జ్ఞాపకాల దొంతరలు పుస్తక తాంబూలాలు

  • 697 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఇంట్లో శుభకార్యం.. ఓ పెళ్లి... పేరంటం .. ఓ పుట్టినరోజు సంబరం.. షష్టిపూర్తి.. చిగురేసిన ఉత్సాహం.. మలివయసులో పాత మిత్రుల కలయిక.. ఇవన్నీ మనసును పులకింపచేసే సందర్భాలు. పదిమందితో పంచుకోవాలనుకునే ఉద్వేగాలు. కలలు పండిన క్షణాలు. అందుకే కమ్మని విందులు. కలబోసుకునే కబుర్లు. చిరకాలం నెమరేసుకునే సుమధుర సన్నివేశాలు. తమ ఇంటి పండగల జ్ఞాపకాలు ఆహూతుల మనసుల్లో నిలవాలనే అతిథేయి తహతహ నుంచి ‘తిరుగు బహుమతులు’ (రిటర్న్‌గిఫ్ట్‌) ఇచ్చే ఆనవాయితీ పుట్టింది.
      అయితే... ఇటీవల శుభకార్యాల సందర్భంగా, పుస్తకాలను పంచడం మొదలైంది. ఇది నిజంగా అద్భుత ఆలోచన. కమ్మటి విందుతో కడుపు నిండుతుంది. మంచి పుస్తకం చదివితే మనసు నిండుతుంది. అంతకు ముందు అడపాదడపా ఇలా పుస్తకాల ప్రదానం జరిగిన సందర్భాలు లేకపోలేదు. కానీ, ఇటీవల ఈ పొత్తాల పంపిణీ సత్సంప్రదాయంలా స్థిరపడుతోంది. అలా ప్రచురిస్తున్న పుస్తకాలు ప్రత్యేకతనూ కలిగి ఉంటున్నాయి. 
సేకరణలూ.. సంకలనాలూ!
పెళ్లిళ్లలో తిరుగు బహుమతులుగా ఇస్తున్న పుస్తకాలు కొన్నింటిలో పెళ్లిమంత్రాలకు అర్థాలను వివరిస్తున్నారు. పెళ్లిపాటలనూ  ముద్రించి పంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ వాళ్ల అమ్మాయి వివాహ సందర్భంగా ‘కల్యాణ సంస్కృతి- రామాయణ సాహితి’ పుస్తకాన్ని ముద్రించారు. పెళ్లి పరమార్థం, క్రతువులు, రామాయణాల్లో సీతారాముల కల్యాణ వర్ణనలను ఇందులో క్రోడీకరించారు. 
సాధారణ పౌరుల్లోనూ పరిశోధనాసక్తి ఉన్న వాళ్లుంటారు. ఈ విషయాన్ని మంగళగిరి సాక్షిగా నిరూపించారు మాదిరాజు గోవర్ధనరావు. వాళ్ల అమ్మాయి పెళ్లిని పురస్కరించుకుని ముద్రించిన పుస్తకంలో ఆయన వాళ్ల సొంతూరైన గుంటూరు జిల్లా మంగళగిరి గురించి ఎన్నో భౌగోళిక, చారిత్రక, పౌరాణిక నేపథ్యాలను చక్కగా వివరించారు. 
      అక్కడొకటీ, అప్పుడొకటీ మంచి కథ దొరికినప్పుడు చదువుతాం. మనసులో ఆ రుచిని పదిలంగా దాచుకుంటాం. కానీ.. మంచి కథలన్నీ ఏర్చి, కూర్చి పెళ్లి భోజనంతో పాటు మన చేతికి అందిస్తే పండగే కదా! అలాంటి అందమైన ప్రయత్నం చేసింది కృష్ణాజిల్లా తెన్నేరుకు చెందిన దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్‌. ఈ సంస్థ నిర్వాహకులు దేవినేని మధుసూదనరావు గుదిగుచ్చిన ‘మనసున మనసై’ కథల సంపుటిని బొల్లినేని లోకనాథ్‌, శాంతిశ్రీ దంపతుల కుమార్తె పెళ్లికి వచ్చిన వారికి పంచారు. ఇందులోని శ్రీరమణ ‘ధనలక్ష్మి’ కథ భార్యాభర్తలు ఒకరికొకరు ఎలా సర్దుకుపోవాలో చెబితే, సోమరాజు సుశీల ‘ఈవెంట్‌ మేనేజర్‌’ ఆడపిల్ల పెళ్లిని ఒడుపుగా గట్టెక్కించేసిన సరమ్మ సమయస్ఫూర్తిని వివరిస్తుంది. ఇలా ‘మనసున మనసై’లోని ప్రతి కథా ఓ ఆణిముత్యమే. ‘‘నా స్నేహితుడు ఒకాయన షష్టిపూర్తి వేడుకకు దాదాపు పది లక్షలు ఖర్చు పెట్టేందుకు సిద్ధపడ్డారు. ఇంత ఖర్చు పెట్టినా ఇవాళ తింటారు రేపు మర్చిపోతారు. ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవడానికి ఏం చేయాలంటే ‘మిథునం’ గురించి చెప్పాను. ఆయన కూడా బాగుంది వేద్దామన్నారు. ఆ పుస్తకం అచ్చు వేసి ఏడెనిమిదేళ్లయ్యింది. అలా చాలా పుస్తకాలు మా ఫౌండేషన్‌ తరఫున అందించాం. మా స్ఫూర్తితో చాలామంది ఇలాంటి పుస్తకాలు తీసుకొస్తున్నారు’’ అని చెప్పారు దేవినేని మధుసూదనరావు.
     వాళ్ల అబ్బాయి కీర్తికిరణ్‌ పెళ్లి సందర్భంగా తిరుపతికి చెందిన కోట పురుషోత్తం ప్రచురించిన ‘పుస్తక శుభలేఖ’ ఓ సృజనాత్మక సంకలనం. మహాత్మాగాంధీ, ఫూలే, కందుకూరి, ఆరుట్ల, చండ్ర, పుచ్చలపల్లి, తరిమెల లాంటి మహామహుల వైవాహిక జీవితాల్లోని స్ఫూర్తిదాయక విషయాలను వివరించే కథనాలను ఇందులో చేర్చారు. ‘‘పెళ్లి, పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం... ఇలా ప్రతి సందర్భానికీ ఒక పుస్తకం వేయాలని ఆలోచన. మా అబ్బాయి పెళ్లి సందర్భంగా ‘నువ్వు నేను’ పేరిట దాదాపు అయిదు వేల పుస్తకాలు ప్రచురించాం. చాలామంది ఉత్తరాలు, ఫోన్ల ద్వారా అభినందనలు తెలిపారు’’ అన్నారు కోట పురుషోత్తం. పుస్తకం నోరువిప్పని ఓ మహావక్త.. జీవితాన్ని సరైన మార్గంలో తీర్చిదిద్దుకోవడానికి ఉపకరించే విషయాలను ఇముడ్చుకున్న పుస్తకాలు పాఠకుల మీద సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతారాయన. 
మర్చిపోలేని బహుమతులు
కథారచయితల దగ్గరనించి నేరుగా పుస్తకాలను కొని వాటిమీద తమ ఇంటి వేడుకల వివరాలు, ఫొటోలు స్టిక్కర్లుగా ముద్రించి పెళ్లిళ్లలో బహుమతులుగా పంచుతున్న వారూ ఉన్నారు. రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి హాస్యకథల సంపుటాలను ఇలా తాంబూలంతో పాటు ఇచ్చిన సందర్భాలున్నాయి. రచయిత్రి వనజ తాతినేని వాళ్ల అబ్బాయి పెళ్లిలో పంచడానికి వేంపల్లె షరీఫ్‌ రాసిన ‘జుమ్మా’, ‘ప్రాతినిధ్య కథలు’ సంపుటాలను ఎంచుకున్నారు. వాటి ప్రతులను ఆహూ తులు తీసుకోవటానికి వీలుగా కల్యాణ వేదిక దగ్గరే చిన్న స్టాలు లాంటిదాన్ని ఏర్పాటు చేశారు. అలా తీసుకెళ్లిన ఒక వ్యక్తికి ఆ కథలు బాగా నచ్చాయి. దాంతో ఆయన ఓ పదమూడు కథలను కన్నడం లోకి అనువదింపజేశారు. అంతేనా! పుస్తకంగా అచ్చువేసి, ఆవిష్కరించారు కూడా. జ్యోతిషాచార్యులు సి.వి.బి. సుబ్రహ్మణ్యం వాళ్ల అబ్బాయి పెళ్లి నాడు గోరఖ్‌పూర్‌ ప్రెస్‌ ప్రచురించిన శ్రీమదాంధ్ర భాగవతాన్ని అతిథులకు పంచారు. 
     తమ కుమారుడు కౌటిల్య చౌదరి వివాహ సందర్భంగా జరిపిన ‘సదస్యం’లో (కవిపండితులకు సత్కారం) సంప్రదాయ పెళ్లిపాటలను పుస్తకంగా ప్రచురించి పంచి, ఆపాతమధురాలను గుర్తుచేశారు గుంటూరుకు చెందిన మద్దినేని నరసింహారావు దంపతులు. వరంగల్లుకు చెందిన కల్వా శివప్రసాద్‌, భాగ్యలక్ష్మి దంపతులు తమ కుమారుడు రాజేంద్ర వివాహానికి ప్రచురించిన పెళ్లి పత్రికనే ఒక సమాచార పత్రం, భక్తిసాహిత్య పొత్తంగా రూపొందించారు. ఇందులో, మొదటగా, పెళ్లి విందులో వడ్డించబోయే వంటకాల జాబితా, దాంతోపాటు రైల్వే, ఆర్టీసీ, తితిదే విచారణ వెబ్‌సైట్ల వివరాలు, వరంగల్లు లోని ప్రభుత్వ ఆసుపత్రులు, హోటళ్లు, గ్యాస్‌ ఏజెన్సీలు, వేడుకల వేదికల ఫోన్‌నంబర్లు తదితరాలతో పాటు భక్తిసాహిత్యాన్నీ పొందుపరిచారు. ‘‘సాధారణంగా వివాహ వేడుక ముగియగానే పెళ్లిపత్రికలను పక్కన పడేస్తాం. అలా పడేయకుండా దాన్నో జ్ఞాపకంగా ఉంచాలని, అందరికీ ఉపయోగపడాలని ఖర్చు ఎక్కువైనా ఇలా ముద్రించాం. చాలామంది బాగుందన్నారు’’ అని సంతోషపడ్డారు శివప్రసాద్‌. 
     గృహప్రవేశ సందర్భాల్లో  లలితా, విష్ణు సహస్ర నామాల్లాంటి భక్తి సాహిత్యాన్ని జేబుల్లో పట్టే పరిమాణంలో ప్రచురించి అతిథులకు ఇవ్వడం మామూలే. అయితే.. శాంతా బయోటెక్‌ అధినేత వరప్రసాదరెడ్డి కుటుంబం కొత్తింట్లోకి వెళ్లినప్పుడు ‘కానుక’ కథల సంపుటిని తిరుగు బహుమతిగా అంద జేశారు. దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్‌ ప్రచురించిన ఈ సంకలనంలోని ప్రతి కథా మానవీయ విలువలకు అద్దం పడుతుంది. 
పిల్లలకూ ఓ పుస్తకం
చిన్నతనంలో చేసిన అల్లరి, ఆడిన ఆటలు, గీసిన బొమ్మలు, రాసిన రాతలు ఎప్పటికీ గోరువెచ్చటి జ్ఞాపకాలే. వాటికి శాశ్వతత్వాన్ని ఆపాదించే దిశగా, పిల్లల పుట్టినరోజు పండగలకు వచ్చిన వారికి వాటిని ప్రచురించి బహూకరించటం ఇప్పటి ఆనవాయితీ. సిరిసిల్లకు చెందిన డా।। కందేపి ప్రసాదరావు, డా।। రాణీప్రసాద్‌ ఇలాంటి మంచి ప్రయత్నం చేశారు. తమ పిల్లలు స్వాప్నిక్‌, సృజన్‌లు రాసిన చిన్న వ్యాసాలు, గీసిన బొమ్మలను పుస్తకాలుగా ప్రచురించి, జన్మదినోత్సవ వేడుకల్లో పంచారు ఆ అమ్మానాన్నలు. ఇలాంటి వేడుకలకు పిల్లలే ఎక్కువగా వస్తారు. ఈ పుస్తకం చూసి వాళ్లూ ప్రేరణ పొందితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది?
