కథానిక అంటే ..?

  • 11876 Views
  • 56Likes
  • Like
  • Article Share

    ఎం.ఎన్‌.వి.సూర్యకుమారి

  • తెలుగు అధ్యాపకురాలు, డీఆర్‌జీ మహిళా డిగ్రీ కళాశాల
  • తాడేపల్లిగూడెం
  • 8500711209
ఎం.ఎన్‌.వి.సూర్యకుమారి

యూజీసీ ‘నెట్‌’ జులై 8న జరగబోతోంది. దీని తెలుగు ప్రశ్నపత్రం పాఠ్యప్రణాళికలో ‘చిన్నకథ/ కథానిక పుట్టుక- పెరుగుదల’ ఓ భాగం. ఇతర పోటీపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకూ ఇది అధ్యయనం చేయాల్సిన ముఖ్యాంశమే. ఈ నేపథ్యంలో కథానిక స్వరూప స్వభావాలు, తెలుగులో దాని ఆవిర్భావ వికాసాల సింహావలోకనమిది..!
ఆధునిక
కాల్పనిక సాహిత్య ప్రక్రియలన్నిటిలో ‘కథానిక’ది ప్రముఖ స్థానం. నిజానికిది పాశ్చాత్య సాహితీ సంప్రదాయం. అక్కడి రచయితల ప్రభావంతో మన భాషలోకి వచ్చిందీ ప్రక్రియ. ఆంగ్లంలోని ‘షార్ట్‌ స్టోరీ’నే మనం ‘కథానిక’గా పిలుచుకుంటున్నాం. అయితే, మొదట్లో ‘షార్ట్‌’ను మనవాళ్లు ‘చిన్న’ అని అనువదించి, షార్ట్‌ స్టోరీని ‘చిన్నకథ’ పేరిట వ్యవహరించేవారు. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి 1936లో ‘ప్రతిభ’ పత్రికలో ఓ వ్యాసం రాస్తూ.. ‘షార్ట్‌ స్టోరీ’కి ‘కథానిక’ అనే పదాన్ని ఉపయోగించడం మంచిదని సూచించారు. నిత్యవ్యవహారంలో మాత్రం ఎక్కువమంది దీన్ని ‘కథ’గానే పిలుస్తారు.
       ‘కథానిక’ బయట నుంచి రావడ మేంటి? అనే ప్రశ్న ఉదయించవచ్చు. ప్రాచీన తెలుగు సాహిత్యంలో కథలున్నట్లు స్పష్టంగా చెప్పలేం. మొదట్లో అవి గ్రంథస్థం కాకపోయినా వాగ్రూపంలో ఉండవచ్చు. క్రమేణా కావ్యాల్లోనూ, ద్విపదల్లోనూ కథలు చోటుచేసుకున్నాయి కానీ, పూర్తిగా వచన రచన రూపంలో మాత్రం కనిపించవు. ప్రాచీన తెలుగు కథాసాహిత్యంలో కేతన (క్రీ.శ.1255) ‘దశకుమార చరిత్ర’ ప్రథమ గద్య పద్యాత్మక రచన. అనంతామాత్యుడి ‘భోజరాజీయం’, జక్కన ‘విక్రమార్క చరిత్ర’, వెన్నెలకంటి అన్నయ్య ‘షోడశకుమార చరిత్ర’, కొఱవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశిక’, కదిరీపతి ‘శుకసప్తతి’, నారాయణకవి ‘హంస వింశతి’, తురగా వెంకటరాజు ‘మర్యాదరామన్న చరిత్ర’ తదితరాలు ఇలాంటివే. వీటితో పాటు పేదరాశి పెద్దమ్మ కథలు, కాశీమజిలీ కథలు, పిట్ట కథలు లాంటివి కూడా చాలా ఉన్నాయి. ఆధునికుల్లో పరవస్తు చిన్నయసూరి, కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, వేదం వేంకట రాయశాస్త్రి సంస్కృత సాహిత్యం నుంచి అనువాదం, అనుసరణ ద్వారా ఎన్నో కథల్ని తెలుగులోకి తెచ్చారు. 
