చిన్నారుల నేస్తం!

  • 283 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పాటి మోహన్‌రెడ్డి

  • చిట్యాల, నల్లగొండ జిల్లా
  • 8008574385
పాటి మోహన్‌రెడ్డి

      జగదీశ్వర్‌ స్వస్థలం రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం. 1976 జూన్‌లో పెండెం నరసింహ, సత్తమ్మ దంపతులకు జన్మించారు. రామన్నపేటలోనే ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మే (తెలుగు) పట్టా అందుకున్నారు. 2008 డీఎస్సీలో ఎంపికై, ఉపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టారు. జగదీశ్వర్‌ తన ఎనిమిదో ఏట నుంచే కథారచన మొదలుపెట్టారు. మిత్రులతో కలిసి స్థానికంగా పలు సాహితీ సంస్థలను ఏర్పాటుచేసి, వాటి నిర్వహణలో కీలకపాత్ర వహించారు.
అరుదైన బాలసాహితీవేత్త 
తెలంగాణ మాండలికంలో బాలసాహిత్యాన్ని సృజించిన తొలి రచయిత పెండెం జగదీశ్వర్‌. ‘బడిపిలగాల్ల కతలు’ పేరిట మూడేళ్ల కిందట ఆయన తొలి తెలంగాణ మాండలిక బాలల కథాసంకలనాన్ని తీసుకొచ్చారు. 2016లో ‘గమ్మతిగమ్మతి కతలు’, 2018లో ‘దోస్తులు చెప్పిన కతల’నూ ఇదే తరహాలో వెలువరించారు. ఎలాంటి కథలు రాసినా దానికో పరమార్థం ఉండాలని గాఢంగా విశ్వసించేవారు జగదీశ్వర్‌. పిల్లలకు సామాజిక, వైజ్ఞానిక దృష్టి కలిగించే లక్ష్యంతో ఆయన పలు కథలను రచించారు. ఆయన రచనల్లో ‘ఆనంద వృక్షం’ పర్యావరణ స్పృహను పెంచు తుంది. ‘గజ్జెల దయ్యం’ కథాసంకలనం శాస్త్రీయ దృక్పథం, హేతువాద కోణంలో పిల్లల్లో మూఢనమ్మకాల పట్ల చైతన్యం కలిగిస్తుంది. ‘పసిడిమొగ్గలు, ఉపాయం’ తదితర కథాసంకలనాలు చిన్నారుల్లో నైతిక విలువలు పెంచుతాయి. జగదీశ్వర్‌ వ్యంగ్యచిత్రకారుడు కూడా. తన కార్టూన్లతో ‘116 నవ్వులు’ పుస్తకాన్ని ప్రచురించారు.
      జానపద సాహితీ పరిశోధనలోనూ జగదీశ్వర్‌ కృషిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో పర్యటించి పిల్లల జానపద కథలను సేకరించారాయన. వాటితో ‘ఆంధ్రప్రదేశ్‌ జానపద కథలు’ అనే బృహత్‌ సంకలనాన్ని వెలువరించారు. జగదీశ్వర్‌ కథలు విద్యార్థులకు పాఠ్యాంశాలుగానూ ఎంపికయ్యాయి. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తిపురస్కారం స్వీకరించిన పెండెం, అనేక సత్కారాలనూ అందుకున్నారు. రచయితగా తనకంటూ ఓ పంథాను స్థిరపరచుకున్న జగదీశ్వర్‌ నలభైరెండేళ్ల వయసులోనే తనువు చాలించడం ఎవరూ ఊహించని విషాదం! అయితే ఆయన సృజించిన బాలసాహిత్యం మాత్రం ఎప్పటికీ చిన్నారులను వేలుపట్టి నడిపిస్తూనే ఉంటుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం