‘నెట్టు’కు రావాలంటే! 

  • 1846 Views
  • 11Likes
  • Like
  • Article Share

విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల ఉద్యోగాలకు, కళాశాలల్లో అధ్యాపక ఉద్యోగాలకు ‘నెట్‌’ అర్హత కీలకం. అలాగే, ‘నెట్‌’లో అర్హత సాధించిన విద్యార్థులకు ఎంఫిల్‌, పీహెచ్‌డీ ఇంటర్వ్యూల్లో ప్రాధాన్యమూ ఇస్తున్నారు. కాబట్టి డిసెంబరులో జరగనున్న ‘నెట్‌’లో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రశ్నపత్రానికి సంబంధించి అభ్యర్థులు దృష్టిపెట్టాల్సిన అంశాలేంటో చూద్దాం!
      ‘నెట్‌’లో మొదటి ప్రశ్నపత్రం అందరికీ సమానంగా వంద మార్కులకు (యాభై ప్రశ్నలు) ఉంటుంది. తెలుగుకు సంబంధించిన రెండో ప్రశ్నపత్రంలో 200 మార్కులకు వంద ప్రశ్నలు అడుగుతారు. సామాన్య భాషా విజ్ఞానం, ఆధునిక తెలుగు నిర్మాణరీతి, ప్రబంధ, ఆధునిక తెలుగు సాహిత్యం, జానపద సమాజం, విజ్ఞానం, గీతాలు- వీరగాథలు, భారతీయ అలంకార శాస్త్రం, సంస్కృత సాహిత్య పరిచయం, ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి, సారస్వత ప్రక్రియలు, మాండలిక భాషలు, మహాభారత భాగవతాలు తదితరాల మీద ప్రశ్నలు వస్తాయి. వీటిలో ముఖ్యంగా భాషాశాస్త్రాన్ని విజయాస్త్రంగా భావించి, విస్తృత అధ్యయనం చేయాలి. భాషాశాస్త్రంలోని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం.

* సంస్కృతం, లాటిన్‌, గ్రీకు ఒకే మూలభాష నుంచి పుట్టాయని 1786లో సర్‌ విలియం జోన్స్‌ ప్రతిపాదించారు. ఇది తులనాత్మక భాషాశాస్త్రానికి పునాది అయింది.

* ఫెర్డినాండ్‌ డెసస్యూర్‌తో వర్ణనాత్మక భాషాశాస్త్ర పరిశోధన ఆరంభమైంది. భాషాశాస్త్రం తులనాత్మకం, చారిత్రకం, వర్ణనాత్మకం అనే మూడు శాఖలుగా వృద్ధిపొందడం ప్రారంభించింది.

* నాద తంత్రులు వాయు మార్గాన్ని కొంతసేపు పూర్తిగా నిరోధించి తర్వాత వదిలితే పుట్టే ధ్వని ‘కంఠమూలీయ స్పర్శం’.

* ప్రయత్న భేదాల వల్ల హల్లుల్లో భేదాలు స్థూలంగా ‘ఏడు’ రకాలు.

* ‘ఇ ఈ ఎ ఏ’లు అగ్రాచ్చులు. వాటి ఉచ్చరణలో నాలుక అగ్రభాగం పైకి లేచి ఉంటుంది. ‘ఉ ఊ ఒ ఓ’లు పశ్చిమాచ్చులు. వీటి ఉచ్చరణలో నాలుక వెనక్కు వెళ్లి కుంచించుకుపోతుంది. దాంతో మృదు తాలువుకీ నాలుకకీ మధ్య సన్నని మార్గం ఉంటుంది. ‘అ ఆ’లు కేంద్రాచ్చులు. వీటి ఉచ్చారణలో నాలుక ముందుకు సాగకుండా, వెనక్కు వెళ్లకుండా తటస్థంగా ఉంటుంది.

* ప్రఖ్యాత ధ్వనిశాస్త్రవేత్త డేనియల్‌ జోన్స్‌ నాలుక ఎత్తునిబట్టి అగ్రభాగంలో నాలుగు, పశ్చాద్భాగంలో నాలుగు మొత్తం ఎనిమిది అచ్చులను ప్రాథమిక అచ్చులుగా పరిగణించారు. మిగిలిన అచ్చులను వీటిలో ఒకదానికంటె కొంచెం కింద ఉన్నది లేక పైన ఉన్నది అని చెప్పవచ్చు అని ప్రతిపాదించారు.

* ‘ఇ ఈ ఉ ఊ’లు ఉన్నతాచ్చులు, సంవృతాచ్చులంటారు. ‘ఎ ఏ ఒ ఓ’లను మధ్యమాచ్చులని, అర్ధసంవృతాచ్చులనీ పిలుస్తారు. ‘అ ఆ’లను నిమ్నాచ్చులని, వివృతాచ్చులనీ అంటారు.