కథానిక- నిర్వచనం
వేదం వారు సూచించిన ‘కథానిక’ అనే పేరుకు స్ఫూర్తి ‘అగ్నిపురాణం’లోని దాని ప్రస్తావన. అలాగని ప్రాచీన సంస్కృత వాఙ్మయంలో కథానికలు ఉండేవని చెప్పడానికి లక్ష్యభూతమైన ఆధారాలు లేవు. కానీ.. అగ్నిపురాణంలోనూ, ధ్వన్యాలోకంలోనూ, కథానికను ఒక గద్యకావ్య ప్రభేదంగా పేర్కొన్నారు. ‘‘అఖ్యాయికా, కథా, ఖండ కథా, పరికథా, తథా/ కథానికేతి మన్యంతే గద్యకావ్యంచ పంచధా’’ అంటుంది ‘అగ్నిపురాణం’. ఈ పురాణకర్త కథానికను ఒక ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా గుర్తించి, దానికి లక్షణ నిర్దేశం చేశాడు. ఆదిలో భయానకం, మధ్యలో కరుణం, అంతంలో అద్భుతం అనే మూడు రసాలుంటూ, క్లుప్తంగా అనుదాత్తంగా చేసిన రచన కథానిక అవుతుందన్నాడు. అయితే.. ‘షార్ట్‌స్టోరి’కి పాశ్చాత్య విమర్శకుల నిర్వచనాలు మరోలా ఉంటాయి. ‘‘ఒకే ఒక సంఘటనను- అది వాస్తవమైనదైనా, అభూత కల్పనతో కూడుకున్నదైనా- చిత్రించే సాహితీ ప్రక్రియ షార్ట్‌ స్టోరీ’’ అని చెప్పారు ఎడ్గార్‌ ఎలెన్‌పో. ‘‘ఆద్యంతాలు లేనిదే అసలైన కథానిక’’ అన్నది చెకోవ్‌ మాట. ఇక హెన్రీథామస్‌ ఏమో ‘‘కథంటే కథన రూపంలో ఆవిష్కృతమయ్యే భిన్ననాటకం’’ అన్నారు. తెలుగు సాహితీవేత్తల్లోనూ కొందరు సుప్రసిద్ధులు ‘కథానిక’ అంటే ఏంటో తమతమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. అవి చూద్దాం.. 
       ‘‘చిన్న కథకి ప్రధాన లక్షణం కేంద్రకం. కథలో ప్రతీచిన్న విషయమూ ఆ కేంద్రాన్ని సూచిస్తూ ఉండాలి. కథానికకు కేంద్రంగా ఒక విస్పష్టమైన సంఘటన, ఒక విచిత్రమైన వ్యక్తి, ఒక మనఃస్థితి రెండు స్వభావాల తారతమ్యం వల్ల వచ్చే నాటకీయత ఇలా ఏదో ఒకటి ఉండాలి. కథానిక ఒక మెరుపు వంటిది. దానిలో వేగం ప్రధానం. వైచిత్రి కథానికకు ప్రాణం. కథానికకు ప్లాట్‌ అనేది అనవసరమని నా అభిప్రాయం. శిల్పం మీద దృష్టిని కేంద్రీకరించి మరీ రాయలేకపోతే కళ్లెం లేని గుర్రంలా అది తిరిగి తిరిగి గమ్యం లేని ప్రదేశాన్ని చేరుకుంటుంది’’  - పాలగుమ్మి పద్మరాజు 
       ‘‘కథను ఏ రూపంలో రాసినా కథ ద్వారా పాఠకులకు ఒక సంస్కారాన్ని, ఒక కొత్త దృష్టినీ కలిగించడం ముఖ్యం’’ 

- గోపీచంద్‌

కథానిక - స్వరూపం
‘‘చిన్న కథ రాయడం పెద్ద కష్టం’’ అంటారు మంజుశ్రీ. ‘‘మంచి నవల రాయడం కన్నా గొప్పకథ రాయడం గొప్ప కష్టం. చెప్పుకోదగ్గ శిల్పం’’.. ఇలా అనడానికి కారణం, కథానిక అన్నది నిష్టగా, నిర్భరంగా సాగాల్సిన రచనా ప్రక్రియ. దానికి పడాల్సిన క్లేశం ఎక్కువ. చెక్కాల్సిన శిల్పం ఎక్కువ. అందువల్లే ప్రక్రియా స్వరూప స్వభావాల పరిశీలనకూ, కల్పనాశిల్ప దృష్టికీ ప్రాముఖ్యం ఏర్పడింది. కథానికలను త్రిమితీయంగా విశ్లేషించవచ్చు. ఆ విభాగాలు మూడు. 
      రచనకు మూలభూతమై ప్రేరక బీజంతో మొదలుకుని పరమార్థ సంసిద్ధి పర్యంతం సాగే అంతఃస్రోతస్విని వస్తుగత విభాగం. ఇందులో గమనించాల్సినవి.. కథాబీజం, కథావస్తువు, ఇతివృత్తం, పరమార్థం. ఆది నుంచి అంతం వరకు వివిధావయవ సుసంఘటితమైన కథాశరీరం రూపగత విభాగం. దీన్లో పరిశీలించాల్సిన విషయాలు.. ఎత్తుగడ, నడక, విషమస్థితి, పట్టు (లేదా) పరాకాష్ట, విడుపు, ముగింపు. అవయవ సంఘటన కావించి, సౌష్టం చేకూర్చి, సౌందర్యం పోషించే వివిధాంశ సమాహారం సంవిధాన విభాగం. ఇక్కడ గమనింపులోకి తీసుకోవాల్సిన అంశాలు.. పాత్ర, సంఘటన, కథనం, సంఘర్షణ, సన్నివేశం. 
      కథకుడు సర్వసాక్షి స్థానుడై ప్రథమపురుషలో చెప్పే పద్ధతి ఒకటి. పాత్రలోకి ప్రవేశించి అతని ముఖతః ఆత్మగతంగా (ఉత్తమ పురుషలో) చెప్పేది మరొకటి. అయితే రచయితకు ప్రథమ పురుష కథనంలో ఉండే సౌకర్యం ఉత్తమ పురుషలో ఉండదు. ప్రథమ పురుషలో అతడు సర్వసాక్షి, సర్వవ్యాప్తి. అందువల్ల పాత్రలకు తెలియని అంశాలనూ, తెలియన వసరం లేని అంశాలనూ, తెలిసే అవకాశం లేని అంశాలనూ తానే చెప్పవచ్చు. ఇక కథనానికి సహజ వాహకం సరళ భాష. తాను నిర్ణయించుకున్న వస్తువుకు, రూపొందించు కున్న కథన ప్రణాళికకు అనుగుణంగా ఉండాలి రచయిత శైలి. భాషను ఎంత పొదుపుగా వాడితే అంత గొప్ప శిల్ప మర్మజ్ఞుడు అనిపించుకుం టాడు. పాత్ర శీలాన్నిగానీ, వస్తుగుణాన్ని కానీ, వాతావరణ పరిసరాల్ని కానీ క్లుప్తంగా, శక్తిమంతంగా చెప్పడంలోనే రచయిత ప్రతిభ వ్యక్తం అవుతుంది. 

క‌థా అనేది మొద‌ట్లో కుతూహ‌లాన్ని ఆలోచ‌న్నీ క‌లిగించాలి. మ‌ధ్య‌లో చెప్పేది ర‌క్తిక‌ట్టిస్తూ చెప్పుకుపోవాలి  

- ఆరుద్ర‌ 

కథానిక - వికాసం
గురజాడ అప్పారావు కథ ‘దిద్దుబాటు’.. ‘ఆంధ్రభారతి’ పత్రికలో 1910 ఫిబ్రవరిలో అచ్చయింది. బండారు అచ్చమాంబతో పాటు మరికొందరు రచయితలు అంతకు ముందే కథలు రాశారు. అయితే.. సంపూర్ణ ఆధునిక కథానిక లక్షణాలతో వచ్చిన తొలి రచన ‘దిద్దుబాటు’. తెలంగాణలో మాడపాటి హనుమంతరావు ‘హృదయశల్యం’ (1912) లాంటి ఆధునిక కథలు రచించారు. నిజాం కాలం పరిస్థితులకు అద్దంపడుతూ సురవరం ప్రతాపరెడ్డి కథలు వెలువరించారు. ఒద్దిరాజు సోదరులు, ఆదిరాజు వీరభద్రరావు, నందగిరి వెంకట్రావు, ఇందిరాదేవి, నెల్లూరి కేశవస్వామి తదితరులు విరివిగా రచనలు చేశారు. అటు రాయలసీమలో ‘శ్రీసాధన’ పత్రిక ఆధునిక కథానికలను ప్రచురించింది. అయ్యగారి నరసింహమూర్తి (‘మతభేదం’ కథ, 1926), బొగ్గవరపు నాగవరదయ్యశ్రేష్ఠి, భూతపురి నారాయణస్వామి తదితరుల రచనలు అందులో వచ్చాయి. 
       ఇరవయ్యో శతాబ్దం ఉత్తరార్ధంలో సమకాలీన జీవన స్థితిగతులకు బాటలు వేసింది తెలుగు కథానిక. శ్రీపాద తెలుగుదనం ఉట్టిపడేలా కథలు రాస్తే, విశాఖ మాండలికంలో రావిశాస్త్రి, ఉత్తరాంధ్ర యాసలో చాసో కథలు రాశారు. వీళ్ల శిల్పంలోని వాడి, వేగం పాఠకులను అక్షరాలు వెంట పరుగులు పెట్టిస్తాయి. న్యూయార్క్‌ హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌ నిర్వహించిన రెండవ ప్రపంచ కథానికల పోటీల్లో పాలగుమ్మి పద్మరాజు ‘గాలివాన’కు రెండో బహుమతి రావడం తెలుగు కథానిక స్థాయిని పెంచింది. రాయలసీమ గ్రామీణ జీవితాలను సాహిత్యీకరించిన కె.సభా, అట్టడుగు జీవితాల్లోని వ్యథలను చిత్రించిన అల్లం రాజయ్య.. ఇలా తరాలు గడిచేకొద్ది తెలుగు కథానిక పదునెక్కింది. వట్టికోట ఆళ్వారుస్వామి, సురమౌళి, చలం, కొ.కు, చింతా దీక్షితులు, కనుపర్తి వరలక్ష్మమ్మ, ఇల్లిందల సరస్వతీదేవి, భాగ్యరెడ్డి వర్మ, మధురాంతకం, మునిమాణిక్యం, అడవి బాపిరాజు, మొక్కపాటి, బుచ్చిబాబు, గోపీచంద్‌, తిలక్‌, మా.గోఖలే, కరుణకుమార, మల్లాది, యశోదారెడ్డి, పెద్దిభొట్ల, ఇనాక్‌ తదితరులెందరో గొప్ప కథానికలను రచించారు. (తెలుగు కథానిక వికాస క్రమం మీద పూర్తిస్థాయి వ్యాసం ‘తెలుగువెలుగు’ జనవరి, 2018 సంచికలో చూడవచ్చు)
        కథానిక చిన్నదే కావచ్చు కానీ, అది సువిశాల ప్రపంచంలో సమైక్య జీవన విధానాన్ని ప్రోత్సహిస్తుంది. మానవత్వాన్ని వెలిగిస్తుంది. చైతన్యగీతిక లాంటి ఈ చిన్నికథ కాలానికి తగ్గట్టు తన రూపాన్ని, మాధ్యమాలను మార్చుకుంటూ ప్రస్తుతం అంతర్జాల కథగా కూడా సాగిపోతోంది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం