ఆపతి సంపతిలో

  • 1743 Views
  • 5Likes
  • Like
  • Article Share

    కె.వి.నరేందర్‌

  • జగిత్యాల
  • 9963213046
కె.వి.నరేందర్‌

తెలంగాణ తెలుగు.. సృజనాత్మకం. మట్టి పరిమళాల భరితం. కానీ, అది కొన్నేళ్ల పాటు వివక్షల పాలైంది. ఇప్పుడు ఆ కారుమేఘాలు తొలగిపోయాయి. తెలంగాణ భాషకు ప్రాధాన్యం లభిస్తోంది. అయితే, ఇందులోని అద్వితీయమైన ‘జోడి పదాలు’ చాలా వరకు కనుమరుగయ్యాయి. 
      కవల పిల్లల్లాంటి వీటిని పదవిన్యాసాలు, జంటపదాలు లేదా జోడి పదాలు అనవచ్చు. ఈ పదాలు విచిత్రంగా ఉంటాయి. తెలంగాణ మాండలికంలో వినిపించే ఈ ‘ఐలాపురం (ఎడ్ల) జోడి’ లాంటి పదాలు అర్థవంతంగా ఉంటాయి. ఒక్క పదంగానే అనిపిస్తాయి. ఈ జోడి పదాల్లో రెండోపదం మొదటి పదానికి బలాన్ని చేకూర్చేలా ఉంటుంది. వాక్యానికి బలమైన అర్థాన్ని, అందాన్ని ఇచ్చే ఈ పదాలు నాదాత్మకంగానూ.. లయాత్మకంగాను ఉంటాయి. తెలంగాణ మాండలికానికి ఓ విలక్షణతను, విశిష్టతను అద్దే ఈ జోడిపదాల్లోని కొన్నింటిని చూద్దాం. 
అక్కల్‌ముక్కల్‌
మా అవ్వ ఈ పదాన్ని చాలాసార్లు వాడేది. చింతకాయ తొక్కు పెట్టుకునే ముందర చింతకాయల్ని రోట్లోవేసి ‘‘అక్కల్‌ముక్కల్‌ గా దంచుకోవాలె’’ అనేది. అంటే పూర్తి పిండి పిండిగా రుబ్బుకోవద్దు అన్నమాట. అలాగే పెసరిగారెలు చేసుకునేటప్పుడు కూడా నానబెట్టిన పెసర్లను ‘అక్కల్‌ముక్కల్‌’గా దంచుకోవాలె అంటారు.
అగ్గోసగ్గో
ఏదైనా వస్తువును కొనేటప్పుడు ‘‘ఏదో అగ్గువకో సగ్గువకో ఇంతకియ్యరాదు’’ అంటుంటారు. చవకగా అనే పదానికి ప్రత్యామ్నాయంగా వాడే మాట ఇది. ‘అగ్గువ’ అంటే వెలతక్కువ, చవుక అని అర్థం. ‘సగ్గు’ అంటే తగ్గు, క్షీణించు. ధర తగ్గించి ఇవ్వరాదూ అన్నది అంతరార్థం. 
అగులుబుగులు
ఏదైనా చెడువార్త విన్నప్పుడు మనసంతా అగులుబుగులు అయిందంటారు. అంటే భయం భయంగా అవడం! ఈ జంటలోని ‘అగులు’కు అర్థం పగులు, ఊడు. ఇక ‘బుగులు’ అంటేనేమో దడ, భయం. మొత్తంగా మనశ్చాంచల్యాన్ని చెప్పే మాట ఇది. 
అత్తిరిబిత్తిరి
ఏదైనా వెర్రి పనులు అమాయకంగా చేస్తే ‘అత్తిరిబిత్తిరి’ అనే పదాన్ని వాడుతారు. అత్తరం (ఆత్రం- తొందరపాటు), బిత్తరం (చంచలం) అన్న పదాల్లోంచి వచ్చిన జోడీపదాలివి. 
అడుపదడుపల
అప్పుడప్పుడు అనే పదానికి మారుగా దీన్ని వాడతారు. ఎవరైనా చుట్టాలు కానీ, స్నేహితులు కానీ వచ్చినప్పుడు ‘‘అడుపదడుపల వచ్చిపో’’ అంటుంటారు. ‘అడపాదడపా’ అన్న మాట మనం తరచూ వినేదే కదా. దానికి ఇదో రూపాంతరం. 
అదలుబదలు
ఏదైనా వస్తువుని ఒకరికొకరు ఇచ్చుకోవడాన్ని ‘అదలుబదలు’ అంటారు. దీన్నే ఇచ్చుకం పుచ్చుకమనీ చెబుతారు. అంటే ఇచ్చిపుచ్చుకోవడం అన్నమాట. విడివిడిగా చూస్తే, ‘అదలు’కు ఉన్న అర్థాల్లో కదులు ఒకటి. ‘బదలు’ అంటే అప్పు.
అంటుసొంటు
పక్కపక్కగా ఉండటానికి ఇష్టపడని వ్యక్తిని గురించి నిష్టురంగా చెప్పే క్రమంలో ‘‘వానికి ఎవల అంటుసొంటు పట్టదు’’ అని వాడతారు. సొంటు అంటే తప్పు, దోషం అనే అర్థాలున్నాయి కానీ, అవి ఇక్కడ సరిపోవు. ఇక్కడ ఈ పదానికి సరైన అర్థం.. ‘సంబంధం’. 
అరుకతి బరుకతి
లాభనష్టాలు బేరీజు వేయడంలో అరుకతి లేదు బరుకతిలేదు అని వాడుతారు. కల్లాలకాడ మానుకతో వడ్లు కొలిచేటప్పుడు మొదటి మానుకని ఒకటి అని కాకుండా బరుకతి అంటారు.
ఆపతిసంపతి
