అనగనగా ఓ కథల పండగ!

  • 640 Views
  • 0Likes
  • Like
  • Article Share

కథ... నైతిక విలువలకు, మానవ అనుభవాలకు, జీవిత సత్యాలకు, మనోవికాసానికి పతాక. ముఖ్యంగా కథలు చిన్నపిల్లల్లో ధైర్యాన్ని, తెలివితేటల్ని, ఆలోచనా శక్తిని, విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి. వాళ్లని విలువలతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దుతాయి. కథలు శ్రవణ శక్తిని పెంచుతాయి. చెప్పింది ప్రశాంతంగా విని తర్వాత దాన్ని మరొకరికి చెప్పేటప్పుడు పిల్లల్లోని ధారణ శక్తి బయటికి వస్తుంది. తద్వారా వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేనా.. భావ ప్రకటనకు కథలు పునాది. వీటి వల్ల వక్తృత్వ పటిమ కూడా అబ్బుతుంది. ఒకప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు, నాన్నమ్మలు పిల్లలకి ఎన్నో కథలు చెప్పేవాళ్లు. వాటిలోని మంచి విషయాలు జీవితాంతం పిల్లల మస్తిష్కాల్లో నిలిచిపోయి ముందుకు నడిపించేవి. కానీ, ప్రస్తుతం చిన్న కుటుంబాలు, అమ్మానాన్నలిద్దరూ ఉద్యోగాల్లో తలమునకలవడం వల్ల పిల్లలకి కథలు చెప్పేవాళ్లు కరవయ్యారు. దీని ప్రభావం పిల్లల పరిపూర్ణ వికాసం మీద ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కథల గొప్పతనాన్ని అందరికీ తెలియజెప్పే ఉద్దేశంతో ‘కథాకుటీరం, బాల సాహిత్య పరిషత్‌, త్యాగరాయ గానసభ’లు సంయుక్తంగా భారతదేశంలో తొలిసారి ఏడు రోజుల పాటు కథలు చెప్పే పండగ ‘కథా’కేళి (విలువల వికాస హేళి)కి¨ శ్రీకారం చుట్టాయి. ‘‘కంప్యూటర్లు, సెల్‌ఫోన్లతో ఈతరం చిన్నారుల కళ్లకు శ్రమ పెరిగింది. మెదళ్లకు పనితగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని విజ్ఞానవేత్తలుగా, మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం’’ అన్నారు ‘కథా’కేళి రూపకర్త ‘కథాకుటీరం’ వ్యవస్థాపకులు, బాలసాహిత్య పరిషత్‌ అధ్యక్షులు, కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత చొక్కాపు వెంకటరమణ. 


 సినీ, టీవీ, విద్యారంగ ప్రముఖుల అనుభవాల కథలు, భిన్న రంగాల కళాకారుల సరదా కథలు, వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణుల స్ఫూర్తి కథలు, ఉపాధ్యాయులు, రేపటి పౌరులు, బాల సాహితీవేత్తలు చెప్పిన విలువల కథలు, ఇంకా ధ్వన్యనుకరణ, ఇంద్రజాలం, మూకాభినయం, మాట్లాడే బొమ్మ లాంటి వాటి ద్వారా చెప్పిన ఆహ్లాద కథలు... ఇలా జులై 20 నుంచి 26 వరకు హైదరాబాదులోని త్యాగరాయ గానసభలో కథలు ఆనంద తాండవం చేశాయి. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కథ చెప్పాలన్న నిబంధన మేరకు అందరూ చక్కటి కథలు వినిపించారు. కథ గొప్పతనాన్ని అందరికీ తెలియజెప్పారు. బాలసాహిత్యం గురించి పలువురు ఆలోచనాత్మక సూచనలూ చేశారు. అనిల ఆర్ట్స్‌ అకాడమీ, రవళి ఆర్ట్స్‌ అకాడమీ, షార్ప్‌ కిడ్స్‌ పాఠశాల, భవన్స్‌ శ్రీరామకృష్ణ విద్యాలయ, వివేకానంద కాన్వెంట్‌ హైస్కూల్‌ విద్యార్థులు జానపద, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. విభిన్న వేషధారణలతోనూ ఆకట్టుకున్నారు. పలువురు చిన్నారులు ముద్దుముద్దు మాటలతో ఆసక్తికర కథలూ చెప్పారు. ‘చిట్టిబొమ్మలాట, నీడబొమ్మలాట, బుర్రకథ, ఒగ్గుకథ’ లాంటి వాటిని నిర్వాహకులు పిల్లలకి పరిచయం చేశారు. 

మనోవికాసానికి ద్వారాలు
‘‘కథలు చెప్పడం మన సంస్కృతిలో భాగం. కథలు పిల్లల్లో వ్యక్తిత్వాన్ని, సంస్కారాన్ని పెంపొందిస్తాయి’’ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా।। కె.వి.రమణాచారి. తొలిరోజు ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారాయన. ‘‘కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ముందు భారతీయ కథల్ని, సాహిత్యాన్ని బతికించుకోవాలి. భవిష్యత్‌ సాహిత్యానికి ప్రధాన ముఖ ద్వారం కథలు. ఇవి పిల్లల్లో సృజనాత్మక శక్తిని తట్టిలేపుతాయి. ఊహాశక్తిని పెంచుతాయి. వీటిని విని ప్రేరణ పొందినవారు భవిష్యత్తులో ప్రయోజకులుగా ఎదుగుతారు. తరగతిగదిలో ఉపాధ్యాయుడు కథ చెప్పకపోతే ఆ పిల్లల్లో సృజనాత్మకత ఉండదు. అమ్మ పాట తర్వాత కథే ప్రధానం. ఆ కథ వినబట్టే శివాజీ వీర శివాజీ అయ్యాడు’’ అన్నారు హైదరాబాదు పుస్తకమేళా అధ్యక్షులు, తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యులు జూలూరి గౌరీశంకర్‌. ఈ కార్యక్రమ విశేషాలను పుస్తక రూపంలో తేవాలని, ఇలాంటి వాటిని ఇంకా విరివిగా నిర్వహించాలని చిల్డ్రన్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు ఎం.వేదకుమార్‌ సూచించారు. ‘‘పాఠశాలల ఉపాధ్యాయుల రచనలను ప్రోత్సహిస్తూ, వారి పుస్తకాలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. దానివల్ల బాలసాహిత్యం ఇంకా ఎక్కువగా వస్తుంది. ఆరేడేళ్లలో దేశంలోనే బాలసాహిత్యంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలుస్తుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘కథ లేకుంటే సంస్కృతి, వారసత్వం, చరిత్ర, గతవైభవం లేవు. హైదరాబాదు సిటీ సెంట్రల్‌ లైబ్రరీలో పిల్లల కోసం ప్రత్యేక విభాగం ఉంది. కానీ వచ్చేవాళ్లు తక్కువ. ఇది పిల్లల తప్పు కాదు. బడి నుంచి రాగానే ట్యూషన్లకి పంపడం, లేదా బడిలోనే రాత్రి వరకు ఉంచడం... వీటితోనే పిల్లలు అలసిపోతున్నారు. కేవలం ట్యూషన్లు చెప్పిస్తేనే పిల్లలకు మనోవికాసం వస్తుందనుకుంటే మనం భ్రమలో ఉన్నట్లే. కథలు, గొప్పవాళ్ల చరిత్రలు పిల్లల మనసు వికసించేలా చేస్తాయి. వ్యక్తిత్వ నిర్మాణానికి తోడ్పడతాయి. అందుకే పిల్లలకు చదివే, వినే, చెప్పే అలవాటు చేయాలి’’ అన్నారు తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ అధ్యక్షులు అయాచితం శ్రీధర్‌. 23వ తేదీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెలంగాణలోని గ్రంథాలయాల్లో క్రమబద్ధంగా కథలు చెప్పే కార్యశాలలు, పోటీలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని శ్రీధర్‌ని ఈ సందర్భంగా చొక్కాపు వెంకటరమణ కోరారు. ఒక ప్రతిపాదనతో వస్తే దీని గురించి చర్చిద్దామని శ్రీధర్‌ సానుకూలంగా స్పందించారు. 
‘‘ఎన్ని ర్యాంకులు తెచ్చుకున్నా, ఐక్యరాజ్య సమితిలో బహుమతి అందుకున్నా... అమ్మమ్మ బళ్లో, తాతయ్య ఒళ్లో పెరిగిన పిల్లలకుండే అనుభూతి, స్పందన, ఆలోచన, ఊహాశక్తి, వికాసం వేరు’’ అని కుండబద్దలు కొట్టారు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ. చిన్నప్పుడు అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతలు చెప్పిన కథలే తన రచనలకు మూలమని ఆయన అన్నారు. ప్రభుత్వం చొరవతీసుకొని ప్రపంచ తెలుగు మహాసభల మాదిరిగానే ఏడాదికి ఒకసారి ప్రపంచ తెలుగు బాలోత్సవం హైదరాబాదులో నిర్వహించాలని అశోక్‌తేజ కోరారు. ప్రతి ఒక్కరిలో కథా కథన నైపుణ్యం, కౌశలం అంతర్గతంగా ఉంటాయంటూ నిజ జీవితంలోని కథాత్మక సంఘటనలను వివరించారు తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకరరావు. 24వ తేదీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథి. ‘‘కథలు వినేటప్పుడు పిల్లలు మంచి శ్రోతలుగా మారతారు. సహనంతో వింటారు. ఈ సహనం వల్ల ఓపిక పెరుగుతుంది. ప్రస్తుత సమాజంలో మనుషుల్లో సహనం నశించింది. దీనికి కారణం కథలు చెప్పే సంస్కృతి కనుమరుగు కావడం’’ అన్నారు పాఠ్యపుస్తకాల నిపుణులు, తెలుగు అమలు కమిటీ సభ్యులు సువర్ణ వినాయక్‌. ‘‘ఇప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు కథలు చెబుతామన్నా తల్లిదండ్రులు పిల్లలని వెళ్లనివ్వడం లేదు. అది సరికాదు. పిల్లలని పెద్దవాళ్లతో సమయం గడపనివ్వాలి’’ అన్నారు సినీ నటులు జెన్నీ. ఆయన తన జీవితానుభవాన్ని కథ రూపంగా వినిపించారు. ‘‘ఒకసారి మా అమ్మ డబ్బా మూత తీయమంది. ఐదుసార్లు ప్రయత్నించినా తీయలేకపోయాను. మా అన్నయ్య వస్తే డబ్బా ఇచ్చాను. ఒక్కసారికే మూత తెరిచేశాడు. ‘అమ్మా.. డబ్బామూతే తీయలేకపోతున్నాను. నేనెందుకు పనికొస్తాను’ అని ఏడ్చాను. ‘పిచ్చికన్నా.. అయిదుసార్లు నువ్వు ఆ మూతని అటూ ఇటూ కదిపి వదులు చేశావు. ఆరోసారి ప్రయత్నించి ఉంటే నువ్వుకూడా తెరవగలిగే వాడివే. కానీ, ఆ అవకాశం అన్నయ్యకి ఇచ్చేశావు. అందుకే విజయం సాధించేదాకా ప్రయత్నిస్తూనే ఉండాలి’ అంది అమ్మ’’ అని మంచి సందేశం వినిపించారు జెన్నీ. ‘‘ఒకప్పుడు పిల్లలు పెరిగారు. ఇప్పుడు పెంచబడుతున్నారు. ఇప్పుడు పిల్లలు ఏం చేసినా, దానివల్ల లాభం ఏంటి? దానివల్ల ఏమవుతావు? అనే ఒత్తిడి ఉంటోంది’’ అన్న ‘మంచి పుస్తకం’ సురేష్‌ మాటలూ ఆలోచనాత్మకమైనవే!

