పడి పడి భలే భలే

  • 1029 Views
  • 0Likes
  • Like
  • Article Share

    అయ్యగారి శ్రీనివాసరావు

  • విజయనగరం
  • 9440108820
అయ్యగారి శ్రీనివాసరావు

‘పడ్డ’వాడెప్పుడూ చెడ్డవాడు కాదు’ అంటూండేది మా బామ్మ. ఆ మాట విన్నప్పుడల్లా మా తెలుగు మాస్టారు, ఆయన చెప్పే వ్యతిరేక పదాలు గుర్తొచ్చేవి. ‘చెడ్డవాడు కాదు’ అంటే.. ‘మంచివాడు’ అని అర్థం. అంటే.. తగిలితే రెండు దెబ్బలు తగిలినా, ‘కిందపడిన వాళ్లందరూ మంచివాళ్లే!’ అనే ధ్రువపత్రానికి అర్హులైనట్టే కదా? పాపం.. పడకుండా ఉండేవాళ్లే చెడ్డవాళ్లు అనే నిశ్చయానికి వచ్చేశాను. అలా అపోహ‘పడిన’ నేను ఆ ఆలోచనను మార్చుకోవాల్సి వచ్చింది, కొన్ని సంఘటనల వల్ల. అవేంటంటే... ఆ మధ్య మా ఎదురింట్లో దొంగలు‘పడ్డారు’. ఇరుగుపొరుగు వారంతా ఏమేమి పోయాయి! అని ఆత్రుత‘పడి’ అడుగుతున్నారు. అంతేతప్ప ఏ ఒక్కరూ ఆ దొంగలకేమైనా దెబ్బలు తగిలాయా? అనడగటం లేదు. దొంగ పడితే కాళ్లో, చేతులో, మరేదో, మరేదో విరగాలి గానీ ఈ పోవడమేంటి మధ్యలో! అనిపించింది. అదీగాక దొంగతనం చెడ్డపని కదా, మరి ఆ పని చెయ్యడానికి పాలు‘పడ్డ’వాడు మంచివాడు ఎలా అవుతాడు చెప్మా అని ఆలోచనలో ‘పడ్డాను’. అంతేతప్ప ఎవర్నీ అడగలేదు. అడిగితే ప్రమాదంలో ‘పడతాన’ని భయ‘పడ్డాను’. అయితే దానికి సమాధానం నేను పెద్దయ్యాక అంటే... చదువులో ‘పడ్డాక’ దొరికింది. ‘పడ్డవాడు అంటే మాట తిన్నవాడు’ అనీ, చొరబడు అనే పదానికి సంక్షిప్తరూపం పడటం అనీ. దాంతో నాకింకో కొత్త విషయం బోధ‘పడింది’. చోరులు పడతారు కాబట్టి ‘చొరబడటం’ అనే పదం ఏర్పడింది.. ఇది నేను అభిప్రాయ‘పడటమే’గాని నిజం కాకపోవచ్చనుకోండి.
      పడేవాటిలో అనేక ప్రదేశాలు, పదార్థాలు, సందర్భాలు, విషయాలు ఇలా వేర్వేరుగా ఉంటాయి. కాదు.. కాదు.. భాషా పరిణామక్రమంలో అవి అలా విభజితమయ్యాయి. ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా పడుతుందో చెప్పలేం. అలా పడిన జీవితాన్ని ఏ మలుపు తిప్పుతుందో కూడా చెప్పలేం. ఆనందంలోనైనా పడవచ్చు. ఆపదలోనైనా పడవచ్చు. అవి ఎలాంటివి? అని ఆత్రుత ‘పడుతున్న’ వారు చెవులు ఇలా పడేస్తే కొన్ని ఉదాహరణలు మీ చెవిన ‘పడేస్తాను’.
      ప్రేమలో ‘పడిన’ వాడికి అందులో నుంచి పైకి లేవలేని పరిస్థితి కలుగుతుందని ఎప్పుడో రాసి ‘పడేశారు’ ఓ సినీకవి. ఆ పాటేంటంటే ‘‘ఏమయ్యా, ప్రేమయ్యా, ‘పడితే’ లేవవు ఓ భయ్యా’’ అని. రాయడమే కాకుండా పిఠాపురం నాగేశ్వరరావుతో పాడించారు కూడా. అందులో పడితే అంత గాఢంగా ఇరుక్కుపోతారు. ఒక పట్టాన బయట ‘పడలేరు’. కాబట్టి ప్రేమలో ‘పడకుండా’ జాగ్రత్త ‘పడటం’ ఒక్కటే మార్గం.
      ‘‘కెరటం నాకు ఆదర్శం. ‘పడినందుకు’ కాదు. పడినా లేచినందుకు’’ అన్నారో కవి. ‘పడ్డవాడు’ మట్టిముద్దలా నేలకి అతుక్కుపోకుండా బంతిలా పైకి లేవాలి. అలా అయితేనే జీవితంలో విజయం సాధించినట్టు. ‘‘పడిలేచే కెరటం చూడు. పడుచు పిల్ల అందం చూడు’’ అనే పాటలో పడుచు పిల్ల అందాన్ని కెరటంతో పోల్చిన తీరు అబ్బురపరుస్తుంది. 
      కప్పలు కూస్తే వర్షం ‘పడుతుంద’ని ఓ నమ్మకం. అలాగని కప్పల వెంట‘పడితే’ మోచిప్పలు పగిలిపోతాయి. కష్ట‘పడి’ సుఖ‘పడ’మన్నారు కదా. అది నమ్మిన ఓ ఆసామి కష్టపడి ఇల్లుకొన్నాడు. ఆ తర్వాత సుఖం కోసం కల్లుతాగి దాన్ని తగలబెట్టుకున్నాడట. ఇక కింద‘పడ్డా’ మీసాలకు మన్ను కాలేదని మురిసిపోయేవాళ్లు, కింద‘పడ్డా’ పైచెయ్యి నాదేనని వాదించేవాళ్లకు ఈ లోకంలో కొరత లేదు. వాళ్ల సంగతి అలా ఉంచితే సామాన్యులకు మాత్రం కడుపు చించుకుంటే కాళ్ల మీద ‘పడు’తుంది. 
      మోజు ‘పడి’ పెళ్లిచేసుకున్నాడో ఆసామి. అదిరిందయ్యా సామీ. కొత్త భార్య.. కొత్త కాపురం.. కొత్త సరదాలు.. అని జనాలు తెగ పొగిడేస్తూంటే, అబ్బో.. తెగ ఆనంద‘పడిపోతున్నా’డా అర్భకుడు. అలాంటి సమయంలో భార్యామణి కంట్లో ఖరీదైన వస్తువొకటి ‘పడింది’. ఆమె దానిమీద మోజు ‘పడింది’. దాన్ని కొనిపెట్టమని ప్రేమగా.. గోముగా ప్రాధేయ‘పడింది’. ఆ మాటలు అతని చెవిన ‘పడగానే’ గుండెల్లో రాయి‘పడింది’. దాంతో అయోమయంలో ‘పడ్డాడు’. అయినా ధైర్యం తెచ్చుకుని అది తన తాహతుకి మించిన కోరిక కాబట్టి తీర్చలేనని మొహమాట ‘పడుతూనే’ చెప్పాడు. ఆ మాట విన్న భార్య అతడి మీద జాలి ‘పడలేదు’ సరికదా ‘పడిపడి’ నవ్వింది. తాను చెప్పేది నిజమేనని రెట్టించి చెప్పేసరికి నవ్వు ఆపేసి అతడి మీద మండి‘పడింది’. దాంతో అతడు ఎంతో బాధ‘పడ్డాడు’.
      పడేవాళ్లని చూసి జాలి‘పడటం’ మానేసి పండగ చేసుకుంటారు కొందరు. చంటిబిడ్డ తొలిసారిగా బోర్లా ‘పడిందను కోండి’, వాళ్లమ్మ భలే ముచ్చట‘పడి’పోయి బొబ్బట్లు చేస్తుంది. ఆ బిడ్డ పెద్దయ్యాక ఆటల్లో ‘పడి’ చదువు ‘పాడు’ చేసుకోకుండా జాగ్రత్తలు ‘పడుతుంది’. ఆ బిడ్డ బాగా చదివి ఉద్యోగంలో స్థిర‘పడ్డా’డనుకోండి, ఆ తల్లిదండ్రులెంతో ఆనంద‘పడి’పోతారు. ఈ కాలమాన పరిస్థితుల్లో ఆ మగపిల్లాడికి మూడుముళ్లు ‘పడితే తెగ సంబర ‘పడిపోతారు’. (అది అంత సులువు కాదనుకోండి. ఎందుకంటే .. ముప్పుతిప్పలు ‘పడి’ మూడు చెరువుల నీరు తాగితేగానీ ఈ తరం మగపిల్లలకి పెళ్లి యోగం కలగట్లేదు)
      ఆధార‘పడటం’, ప్రాధేయ‘పడటం’, సాగిల‘పడటం’, వెంట‘పడటం’, ఈండ్ర‘పడటం’, కాళ్లావేళ్లా‘పడటం’, పాట్లు- కునికిపాట్లు‘పడటం’, బొక్కబోర్లా‘పడటం’, తారస‘పడటం’, అబ్బుర‘పడటం’... తంతే బూరెలబుట్టలో‘పడటం’, రొట్టె విరిగి నేతిలో‘పడటం’, గండం గడిచి పిండం బయట‘పడటం’, గొంతులో పచ్చివెలక్కాయ ‘పడటం’, గండి‘పడటం’ భంగ‘పడటం’, అబ్బో... ఎన్ని రకాల పడటాలున్నాయో. కుడితిలో ‘పడ్డ’ ఎలుక, కంపలో ‘పడ్డ’ గొడ్డు, చేలో ‘పడ్డ’ గుడ్డెద్దు, గొర్రెల మందలో ‘పడ్డ’ తోడేలు, చెరకు తోటలో ‘పడ్డ’ ఏనుగు... సకల జీవులనూ ఇలా పోలికల్లోకి తీసుకొచ్చి పడేసే జాతీయాలూ ఎన్నెన్నో. 
      ఏది, ఎలా పడినా ఫర్వాలేదు కానీ.. మూలన‘పడటం’ మాత్రం మంచిది కాదు. అంటే, మంచాన‘పడటం’ అన్నమాట. అయినా.. మనుషులేంటి ఖర్మ! ఎన్నో మూలన పడుతూనే ఉన్నాయి. టీవీలు, సెల్‌ఫోన్ల ప్రభావంతో పుస్తకాలు, ప్రేమ వ్యవహారంలో పడి చదువులూ మూలన పడుతున్నాయి. వాటి మోజు నుంచి ఎంత తొందరగా బయట‘పడితే’ అంత  మంచిది. అందరూ స్థిమితపడతారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం