్చారు. ఫిలిగ్రీ విశిష్టతను గమనించి, ఈ కళాకారులకు చేయూతనివ్వాలని నాటి కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌కు సూచించారు. ఆవిడ చొరవతో 2013లో ఎస్బీహెచ్‌ నుంచి ‘సిఫ్కా’కు రూ.కోటి రుణం మంజూరయ్యింది. దీనికి ‘లేపాక్షి’ ఎండీ శైలజా రామయ్యర్‌ కూడా తోడ్పాటును అందించారు. అప్పటి నుంచి సిఫ్కా వెనుదిరిగి చూడలేదు. ప్రస్తుతం రూ.2 కోట్ల పైగా టర్నోవర్‌తో అభివృద్ధి పథంలో సాగుతోంది.
పూర్తిగా హస్త నైపుణ్యమే!
ఫిలిగ్రీలో ముందు ముడి వెండిని కరిగించి చిన్న చిన్న కడ్డీలుగా పోతపోస్తారు. తర్వాత వాటి నుంచి కావాల్సిన పరిమాణంలో తీగలు తీస్తారు. ఆ తీగలను, తయారు చేసే వస్తువుకు తగినట్టుగా కత్తిరించడం, ఆకృతులుగా మార్చుకోవడం అంతా చేత్తో చేసేదే. దీనికి చాలా ఏకాగ్రత, ఓపిక కావాలి. వినియోగదారుడి అభిరుచి మేరకు తయారీదారులు ముందు కాగితం మీద ఆకృతులను గీసుకుంటారు. తర్వాత సరిపడా వెండిని సమకూర్చుకుని, దాన్ని తీగలుగా మలుస్తారు. ఆ తీగలను కత్తిరిస్తూ, వంచుతూ విభిన్న ఆకృతులను రూపొందిస్తారు. తర్వాత వాటన్నింటినీ కలిపి కళాఖండాన్ని సృష్టిస్తారు. ఈ క్రమంలో ఎక్కడ తేడా వచ్చినా మొత్తం ఆకృతి దెబ్బతింటుంది. కాబట్టి, కళాకారులందరూ పూర్తి శ్రద్ధతో అత్యంత సూక్ష్మస్థాయికి వెళ్లి పనిచేస్తారు. అందుకే ఒక్కో కళాఖండం తయారుచేయడానికి 5 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. పెద్ద ఆర్డరు ఉన్నప్పుడు సంఘం సభ్యులంతా కలిసికట్టుగా పనిచేసి పూర్తి చేస్తారు. ప్రముఖులకు ఆయా సందర్భాల్లో అందజేసే జ్ఞాపికలే కాదు.. పూజ గది, వివాహాది వేడుకలు, గృహాలంకరణకు కావాల్సిన మరెన్నో కళారూపాలను వీళ్లు సృజిస్తున్నారు.
      చేతి వృత్తులకు రుణ సాయం, విపణి సదుపాయాలు కల్పించి ప్రోత్సహించేందుకు 2014 అక్టోబరులో హైదరాబాదు ఆర్బీఐ కార్యాలయం ఆవరణలో బ్యాంకర్లు ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాత కళాకృతులను ఇందులో ప్రదర్శించారు. ఇందులో పాల్గొన్న ఫిలిగ్రీ కళాకారుల సృజనలు నాటి ఆర్బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ మనసు దోచుకున్నాయి. ఇంకా వివిధ సందర్భాల్లో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు ఈ కళాకారులను అభినందనలతో ముంచెత్తారు. ‘సిఫ్కా’తో పాటు దాని వ్యవస్థాపకులు, నిర్వాహకులకు జాతీయ, అంతర్జాతీయ గౌరవాలు లభించాయి. 2008లో ‘యునెస్కో అవార్డ్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ను హాంకాంగ్‌లో స్వీకరించారు. ఆ తర్వాత ఏడాది వీరిని హరియాణా ప్రభుత్వం ‘కళానిధి’ సత్కారంతో గౌరవించింది. 2011, 12ల్లో రాష్ట్రపతి పురస్కారాలనూ ఈ కళాకారులు అందుకున్నారు. మరోవైపు... ఈ కళను భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో సిఫ్కా ఆధ్వర్యంలో నిరంతర శిక్షణలు నిర్వహిస్తున్నారు. దీనికి ప్రభుత్వం కూడా తోడ్పాటునందిస్తోంది. ‘నిఫ్ట్‌’ కూడా కళాకారులకు చేయూతనిస్తోంది. అలాగే ‘లేపాక్షి’ ఆధ్వర్యంలో వృత్తి, మార్కెటింగ్‌ నైపుణ్యాల్లో మెలకువలు నేర్పుతున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధినీ అందిస్తున్నారు. ఇక్కడ పనిని బట్టి వేతనం ఉంటుంది. ఒక్కో కళాకారుడికి తన నైపుణ్యానికి అనుగుణంగా నెలకు రూ.20 వేల వరకూ అందుతుంది.
      తెలుగునాడు వివిధ హస్తకళలకు ఆటపట్టు. వాటిలో ఒకటిగా ఈ గడ్డ ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపజేస్తోంది ఫిలిగ్రీ. దేశీయంగా కటక్‌ తదితర ప్రాంతాల్లో ఈ వెండితీగ పని సాగుతున్నా... కరీంనగర్‌ కళాకారుల సృజనలకే అన్నిచోట్లా మంచిపేరు ఉంది. ఆ గుర్తింపు అలా కొనసాగడంతో పాటు భావితరాలకు ఈ కళ మరింతచేరువకావాలని ఆశిద్దాం.


