ప్రభుత్వ సేవలను తెలుగులో అందుకోవడం మనందరి హక్కు. సర్కారీ కార్యకలాపాల్లో అధికారభాషగా తెలుగును అమలు చేయాల్సిందేనని ప్రభుత్వ సేవలను తెలుగులో అందుకోవడం మనందరి హక్కు. సర్కారీ కార్యకలాపాల్లో అధికారభాషగా తెలుగును అమలు చేయాల్సిందేనని నిర్దేశించే ఉత్తర్వులు చాలానే ఉన్నాయి. కానీ, వాస్తవంలో మాత్రం పరిస్థితి భిన్నం! ఆంగ్లానిదే ఆధిపత్యం!! కానీ, రెండు రాష్ట్రాల్లోని కొంతమంది అధికారులు, ప్రభుత్వోద్యోగులు మాత్రం పట్టుబట్టి ‘తెలుగులో పనిచేస్తున్నారు’. ప్రజలకు మాతృభాషలో సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారిలో కొందరి గురించి ‘తెలుగు భాషా దినోత్సవం’ (ఆగస్టు 29) సందర్భంగా..
నిలువెత్తు తెలుగు సంతకం
తెలుగుభాషా వికాసానికి కృషిచేస్తూనే విధి నిర్వహణలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) గాజువాక జోనల్ కమిషనర్ బెండి వెంకటరమణ (96666 73949). తన కార్యాలయంలో ప్రతీ ఉద్యోగి తెలుగులోనే సంతకాలు పెట్టాలని ఆదేశించారాయన. అన్ని దస్త్రాలనూ అమ్మభాషలోనే నిర్వహింపజేస్తున్నారు. వెంకటరమణ గతంలో శ్రీకాకుళం జిల్లా రాజాం, పలాస, విజయనగరం జిల్లా బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం పురపాలక కమిషనర్‌గా, ‘మెప్మా’ సంచాలకుడిగా పనిచేశారు. రెండేళ్ల కిందట గాజువాకకు వచ్చారు. ఉగాది, మాతృభాషా దినోత్సవం, ఇతర పర్వదినాల్లో కవి సమ్మేళనాలు, భాషా సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రతీ దస్త్రంమీదా వెంకటరమణ తెలుగులోనే సంతకం చేస్తారు. ఎవరైనా ఆంగ్లంలో వినతిపత్రాలు ఇస్తే తెలుగులో ఇమ్మంటారు. కార్యాలయంలోని నామఫలకాలన్నీ తెలుగులోనే ఉండేలా చూశారు. ప్రముఖుల సూక్తులు, సందేశాలను పెట్టించారు. స్ఫూర్తిప్రదాతలు గురజాడ, గిడుగు, పొట్టిశ్రీరాములు చిత్రపటాలను అన్ని ఛాంబర్లలో ఏర్పాటుచేయించారు. ఆంగ్లంలో వచ్చిన ప్రభుత్వ ఆదేశాలను, మార్గదర్శకాలను తెలుగులోకి తర్జుమా చేయిస్తారు. ఆంగ్ల పాఠశాలల్లో సమావేశాలకు హాజరైనా తెలుగులోనే ప్రసంగిస్తూ, అమ్మభాషను కాపాడుకుందామని ఉద్బోధిస్తుంటారు. కాలనీల్లోని గ్రంథాలయాలకు తెలుగు పుస్తకాలను అందిస్తున్నారు. పట్టణంలో దుకాణదారులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి, నామఫలకాలన్నీ తెలుగులోనే ఉండేలా కృషిచేశారు. విజయనగరంలో ఉన్నప్పుడు నంది నాటకోత్సవాలు, తెలుగుభాషా ఉత్సవాలు, గురజాడ జన్మదినోత్సవాలు నిర్వహించారు. భాషాభివృద్ధికి చేస్తున్న కృషికిగానూ నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి పురస్కారాన్ని అందుకున్నారు.
- జగదీశ్, గాజువాక
అమ్మభాషే ప్రగతి బాట
ఆర్టీసీలో సీనియర్ పర్యవేక్షకులు. కడప జిల్లా పులివెందులలో పనిచేస్తున్నారు. అమ్మభాషలోనే విధులు నిర్వర్తిస్తున్నందుకు గుర్తింపుగా మోహన్ గతంలో ఆర్టీసీ ఎండీ పురస్కారాలనూ అందుకున్నారు.
సాధారణంగా ఆర్టీసీలో ఆంగ్లాన్నే ఎక్కువగా వాడుతుంటారు. ఆ భాషమీద పెద్దగా పట్టులేని డ్రైవర్లు, మెకానిక్‌లతో కూడా అందులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తుంటారు. పైగా కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే ప్రతి ఉత్తర్వునూ ఆంగ్లంలోనే పంపుతారు. వాటిని అలాగే నకలు చేసి, డిపోల్లో నోటీసుబోర్డుల్లో పెడుతుంటారు. దాంతో కార్మికులకు చేరాల్సిన సమాచారం సరిగ్గా అందట్లేదు. ఈ పరిస్థితుల్లో హరిమోహన్ స్వచ్ఛందంగా ఆ ఉత్తర్వులు, ఇతర సూచనల ప్రతులను తెలుగులోకి అనువదిస్తున్నారు. అలా తెలుగు చేసిన ప్రతులను నోటీస్‌బోర్డు మీద ఉంచుతున్నారు. దానివల్ల కార్మికులకు మేలు జరుగడంతో పాటు సంస్థ ఉద్దేశాలు వాళ్లకు సరిగ్గా అర్థమవుతాయన్నది ఆయన భావన. అభినందన, దోషారోపణ పత్రాలు, ఉన్నతాధికారులకు పంపే సమాధానాలకూ ఆయన తెలుగునే వినియోగిస్తున్నారు. హరిమోహన్ తెలుగులో పంపిన నోట్‌ఫైల్స్‌ను ఒక్కోసారి తిప్పిపంపుతుంటారు ఉన్నతాధికారులు. ఆంగ్లంలో ఇవ్వమంటారు. కానీ, ఆయన మాత్రం పట్టువదలకుండా తెలుగులోనే సమాధానమిస్తారు. భాషాభిమానం ఉన్న అధికారులు మాత్రం ఆయన తపనను మెచ్చుకుంటూ ఉంటారు.
ఎం.హరిమోహన్ (73828 61895)
రాష్ట్రమంతటికీ స్ఫూర్తి
తన మాతృభాష కాకపోయినా తెలుగు కోసం తపిస్తున్నారో అధికారి. ప్రజలకు స్థానిక అధికారభాషలోనే సేవలందించాలన్న ఆశయంతో పుష్కర కాలంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనే సయ్యద్ ఖాదర్‌బాషా ( 99634 78966).
ప్రస్తుతం కడప జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి (డిప్యూటీ సీఈఓ). పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ సహాయకునిగా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనకు చిన్నతనం నుంచే తెలుగులో కవితలు రాసే అలవాటు ఉంది. ఉద్యోగంలో చేరాక (2004) కూడా తెలుగులోనే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా తాను పనిచేస్తున్న శాఖలో తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. ఆంగ్ల పరిజ్ఞానం లేని సర్పంచులు, వార్డు కమిటీ సభ్యులు సైతం సర్కారీ ఉత్తర్వులను సొంతంగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో తెలుగు అమలుకు పూనుకొన్నారు. అలా తొలి విజయం సాధించారు. పూర్తిగా తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్న కార్యాలయంగా కడప జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఓ గుర్తింపు సాధించిపెట్టారు. ఖాదర్‌బాషా స్ఫూర్తితో అన్ని జిల్లా పంచాయతీల్లోనూ తెలుగులోనే కార్యకలాపాలు నిర్వహించాలని కొన్నేళ్ల కిందట ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. ఐఏఎస్ అధికారి కృష్ణబాబు ప్రోత్సాహం... ‘అధికారభాషగా తెలుగు అమల్లో’ బాషాకు వెనుదన్నుగా నిలిచింది. మధ్యలో ఓ ఏడాది బదిలీమీద కర్నూలు జిల్లాకు వెళ్లారాయన. ఆ సమయంలో సిబ్బంది పనితీరు, ఫిర్యాదుదారులతో ప్రవర్తించే తీరుమీద ఎప్పుడైనా అసంతృప్తి కలిగితే ‘నొప్పించక తానొవ్వక’ అన్న రీతిలో వాళ్లని చక్కదిద్దేందుకు కవితలను ఉపయోగించేవారు. సిబ్బంది మీద తన అభిప్రాయాన్ని కవిత రూపంలో చీటీ రాసి ఫైళ్లలో ఉంచేవారు. దాన్ని చదువుకున్న వారు పద్ధతి మార్చుకునేవారు. అలా ఖాదర్ రాసిన కవితలన్నింటినీ అక్కడి సిబ్బంది తాఖీదు బోర్డులో ప్రదర్శనకు ఉంచడం విశేషం.
- గాలి సురేష్, కడప
ఒకే ఒక్కడు
ఆయనకు అమ్మభాషంటే చాలా ఇష్టం. చిన్నప్పటినుంచే తెలుగులో రచనలు చేసే అలవాటు ఉంది. ప్రభుత్వోద్యోగిగా విధినిర్వహణలోనూ భాషాభిమానాన్ని చాటుకుంటున్నారు.
కరీంనగర్ జిల్లా సచివాలయంలో (కలెక్టరేట్) వందలమంది ఉద్యోగులు పనిచేస్తుంటారు కానీ, తెలుగులో పనిచేసేదెవరంటే మాత్రం ఆయనొక్కరి పేరే వినిపిస్తుంది. ఇంతకూ ఆయన ఎవరంటే... జిల్లా సచివాలయంలోని భూ కొలతలు, దస్త్రాల శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ వి.నటరాజ్‌కుమార్ (98484 57769). స్వస్థలం తీగలగుట్టపలల్లి. బాల్యం నుంచే అమ్మభాషపై మక్కువ పెంచుకున్న ఆయన... సృజనాత్మక రచనలు చేయడం అలవర్చుకున్నారు. విద్యార్థి దశలో పోటీపరీక్షల కోసం ఇతర భాషల మీద పట్టుపెంచుకున్నారు కానీ, తెలుగు మీద ప్రేమను వదులుకోలేదు. 2010లో ఉద్యోగంలో చేరిన నటరాజ్ తొలిరోజు నుంచి తెలుగులోనే నివేదికలు రూపొందించడం, కార్యవర్తనాలు నిర్వహించడం చేస్తున్నారు. విధుల్లో భాగంగా రాసే ఉత్తర, ప్రత్యుత్తరాలకూ తెలుగునే ఎంచుకున్నారు. ఇప్పటికీ దాన్నే అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరు ఎన్నిరకాలుగా విమర్శించినా పట్టించుకోకుండా తన పని తను చేసుకువెళ్తున్నారు. దీనికి గుర్తింపుగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా 2013లో ప్రశంసాపత్రంతో అభినందించారు అప్పటి అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్. ‘ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమవుతోంది. యువత ఇతర భాషల వైపే మొగ్గు చూపుతున్నారు. రోజువారీ మాటలు, రాతల్లోనూ పరాయిభాషకే ప్రాధాన్యమిస్తున్నారు. వాళ్లలో మార్పు రావాలి. కార్యాలయానికి వచ్చేవాళ్లలో అమ్మభాష మీద అభిమానం పెంచడానికి నా ప్రయత్నం దోహదపడుతుందని అనుకుంటున్నాను’ అనే నటరాజ్... స్థానికుల దృష్టిలో ఒంటరి తెలుగు సైనికుడు.
- కిరణ్పటేల్ గోలి, కరీంనగర్
ఆ సంఘటనతో...
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండల పరిషత్తు అభివృద్ధి అధికారి ఎం.రాజు. పదిహేనేళ్లుగా తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలను నిర్వహిస్తున్నారు. అధికారభాషగా తెలుగును అమలు చేయమన్న ప్రభుత్వ ఉత్తర్వులను తాను పనిచేసిన మండలాల్లో యథాశక్తి పాటిస్తున్నారు.
‘జంగారెడ్డిగూడెం బస్టాండులో ఓ మహిళ హడావుడి పడుతూ హైదరాబాదు బస్సు ఎక్కింది. నేనూ అదే బస్సులో ఉన్నా. ఊరు దాటిన తర్వాత టిక్కెట్టు కోసం అడిగితే ‘బుట్టాయగూడేనికి ఇవ్వండి’ అంది. ఇది ఆ ఊరెళ్లే బస్సు కాదంటే, తెలియక ఎక్కానని చెప్పింది. ఆమెను అక్కడే దింపేసి బస్సు వెళ్లిపోయింది. అప్పటికే రాత్రి పది దాటిపోయింది. తోడు ఎవరూ లేరు. ఆ పరిస్థితుల్లో ఆవిడ ఎన్ని కష్టాలుపడిందో. నిరక్షరాస్యత వల్ల ఎదరయ్యే ఇబ్బందులేంటో ఆ క్షణంలో ప్రత్యక్షంగా చూశా. అప్పుడే నిర్ణయించుకున్నా. ముఖ్యంగా మహిళలకు చదవడం, రాయడం నేర్పించాలని. అదే తర్వాత క్షేత్రస్థాయికి చేరే ఉత్తర్వులను తెలుగులోనే ఇవ్వాలన్న నా దృఢ సంకల్పానికి కారణమైంది’ అంటారు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం ఎంపీడీవో ఎం.రాజు (94937 42437). జంగారెడ్డిగూడెం ఎంపీడీవోగా పనిచేస్తున్నప్పుడు ‘20 సూత్రాల అమలు కార్యక్రమం’లో రాష్ట్రస్థాయి ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారాయన. దానికి రూ.5 లక్షలు ప్రోత్సాహక బహుమతిని అందుకున్నారు. దీనికిమించిన సంతృప్తిని రూ.వెయ్యి బహుమానం అందించిందని చెబుతారు రాజు. అది అధికార భాషగా తెలుగును సమర్థంగా అమలు చేస్తున్నందుకు అప్పటి కలెక్టర్ సంజయ్‌జాజు చేతుల మీదుగా అందుకున్న బహుమతి! పరిపాలనాపరమైన లావాదేవీలు, ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే నిర్వహించడాన్ని అభినందిస్తూ దాన్ని అందించారు. ‘గ్రామాల్లో వ్యవసాయం, రైతువారి పనులతో జీవనం సాగించేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆదేశాలు, సూచనలు ఆంగ్లంలో ఇచ్చి, వాటిని కార్యాలయాల్లో అంటిస్తే చాలామందికి అర్థం కావు. తెలుగులో ఇవ్వడంవల్ల అవి అందరికీ సులభంగా అర్థమవుతాయి’ అనే ఆయన మాటలు అక్షరసత్యాలు.
ఆయన ప్రేరణతో...
చట్టా భాస్కర నారాయణ (94410 34659)... హోదా రీత్యా ఉప తహసీల్దారు. గత పన్నెండేళ్లుగా ఆయన అధికారిక విధులన్నింటినీ అమ్మభాషలోనే నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనకు తెలుగు అంటే మక్కువ. జిల్లా అధికారులకు, ప్రభుత్వానికి ఏదైనా నివేదిక పంపాలన్నా అంతా తెలుగులోనే రాస్తారు. కంప్యూటర్లోనూ తెలుగునే ఉపయోగిస్తూ, అందులోనే అధికారిక పత్రాలు తయారు చేస్తారు. ఆయనే కడప జిల్లా సచివాలయంలో పనిచేసే చట్టా భాస్కర్‌నారాయణ. ఆయన ఇక్కడి హెచ్-1 విభాగంలో ఉప తహసీల్దారు. భాస్కరనారాయణ 2004లో ఇక్కడికి వచ్చారు. అప్పటి నుంచీ తెలుగులోనే పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఎన్నికలు, సమాచారహక్కు చట్టం, కళ్యాణమస్తు, శ్రీవారి కళ్యాణం, శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలు, లేపాక్షి ఉత్సవాలు, ప్రపంచ తెలుగు మహాసభలు, ప్రజాసాధికార సర్వే, ఈ-పాలన తదితర సందర్భాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే నిర్వహించారు. భాస్కర నారాయణ ధర్మవరంలో సీనియర్ పర్యవేక్షకులుగా చేసేటప్పుడు అక్కడ తహసీల్దారుగా గోవిందరాజులు (ప్రస్తుతం విశ్రాంత డెప్యూటీ కలెక్టర్) ఉండేవారు. సాధికారికమైన పరిజ్ఞానం లేని ఆంగ్లం కన్నా మన భాషలో విధులు నిర్వర్తించడం మంచిది కదా అని తన సిబ్బందికి గోవిందరాజులు చెప్పేవారట. ఆయన మాటలతో ఉత్తేజితులై, అప్పటినుంచి ఎక్కడ ఏ బాధ్యతలు నిర్వర్తించినా తెలుగులోనే పనిచేస్తున్నారు భాస్కర నారాయణ. లోకేశ్‌కుమార్, సాల్మన్ ఆరోఖ్యరాజ్, జనార్దన్‌రెడ్డి, దుర్గాదాస్ లాంటి కలెక్టర్లు ఆయన్ను ప్రోత్సహించారు. పాలనాభాషగా తెలుగును అమలు చేయడంలో భాస్కరనారాయణ కృషికి గుర్తింపుగా 2008 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా అధికార భాష సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుద్ధప్రసాద్, 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశంసాపత్రాలు, నగదు పురస్కారాలు అందజేశారు.
- రామచంద్ర, అనంతపురం
* * *