వాస్తవిక దృక్పథం అవసరం
ప్రస్తుతం బాలసాహిత్య గమనం ఎలా ఉంది? నేటి పిల్లలకు అనుగుణంగా రచనలు వస్తున్నాయా? అనే దాని గురించి కూడా పలువురు ఈ కార్యక్రమంలో ఆసక్తికర, ఆలోచనాత్మక సూచనలు చేశారు. ‘‘23 ఏళ్లుగా రాక్షసులు, దేవుళ్లు, అభూత కల్పనలతో కూడిన కథలే వస్తున్నాయి. ఈ తరం పిల్లలకు కావాల్సిన కథలు రావట్లేదు. వేదికలు ఉన్నాయి కదా అని ఎడమ చేత్తో, కుడి చేత్తో రాస్తున్నారు, పుస్తకాలు వేసుకుంటున్నారు. అవార్డుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అవార్డుల కోసం రాయొద్దు, నిజాయతీగా రాయండి’’ అన్నారు బాలసాహితీవేత్త, పత్రికా సంపాదకులు టి.వేదాంత సూరి. ‘‘ఇప్పటివరకు బాలసాహిత్యంలో కొన్ని వందల పుస్తకాలొచ్చాయిగానీ బాలల మనసెరిగి, వారికి అర్థమయ్యేలా, వాళ్లు ఆ కథల్లోని విలువలని గ్రహించి తమ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుకునే కథలు ఇంకా రావాల్సి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సమాచారం విస్ఫోటన స్థాయికి చేరుతున్న ప్రస్తుత ప్రపంచీకరణ పరిస్థితుల్లో పిల్లలు పెద్దలకంటే అనేక మైళ్లు ముందున్నారు. వాళ్ల అవగాహన స్థాయి పెంచాలన్నా, వాళ్లకి అర్థమయ్యేలా కథ చెప్పాలన్నా వాస్తవిక దృక్పథం అవసరం’’ అన్నారు తెలంగాణ సారస్వత పరిషత్‌ ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య. ‘‘మనం ఎన్ని కథలు రాసినా, ఎన్ని వందల కథలు చెప్పినా పిల్లల బుర్రల్లోకి వెళ్లడం లేదు. తల్లిదండ్రులు తమ అమ్మానాన్నల్ని ఇంట్లో పెట్టుకొని వాళ్లతో కథలు చెప్పించాలి. అప్పుడే మంచి ఫలితాలుంటాయి’’ అని సూచించారు రచయిత్రి, కవయిత్రి శారదా అశోకవర్ధన్‌. ‘‘కథ వల్ల పిల్లల్లో అనేక ఆలోచనలు రేకెత్తుతాయి. వాళ్లలో సృజనాత్మకత పెరుగుతుంది. సొంతగా ఆలోచించే శక్తి వస్తుంది. ముఖ్యంగా శాస్త్రీయ ఆలోచనలని పెంపొందించే కథలే పిల్లల్ని ముందుకు తీసుకెళ్తాయి’’ అన్నారు నవ తెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ జనరల్‌ మేనేజర్‌ కోయ చంద్రమోహన్‌. 
 ‘కథా’కేళి కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లోని బాలసాహితీ వేత్తలు, కళాకారులు, ఇతర రంగాల ప్రముఖులని ఒక వేదిక మీదకి తెచ్చింది. సమాజానికి కథ గొప్పదనాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేసింది. బాలసాహితీవేత్తలు రెడ్డిరాఘవయ్య, ఐతా చంద్రయ్య, పుట్టగుంట సురేష్‌కుమార్‌, కన్నెగంటి అనసూయ, అమ్మిన శ్రీనివాసరాజు, షేక్‌ అబ్దుల్‌ హకీం జానీ, ఎం.హరికిషన్‌ తదితరులతో పాటు మైమ్‌ కళాకారులు మధు, కళాధర్‌, ‘ఆనందలహరి’ వ్యవస్థాపకులు మల్లం రమేష్‌, ‘కథల తాతయ్య’ ఎన్నవెళ్లి రాజమౌళి, ‘పిల్లలలోకం’ వ్యవస్థాపకులు వి.ఆర్‌.శర్మ, బాలసాహిత్య పరిషత్తు కోశాధికారి పైడిమర్రి రామకృష్ణ, ‘కథాపాఠశాల’ వ్యవస్థాపకులు వి.రవిశంకర్‌ తదితరులు చక్కటి కథలు చెప్పారు. మొత్తమ్మీద బాలసాహిత్యానికి సంబంధించి భవిష్యత్తులో విస్తృత కార్యక్రమాలు నిర్వహించడానికి బలమైన ముందడుగుగా ‘కథా’కేళి నిలిచింది. 


వంద నిమిషాల్లో వంద కథలు
‘కథా’కేళి చివరిరోజు చొక్కాపు వెంకటరమణ చెప్పిన 100 నిమిషాల్లో 100 చందమామ కథలు ఈ వారం రోజుల కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కథన రూపంలోనే కాకుండా ధ్వన్యనుకరణ, ఇంద్రజాలం ద్వారా కూడా నిర్దేశిత సమయంలో వంద కథలు చెప్పి.. గిన్నిస్‌, లిమ్కా బుక్‌ రికార్డుల్లో స్థానం కోసం ప్రయత్నించారు చొక్కాపు. మొదటి కథ నుంచి చివరి కథ వరకు ఒకే ఉత్సాహంతో, ఆ కథల్లోని పాత్రల్లో లీనమవుతూ, వాటి స్వభావాల్ని అనుకరిస్తూ, అందరినీ అలరిస్తూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారాయన. చివర్లో ‘‘వంద కథలు అయిపోయాయి’’ అని ఆయన చెప్పేంత వరకూ ప్రేక్షకులకు సమయం గుర్తురాలేదు! ఆ తర్వాత వాళ్లంతా నిల్చొని కరతాళ ధ్వనులతో చొక్కాపును అభినందించారు. ‘‘ఒక చెప్పుల షాపులో కుర్రాడు ఒక వ్యక్తికి చెప్పులు చూపిస్తున్నాడు. అంతలో యజమాని వచ్చి ఆ చెప్పులు తీసుకొని చూపిస్తూ, కాళ్లకి తొడుగుతున్నాడు. ఆయనకి ఊళ్లో పది చెప్పుల షాపులున్నాయి. అలాంటి వ్యక్తి తన కాళ్లు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పాడా వ్యక్తి. ‘అయ్యా ఇది నా బాధ్యత. బయట కోటి రూపాయలిచ్చినా మీ కాళ్లు పట్టుకోను. ఇక్కడ మీరు కోటి ఇస్తానన్నా మీ కాళ్లు వదలను’ అన్నాడా వ్యక్తి’’; ‘‘ఒక మాస్టారు పిల్లలకి పూల విత్తనాలిచ్చి, వాటిని కుండీల్లో పెంచి నెల రోజుల తర్వాత పూలు పూసినప్పుడు తెచ్చి చూపించమన్నారు. నెల తర్వాత పిల్లలందరూ పూల మొక్కలతో వచ్చారు. ఒక పిల్లాడు మాత్రం ఉత్త కుండీతో వచ్చాడు. ‘మాస్టారూ.. మీరిచ్చిన విత్తనాలు నాటాను. రోజూ నీళ్లు పోశాను. కానీ మొక్క రాలేదు. నన్ను క్షమించండి అన్నాడు’. మాస్టారు ‘శభాష్‌’ అని ఆ పిల్లాడి భుజం తట్టి, ‘నేను మీకందరికీ ఉడకబెట్టిన విత్తనాలిచ్చాను. అవి మొలవవు కదా. మిగిలిన పిల్లలందరూ వేరే విత్తనాలు నాటారు. నువ్వు నిజాయతీగా ఉన్నావు’ అన్నారు’’... ఇలా పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే, తెలివితేటల్ని పెంచే కథలని చెప్పారు చొక్కాపు వెంకటరమణ. ఈ సభకు హాస్యావధాని శంకర నారాయణ అధ్యక్షత వహించారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బి.వి.పట్టాభిరామ్‌ గౌరవ అతిథిగా హాజరయ్యారు.