* భాషలోని కనిష్ఠమైన అంశం ధ్వని. అర్ధభేదక శక్తి కల్గిన కనిష్ఠ భాషాంశం వర్ణం. ‘ఫొనీమ్‌’ని వర్ణం అంటారు. ఒకే వర్ణానికి చెందిన సన్నిహిత ధ్వనులని సవర్ణాలని (Allophones) పిలుస్తారు.

* ఒకే స్థానంలో సన్నిహితులైన భిన్న ధ్వనులు ఉండటంతో అర్థభేదం సమకూరిన జంటమాటలని ‘కనిష్ఠ భేదక యుగ్మం’ (మినిమల్‌ పెయిర్‌) అంటారు. ఉదాహరణకు.. కోడలు- గోడలు.

* వర్ణనిర్ణయ విధానాన్ని సమగ్రం చేసి అనుసరించినవారు బ్లూమ్‌ఫీల్డ్‌. అతని అనుయాయులు హారిస్‌, హాకెట్‌, పైక్‌ తదితరులు.

* ప్రాగ్‌ నగరంలో ట్రు బెట్జికయ్‌, యాకబ్‌సన్‌ తదితరులు 1920-30ల మధ్య భాషల వర్ణ నిర్మాణం మీద ముఖ్యమైన పరిశోధన చేశారు.

* బహు వ్యాపక వర్ణ నిర్మాణ శాఖను బ్రిటిష్‌ భాషాశాస్త్రజ్ఞుడు ఫిర్త్‌ స్థాపించారు. ఉత్పాదక వ్యాకరణ స్థాపకులు ఛామ్‌స్కీ

* అర్థవంతమైన అంతరాలు లేని అర్థవంతమైన అంశం అర్థకం.

* Morphemeకి సమాన రూపం పదాంశం. దీనికి ‘అర్థకం’ అన్న పేరు సూచించింది పి.ఎస్‌.సుబ్రహ్మణ్యం.

* Allomorph అంటే సపదాంశం. ఒకే అర్థకానికి చెందిన రూపాంతరాలు ‘సార్థకాలు’. ‘సార్థకం’ అన్న పేరును సూచించింది పి.ఎస్‌.సుబ్రహ్మణ్యం. ఒకే అర్థకానికి చెందిన సార్థకాలు ఒకే వర్ణానికి చెందిన సవర్ణాల్లా స్వేచ్ఛా ప్రవృత్తిలో కానీ, పరస్పర పరిపూరక ప్రవృత్తిలో కానీ ఉంటాయి.

* ‘రైతులు పంటలు పండిస్తారు’ అనే మూడు పదాలున్న వాక్యంలో అర్థకాల సంఖ్య తొమ్మిది.

* ‘నైడా’ ఒక భాషలో పదాలని విశ్లేషించి అర్థకాలని గుర్తించడానికి సహాయకారులుగా ఇచ్చిన సూత్రాల సంఖ్య ‘ఆరు’.

* పద నిర్మాణాన్ని వర్ణించడానికి వ్యాప్తిలో ఉండే పద్ధతులు మూడు. సన్నివేశ పద్ధతి, (సంబద్ధ) శబ్దావళి పద్ధతి, ప్రక్రియా పద్ధతి. 

* అర్థకాలని రెండు ముఖ్య తెగలుగా విభజించవచ్చు.. ధాతువులు, ప్రత్యయాలు.

* రెండచ్చులు పక్కపక్కగా వచ్చినపుడు వాటి మధ్య వచ్చి చేరే హల్లుని ‘స్వరశ్రుతి’ అంటారు. సాధారణంగా స్వరశ్రుతులుగా ఉండేవి ‘య, వ’లు

* ఒక సూత్రం ప్రవర్తించడానికి అవకాశం ఉన్న రెండు అంశాల సముదాయాన్ని ‘దత్తం’ అంటారు. ఉదాహరణకు.. కాకి - లు. ఆ సూత్రం ప్రవర్తించాక ఏర్పడే రూపాన్ని ఆ సూత్రానికి చెందిన నిష్పన్నరూపమని పిలుస్తారు. ఉదాహరణకు.. కాకు- లు. సూత్రం ప్రవర్తించడానికి అనువైన సందర్భాన్ని ‘పరిసరం’ అంటారు. ఉదాహరణకు.. లు.

* పందొమ్మిదో శతాబ్ది భాషాశాస్త్రజ్ఞులు ప్రపంచ భాషలన్నిటినీ వాటిలో ఉన్న పద నిర్మాణం దృష్ట్యా నాలుగు రకాలుగా విభజించారు... విశ్లేషణాత్మక (చైనీస్‌, వియత్నమీస్‌..), సంయోజనాత్మక (తెలుగు తమిళం..), సంశ్లేషణాత్మక (సంస్కృతం, లాటిన్‌, గ్రీకు..), అతి సంశ్లేషణాత్మక (అమెరికన్‌ ఇండియన్‌) భాషలు.

* ‘పరివర్తన వ్యాకరణం’ అనే వ్యాకరణ ప్రక్రియ నోమ్‌ ఛామ్‌స్కీ రచించిన ‘సింటాక్టిక్‌ స్ట్రక్చర్స్‌’తో ప్రారంభమైంది.

* విభక్తి వ్యాకరణం ప్రతిపాదించింది ఛార్లెస్‌ ఫిల్‌మోర్‌.

* ద్రావిడ భాషల నుంచి సంస్కృతంలోకి వెళ్లిన పదాలు.. మయూర, ఉలూఖల, బిల్వ, హేరంబ, సీర తదితరాలు.

* ‘ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు’, ‘ద్రావిడ భాషలు’ గ్రంథాల రచయిత పి.ఎస్‌.సుబ్రహ్మణ్యం.

* ‘తెలుగు భాషా చరిత్ర’ సంపాదకులు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి

* తత్త్వశాస్త్రంలో ‘అనుభవవాదం’ నేపథ్యంగా కలిగిన భాషోత్పత్తివాదం సంపాదన వాదం. దీన్ని ఖండించి స్వతస్సిద్ధవాదాన్ని ప్రతిపాదించి భాషాశాస్త్రంలో విప్లవాన్ని తెచ్చిన భాషావేత్త నోమ్‌ ఛామ్‌స్కీ.

* తొలిసారిగా ఇండోయూరోపియన్‌ భాషా కుటుంబాన్ని ఏర్పరచిన భాషావేత్త ‘అడెలంగ్‌’. 1833లో ఇండోయూరోపియన్‌ భాషలకు సమగ్ర తులనాత్మక వ్యాకరణాన్ని ప్రచురించటం ఆరంభించిన వారు... బాప్‌. ఈ భాషల ఆధునిక నిరుక్తాచార్యుడు.. పాట్‌.

* ‘భాష-భాషాధ్యయనం’ (లాంగ్వేజ్‌ అండ్‌ ది స్టడీ ఆఫ్‌ లాంగ్వేజ్‌) కర్త విలియం వివిట్నీ. ‘భాషా చారిత్రక నియమావళి’ (ది ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ లింగ్విస్టిక్‌ హిస్టరీ) రచయిత - హెర్మన్‌పాల్‌.

* ప్రాథమికోత్పాదకం, అనంతోత్పాదకాలకు తెలుగు వ్యాకరణంలోని పేర్లు ‘కృదంతీకరణం’, ‘తద్ధితాంతాలు’.

* పరవర్ణం పూర్వవర్ణంతో సమీకరిస్తే అది పరవర్ణ సమీకరణం (అగ్ని- అగ్గి). పరవర్ణంతో పూర్వవర్ణం సమీకరిస్తే అది పూర్వవర్ణ సమీకరణం (భక్తి- బత్తి). పూర్వవర్ణం పరవర్ణాన్ని, పరవర్ణం పూర్వవర్ణాన్ని ప్రభావితం చేస్తే అది పరస్పర వర్ణ సమీకరణం (వేడి+నీళ్లు-వేడి+ణీళ్లు-వేణ్ణీళ్లు).

* సమీకరణం పూర్తిగా పక్కపక్క వర్ణాలకు జరిగితే అది పార్శ్వవర్ణ పరస్పర పూర్ణ సమీకరణం (తత్‌+చరితం - తచ్చరితం).

* ‘వచించు+ఇంచు - వచించించు - వచింపింపు’ అన్నది ఏ శబ్ద విపరిణామానికి ఉదాహరణ?‘వర్ణవిభేదం’.

* వాడు ‘ఆడు’గా మారడంలోని శబ్ద విపరిణామం.. ‘ఆద్యక్షర లోపం’. నిప్పు+పుల్ల ‘నిప్పుల్ల’గా మారడం.. ‘వర్ణనాశం’. ‘దనుక- దాక’లోని శబ్ద విపరిణామం ‘లోప దీర్ఘం’. శబ్దము ‘సబుదము’గా మారడం.. ‘స్వరభక్తి’. 

* స్వరభక్తికి మరో పేరు.. ‘విప్రకర్ష’

* భాషా పరిణామ వికాసాల్ని తెలియజేసేది చారిత్రక భాషా శాస్త్రం. దీనికే మరోపేరు ‘అనేక కాలిక భాషా శాస్త్రం’. ఒకే కాలానికి లేక ఒక దశకు చెందిన భాషాభివర్ణనం కావించేది ‘ఏక కాలిక భాషా శాస్త్రం’.

* పదాంశాన్ని (నిబద్ధానిబద్ధ) ‘శబ్దం’ అనవచ్చు. నిబద్ధ పదాంశాన్ని ‘వర్ణకం’ అని చెప్పింది - ఆంధ్రశబ్ద చింతామణి

* ఒక పదంలోని అర్థవంతమైన కనిష్ఠ శబ్దాన్ని ‘పదాంశం’ అంటారు. ‘పేదరాలు’లోని రేఫ అర్ధశూన్య పదాంశానికి ఉదాహరణ. ఆమ్రేడిత పదాంశానికి ఉదాహరణ.. తుత్తునియలు.
 


వెనక్కి ...

మీ అభిప్రాయం