పిల్లల పుట్టినరోజులే కాదు, పెద్దల షష్టిపూర్తులు, సహస్రచంద్ర దర్శనాల వంటి పండగల్లోనూ ఇలా పుస్తకాలను పంచుతున్నారు కొందరు. రచయిత్రి సుజలగంటి తన శ్రీవారి 70వ పుట్టినరోజున ‘హనుమచ్చరిత్ర’ పుస్తకాలు వెయ్యి ప్రతులను పంచారు. 
చదువుకునే రోజుల్లో స్నేహాలు మలివయసు లోనూ మనసుకు పట్టి ఉండే పరిమళాలు. భిలాయికి చెందిన గునుపూడి సీతాభాస్కరరావు తాను చదివిన జార్సుగూడ పాఠశాల మిత్రులను చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్న సన్నివేశాన్ని స్వగతం రూపంలో పుస్తకంగా ప్రచురించారు. ‘‘నా బాల్యమిత్రులు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. పదవీ విరమణ తర్వాత అందరం ఓ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంతో పాటూ, వాళ్లతో నా మధుర స్మృతులు ఓ చోట భద్రపరచాలని ‘చిన్ననాటి చెలిమి- మరపు రాని ఘట్టాలు’ పుస్తకాన్ని తీసుకొచ్చాను. మిత్రులందరికీ ఈ పుస్తకాన్ని పంపించాను. పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని వాళ్లందరూ చెప్పార’’ంటూ సంతోషపడ్డారాయన.
     తన అన్నకూతురు అన్షు ఓణీ వేడుక సందర్భంగా, తాడేపల్లిగూడేనికి చెందిన ‘యశస్వి’ సతీశ్‌ ‘బాబాయి కవితలు’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. ‘‘చంద్రవంక మా వాకిలిలో కురిపించే/ వెన్నెల వెల్లువ నీ నవ్వు/ పంచిపెట్టుకునే మా పళ్లతోటలో విరిసిన పువ్వు నువ్వు’’ అంటూ ఆ చిన్నారి మీద తన ప్రేమను వ్యక్తీకరించారు.
మరణంలోనూ జీవితేచ్ఛ! 
కష్టసుఖాలను కలబోసుకున్న ఆత్మీయులు మరణించినప్పుడు వారి గొప్పతనాన్ని, వారు చూపిన మమతానురాగాలను, చేసిన సేవలను అదేపనిగా గుర్తుతెచ్చుకుంటాం.  ఆ జ్ఞాపకాలను చిన్న పొత్తంలో ఇమిడ్చి నలుగురితో పంచుకోగలిగితే, అది కొంత ఆత్మతృప్తిని కలిగిస్తుంది. కలిసి జీవితమంతా నడిచిన భార్య కావచ్చు, కళ్లల్లో పెట్టుకుని చూసుకున్న భర్త కావచ్చు, కనిపెంచిన తల్లిదండ్రులు కావచ్చు, రక్తంతో పాటు ఆపేక్షలనూ పంచుకున్న అన్న, చెల్లి, అక్క, తమ్ముడు ఎవరైనా వాళ్ల స్మృతులను కూర్చిపేర్చిన సాహిత్యాన్ని వారి గుర్తుగా పొత్తంగా ప్రచురించి ఆత్మీయులకు అందచేసే ఆలోచనే విశేషమైంది. సాకం మోహన్‌శెట్టి స్మృతిలో సోదరులు అచ్చొత్తించి పంచిన ‘తమ్ముడి ఉత్తరం’ కంటతడి పెట్టిస్తుంది. అన్నదమ్ముల ప్రేమకు అద్దంపట్టే ఈ కథ సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి రచన. ‘‘మోహన్‌ బ్యాంకు ఉద్యోగి. తను చనిపోయాడు.. మరి రాడు.. అయినా తను అందరి జ్ఞాపకాల్లో ఉండాలని ఈ పుస్తకాన్ని వెలువరించాం. ఇలాంటి వాటితో సాహిత్య, సామాజిక ప్రయోజనాలు రెండూ నెరవేరతాయి’’ అన్నారు మోహన్‌ వాళ్లన్నయ్య సాకం నాగరాజ. ‘తమ్ముడి ఉత్తరం’ కథ- జీవితేచ్ఛ జీవించటంలోనే కాదు, మరణించటంలోనూ ఉంటుందన్న సున్నితమైన సత్యాన్ని తెలియజెపుతుంది. 
ఇక ‘పెద్దక్క ప్రయాణం’ ఓ స్మృతిగుచ్ఛం. ఒక మనిషి తన ఉనికి నుంచి తప్పుకోవటం భౌతికంగానే కాక, చాలా పార్శ్వాల్లో, చాలా రూపాల్లో ఉంటుందన్న రహస్యాన్ని ఈ పుస్తకం విశదం చేస్తుంది. రొమ్ముకాన్సర్‌తో మరణించిన తమ పెద్దక్క స్థైర్యాన్ని చనిపోతానని తెలిసి కూడా హుందాగా, ధైర్యంగా ఎలా గడిపారన్న విషయాల్ని జ్ఞాపకాల పరిమళాల్లో రంగరించి పంచారు విశాఖకు చెందిన రచయిత్రి మల్లీశ్వరి. 
కల్లాకపటం లేని స్వచ్ఛమైన, నిజాయతీ, నిరాడంబరతలతో పరిపూర్ణమైన పదహారణాల పల్లెటూరి రైతు జీవనచిత్రం ‘మట్టిమనిషి మా నాన్న’ వ్యాసం. తన జీవితాన్ని తృప్తికీ, నిసర్గ సంతోషానికీ నిర్వచనంగా చేసుకున్న నాన్న మానుకొండ వెంకటయ్య జ్ఞాపకాల మట్టిపరిమళాలను మనసులకు పట్టేటట్లుగా అక్షరాల్లో గుదిగుచ్చారు ఈనాడు పాత్రికేయ పాఠశాల ప్రధానాచార్యులు నాగేశ్వరరావు. నాన్నకి జేజే’ పేరిట ప్రచురించిన పుస్తకంలో తన వ్యాసంతో పాటు కొ.కు, అడవి బాపిరాజు, పుట్టపర్తి లాంటి ప్రాతఃస్మరణీయులను గురించి, వారి పిల్లలు పంచుకున్న మధుర స్మృతులను సేకరించి జోడించారు. ఈయనే వాళ్ల అమ్మాయి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్తున్న సందర్భంలో ‘సుదీప్తికి విజయోస్తు’ పుస్తకాన్ని ప్రచురించారు. అమ్మానాన్నల ఆశలు, ఆకాంక్షలు, దూరతీరంలో ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జీవితాన్ని స్వతంత్రంగా మలచుకోవడానికి ఏం చెయ్యాలి.. వంటి అంశాలన్నీ అందులో గుదిగుచ్చారు. దీన్ని చాలామంది అమ్మానాన్నలు వాళ్ల పిల్లలకు బహూకరించారు. 
సిరిసిల్లకు చెందిన ‘ఈనాడు’ గ్రామీణ విలేకరి తవుటు నాగభూషణం దూరమైనప్పుడు ‘భూషణంతో సంభాషణ’ పుస్తకాన్ని వెలువరించారు మిత్రులు. దాన్లో తమ జ్ఞాపకాలను గుదిగుచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేషీలో పని చేస్తున్న ఐఏఎస్‌ అధికారి ఎ.వి.రాజమౌళి కూడా దివంగత మాతృమూర్తి జ్ఞాపకాలతో ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆంధ్ర విశ్వ విద్యాలయానికి చిరకాలం సేవలందించిన కాట్రగడ్డ శారద స్మృతిలో ఆవిడ భర్త విశ్రాంత ఆచార్యులు వెంకటేశ్వర్లు ప్రతీ సంవత్సరం ఒక పుస్తకాన్ని ప్రచురించి పంచి పెడుతున్నారు. 2015లో ‘అమ్మకు జేజే, నాన్నకు జేజే, గురువుకు జేజే’ పుస్తకాన్ని పునర్ముద్రించి, అందించారు. ఆ తర్వాతి ఏడాది ‘ప్రకృతి నేస్తాలు’ పేరిట రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని అందించే 50 వ్యాసాల సంకలనాన్ని రెండు రాష్ట్రాల్లోని గ్రామ గ్రంథాలయాలకు పంపిణీ చేశారు.
      ఇలా సందర్భానికి అనుగుణంగా పుస్త కాలను ప్రచురించి పంచే ఈ ఆనవాయితీ ఇంకా ఊపందుకోవాలి. పుస్తకాలు చదివే అలవాటును పునరుద్ధరిస్తున్న ఈ సంప్రదా యాలు తెలుగునాట మారుమూలలకూ చేరాలి. ఎందుకంటే.. చీరె పెడితే చిరిగి పోతుంది. అన్నం పెడితే అరిగి పోతుంది. అదే పుస్తకం చేతిలో పెడితే, అది అందించే స్ఫూర్తి పదికాలాల పాటు నిలుస్తుంది.


శుభకార్యాల్లో అతిథులకు బహుమతులుగా వస్తువులు ఇవ్వడం నాకెందుకో ఇష్టంగా అనిపించదు. వస్తువులు ఉపయోగపడవచ్చు, పడకపోవచ్చు. అందుకే నాకిష్టమైన మన భాష, సాహిత్యం, సంస్కృతుల కోణంలో ఏదైనా బహుమతులు ఇవ్వాలని ఆలోచించాను. అదే పుస్తకం అయితే ప్రభావవంతంగా ఉంటుంది. చదివే అలవాటు లేని వాళ్లకు కూడా ప్రత్యేక సందర్భాల్లో పుస్తకాలు ఇవ్వడం ఆసక్తి కలిగిస్తుంది. మా పెద్దమ్మాయి పెళ్లికి మన కావ్యాల్లో పెళ్లిళ్ల వర్ణనలను సేకరించి పుస్తకంగా వేశాం. రెండో అమ్మాయి పెళ్లికి ‘అవనిజ కళ్యాణం’ పుస్తకం వేశాం. మా ఇద్దరు మనవరాళ్ల తొలి పుట్టినరోజు వేడుకల్లోనూ బాలగేయాల పుస్తకాలు వేయించి పంచిపెట్టాం.  

- మండలి బుద్ధప్రసాద్‌, ఉప సభాపతి, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ


మా నాన్నది పరిపూర్ణ జీవితం. కల్లాకపటం, దిగులూ విచారం, భయాలూ భ్రమలూ లేకుండా 90 ఏళ్లు జీవించారు. నిండు నూరేళ్లు జీవిస్తారని నమ్మేవాణ్ని. కారణం తనది అత్యంత సహజసిద్ధమైన జీవనశైలి. మనసులో, మాటలో, చేతలో మర్మం ఉండేది కాదు. మా నాన్న చదువుకోని తాత్త్వికుడు. ప్రకృతి ప్రేమికుడు. మేము అయిదుగురం సంతానం. మా ఇంట్లో మేమెంతో, మా గొర్రెలూ, బర్రెలూ, ఎద్దులూ అంతే. సమానంగా చూసేవాడు. పొలాలూ, పంటలూ అన్నా అంతే ప్రాణం. మా ఊరు, గ్రామస్థులు, పోలేరమ్మ గుడి, నడిబజారు, ఇల్లు, పశువుల కొట్టం, పొలం ఇవే ఆయన లోకం. ఒక్క ముక్క ఇంగ్లీష్‌ లేకుండా మాట్లాడేవాడు. స్నేహితులకు మా నాన్న సంగతులు చెప్పినప్పుడల్లా ఆసక్తిగా వినేవారు. అందుకనే ఆ కబుర్లతో పుస్తకం వేద్దామన్న ఆలోచన వచ్చింది. 11వ రోజు పెద్దకర్మ నాటికే పుస్తకం తెచ్చాం. మా నాన్న గురించి ఒక పెద్ద వ్యాసం, తిరుపతికి చెందిన స్నేహితుడు జుజ్జవరపు దుర్గాప్రసాద్‌ అప్పటికే ప్రచురించిన సంకలనంలోని వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ఇలా చేయడం మా ఊర్లో అదే మొదలు. బంధు మిత్రులు ఈ ప్రయత్నాన్ని ఎంతో మెచ్చుకున్నారు. దుఃఖాన్ని త్వరగా మర్చిపోయి, నాన్న నమ్మకాలూ, ఆ కాలం విలువలూ నెమరు వేసుకోవడానికి ఈ పుస్తకం సాయపడింది. 
మా అమ్మాయి సుదీప్తి పైచదువుల కోసం 2015 ఆగస్టులో అమెరికా వెళ్లింది. అంతకు కొద్దిరోజుల ముందే నాకు పెద్ద ప్రమాదం జరిగింది. ప్రయాణం దగ్గరపడినా, ప్రమాద దుఃఖం నుంచి కుటుంబ సభ్యులెవరూ కోలుకోలేదు. అమెరికా వెళ్లడానికి వారం ముందు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశాం. ఆప్తులు, బంధుమిత్రులు, తన స్నేహితులు వచ్చారు. నేను చక్రాల కుర్చీలోనే వెళ్లాను. ఆ సందర్భంగా ‘‘సుదీప్తికి విజయోస్తు’’ పేరుతో పుస్తకం వేశాం. సుదీప్తి భవిష్యత్తు గురించి మా ఆకాంక్షలూ, అమెరికా వెళ్లే పిల్లలు గుర్తు పెట్టుకోవాల్సిన సంగతులూ, పరాయిదేశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలూ ఇందులో రాశాం. ఈ విషయాలు విదేశాలు వెళ్లే విద్యార్థులందరికీ వర్తించేవే! చాలామంది స్నేహితులు వాళ్ల పిల్లల కోసం ఆ పుస్తకం సాఫ్ట్‌కాపీని అడిగి తీసుకున్నారు. పిల్లల పట్ల ప్రేమనీ... వాత్సల్యాన్నీ వ్యక్తీకరించడానికే కాక, మన ఆకాంక్షల్ని తెలపడానికి కూడా ఇలాంటి చిన్న చిన్న పుస్తకాలు ఉపయోగపడతాయని అర్థమైంది. 

- మానుకొండ నాగేశ్వరరావు, ప్ర‌ధానాచార్యులు, ఈనాడు పాత్రికేయ పాఠ‌శాల‌


మా అమ్మ ఒడిలో, నాన్న బడిలో చదువుకోవడం వల్లే ఐఏఎస్‌ అయ్యాను. నాన్న రామబ్రహ్మం తాత్త్వికులు. గొప్ప చదువరి. రుషితుల్యులు. కుటుంబాన్ని తీర్చిదిద్దింది మాత్రం అమ్మ లీలా రత్నకుమారే. తన చదువు హైస్కూల్‌ దాటకపోయినా జీవితాన్ని బాగా చదివారు. అమ్మ చెప్పిన ఆణిముత్యాల్లాంటి జీవిత సత్యాలు, చెప్పకుండా ఆచరించి నేర్పిన విలువలు నిత్యం గుర్తొస్తూనే ఉంటాయి. 2016లో కాలం చేసిన అమ్మ జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ అప్పుడప్పుడూ రాసిన విషయాలతో 2017లో పుస్తకంగా వేశాం... ‘‘అమ్మ ఒడి... విలువల గుడి’’ పేరుతో. చదివిన మిత్రులు, బంధువులు అమ్మలో వాళ్ల అమ్మలను చూసుకున్నట్లు చెప్పారు. అమ్మానాన్నల్ని వృద్ధాప్యంలో బాగా చూసుకోలేక పోయామని కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. అమ్మని విగ్రహ రూపంలో ఇంట్లో పెట్టుకున్నాం. పుస్తక రూపంలో గుండెల్లో దాచుకున్నాం. దీని ద్వారా భవిష్యత్తు తరాలకు అమ్మ స్ఫూర్తి అందితే అది మా అదృష్టం. 

- ఎ.వి.రాజమౌళి, ఐఏఎస్ అధికారి


 


వెనక్కి ...

మీ అభిప్రాయం