సంస్కృతి నిండుగా... దసరా పండుగ

  • 1068 Views
  • 2Likes
  • Like
  • Article Share

    ఓలేటి శ్రీనివాసభాను

  • హైదరాబాదు
  • 7032480233
ఓలేటి శ్రీనివాసభాను

శ్రమిస్తూ సేదదీరడం, విరామంలో వినోదాన్ని ఆస్వాదించడం, వ్యవసాయం జీవనాధారమైన 
ఏ దేశంలోనైనా ఇదే పండుగల పరమార్థం!
      పేరులో సరదాను స్ఫురించే దసరా-
      ‘‘పనిచేసేవారి కోసమే పండుగ’’ అని చాటి చెబుతుంది!
      మట్టిని నమ్ముకున్న మనసైన తెలుగులోగిట్లో దసరా పండుగ ఓ రకంగా విశ్రాంతి సమయం లాంటిది. ఆషాఢశ్రావణ, భాద్రపదాల్లో - సేద్యంలో తలమునకలైన రైతులోకాన్ని ఆశ్వయుజం ఊపిరి తీసుకోమంటుంది. నీడపట్టున కొద్దిపాటి విరామాన్నిస్తుంది. ఆ వ్యవధిలో...పంట ఎదిగి, కోతకు వచ్చేలోపున లభించే కొద్దిపాటి తీరికలో జనం దసరావేడుకలు చేసుకొంటారు. సంబరాలకు సరదాల ద్వారాలు తెరుస్తారు. వీటికి తగిన నేపథ్యాన్ని ప్రకృతి సమకూరుస్తుంది. సామాజిక వాతావరణాన్ని సిద్ధంచేస్తుంది.
      బొమ్మల కొలువులు... బతుకమ్మపాటలు... అయ్యవార్లకిచ్చే అయిదు వరహాలు... పిల్లలకు పంచే పప్పు బెల్లాలు... పాలపిట్టను చూసేందుకు పొలిమేర యాత్రలు... శమీ దర్శనాలు... పరస్పర ఆలింగనలతో పంచుకునే ‘బంగారాలు’... సాముగరిడీలు, పులివేషాలు... డప్పులమోతలు... సమస్త వృత్తి చిహ్నాలకు సభక్తిక పూజలు- ఈ వేడుకలోని విస్తృతికి సూచికలు!
హాయీ... ఆనందం...
ఆశ్వయుజం రాకతో వానలు వెలుస్తాయి... చిత్తడి నేలలు పొడిబారతాయి. మబ్బుల్ని వదిలించుకున్న పర్యావరణం పులుగడిగిన ముత్యమౌతుంది. నింగి నీలాలు పరచుకుని నడిమధ్యలో నెలబాలుణ్ని ముద్దాడుతూ వెన్నెల ముగ్గులు వేస్తుంది. హలధారులకు విశ్రాంతినిచ్చిన ప్రకృతి కలంధారులకు ప్రోత్సాహాన్నిస్తుంది. నీరదాన్ని వీడిన శరత్‌జ్యోత్స్నకు భావుకత పరదాలు పరుస్తూ కవుల కలాలు పరుగులుతీస్తాయి. కావ్యగానాలు చేస్తాయి.
      శరదృతువుకు సంబంధించిన పదచిత్రాలు మన కావ్యాల నిండా ఉన్నాయి. నన్నయ కలం మహాభారతం అరణ్యపర్వంలోని చతుర్థాశ్వాసంలో ‘‘శారదరాత్రులుజ్జ్వల లసత్తర తారకహార పంక్తు’’లతో ‘‘పాండురుచిపూరము’’లైన ఆకాశపు సోయగాల్ని ఆవిష్కరించింది. తెలుగు వారి దురదృష్టం వల్ల ఆదికవి కలం అక్కడితో ఆగిపోయినా, ఆయన పూర్తి చేయలేకపోయిన శరదృతువర్ణనను- ‘‘స్ఫురదరుణాంశు రాగరుచి’’తో ఎర్రన అద్భుతంగా కొనసాగించాడని సాహిత్య సమీక్షకులు మెచ్చుకున్నారు. శారదరాత్రులతో నన్నయ అస్తమిస్తే, శరత్కాల ప్రభాత వర్ణనతో ఎర్రన ఉదయించాడని చమత్కరించారు కూడా! ఈ కాలంలో అడవుల్లో విహరించే ఏనుగుల్ని - శరదృతువుకు భయపడి మారువేషంలో దిగివచ్చిన వానమేఘాలతో ఎర్రన సరిపోల్చి చూస్తే, శరత్కాలంలోని స్వచ్ఛమైన నీలాకాశంలో లేత ఎరుపు రంగులో ఉన్న వరికంకుల్ని నోటకరుచుకుని ఎగిరే ఆకుపచ్చని చిలుకలబారులు నింగికి వేలాడదీసిన తోరణాల్లాగా ఉన్నాయని నన్నె చోడుడు ‘కుమార సంభవం’లో అందంగా ఆవిష్కరించాడు! గోన బుద్ధారెడ్డి తన ‘రంగనాథ రామాయణం’ కిష్కింధ కాండలో వానలు నిల్చిన వైనాన్నీ, ప్రకృతిలో పొడచూపిన మార్పుల్నీ సహజ స్వాభావికంగా వర్ణిస్తూ ‘ఇట శారదాగమంబేతెంచె నింక’ అంటూ హనుమంతుడి చేత సుగ్రీవుడికి చెప్పించి, శరత్కాలం సీతాన్వేషణకు అనువైన సమయం అని సూచిస్తాడు!
ఆధ్యాత్మిక వికాసం
శారదరాత్రులు శ్రమజీవులకు విరామాన్నీ, బుద్ధిజీవులకు వినోదాన్నీ అందిస్తే అంతరంగంలోకి తొంగి చూసేవారికి ఆధ్యాత్మిక వికాసాన్ని ప్రసాదించాయి. ఈ సమస్త విశ్వానికీ వెన్నుదన్నుగా నిలిచే కేంద్రక శక్తి ఒకటుందనీ, సాత్త్వికతకు నెలవై ఆమె జగన్మాత రూపంలో లోకాల్ని కాపాడుతోందనీ ధార్మికులు విశ్వసిస్తారు. ఆ మాతృమూర్తిని భక్తి ప్రపత్తులతో పూజించడం, నవరాత్రుల దుష్టశక్తులపై ఆమె సాధించిన విజయాన్ని కీర్తిస్తూ దశమినాడు వేడుకలు చేస్తారు.
      దేవీభాగవతంలో నవరాత్రుల ప్రాధాన్యాన్ని వివరించే ఘట్టాలు ఉన్నాయి. శరదృతువులో ఆశ్వయుజ బహుళ పాడ్యమి మొదలుకుని మహర్నవమి వరకు- మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మొదలైన రూపాల్లో శుంభ, నిశుంభ, చండ, ముండాది రాక్షసుల్ని సంహరించిన ఆదిశక్తిని అర్చించడం, విజయదశమి నాడు ‘రామ్‌లీలా’ జరపడం దేశవ్యాప్తంగా కానవస్తుంది.
శ్రమ సంస్కృతికి నమోనమః
దసరానాడు ఆయుధాల్నీ, వాహనాల్నీ, వృత్తికి సంబంధించిన పరికరాల్నీ పూజించడం సంప్రదాయం. దీని వెనుక కూడా పౌరాణిక ప్రాశస్త్యం ఉంది. దుష్ట సంహారం కోసం వ్రతం చేసిన ఆదిశక్తి- సకల దేవతలు తనకు సమర్పించిన ఆయుధాల్ని పూజించి అఖండమైన శక్తిని సంతరించుకున్నదట. ఇదే ప్రేరణతో రాముడు ఆయుధాల్ని అర్చించి రావణుణ్ని సంహరించాడనీ, పాండవులు జమ్మిచెట్టునీ, శస్త్రాస్త్రాల్నీ పూజించి దాయాదుల్ని ఓడించారనీ పౌరాణికులు చెబుతారు. ఆ తర్వాతి యుగాల్లోనూ రాజులు ఈ సంప్రదాయాన్ని  కొనసాగించడం చరిత్రలో కనిపిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నేటికీ వీటి ఆనవాళ్లు చెక్కుచెదరలేదు.
ప్రతీ ప్రాంతం... ప్రకృతిలో మమేకం
పండుగల మూలాలు పల్లెల్లో ఉన్నాయనడానికి బతుకమ్మలే మంచి ఉదాహరణ. తెలంగాణ ప్రాంతంలోని జానపద సంస్కృతి బతుకమ్మను పూలరాశుల్లో ఊరేగిస్తుంది. పాడ్యమి మొదలుకుని దుర్గాష్టమి వరకు సాగే ఈ బంగారు గౌరమ్మ వేడుకలు మనిషిని ప్రకృతిలో మమేకం చేస్తాయి. కానుగ, తంగేడు, అల్లి, కట్ల టేకు, కలువ, గుమ్మడిపూలతో బతుకమ్మల్ని అలంకరించి, ప్రసాదాలు నివేదించి, వలయాకారంగా తిరుగుతూ వనితలు పాడే పాటలు మట్టివాసనతో పరిమళిస్తాయి.
      మిగిలిన ప్రాంతాల్లో అమ్మవారిని కలశరూపంలో ఆవాహన చేసి, పదహారు ఉపచారాలతో పూజలు చేయడం, బొమ్మలకొలువులు తీర్చడం విశేషంగా కనిపిస్తాయి. తొమ్మిది మెట్లపై బొమ్మల్ని పేర్చడంలో ఒక విధమైన ఆధ్యాత్మిక ఆలోచన ఉందంటారు. మొదటి మూడు మెట్లపై అమ్మవారి కలశాన్ని ఉంచుతారు.
      దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాలైన బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల్లో దసరా వేడుకల్ని పార్వతీదేవి పుట్టింటికి రావడంగా జరుపుతారు. తమ ఇంటికి వచ్చిన ఆడపడుచును సప్తమి, అష్టమి, నవమి రోజుల్లో అర్చించి దశమినాడు కన్నీళ్లతో అంపకాలు పెడతారు. ఆ సందర్భంగా స్త్రీలు పాడే పాటల్ని ‘ఆగమ గీతికలు’ అంటారు.
      ‘భస్మరాశుల మధ్య భోగభాగ్యాలేవి? ముక్కంటి ఇంటిలో ముద్దు మురిపాలేవి? ఎద్దు నెక్కిన వాని నెట్లు వలచావే తల్లి? పోయిరావే తల్లి- పోయిరావమ్మ’ అనే అర్థం స్ఫురించే పాటలు పాడుతూ, శత్రువులు సైతం ఆ మూడు రోజులూ సఖ్యతతో సాగిపోతారు.
      గుజరాతులో దసరాకు దాండియా నృత్యం చేయడం సంప్రదాయం. శ్రీకృష్ణుని కోడలు, అనిరుద్ధుడి భార్య అయిన ఉష ఈ నృత్యాన్ని ప్రవేశపెట్టిందని సౌరాష్ట్రంలోని జానపదుల విశ్వాసం. శరన్నవరాత్రుల్లో ఆదిపరాశక్తి గాథల్నీ, శ్రీకృష్ణుడి లీలల్నీ పాడుతూ ఆబాలగోపాలం కోలాటాలాడతారు. ఒకప్పుడు పల్లెపట్టులకే పరిమితమైన దాండియా ఇప్పుడు నగరాలకూ విస్తరించింది. అధునాతన జీవనశైలిలో ఓ వినోద కార్యక్రమంగా మారిపోయింది.
      ఉత్తర భారతదేశంలో దసరా వేడుకల్ని రావణుడిపై రాముడు సాధించిన విజయంగా జరుపుకొంటారు. ‘రామ్‌లీలా’ వీధి నాటకాలూ, జానపదగీతాల్లో రామాయణ గాథలూ, దశకంఠుడి గడ్డిబొమ్మల దహనాలు దేశానికి ఎగువ ప్రాంతంలో అట్టహాసంగా జరుగుతాయి.
      తెలుగు ప్రాంతాల్లో ఒకప్పుడు దసరా నవరాత్రుల్లో ధనుర్బాణాల్ని ధరించిన పిల్లల్ని అయ్యవార్లు ఇంటింటా తిప్పుతూ దసరాపాటలు పాడించేవారు. ఇంటి యజమానులు అయ్యవార్లను వరహాలతోనూ, పిల్లల్ని పప్పు బెల్లాలతోనూ సంతోషపెట్టేవారు.
      హైటెక్‌ యుగంలో జీవితం గుక్కతిప్పుకోలేనంత వేగాన్ని సంతరించుకొన్నా మూలాల్ని కాపాడుకొన్నప్పుడే అభివృద్ధిలోని ఆనందాన్ని ఆస్వాదించగలం! అందుకే శ్రమిస్తూ సేదదీరాలి...విరామంలో వినోదాన్ని ఆస్వాదించాలి! మన జీవనాధారాలు ఏవైనా సాంస్కృతిక మూలాల్ని గుర్తుంచుకోవాలి. పనులు చేస్తూనే పండుగలు చేసుకోవాలి.   
       దసరా సందేశం ఇదే!

* * *


వెనక్కి ...

మీ అభిప్రాయం