ప్రతిచోటా తెలుగు.. విస్తరించాలి ఆ వెలుగు!

  • 244 Views
  • 0Likes
  • Like
  • Article Share

    నెమ్మాని సీతారామమూర్తి

  • ఒంగోలు
  • 8008574071
నెమ్మాని సీతారామమూర్తి

తొలి తెలుగు పద్య శాసనం పుట్టిన ప్రదేశం.. ‘‘అంబ నవాంబు జోజ్వల కరాంబుజ శారద చంద్రికా’’ అన్న ఎర్రనామాత్యుడి పద్యార్చనతో పునీతమైన నేల గుండ్లకమ్మ సీమ. ‘‘తూరుపు సాగరమే తోరణ పీఠం’’ అని పలికిన నాగభైరవ కవనంతో పులకించిన ఈ ప్రాంతం తెలుగువెలుగులతో ప్రకాశించింది. ఆగస్టు12న ఒంగోలు ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో జరిగిన భాషా బ్రహ్మోత్సవాలు తెలుగు తీపిని మరోమారు చవిచూపించాయి. గతకాలపు వైభవాన్ని తల్చుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తులో భాషాభివృద్ధికి దిశానిర్దేశం చేశాయి. 
ఆంధ్రప్రదేశ్‌ భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు భాషాబ్రహ్మోత్సవాలు భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా సాగాయి. పిన్నలనుంచి పెద్దల వరకు, అధికారుల నుంచి ప్రజాప్రతినిధులు వరకు అందరూ ఈ సందర్భంగా తెలుగుతల్లికి జైకొట్టారు. ముందుగా జిల్లా గ్రంథాలయం దగ్గరి నుంచి ఉత్సవ వేదిక వరకు, బాలబాలికలతో సాగిన అక్షర ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఇందులో భాగంగా త్యాగరాజస్వామి, ఎర్రనామాత్యుడు, గుర్రం జాషువా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో రాష్ట అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘‘ముఖ్యమంత్రి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషాభివృద్ధికి అన్ని విధాలా తోడ్పాటునిస్తోంది. కవులు, పండితులు, భాషాభిమానులను ఒకే వేదిక మీదకు తీసుకురావడానికి, భాషా పరిరక్షణ కోణంలో ప్రజల్లో ఆలోచన కలిగించేందుకు బ్రహ్మోత్సవాలను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నా’’మని ఆయన చెప్పారు. ప్రారంభోత్సవానికి శాసనమండలి సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. తర్వాత జరిగిన సదస్సుల్లో పలువురు సాహితీవేత్తలు అనేక అంశాల మీద సోదాహరణంగా చర్చించారు. తెలుగుతల్లిని కీర్తిస్తూ చిన్నారులు నృత్యప్రదర్శన ఇచ్చారు. ఇరవై మంది సాహితీవేత్తలను ఈ సందర్భంగా సత్కరించారు. యాభై మంది కవులు, కవయిత్రులు పాల్గొన్న కవిసమ్మేళనం తెలుగు మధురిమలను పంచిపెట్టింది. సృజనాత్మకత, సంస్కృతి సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి దీర్ఘాసి విజయభాస్కర్‌ సభా నిర్వహణ బాధ్యతలు వహించారు. కవయిత్రి తేళ్ల అరుణ బ్రహ్మోత్సవాలకు సమన్వయకర్తగా, డా. నూనె అంకమ్మరావు సహాయకులుగా వ్యవహరించారు.
      కార్యక్రమంలో రెండు సదస్సులు జరిగాయి. మొదటి సదస్సుకు సాహితీవేత్త బి.హనుమారెడ్డి అధ్యక్షత వహించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలుగు భాషాభివృద్ధికి కంకణం కట్టుకోవడం అభినందనీయం. తెలుగు భాషా ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో నంబర్‌ 40లో కొన్ని మార్పులు చేయాలి. ఆ ఉత్తర్వు ద్వారా భాషకు సంబంధించిన విషయాలు పర్యాటక శాఖ కిందకి వెళ్తున్నాయి. దీన్ని సవరించాలి’’ అని సూచించారాయన. తెలుగు బతకాలంటే సాంకేతిక పదసృష్టి జరగాలని రచయిత డా. జీవీ పూర్ణచందు అభిప్రాయపడ్డారు. ‘‘సామాజికంగా, విద్యాపరంగా కొన్ని వేల ఆంగ్లపదాలు మనల్ని ముంచెత్తుతున్నాయి. వాటన్నిటికి తెలుగు పదాలు తీసుకురావాలి. క్రీ.శ.1870లోనే మచిలీపట్నం కలెక్టర్‌ రాండ్‌ హామ్‌ కేవలం తెలుగులో వచ్చే దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తానని చెప్పారు. మనం కూడా అలాంటి భాషా చైతన్యాన్ని   ప్రదర్శించాలి’’ అని ఆయన  పిలుపునిచ్చారు. ఎర్రన స్ఫూర్తితో తెలుగు భాషకు తిరిగి పట్టంకట్టాలని సాహితీవేత్త డా. గుమ్మా సాంబశివరావు చెప్పారు. ‘‘ఎర్రనామాత్యుడు గొప్ప పండితుడే కాదు, అద్భుతమైన భాషా సమన్వయకర్త. మళ్లీ మనం అలాంటి చైతన్యాన్ని అంది పుచ్చుకోవాలి. నన్నయ, తిక్కనను సమన్వయం చేసుకుంటూ, పోతన పెద్దనాదులకు దారి చూపిన భాషా దార్శనికుడు ఎర్రన. ఆయన రచించిన నృసింహ పురాణం, హరివంశాల్లో కావాల్సినన్ని అచ్చ తెనుగు పదాలు కనిపిస్తాయి. ఆ పదనిధిని క్రోడీకరించాల’’ని ఆయన సూచించారు.

      తెలుగులో చదువుకున్నవారికి సరైన ఉపాధి దొరికేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించాలి. అప్పుడే నేటితరం అమ్మభాష వైపు మొగ్గుచూపుతుందని సాహితీ విమర్శకులు కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ‘‘అమ్మఒడి, మడిలో ఉన్న తెలుగు.. బడిలో లేకపోవడం భాషకు తీరని నష్టం. పాఠశాలల్లో తెలుగు కనుమరుగవుతున్నా ఇంకా ఓర్చుకుంటున్న తరం మనది. మన సహనం వల్ల భావి జాతికి అన్యాయం జరుగుతోంది. బడినుంచి ప్రారంభిస్తేనే భాషోద్యమాలకు సరైన అర్ధం ఉంటుంద’’న్న ఆయన మాటలు కర్తవ్యబోధ చేశాయి. అలాగే, పాలనలోనూ తెలుగును తప్పనిసరి చేయాలని రచయిత్రి కత్తి కృపావరం సూచించారు. రసీదుల నుంచి ప్రభుత్వ ఉత్తర్వుల వరకూ అన్నీ అమ్మభాషలోనే ఉండాలని చెప్పారు. ‘‘ప్రభుత్వ యంత్రాంగం నోట్‌ఫైల్‌, మెమో, లెటర్‌ లాంటి ఆంగ్ల పదాలనే ఉపయోగించడం బాధాకరం. ప్రాధికార సంస్థతోనైనా ఈ పరిస్థితి మారుతుందనుకుంటున్నా’’నంటూ ఆశాభావం వ్యక్తంజేశారు. జిల్లాల వారీగా మాండలిక పదాలను సేకరించాలని, వాటిని చిన్నారులకు నేర్పాలని సాహితీవేత్త డా. బీరం సుందర్రావు చెప్పారు. స్వచ్ఛమైన తెలుగును కాపాడుకోవడానికి ఇదో మంచి మార్గమన్నది ఆయన సూచన!
న్యాయస్థానాల్లో తెలుగేది?
బ్రహోత్సవాల్లో రెండో సదస్సుకు సాహితీవేత్త డాక్టర్‌ నూకతోటి రవికుమార్‌ అధ్యక్షత వహించారు. ‘‘ఇంటర్‌, డిగ్రీల్లో విద్యాశాఖ అవలంబిస్తున్న విధానాల వల్ల కొన్ని లక్షలమంది విద్యార్థులు తెలుగుకు దూరమవుతున్నారు. సంస్కృతం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం వెంటనే దీనికి పరిష్కారం ఆలోచించాలి. కావ్యాల్లో ఉన్న అనేక పాత తెలుగు పదాలను సేకరించి పుస్తకాలు ప్రచురించాలి. అవి ప్రతి కళాశాల, పాఠశాలల్లో అందుబాటులో ఉంచాలి. విద్యార్థులు ప్రతిరోజూ తెలుగు దినపత్రికలు చదివేలా ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రోత్సహించాలి’’ అంటూ ఆయన ఆలోచనాత్మక సూచనలు చేశారు. ఈతరానికి చరిత్ర, సామాజిక శాస్త్రాల మీద అవగాహన ఉండట్లేదు. ఈ పరిస్థితి మీద విద్యాన్‌ జ్యోతి చంద్రమౌళి ఆందోళన వ్యక్తంజేశారు. ‘‘చాలా మందికి చరిత్ర అంటే చిన్నచూపు ఉంటుంది. చరిత్ర అంటే భాష, సంస్కృతుల సంగమం. ప్రతి జిల్లా చరిత్ర గురించి, అక్కడి యంత్రాంగం విద్యార్థులకు అవగాహన కల్పించాలి. తద్వారా స్థానిక భాష, ప్రాంత ఘనతల గురించి వాళ్లకి తెలుస్తుంది. వాటిని కాపాడుకోవాలనే స్పృహ పెరుగుతుంద’’ని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతి జిల్లాలో కొన్ని వందల శాసనాలు ఉంటాయి. ఇవన్నీ తెలుగు భాష ఎలా రూపాంతరం చెందిందీ స్పష్టంగా తెలియజేస్తాయి. వీటికి నకళ్లు తీయించి విద్యాసంస్థల్లో ప్రదర్శించాలి. భాషలో వచ్చిన మార్పులను చిన్నారులకు సమగ్రంగా వివరించాలి. అప్పుడే భాష పట్ల వాళ్లలో ఓ దృక్పథం ఏర్పడుతుంది’’ అని విశ్రాంత అధ్యాపకులు కొండా శ్రీనివాసులు చెప్పారు.
      ఆంగ్లేయుల కాలంలో తెలుగు వెలిగితే, ఇప్పుడు ఆంగ్లం రాజ్యంచేస్తోందని విశ్రాంత న్యాయమూర్తి కె.బాలకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తంజేశారు. ‘‘న్యాయస్థానాలకు వచ్చే కక్షిదారులు ఎక్కువ మందికి ఆంగ్లం తెలియదు. చట్టాల్లో ఏముందో తెలియదు. అయినా అక్కడ వాదనలు, ప్రతివాదనలన్నీ ఆంగ్లంలోనే జరుగుతుంటాయి. కక్షిదారులు బిక్కమొహం వేసుకుని చూస్తుంటారు. న్యాయవాదులు తనను తెలుగులో గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తారు. తన సమాధానాలను న్యాయమూర్తికి ఆంగ్లంలోకి అనువదించి చెబుతారు. కథ మొత్తం చిత్రంగా జరిగిపోతుంటుంది. ఇంతకంటే బాధ మరొకటి ఉంటుందా? అక్కడికి వచ్చినవాళ్లకి ఎవరికైనా న్యాయం పరాయిభాష ద్వారానే లభిస్తుందా? మనభాష ద్వారా అందదా? అనే సందేహం రావడం సహజం. 1974లోనే ప్రభుత్వం న్యాయపాలన తెలుగులోనే ఉండాలని ఉత్తర్వులు ఇచ్చినా ఇంతవరకు అతీగతీ లేదు. చిత్రమేమిటంటే ఆంగ్లేయుల కాలంలో వాదోపవాదాలు, తీర్పులన్నీ తెలుగులోనే ఉండేవి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తెలుగుకు స్వాతంత్య్రం పోయింది. చిన్న పదం తేడా వచ్చినా జీవితాలు మారిపోతాయి. కాబట్టి న్యాయవ్యవస్థలో తెలుగు కచ్చితంగా అమలు కావాలి’’ అన్న ఆయన ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. తెలుగునాట ప్రతి ఇల్లూ భాషానిలయం కావాలన్న ఆశాభావం సాహితీవేత్త పిన్ని వెంకటేశ్వర్లు మాటల్లో వ్యక్తమైంది. పిల్లలతో తెలుగులోనే మాట్లాడాలి. ఇతర దేశాల్లో స్థిరపడిన మనవాళ్లు తెలుగులో మాట్లాడేందుకు, రాసేందుకు ఆసక్తి చూపుతుంటే మనం మాత్రం ఆంగ్లం వైపు చూస్తున్నాం. అమ్మభాష అంటే మానవ వికాస విజ్ఞాన నేత్రమన్న సంగతి మరవకూడదని ఆయన హెచ్చరించారు. మొత్తమ్మీద ఈ బ్రహ్మోత్సవాలు భాషాభివృద్ధికి సంబంధించి విభిన్న కోణాలను చర్చకుపెట్టాయి. వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో జరగాల్సిన కృషిని ప్రస్తావించాయి. ప్రభుత్వంతో పాటు తెలుగువాళ్లందరూ భాగస్వాములైతేనే భాష పదికాలాల పాటు నిలుస్తుందన్న సత్యాన్ని విస్పష్టంగా ప్రకటించాయి.


భాషను కాపాడుకోవడం కేవలం ప్రభుత్వం బాధ్యతే కాదు.. ప్రజలందరిదీ. అందరూ కలిసి కృషిచేస్తేనే తెలుగు వెలుగుతుంది. ఇందుకే భాషా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే శ్రీకాకుళం, తెనాలి, అవనిగడ్డల్లో చేశాం. ఇది నాలుగోది. వచ్చే నెలలో నెల్లూరులో, తర్వాత అనంతపురంలో పెడుతున్నాం. ఎక్కడికక్కడ స్థానిక భాషాభిమానులు, సంస్థలు, ప్రజలను కలుపుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇది తొలిదశ మాత్రమే. ఆ తర్వాత కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సైతం నిర్వహిస్తాం. 

- దీర్ఘాసి విజయభాస్కర్‌


 


వెనక్కి ...

మీ అభిప్రాయం