వారసత్వంగా వచ్చిన కళను కాపాడుకోవాలనే తపనతో శ్రమించాం. దానికి తగిన ప్రతిఫలం లభిస్తోంది. ప్రాచీన కళను పాత పద్ధతిలోనే కొనసాగిస్తే కొత్తదనం లోపిస్తుందని గుర్తించాం. అందుకే వివిధ శిక్షణలు, క్షేత్ర పర్యటనలు ఏర్పాటుచేస్తున్నాం. ఇటీవలి కాలంలో కొత్తగా విలువైన రంగు రాళ్లు అమర్చి కళాకృతులకు మరింత శోభను తీసుకొస్తున్నాం.. ప్రభుత్వం నుంచి ఆర్డర్లు రావడం మాకు ప్రోత్సాహకంగా ఉంది. అలాగే తయారు చేసిన వస్తువులను సరైన పద్ధతిలో మార్కెట్‌ చేయగలుగుతుండటంతో కళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి లభిస్తుంది. కరీంనగర్‌తో పాటు హైదరాబాదులోనూ దుకాణాలు తెరిచాం. వినియోగదారుల అభిరుచికి తగినట్టు ఆకృతులను రూపొందించడం కీలకం. అలా చేస్తేనే ఆదరణ లభిస్తుంది. 

- గద్దె అశోక్‌ కుమార్‌, ‘సిఫ్కా’ ప్రధాన కార్యదర్శి, 92469 34641


 ఇంటికి దగ్గర్లోనే ఉపాధి లభిస్తోంది. భార్యాభర్తలం ఇక్కడే పని చేస్తున్నాం. మొదట నాకు శిక్షణ ఇచ్చారు. ముడి వెండి నుంచి వివిధ ఆకృతులను మలచడం లాంటి పనులు చేశా. ఇప్పుడు పూర్తిస్థాయిలో వర్క్‌ షాపులో పని చేస్తున్నా. అయిదు సంవత్సరాల నుంచి ఈ పనిలో ఉన్నా. మనం చేసేదాన్ని బట్టి డబ్బులు వస్తాయి. దూరం పోకుండా కులవృత్తిలోనే కొనసాగడం.. అదీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేసుకోగలగడం సంతోషం కలిగిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళ మాది అని చెప్పుకునేందుకు గర్వంగానూ ఉంది. 

- ఎనగంటి లక్ష్మి


పదో తరగతి వరకు చదువుకున్నా. ఆపై కుదరలేదు. స్వతహాగా స్వర్ణకారుణ్ని కావడంతో కులవృత్తిలోకి రావాలనుకున్నా. ఎర్రోజు అశోక్‌ దగ్గర వెండితీగ పని నేర్చుకున్నా. ఆ తర్వాత సిఫ్కాలోనే పదమూడేళ్లుగా పని చేస్తున్నా. ఇతర పనులతో పోల్చుకుంటే ఇది పూర్తిగా సృజనాత్మకమైన, కష్టమైన పని. అయినా... ఓ కళాఖండం పూర్తయిన తర్వాత, దాన్ని చూస్తే చాలు మా శ్రమను మరచిపోతాం. రాత్రి, పగలు అనే తేడా లేదు... అవసరం ఉంటే ఎప్పుడైనా పని చేసేందుకు మేమంతా సిద్ధంగా ఉంటాం. క్రమం తప్పకుండా ఆర్డర్లు వస్తుండటంతో ఉపాధికి ఇబ్బందేమీ లేదు. ‘సిఫ్కా’ ద్వారా భవిష్యత్తు మీద భరోసా కూడా లభిస్తోంది.  

 - చిలుముల వేణు


*   *    *

 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  హస్తకళలు