గుమ్మడేడే గోపదేవీ... గుమ్మడేడె కన్నతల్లీ!
  • 920 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా. సుబ్బలక్ష్మి మర్ల

  • కాకినాడ
  • 9491123889

తెలుగు జానపద సాహిత్యం అపారమైన జ్ఞానభాండాగారం. ముఖ్యంగా ఇందులోని గేయాల్లో అనేక శాస్త్ర, సాంకేతిక అంశాలే కాదు, వేదాంత విషయాలూ దాగి ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి.. ఎన్నో వేదాంత భావనలను తనలో ఇముడ్చుకుని పారమార్థికతను విపులీకరించేది ‘గుమ్మడు పాట’. ‘‘గుమ్మడేడే గోపదేవీ- గుమ్మడేడే కన్నతల్లి/ గుమ్మడిని పొడచూపగదవే- అమ్మ గోపెమ్మా’’ అని సాగే ఈ పాటను ఓ యాభై ఏళ్ల కిందటి వరకూ స్త్రీలు నిత్యం చల్ల చేసుకుంటూ పాడుకునేవారు.
‘‘రాణించు
ముత్యాల రావిరేకయు బొట్టు- కురు వెంట్రుకల నడుమ గునిసియాడ/ బాగైన ముత్యాల పౌజు కమ్మల జోడు- చెక్కిళ్లపై మెరుగు సేయుచుండ’’ రేపల్లెలో ఒకనాడు యశోద చల్ల చేస్తోంది. చేతి గాజులు, సందెడ దండలు లయ కలుపుతుంటే ‘కడవ స్తంభాన్ని నిలిపి కవ్వాన్ని చేతబూనింది ఇంతి’. అలా ఆమె ఘుమ్ముఘుమ్మున పెరుగు చిలుకుతుంటే ఆ శబ్దం విని కృష్ణుడు ‘అమ్మా! వెన్న’ అంటూ పరుగున వచ్చాడు. రావడం రావడం యశోదమ్మ మూపున వాలి, కవ్వాన్ని అణచిపట్టాడు. ‘ఏమిరా! కన్నా.. ఈ అల్లరి? నన్ను శాంతంగా చల్ల చిలుకుకోనివ్వవా?’ అంటూ లేని కోపాన్ని నటిస్తూ నందరాణి ఆ చిన్నారి బుగ్గల మీద చేత్తో తట్టింది. ఆ మాటల్ని పట్టించుకోని కన్నయ్య ఆమె కొప్పును సవరిస్తూ, కొంగుపట్టి లాగుతూ, మెడలోని సరాలను గుంజుతూ నానా హంగామా చేస్తున్నాడు. ‘ఇదిగో ఇలాగే అల్లరి చేశావంటే ఈ కుండలో ఉన్న ఘుమ్ముడు వచ్చి ఎత్తుకుపోతాడంటూ కన్నయ్యను భయపెట్టబోయింది యశోద.
      ‘‘నమ్మరా కృష్ణమ్మ పెరుగులో- నడుమ గుమ్మడు తిరుగులాడును/ నమ్మకున్నను ఘుమ్ముఘుమ్మను- నాదమిటు వినుమీ’’ అంటూ ‘నన్ను ఒక్కరవ్వ పని చేసుకోనీయరా తండ్రీ!’ అంటూ బిడ్డను చేరదీసింది. ‘‘కాటబోయిన వారి పాపడు- కడవ లోపల చెయ్యి ముంచెను/ తూటుపొడిచీ కరచె గుమ్మడు - తొలగి పోవగనూ/ మాటలేటికి విడుము కవ్వము- అన్న నీకును వెన్న బెట్టెద/ యేటికి ఇందున్న గుమ్మడు- యెగిరి కరచెడినీ’’ అని బెదిరించింది. కానీ.. ఏం లాభం! ఘుమ్ముడంటే ఎవరు? నాకు చూపించు అంటూ కృష్ణయ్య మారానికి దిగాడు. దాంతో యశోద పెరుగు చిలుకుతూ కుండలోంచి వస్తున్న ఘుమ్ముఘుమ్మనే శబ్దాన్ని వినిపించి, ‘ఇడుగో ఘుమ్ముడు చూడు’ అంది. దానికి నల్లనయ్య ‘ఏమమ్మా గోపెమ్మా ఈ ఘుమ్ముడు వినపడటమే కానీ కనపడడా?’ అంటూ పేచీ మొదలుపెట్టాడు. గోపెమ్మ అతణ్ని కుండ దగ్గరగా కూర్చోపెట్టి, ‘ఇదిగో చూడు ఘుమ్ముడు ఇప్పుడు కనపడతాడు’ అంటూ మళ్లీ చల్ల చిలకడం ప్రారంభించింది. కవ్వం ధాటికి చల్ల వివిధ ఆకారాలతో పైకెగసి తిరిగి కుండలో పడుతోంది. ‘భలేభలే ఘుమ్ముడు పాట పాడటమే కాదు, దానికి తగ్గట్టు నృత్యం కూడా చేస్తున్నాడు’ అంటూ చప్పట్లు చరుస్తూ ఆనందంతో గంతులు వేశాడు గోపీలోలుడు. అంతలోనే అతనికి ఓ అనుమానం వచ్చింది.
      ‘‘ముచ్చుతనమున వేదములుగొని- తెచ్చి వెరచుచు జలధిలోపల/ జొచ్చియున్నా వాని వెంబటి- జొచ్చి వెనుదగిలీ/ మత్స్యమై సోమకుని దుంచితి- మొదటి చదువులు బ్రహ్మకిచ్చితి/ అక్షయంబుగ గుమ్మడనియెడి మాట నేనెరుగా’’- మత్స్యావతారంలో జలధిని జల్లెడ పట్టినప్పుడు నాకు ఎక్కడా ఘుమ్ముడనే వాడు తగల్లేదు కదా అమ్మా! కూర్మావతారంలో గిరిని ఎత్తినప్పుడు, వరాహావతారంలో రక్కసుణ్ని దునిమినప్పుడు, నరసింహావతారంలో హిరణ్యకశిపుణ్ని సంహరించినప్పుడు, వామనావతారమెత్తి ‘అడుగులను బ్రహ్మాండ భాండమంతటా’ నేను నిండినప్పుడు కానీ ఈ ఘుమ్ముడు కనపడలేదే! పరశురామ, రామ, కృష్ణావతారాల్లో కానీ, ‘‘చిత్తమును బహుచందములుగా- చంద్రకళయును జలసమస్తము/ సప్తరాత్రులు వుంటినే- వటపత్ర శయనమునా’’ యోగముద్రలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ ఈ ఘుమ్ముడు ఎక్కడా కనపడలేదేంటమ్మా అని అడిగాడు కన్నయ్య. ఆ వెంటనే ‘ఇదిగో ఇక్కడ ఉన్నాడా? చూడు’ అంటూ నోరు తెరిచాడు.
      ‘‘నందనందను నోటిలోపల- నాతిపొడగనె చరాచరమ్ములు/ చంద్రసూర్యులు మొదలుగాగల- సకల దేవతలూ’’ ఇలా నల్లనయ్య తన నోట్లో భువన భాండాలన్నింటినీ చూపించాడు. ‘‘వెరువవలెనని గుమ్మడంటిని- వెరచితిని తెరువాకు మూయుము/ చిరుతలను వెరపించు చందము- చేస్తినో తండ్రీ’’ ఏదో చిరుత బాలుడవు నిన్ను భయపెట్టాలని ఘుమ్ముడన్నాను కానీ, నేనే కంపించిపోయానురా కన్నా! ఏదో కన్న మమకారం కొద్దీ బాలుడవనుకున్నాను.. నన్ను కరుణించరా దేవమణీ అంటూ చిన్నికృష్ణుణ్ని అక్కునజేర్చుకుంది యశోద.
      కుండలో ఒకపక్కకు చేరిన వెన్నను తీసి, ‘ఇదిగోరా కన్నా నీకోసం ఘుమ్ముడు వెన్న ఇచ్చాడు’ అంటూ అంతవరకు తాను పొందిన దైవసాక్షాత్కారాన్ని మరచి మాతృమూర్తిగా మారిపోయి మురిపెంగా బాలకిశోరుడికి తినిపించింది యశోద. మిగిలిన వెన్న ఆ నల్లనయ్య ఒంటినిండా పూసింది. నిగనిగ మెరుస్తున్న ఆ శ్యామసుందరుడి దేహం చూసి, ‘నా దిష్టే తగిలేలా ఉందిరా నాన్నా.. దా’’ అంటూ చేరదీసి శనగపిండిలో ఇన్ని పాలుపోసి దాన్ని ఆ నీలమేఘవర్ణుడికి పట్టించింది. వేణ్నీళ్లతో బిడ్డకు మురిపెంగా స్నానం చేయించింది. తన ఒంటి పిండిని తల్లిముఖానికి పాముతూ, చీరపట్టి లాగుతూ, కొప్పును గుంజుతూ నానా హంగామా చేస్తున్న ఆ చిన్ని కృష్ణుణ్ని ఇష్టంగా మందలిస్తూ అతడికి స్నానం చేయించేసరికి యశోదమ్మ అవతారం చూడనలవికాదు! తనను చూసి పరిహసిస్తున్న నందుణ్ని సున్నితంగా కసురుకుంటూ, కన్నయ్యకు చక్కగా కురులు దువ్వి నడినెత్తిన సిగ చుట్టింది. దాని చుట్టూ పొన్నపూలమాల అలంకరించింది. ఒక పక్కగా నెమలి ఈకను గుచ్చింది. దిష్టిచుక్క పెట్టింది. నుదుటన కస్తూరి తిలకం దిద్దింది. మెడలో ముత్యాలపేరులు వేసింది. ఇంతలో కన్నయ్య స్నేహితులు బిలబిలమంటూ వచ్చారు. వారితో ఆటలకు పోయే తన తనయుడికి రక్షగా తులసిమాలలు తెచ్చి మెడలో వేసింది. ‘కృష్ణా! అల్లరిపనులు చేయకు. కానివారితో కయ్యానికి దిగకు. చెట్టులెక్కకు. మడుగులలో దిగకు’ అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపింది యశోదమ్మ.
అంతరార్థం ఇదిగో...
స్థూలదృష్టికి ఇదంతా మాతృహృదయ మమతానురాగాలకు అద్దంపట్టే కథగా కనపడుతుంది. కానీ, లోతుగా పరిశీలిస్తే ఇందులో అంతర్గతంగా దాగిన పారమార్థిక విషయాలు అనేకం దృగ్గోచరమవుతాయి. ఇందులోని చల్లకుండ ఆత్మకు సంకేతమైతే, ఆ చల్లను చిలికే కవ్వం జిజ్ఞాసకు ప్రతీక. సాధకులు ఆత్మ అనే దధిభాండాన్ని జిజ్ఞాస అనే కవ్వంతో మథిÅంచినప్పుడు జ్ఞానం అనే వెన్న వెలికి వస్తుంది. అంతరాత్మను మథిÅంచేటప్పుడు చల్లకుండలో ఘుమ్ముఘుమ్మున నాట్యం చేస్తూ వివిధ ఆకారాల్లో సాక్షాత్కరించే ఘుమ్ముడిలాగే అనేకానేక భావ వికారాలు వివిధ రూపాల్లో బహిర్గతమవుతాయి. సాధకుడు వాటికి లోబడకుండా అవిరళంగా మథనం (ఆత్మశోధన) సాగిస్తేనే జ్ఞానమనే వెన్నను పొందగలడు. ఇక్కడ సాధకుడు అంతర్మథనంలో వెలువడే ఆటంకాలనే కాకుండా బాహ్యంగా ఎదురయ్యే అవరోధాలను కూడా జయించాలి అనే సూచన కనపడుతుంది. అందుకే యశోద కన్నయ్య ఎన్ని ఆటంకాలు ఏర్పరచినా విడిచిపెట్టకుండా చల్ల చిలికి కార్యం సాధించింది. మథనంలో వెలువడ్డ జ్ఞానమనే వెన్నను భగవదర్పితం చేస్తే అలౌకికానందం ప్రాప్తిస్తుంది. ఆ ఆనందం నుంచే సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుడి సాక్షాత్కారం కలుగుతుంది. దాంతో ముముక్షువులు మోక్షాన్ని పొందుతారు. మోహపరవశులైన వారు మళ్లీ మళ్లీ ఆ సాక్షాత్కారాన్ని పొందాలనే ఆరాటంతో ప్రాప్తించిన మోక్షాన్ని తృణప్రాయంగా త్యజించి, తిరిగి అదే చక్రంలో పరిభ్రమించడానికి ఉత్సుకత చూపుతారు. యశోద, గోపికలు ఈ కోవకు చెందినవారే. విషయలంపటులైన వారు మాత్రం దైవం కళ్లెదుట నిలిచినా గుర్తించలేరు.
ఈ ఘుమ్ముడే జానపదుల నోళ్లలో గుమ్మడుగా మారి, గుమ్మడు పాట రూపుదిద్దుకుంది. జానపదులు పనులు చేసుకునేటప్పుడు శ్రమ తెలియకుండా ఇలాంటి పాటలు పాడుకుంటూ ఇటు ఐహికంగానూ, అటు ఆముష్మికంగానూ ప్రయోజనం పొందేవారు. కానీ, ఇప్పుడు ఈ పాటలు ఎక్కడా వినిపించట్లేదు. ఇక వాటి అర్థాలు.. అంతరార్థాల గురించి ఆలోచించేవారు, నవతరానికి వాటిని విడమరచి చెప్పేవారు మరీ అరుదైపోయారు. మన సంస్కృతిని మనం అపురూపంగా భావిస్తేనే ఇలాంటి అద్భుత జానపద గీతాలు మళ్లీ జాతి నాలుకమీద నాట్యమాడతాయి.

* * * 


వెనక్కి ...

మీ అభిప్రాయం