కథ చెప్పడం మన సంస్కృతి. కథే లేకపోతే మన నాగరికత పెరిగేదే కాదు. నిజాయతీ, ధైర్యం, శాంతం లాంటి గుణాలు పిల్లలకు అలవడాలంటే కథల ద్వారా మాత్రమే సాధ్యం. చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు మనకి గుర్తుండవు. కానీ మాస్టారు చెప్పిన కథ బాగా గుర్తుంటుంది. అందుకే పాఠాలను కూడా కథల్లా చెప్పేలా విద్యావిధానం మారాలన్నది మా ఆకాంక్ష. 

- దాసరి వెంకటరమణ


తెలుగులో బాలసాహిత్యం అయిదో తరగతి దాటిన పిల్లవాడు మాత్రమే చదివే విధంగా ఉంది. ఆలోపు పిల్లలకి మన భాషలో మంచి పుస్తకాలు చాలా అవసరం. భాషను పసివాళ్లకు పరిచయం చేస్తూ.. దాన్ని బతికించుకోవడానికీ ఈ పుస్తకాలు దోహదపడతాయి.

- డా।। ఎం.హరికిషన్‌, బాలసాహితీవేత్త

ఒక రుషి సముద్ర స్నానానికి వెళుతున్నాడు. ఎదురుగా రాజు వస్తున్నాడు. 
‘‘ఊ.. పక్కకి జరుగు. నేను మహాజ్ఞానిని’’ అన్నాడు రుషి. 
‘‘నువ్వే జరుగు... నేను ఈ రాజ్యానికి మహారాజుని’’ అన్నాడు రాజు. 
ఆ రుషి కోపంతో ఊగిపోతూ ‘‘బ్రహ్మరాక్షసుడివి అయిపో’’ అని రాజుని శపించాడు. వెంటనే రాజు రాక్షసుడిలా మారిపోయాడు. రుషిని తినేశాడు! 

- జి.వి.ఎన్‌.రాజు, ధ్వన్యనుకరణ కళాకారుడు

 

‘‘హలో’’ 
‘‘సార్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి. మీ కుక్క తప్పిపోయిందని ఫిర్యాదు ఇచ్చారు కదా!’’ 
‘‘అవును. చాలా రోజులైంది. ఏమైంది?’’ 
‘‘అది వృద్ధాశ్రమంలో మీ అమ్మానాన్నల దగ్గర ఆడుకుంటోంది!’’

- దాసరి వెంకటరమణ, బాలసాహిత్య పరిషత్‌ ప్రధాన కార్యదర్శి, కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత

 

ఒక రాజు కోతిని పెంచుకుంటున్నాడు. రాజుగారు నిద్రపోతుంటే కోతి కాపలాకాసేది. ఒకరోజు రాజు నిద్రపోతుంటే ఓ ఈగ వచ్చి ఆయన మీద వాలింది. కోతి దాన్ని ఎంత తోలుతున్నా మళ్లీ రాజుగారి మీదే వాలుతోంది. కోతికి కోపం వచ్చి కత్తి తీసుకొని ఈగని చంపడానికి ప్రయత్నించింది. అది ఎగురుతూ మళ్లీ రాజుగారి మీదే వాలుతోంది. ఎన్నిసార్లు చంపాలని చూసినా దానికేం కాలేదు. కానీ, రాజుగారికి బాగా దెబ్బలు తగిలాయి. అందుకే మూర్ఖులతో చనువు మంచిది కాదని పెద్దలు చెబుతారు. 

- లక్ష్మీప్రియ, ఒకటో తరగతి, 
షార్ప్‌కిడ్స్‌ పాఠశాల


వెనక్కి ...

మీ అభిప్రాయం