ప్రజోద్యమ రథసారథి... సాహిత్య వారధి..

  • 281 Views
  • 0Likes
  • Like
  • Article Share

అనువాదకులుగా, జనసాహితీ కార్యవర్గసభ్యులుగా సాహిత్య, సామాజిక రంగాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన నిర్మలానంద అసలు పేరు ముప్పన మల్లేశ్వరరావు. విశాఖ జిల్లా అనకాపల్లిలో 1935 అక్టోబర్‌ 20న జన్మించారు. రైల్వేలో ఉద్యోగం చేస్తూ హిందీ, ఒడియా, బెంగాలీ భాషల మీద పట్టు పెంచుకున్నారు. ఆ ప్రజ్ఞతో విశిష్ట అనువాదకుడిగా గుర్తింపు పొందారు. అనేక ప్రసిద్ధ తెలుగు పుస్తకాలను హిందీలోకి అనువదించారు. శ్రీశ్రీ, చలం, కొకు, రావిశాస్త్రి, శ్రీపతి, డి.వెంకట్రామయ్య, కుందుర్తి, శీలా వీర్రాజు, సుభద్రాదేవి తదితరుల రచనలను ఆ భాషలోకి తీసుకెళ్లారు. ‘నిర్మలానంద వాత్సాయన్‌’ పేరిట ఆయన హిందీలో రచనలు కొనసాగించారు. ఆ భాషలోని మేలిమి కవితలను ‘కలాల కవాతు’ పేరిట తెలుగు సాహితీలోకానికి పరిచయం చేశారు. మరోవైపు.. జనసాహితి సభ్యులుగా నిర్మలానంద చురకెత్తు భావాలను ప్రచారం చేశారు. ఆయన సంపాదకత్వంలో వెలువడిన మొదటి పుస్తకం.. ‘లూషన్‌ వ్యక్తిత్వం- సాహిత్యం’. ‘నేను నేలకొరిగిపోతే!’ ద్వారా పాలస్తీనా పోరాట స్ఫూర్తిని తెలుగునాడుకు తీసుకొచ్చారు. భగత్‌సింగ్‌ కారాగారంలో ఉన్నప్పుడు రాసిపెట్టుకున్న విభిన్న రచనలన్నింటినీ ‘నా నెత్తురు వృథా కాదు’ పేరిట అనువదించారు. ఆ యోధుడి ఆవేశం, ఆవేదనలకు అద్దంపట్టే ఈ రచన ఇప్పటికీ శక్తిమంతమైన సాహిత్యమే. ‘‘మీ జీవితం నుంచి ఒక్కరోజునైనా దొంగిలించండి, నిజంగా జీవించడానికి!’’ అంటూ నినదించి ఖలిస్థాన్‌ ఉగ్రవాదుల చేతిలో ఆహుతైపోయిన కవి పాష్‌నూ తెలుగువారికి పరిచయం చేశారు నిర్మలానంద. తన సంపాదకత్వంలో ‘పాష్‌ కవిత’ అనువాద సంపుటిని వెలువరించారు.
      ప్రజాసాహితి పత్రికకు నిర్మలానంద రెండు దశాబ్దాల పాటు సంపాదకులుగా వ్యవహరించారు. ప్రజలకు మేలుచేసే.. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే సాహిత్యాన్ని నలుగురికీ అందించాలనే తపనతో అవిశ్రాంతంగా పనిచేశారు. నిరాలా, నాగార్జున్‌, ముక్తిబోధ్‌, కైఫీ అజ్మీ, సర్వేశ్వర్‌ దయాళ్‌ సక్సేనా, అమృతాప్రీతమ్‌, కె.అయ్యప్ప పణికర్‌, మహాశ్వేతాదేవి తదితరుల రచనలను తెలుగులోకి తెచ్చారు. అల్లూరి సీతారామరాజు పోరాట గమనాన్ని విశ్లేషిస్తూ ప్రముఖులు రాసిన వ్యాసాలను ఏరి కూర్చి ‘మన్యం వీరుని పోరుదారి’ పేరిట ముద్రించారు. ఆ పుస్తకాన్ని మహాశ్వేతాదేవితో ఆవిష్కరింపజేశారు. విప్లవనారి దుర్గావతీదేవి రచనల సంకలనాన్ని, జాషువా శత జయంతి సందర్భంగా ప్రత్యేక సంచికనూ వెలువరించారు. తొలిదశలో కిషన్‌చందర్‌ రచనలను అనువాదం చేసేటప్పుడు కొంత తడబడినా ఆ తర్వాత ఆ ప్రక్రియను ఒడుపుగా నిర్వహించారు. అనువాదాన్ని సమరశీలశక్తులకి ముడిసరుకుగా, సామాజిక చైతన్యానికి ఇంధ]నంగా మార్చారు. యువశక్తులకు చేతనత్వాన్ని కలిగించి, నవశకాన్ని ఆవిష్కరింపజేయడమే లక్ష్యంగా రచనలు చేశారు. అనువాదమనేది సమర్థవంతమైన ప్రక్రియ అని, అందులో రాణించడం అషామాషీ వ్యవహారం కాదని, లక్ష్య భాషలోని నుడికారాల మీద పట్టుంటేనే అది శక్తిమంతంగా ఉంటుందని చెప్పేవారాయన. సామాజిక పునర్వికాసం కుంటుపడకుండా కొనసాగాలంటే సామాన్యులు నిర్భయంగా గొంతు విప్పగలగాలనీ, అవిశ్రాంత పోరాటపటిమను అలవర్చుకోవాలని ఉద్బోధించిన నిర్మలానంద, 2018 జులై 24న తుదిశ్వాస విడిచారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం