వజ్రాలకొండ.. గోల్కొండ!

  • 1357 Views
  • 2Likes
  • Like
  • Article Share

    ఎస్‌ ఎస్‌ రంగాచార్యులు

  • విశ్రాంత ఉప సంచాలకులు, రాష్ట్ర పురావస్తు విభాగం
  • హైదరాబాదు
  • 9989774997
ఎస్‌ ఎస్‌ రంగాచార్యులు

గోల్కొండ కోట... హైదరాబాదు నగరం కంటే పురాతన నిర్మాణం. కుతుబ్‌షాహీ రాజ్య కీర్తిప్రభలకు కేంద్రస్థానం! ‘‘ఇనసమతేజులౌ నృపుల నెల్ల మహమ్మదుశాహి యేలు నీ/ యెనుబదినాల్గు దుర్గముల నేలిన యేలిక గోలుకొండ..’’గా తెలుగు కవులు అభివర్ణించిన అజేయ గిరిదుర్గం!! ఈ ఖిల్లా నిర్మితమై అయిదు వందల ఏళ్లు దాటుతోంది. ఈ విశిష్ట సందర్భంలో గోల్కొండ ఘనచరిత్రను ఓమారు గుర్తుచేసుకుందాం! 
గోల్కొండ
నిర్మాణం కాకతీయుల కాలంలోనే ప్రారంభమైంది. ఇది కాకతీయ రాజుల పశ్చిమ సరిహద్దుగా ఉండేది. దీని ప్రాచీన నామం ‘గొల్లల కొండ’గా చరిత్రకారులు చెబుతారు. ఇప్పటికీ గోల్కొండ, హైదరాబాదు ప్రాంతాల్లో యాదవుల జనాభా అధికంగా ఉండటం, పూర్వకాలం నుంచీ జరుగుతున్న బోనాల పండగలే ఇందుకు నిదర్శనం. చరిత్రపరంగా చూస్తే గోల్కొండతో సహా తెలంగాణ యావత్తు కాకతీయుల పరిపాలనలో ఉంది. క్రీ.శ.1323లో వాళ్ల పతనానంతరం తెలంగాణలో చాలాభాగం మహమ్మదీయుల పాలనలోకి వెళ్లింది. పద్మనాయకులు కొంతభాగాన్ని ఏలినా క్రీ.శ.1470 తర్వాత తెలంగాణ మొత్తం బహ్మనీ రాజుల వశమైంది. బహ్మనీ రాజులు మొదట గుల్బర్గా, తర్వాత బీదర్‌ ముఖ్యపట్టణాలుగా దక్కన్‌ భూభాగాన్ని పరిపాలించారు.
      బహ్మని రాజు మహ్మద్‌షా కాలంలో తుర్కుమేనియా తెగకు చెందిన సుల్తాన్‌ కులీ అనే యోధుడు పర్షియా దేశం నుంచి దక్కనుకు వచ్చాడు. రాజ కుటుంబంలో అంగరక్షకుడిగా చేరాడు. అతని ధైర్యసాహసాలకు మెచ్చి మహ్మద్‌షా, సుల్తాన్‌ కులీకి ‘కుతుబ్‌-ఉల్‌-ముల్క్‌’ బిరుదు ప్రదానం చేశాడు. తెలంగాణకు తరఫ్‌దారు (గవర్నరు)గా నియమించాడు.
      మహ్మద్‌షా కాలంలోనే (క్రీ.శ.1518) బహ్మని రాజ్యం విచ్ఛిన్నమైపోయింది. బీదర్‌, బెరార్‌, అహ్మద్‌నగర్‌, బీజాపూర్‌, గోల్కొండ రాజ్యాలు ఏర్పడ్డాయి. ఓరుగల్లు ముఖ్యకేంద్రంగా తరఫ్‌దారు హోదాలో తెలంగాణను పాలిస్తున్న సుల్తాన్‌ కులీ కుతుబ్‌షా స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. గోల్కొండకు రాజధానిని మార్చాడు. కుతుబ్‌షాహీల కాలంలో దక్కన్‌లోని రాజ్యాల్లో గోల్కొండ అతి పెద్దదిగా అవతరించింది. అలా కులీ కుతుబ్‌షా కుతుబ్‌షాహి వంశ మూలపురుషుడు, గోల్కొండ రాజ్య స్థాపకుడయ్యాడు.
అసలు పేరు.. బాగ్‌నగర్‌!
గోల్కొండ కోట నిర్మాణానికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. అయితే, మొట్టమొదట ఈ కోటను వరంగల్లు రాజులు (కాకతీయులు) నిర్మించినట్టుగా ముస్లిం చరిత్రకారుల రచనలతో తెలుస్తోంది. ఈ కోట ఎత్తయిన కొండరాతి మీద నిర్మితమైంది. దీన్ని గిరిదుర్గంగా చెప్పుకోవచ్చు. కాకతీయుల కాలంలో నిర్మితమైన మట్టికోట గోడలు అసంపూర్ణంగా, రక్షణ అవసరాలు తీర్చడానికి అనుకూలంగా ఉండేవి కావు. దాంతో పెద్ద పెద్ద బండరాళ్లతో నూతన ప్రాకారాన్ని నిర్మించారు. కోట చుట్టూ మూడు ప్రాకారాలు ఒకదాని వెంట ఒకటి నిర్మితమయ్యాయి. ఇవి దాదాపు ఏడు కిలోమీటర్ల పొడవు, 35 నుంచి 55 అడుగుల ఎత్తున ఉంటాయి. చుట్టూ 87 బలిష్ఠమైన బురుజులు, వాటి మీద ఫిరంగులనూ ఏర్పాటుచేశారు. కోట చుట్టూ కందకం, దక్షిణం వైపు చిన్న గుట్టలు, సహజసిద్ధ రక్షణకవచంగా మూసీనది ఉండటంతో గోల్కొండ శత్రు దుర్భేద్యమైంది. మొదటి సుల్తాను కులీకుతుబ్‌షా (క్రీ.శ.1518-43) ఈ కోట నిర్మాణంలో ప్రధాన పాత్రధారి. ఇతడు దుర్గంతో పాటు నగర నిర్మాణమూ చేసి, దానికి ‘మహ్మద్‌నగర్‌’గా పేరుపెట్టాడు.
      కులీకుతుబ్‌షా వారసులు జంషీద్‌ కులీకుతుబ్‌షా (క్రీ.శ.1543-50), ఇబ్రహీం కులీకుతుబ్‌షా (క్రీ.శ.1550-80) గోల్కొండలో అనేక నిర్మాణాలు చేశారు. తర్వాతి రాజు మహ్మద్‌ కులీకుతుబ్‌షా (క్రీ.శ.1580-1612) హైదరాబాదు నగర నిర్మాత. దినదినాభివృద్ధి చెందుతున్న గోల్కొండ అధిక జనావాసానికి అనుకూలంగా లేకపోవడంతో మూసీనది మీద వంతెన (పురానాపూల్‌) నిర్మించి, నూతన నగర నిర్మాణం చేపట్టారు. ఈ నగరం ఇరాన్‌లోని ‘ఇస్వాహాన్‌’ నగర నిర్మాణాన్ని పోలి ఉంటుంది. మహ్మద్‌ కులీకుతుబ్‌షా భాగమతి అనే హిందూ నర్తకిని ప్రేమించి, దీనికి భాగ్యనగరమనే పేరు పెట్టాడనే ఐతిహ్యం ఉంది. కానీ, దీని అసలు పేరు బాగ్‌నగర్‌ (అనేక తోటలతో కూడిన నగరమని అర్థం). మహ్మద్‌ కులీకి ‘హైదర్‌’ అనే బిరుదు ప్రదానం చేసిన సందర్భంగా ‘హైదరాబాదు’గా మారింది. క్రీ.శ.1584, 1605లో ముద్రితమైన నాణేల మీద ‘దారుల్‌-సల్తనత్‌-హైదరాబాద్‌’ అని కనిపిస్తుంది. మహ్మద్‌ కులీ కాలంలోనే చార్మినార్‌, జమామసీద్‌, చార్‌కమాన్‌ కట్టడాలు కుతుబ్‌షాహీ వాస్తు కళారీతిలో నిర్మితమయ్యాయి. తదుపరి సుల్తాన్‌ మహ్మద్‌ కుతుబ్‌షా కాలంలో (క్రీ.శ.1612-26) మక్కామసీద్‌ నిర్మాణం ప్రారంభమైంది. ఇతని తర్వాత అబ్దుల్లా కుతుబ్‌షా (క్రీ.శ.1626-72) రాజ్యానికొచ్చాడు. ఈ సమయంలోనే గోల్కొండ మీద మొగలాయి దండయాత్రలు మొదలయ్యాయి క్రీ.శ.1636, 1655-56ల్లో జరిగిన దండయాత్రల నుంచి రాజ్యాన్ని కాపాడుకోవడానికి అధిక మొత్తాన్ని కప్పంగా చెల్లించారు. రక్షణ చర్యల్లో భాగంగా ‘నయాఖిలా’గా పిలిచే కొత్త కోటను నిర్మించారు. కుతుబ్‌షాహీ వంశంలో చివరివాడైన అబుల్‌ హసన్‌ తానాషా క్రీ.శ.1672-87 మధ్య పరిపాలించాడు. ఔరంగజేబు దండయాత్రలో ఇతన్ని బంధించి దౌలతాబాదుకు తరలించారు.
గోల్కొండ విశిష్టత
గోల్కొండ కోటకు మొత్తం ఎనిమిది ద్వారాలుంటాయి. అవి.. బంజారా దర్వాజా, జుమాలీ దర్వాజా, నయాఖిలా, ఫతే దర్వాజా, మోతీ దర్వాజా, బమ్నీ దర్వాజా, మక్కాయీ దర్వాజా, పటాన్‌చెరువు దర్వాజా. వీటిలో తూర్పువైపు ఉండే ఫతే దర్వాజా, పశ్చిమంలోని మక్కాయీ దర్వాజా, వాయవ్యంలో నిర్మితమైన జుమాలీ, బంజారా దర్వాజాలు వాడుకలో ఉండేవి. మక్కా యాత్రకు వెళ్లేవాళ్లు మక్కాయీ దర్వాజా గుండా రాకపోకలు సాగించేవారు. గోల్కొండలోకి మొగలాయి సైన్యం ప్రవేశించిన ద్వారాన్ని ‘ఫతే దర్వాజా’ అంటారు.
      కుతుబ్‌షాహి రాజుల పాలనలో కోటతోపాటు అనేక నిర్మాణాలూ రూపుదాల్చాయి. వీటిలో రాజప్రాసాదం, మోతీమహల్‌, రాణీమహల్‌, కోశాగారం, ఆయుధాగారం, రామదాసు ఖైదు, జమామసీదు, తారామతి, బారాదరి, ప్రేమామతి మసీదులు, అంబర్‌ఖానా, అశ్వశాలలు, సైనిక గదులు, నగీనాబాగ్‌, నయాఖిలా బాగ్‌, మహంకాళి దేవాలయం ముఖ్యమైనవి. కోట ప్రధాన ద్వారం బాలాహిస్సార్‌ గేట్‌. నెమళ్లు, సింహాలు, లతలతో ఇది చాలా అందంగా ఉంటుంది. ఈ ద్వారం మీది చిత్రాలు హిందూ చిత్రకళకు అద్దంపడతాయి. అలాగే, గోల్కొండ కోట సమీపంలోని కుతుబ్‌షాహీల సమాధుల సముదాయం, చార్మినార్‌ దగ్గరి బాదుషాహీ అశుర్‌ ఖానా, చార్‌కమాన్‌, మక్కామసీద్‌ తదితరాలు ఇతర ప్రధాన కట్టడాలు. ఈ నిర్మాణాలన్నీ హిందూ, ముస్లిం నిర్మాణశైలుల కలయికతో రూపుదాల్చినవి. కోట పైకి, లోపలి వివిధ భవనాలకు నీటి సరఫరా కోసం చేసిన ఏర్పాట్లలో అద్భుత ఇంజినీరింగ్‌ నైపుణ్యం కనిపిస్తుంది. కోట వాయవ్య భాగంలోని దుర్గ తలాబ్‌- నేటి దుర్గంచెరువు నుంచి కాలువలు, మట్టిగొట్టాల ద్వారా కోటకు నీళ్లసరఫరా చేశారు.
      సమకాలీన కాలంలో గోల్కొండ కోట వజ్రాలకు, ముత్యాలకు చాలా ప్రసిద్ధిగాంచింది. యూరోపియన్‌ యాత్రికులైన థెవెనాట్‌, టావెర్నియర్‌, బార్నియర్‌ రచనలు ఈ విషయాన్ని నిర్ధరిస్తాయి. గోల్కొండ రాజ్యంలో ముఖ్యంగా కొల్లూరు, వజ్రకరూర్‌ ప్రాంతాల నుంచి అనేక వజ్రాలను సేకరించి, దేశ విదేశాలకు విక్రయించేవారు. అలా తరలిపోయిన వజ్రాల్లో ‘కోహినూర్‌’ ప్రధానమైంది. ఇది అనేక రాజుల దగ్గరి నుంచి చివరికి బ్రిటిష్‌ రాణి కిరీటంలో చేరింది. మరో ముఖ్య వజ్రం ‘ఓర్లోవ్‌’. ఇది ప్రస్తుతం రష్యా రాజధాని మాస్కోలో ఉందని అంటారు.

ఆయన మల్కిభరాముడు!
ఫరిస్తా అనే చరిత్రకారుడి రచనల ప్రకారం కుతుబ్‌షాహీలు పర్షియన్‌ భాషను ఆస్థాన భాషగా ప్రవేశపెట్టారు. ఆ దేశీయులు అనేక మందిని ఉద్యోగులుగా నియమించుకున్నారు. పర్షియన్‌, అరబిక్‌లతోపాటు వీరు తెలుగు సాహిత్యసేవ కూడా చేశారు. ఇబ్రహీం కుతుబ్‌షా కొంతకాలం విజయనగర రాజ్యంలో శరణార్థిగా ఉన్నాడు. ఆ సమయంలో తెలుగు భాష, కవులతో ప్రభావితుడయ్యాడు. తను గోల్కొండ రాజైన తర్వాత ఆ కవుల్లో చాలామందిని ఇక్కడికి రప్పించాడు.
      క్రీ.శ.1565లో జరిగిన తళ్లికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం పతనమైంది. కవి పండితులను పోషించే నాథుడు లేకపోవడంతో వాళ్లందరూ గోల్కొండ వైపు పయనమయ్యారు. వాళ్లలో అద్దంకి గంగాధర కవి, పొన్నగంటి తెలగన, సారంగు తమ్మయ, రాజమల్లారెడ్డి, మాధవరాయలు, కందుకూరి రుద్రకవి (తొలితెలుగు యక్షగానం ‘సుగ్రీవ విజయం’ కర్త), మరింగంటి సింగరాచార్యుల(తొలి తెలుగు త్య్రర్థి, చతురర్థి కావ్యాల కర్త)ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. అద్దంకి గంగాధర కవిని ఇబ్రహీం కుతుబ్‌షా తన ఆస్థాన కవిగా నియమించాడు. గంగాధరుడు ‘తపతి సంవరణోపాఖ్యానము’ అనే పద్యకావ్యాన్ని రాసి, ఇబ్రహీం కుతుబ్‌షాకి అంకితమిచ్చాడు. పొన్నగంటి తెలగన తన ‘యయాతి చరిత్ర’ (తొలి అచ్చతెలుగు కావ్యం)ను ఇబ్రహీం కుతుబ్‌షా రాజాస్థానంలోని అమీన్‌ఖాన్‌ అనే జాగిర్దారుకు అంకితం చేశాడు. గోల్కొండ ఆస్థాన తెలుగు కవులు ఇబ్రహీం కుతుబ్‌షాను ప్రేమాభిమానాలతో ‘మల్కిభరాముడు’ అని పిలుచుకున్నారు. అతను మరణించినప్పుడు ‘‘రార! విధాత! యోరి! వినరా! తగురా? తలకొట్లమారి! ని/ స్సారపు లోభిరాజులను జంపక మల్కిభరామ భూవరున్‌/ జారుయశోధనున్‌ సుగిణి జంపితి, వర్థులకేమి గిక్కురా/ చేరిన నింతరాజును సృజింపగ నీతరమా వసుంధరన్‌?’’ (చాటుపద్యమణిమంజరి) అంటూ ఆక్రోశం వ్యక్తంచేశారు. ఈ ‘మల్కిభరాముడి’ కాలంలో శాసనాలు కూడా తెలుగు, పర్షియన్‌ భాషల్లో వేశారు. క్రీ.శ.1554 నాటి పానగల్లు శాసనం దీనికో తార్కాణం. ‘వైజయంతీ విలాసం’ కావ్యకర్త సారంగు తమ్మయ కులీకుతుబ్‌షా ఆస్థానంలో కరణంగా పనిచేశాడు.
      దాశరథి శతకకర్త కంచర్ల గోపన్న (రామదాసు), అబుల్‌ హసన్‌ తానాషాకు సమకాలీనుడు. కూచిపూడి భాగవతులకు కూచిపూడి గ్రామాన్ని దానం చేసి, ఆ నాట్యాన్ని నిలబెట్టింది తానాషానే. కుతుబ్‌షాహీలు తెలుగు కవులకూ అగ్రహారాలను దానమిచ్చారు. గోల్కొండ పతనమైన తర్వాత తెలుగు సరస్వతికి రాజపోషణ కరవైంది. దాంతో చాలామంది కవులు జీవనోపాధి కోసం తంజావూరు, మధురై, మైసూరు, పుదుక్కొట్టు తదితర ప్రాంతాలకు తరలిపోయారు.
సామ్రాజ్య పతనం
అబుల్‌ హసన్‌ తానాషా కాలంలో మొగలాయి చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండపై దాడిచేశాడు. కోటముట్టడి దాదాపు ఎనిమిది నెలలపాటు సాగింది. తానాషా, అతని సైనికాధికారులు ముఖ్యంగా అబ్దుల్‌ రజాక్‌ లారీ తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సమయంలో అయినవాళ్లే తానాషాకు ద్రోహం చేయడంతో మొగలాయిలు విజయం సాధించగలిగారు. అబ్దుల్‌- లాహి- ఖన్‌పన్నీ అనే సైనికాధికారి ఫతేదర్వాజా తెరిచి, మొగలాయి సైనికులకు మార్గం సుగమం చేశాడు. అలా సెప్టెంబరు 21, 1687 అర్ధరాత్రి గోల్కొండ కోట మొగలాయిల వశమైంది. తానాషాను బంధించి, దౌలతాబాదులోని ‘కాలామహల్‌’ కారాగారంలో ఉంచారు. పద్నాలుగేళ్లు ఆ బంధిఖానాలోనే గడిపి, క్రీ.శ.1701లో అతను మరణించాడు. దీంతో దాదాపు 170 సంవత్సరాల పాటు సాగిన       కుతుబ్‌షాహీల పాలన, గోల్కొండ వైభవం అంతరించిపోయాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ గోల్కొండ కోట మీద నుంచి జాతీయ జెండా ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న గోల్కొండ తెలుగు జాతి వారసత్వ సంపద. దాన్ని సంరక్షించుకోవడం, భావితరాలకు దాని ప్రశస్తిని తెలియజేయడం మనందరి బాధ్యత.


‘‘ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతీ
ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయితాం ధ్రువమ్‌’’
అని తెలుగువారి కల్యాణమంటపాల్లో ఘోషించే పురోహితుల మంత్రాలు విన్నకొలదీ ‘ధ్రువమ్‌’ అన్న పదం కులీ గుండెల్లో గూడు కట్టిందేమో! తాను మెట్టిన దేశంలో తనవంశం ధ్రువంగా ఉండాలని మనసు పుట్టిందేమో! కనకనే తనవంశానికి ధ్రువార్థకమైన ‘కుతుబ్‌’ నామం స్వీకరించాడు. ధ్రువం అన్నా కుతుబ్‌ అన్నా ఒకటే అర్థం.
      అతని కొడుకు ఇబ్రహీం. ఇబ్రహీం చిన్నవాడై ఉండగానే రాజ్యం వదిలి విజయనగర రాజుల సన్నిధిలో తలదాచుకోవలసి వచ్చింది. అక్కడ ఉన్నప్పుడే విజయనగర రాజుల భాషాపోషణ, సాహిత్య సమారాధన, ఇబ్రహీం మీద చెరగని ముద్రవేశాయి. తెలుగుసాహిత్యం పట్ల అభిమానం అభిరుచీ అభినివేశం ఏర్పడ్డాయి. గోల్కొండ రాజ్యానికి అధిపతిగా వచ్చిన తర్వాత ఇబ్రహీం తెలుగునోట అభిరాముడయ్యాడు. తెలుగుకవితలో మల్కిభరామచంద్రుడై వెలిగాడు. తెలుగు కవులపాలిట ఏడవచక్రవర్తిగా పదునేడవరాజుగా వినుతికెక్కాడు.
      అలాంటి మల్కిభరామచంద్రుని హయాంలో- తెలుగుప్రజలందరూ ఒక ఏలుబడి కిందికి వచ్చారు. అంతవరకు పలుకునేర్వని ఉర్దూభాష తెలుగు తేటతనాన్ని అవగతం చేసుకుని కవితలల్లింది. పారసీక తుర్కీ పదాలను కదం తొక్కించి తెలుగు తేజరిల్లింది. 

 -  రాంభట్ల కృష్ణమూర్తి


మల్కిభరామ్‌, కులీకుతుబ్‌షా వంటి మధుర హృదయులు పరిపాలించిన ప్రాంతం మత దురహంకారంతో మైమరచిన కర్కోటకుల చేతుల్లో పడింది. ఆంధ్ర భాషను ఆదరించిన రాజులు పోయి ఆంధ్రభాషను అవమానించేవారు గద్దెనెక్కారు. సర్వమత సమానత్వాన్ని ఉద్బోధించినవారు గతించి కాసింరజ్వీలు పెల్లుబికారు. అట్టి ప్రాంతంలో అల్లకల్లోలంలో స్వేచ్ఛకై జరిగిన పోరాటం చూచాను. హైదరాబాదు నగరం అమాయకుల రక్తంతో తడిసిన గడియలను ఎరుగుదును. దేశభక్తులు కారాగారాల్లో బంధించబడగా ప్రజా ద్రోహులు అధికారం చలాయించడం చూచాను. ఆ ఆంధకారం చాలా కాలం ఆవరించి ఉంది. అయితే అభ్యుదయ బాలసూర్యుడు. ఉదయించనే ఉదయించాడు. నలుదెసల కాంతి వ్యాపించింది. నేడు తెలుగు వెలుగు భాగ్యనగరం నలుమూలల పరచుకుంది. నేడు భాగ్యనగరం తెలుగువారిది.
భాగ్యనగరం చైతన్యవంతులైన ప్రజలకు ఆటపట్టు. ఉత్తర దక్షిణాల కూడలి. భిన్న సంస్కృతులకు సంగమస్థానం. మతసామరస్యానికి మచ్చుతునక. ప్రజాహంతకుల రక్తహస్తాల నుండి విడిపడి ఆంధ్ర రాజధాని అయ్యి దేశభక్తుల కలలకు రూపుదిద్దింది.  

-   దాశరథి


 


వెనక్కి ...

మీ అభిప్రాయం