ఆపతి అంటే ఆపద. సంపతి అంటే సంపద. కష్టసుఖాల గురించి చెప్పే సమయంలో ఈ పదాన్ని వాడతారు. ‘‘వాడు ఆపతికి సంపతికి దేనికి పనికిరాడు’’ అంటారు. 
ఇయ్యరమయ్యర
ఎవరినైనా ఇష్టమొచ్చినట్టు కొట్టినప్పుడు ‘‘ఇయ్యర మయ్యర జోపిండ్రు’’ అని వాడుతుంటారు. ఇదో అనుకరణ వాచకం. 
ఇర్రిర్రు
చలికాలం వచ్చే రోజుల్లో శరీరం వాతావరణానికి అలవాటు పడకుండా, బద్దకంగా, దురదలేస్తున్నట్టుగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ‘‘పెయ్యంతా ఇర్రిర్రుమంటుంది’’ అంటుంటారు. ‘ఇర్రించు’ అంటే బిగించడం లేదా బిగించి కట్టడం. 
ఉప్పోస ఊరట
ఇరుగు పొరుగుతో సఖ్యతగా లేకపోతే... ‘ఉప్పోస లేదు ఊరటలేదు’ అంటుంటారు. ఇది కూడా నిష్టూరంగా వాడే పదమే.
ఇస్కుడిస్కుడు
‘‘బట్టలన్ని ఇస్కుడిస్కుడు చెయ్యకు’’ అంటారు. అంటే నలగ్గొట్టొద్దు.. ముడతలు పడనీయొద్దు అని అర్థం. 
ఉత్తిగపచ్చిగ
ఉచితంగా ఇవ్వరని అర్థం. ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఫ్రీగా ఇవ్వరా అని అడిగితే.. ‘‘ఉత్తిగలేదు పచ్చిగలేదు’’ అంటూ బదులొస్తుంది అవతలి పక్షం నుంచి! 
ఉమ్మయ్య జక్కయ్య
ఓ అస్తిత్వం అంటూ లేనివాడని అర్థం. ఎవరైనా వ్యక్తిని తనకు పరిచయం లేనివాడు అనికానీ, ఠికాణా/ చిరునామా లేనివాడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ‘‘ఎవడో ఉమ్మయ్య జక్కయ్యగాడు’’ అని చెబుతారు.
ఏసుతాసు
వ్యత్యాసం, తారతమ్యం గురించి చెప్పేటప్పుడు దీన్ని వాడతారు. వస్తువుల్ని కొలిచినప్పుడు ఎక్కువ తక్కువుంటే ఇలా అంటారు. ఎవరి వ్యక్తిత్వం గురించైనా మాట్లాడాల్సిన సందర్భంలో కూడా ‘‘వాడు ఏసుతాసు లేని మనిషి’’ అంటారు.
ఐశద్‌ బేశద్‌
నువ్వెంత? వాడెంత? అన్న మాటలకు ప్రత్యామ్నాయమిది. ఎవరైనా గొడవపడినపుడు ఒకరికొకరు నువ్వెంతంటే నువ్వెంత అనుకునే సమయంలో ఇది వినబడుతుంది. నువ్వెంత అని అనుకునేటప్పుడు వాని ఐశద్‌ ఏంది బేశద్‌ ఏంది అంటారు. ఉర్దూలోంచి వచ్చి కలిసిన మాటలివి. ఆ భాషలో హైసియత్‌ అంటే అర్హత. అదే ఇక్కడ ‘ఐశద్‌’ అయింది. ఇక బేశద్‌ అంటే ఎక్కువ. 
చిట్కురం పట్కురం
ఎప్పుడూ ఏదో గొడవపడే వాళ్లను ఉద్దేశించి దీన్ని వాడతారు.
చెంగడ బింగడ
ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం. దూకుడుతనాన్ని చెంగడ బింగడ అంటారు.
తల్లడం మల్లడం
ఏదైనా సమస్యతో మనసు, శరీరం తల్లడిల్లిపోతుంటే ‘తల్లడం మల్లడం’ అని చెబుతారు. తల్లడపడు అంటే ‘బాధపడు’. మల్లడి అంటే దుఃఖం, పరితాపం. అంటే దాదాపు ఒకే అర్థం ఉన్న పదాలన్న మాట. అలాగే, ఏదైనా సమస్య మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు ‘తాయిమాయి చేస్తుంది’ అని అంటారు.
ధూంధాం
చాలా అట్టహాసంగా, వైభవోపేతంగా వేదికల మీద పాటలు, నృత్యాలతో దుమ్మురేపుతున్నపుడు ‘ధూంధాం చేస్తున్నరు’ అంటుంటారు. హంగామా అని అర్థం. 
పానాపానం
పంచ ప్రాణాలుగా చూసుకోవడమనే అర్థంలో వాడతారు. ‘‘వాళ్లంటే దానికి పానాపానం’’ అంటుంటారు. ప్రాణానికి ప్రాణంగా అన్న భావవ్యక్తీకరణే ‘పానాపానం’గా మారింది. 
      ఇలా తెలంగాణ తెలుగులో జోడి పదాలు వేనవేలుగా దొరుకుతాయి. మన భాషాసౌందర్యానికి అద్దంపట్టే వీటన్నింటినీ సేకరించి, ఒక్కచోటకు చేర్చితే అద్భుతమైన పదకోశమే అవుతుంది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం