వెయ్యేళ్ల వెలుగు.. ఇంద్రకీలాద్రి

  • 837 Views
  • 2Likes
  • Like
  • Article Share

    డా।। కప్పగంతు రామకృష్ణ

  • తెలుగు అధ్యాపకులు
  • విజయవాడ
  • 9032044115
డా।। కప్పగంతు రామకృష్ణ

ఓ పక్క పరవళ్లు తొక్కే కృష్ణానది.. మరోపక్క రమణీయ ప్రకృతి శోభతో అలరారే పర్వతప్రాంతం.. ఈ రెండింటి మధ్య అందమైన శిల్పాలతో కూడిన కట్టడాలు.. వీటన్నిటి సమాహార ప్రాంతంలో బంగారుగోపురంతో, దివ్యప్రభలతో వెలుగొందుతుంది కనకదుర్గమ్మ దేవాలయం. ఈ కోవెల సాక్షిగానే తొలితెలుగు మధ్యక్కర పద్యం పురుడుపోసుకుంది. కవిసార్వభౌముడు శ్రీనాథుడితో సహా ఎందరో కవులు ఇంద్రకీలాద్రి మీది దుర్గాదేవి వైభవానికి అక్షర నీరాజనాలు సమర్పించారు.
శక్తిపీఠాల్లో ఒకటిగా విజయవాడ కనకదుర్గాదేవి ఆలయం పేరు పొందింది. పర్వతప్రారంభంలోనే కామధేను అమ్మవారుగా దుర్గమ్మ పూజలందుకుంటుంది. అక్కడ నుంచి పర్వతం పైకి చేరుకునే వరకు ‘ఓం కనకదుర్గాయైనమః’ అంటూ అమ్మవారి నామం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. పర్వతం ఒక మలుపు తిరగ్గానే క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి ఆలయం ఉంటుంది. అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్లగానే ఆవునేతి హోమాల నుంచి వచ్చే ధూమం, కుంకుమ వాసనలు, అమ్మకు భక్తులు సమర్పించే నేతి పొంగళ్ల సువాసనలు మనసుల్ని ఆధ్యాత్మిక భావ నిలయాలుగా చేస్తాయి. ఆ పక్కనే అంబారావాల గోమాత నిలయం భక్తులకు స్వాగతం పలుకుతుంది. వీటికి ఎదురుగా పల్లవ, చోళ, మధ్యయుగ కాలాల చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే కట్టడాలు కనిపిస్తాయి. వీటికి కుడిపక్కగా బంగారు తాపడం చేసిన గోపురంతో కూడిన ఆలయంలో దుర్గాదేవి మహిషాసురమర్దినిగా దర్శనమిస్తుంది.
      ఆలయ ప్రధాన ద్వారానికి పైభాగంలో పోతనామాత్యుడి ప్రసిద్ధ పద్యం ‘అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ...’ చెక్కి ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించే భక్తులందరూ తప్పనిసరిగా ఈ పద్యాన్ని చదువుతూ, అమ్మకు నమస్కారం చేస్తారు. అమ్మవారి ప్రధాన ఆలయం వెలుపలి గోడకు నాలుగువైపులా అష్టలక్ష్ముల విగ్రహాలు ఉంటాయి. అమ్మవారికి ఎడమభాగంలో ఆదిశంకరాచార్య ప్రతిష్ఠించిన శ్రీచక్రం, దానిపక్కనే గణపతి విగ్రహం ఉంటాయి. ఆలయంలో అమ్మ పేరు మీద జరిగే అర్చనలన్నీ శ్రీచక్రానికే జరుగుతాయి. శక్తిక్షేత్రమే అయినప్పటికీ దుర్గాదేవికి శాక్తేయ విధానంలో కాకుండా పూర్తిగా స్మార్తశైవాగమం ప్రకారం అర్చనలు నిర్వహించటం ఈ ఆలయ విశేషాల్లో ఒకటి. గర్భాలయానికి ముందు అంతరాలయం, దానిముందు ముఖమంటపం కనిపిస్తాయి.
      ప్రధాన ఆలయంలో అమ్మవారు సింహవాహనం మీద కూర్చుని, మహిషాసురుణ్ని సంహరిస్తున్న భంగిమలో దర్శనమిస్తుంది. ఈమె మహిషాసురమర్దిని స్వరూపంలో ఉంటే, కనకదుర్గాదేవి అని పిలవటం వెనుక కారణం ఏంటనే ఆలోచన సహజంగానే కలుగుతుంది. ఇందుకు ప్రత్యేక ఆధారాలు కనిపించవు. అయితే, కనకదుర్గాదేవి మూర్తి ఇంద్రకీలాద్రి మీదనే మరొక చోట ఉందని, ఆమెను చింతామణి దుర్గ అంటారని ప్రతీతి. ఆలయం నుంచి వెలుపలికి రాగానే వల్లీదేవసేనలతో కూడిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఉపాలయం, నాగేంద్రుడి పుట్ట, దానికి కొద్దిదూరంలో వినాయకుడు, నటరాజస్వామి, శివకామసుందరీ దేవి ఉపాలయాల సమాహార మందిరం తారసపడతాయి. అక్కడికి కొద్ది దూరంలో మల్లికార్జునస్వామి ఆలయం ఉంటుంది. ఈ మార్గంలో అద్దాలమంటపం, రాధాకృష్ణుల ప్రతిమతో తీర్చిదిద్దిన పూలవనం మనసుకు ప్రశాంతత కలిగిస్తాయి. మల్లికార్జునస్వామి ఆలయ శిఖరం, దానికి ముందున్న గోపురంపై శిల్పాలు మధ్యయుగాల శిల్పకళకు అద్దంపడతాయి.
శాసనంలోని కథ
కీలుడనే యక్షుడు చేసిన తపస్సుకు మెచ్చిన జగన్మాత అతడికి వరం ఇవ్వటం, కీలుడు ఇంద్రకీలాద్రి పర్వతంగా మారటం, దాని మీద దుర్గమ్మ అవతరించటం, బ్రహ్మదేవుడు మల్లికాపుష్పాలతో అర్చించిన కారణంగా ఇక్కడి పరమేశ్వరుడికి మల్లికార్జునస్వామిగా పేరు రావడం తదితరాలు స్థలపురాణంలో కనిపిస్తాయి. ఇంద్రకీలాద్రి మీద మహాభారత కాలంలో అర్జునుడు తపస్సు చేసి, పాశుపతాస్తాన్న్రి సంపాదించటం, మహోగ్రరూపిణిగా ఉన్న అమ్మను శాంతింపజేయటానికి ఆదిశంకరాచార్యులు ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించటం ఇలా ఎన్నో పౌరాణిక, చారిత్రక గాథలు విజయవాడతో ముడిపడి ఉన్నాయి.
      పూర్వకాలంలో విజయవాడను మాధవ వర్మ అనే రాజు పాలించేవాడు. ప్రజలను కన్నబిడ్డల కన్నా మిన్నగా చూసుకునేవాడు. ఒకరోజున అతని కుమారుడు తన రథం మీద నగరంలో పర్యటిస్తున్న సందర్భంలో, అకస్మాత్తుగా ఓ బాలుడు ఆ రథచక్రాల కింద పడి మరణిస్తాడు. ఆ బాలుడి తల్లి రాజకుమారుడి కారణంగానే తన బిడ్డ మరణించాడని రాజుకు ఫిర్యాదు చేస్తుంది. కలలో కూడా ధర్మం తప్పని మాధవవర్మ తన వంశాంకురమైన యువరాజుకు మరణశిక్ష విధించి, అమలు చేస్తాడు. మాధవుడి ధర్మనిష్ఠకు మెచ్చిన దుర్గాదేవి, అతడి రాజ్యంలో కనకవర్షం కురిపిస్తుంది. అప్పటినుంచి ఇంద్రకీలాద్రి మీద కొలువున్న దుర్గాదేవి కనకదుర్గాదేవిగా ప్రసిద్ధిపొందింది. పార్వతీపరమేశ్వరుల అనుగ్రహంతో బిడ్డలిద్దరూ పునర్జీవితులు అవుతారు. క్రీ.శ.12వ శతాబ్దానికి చెందిన ముక్కంటి కాడ్వెట్టి వంశీకుడైన పల్లవకేత భూపాలుడు ఇంద్రకీలాద్రి మీది మల్లేశ్వరాలయంలో వేయించిన శాసనంలో ఈ కథ కనిపిస్తుంది.
జమ్మిదొడ్డి చారిత్రక గాథ
దుర్గామల్లేశ్వరుల భక్తుడైన పండితయ్య అనే భక్తుడు బెజవాడలో ఉండేవాడు. అతడు క్రమం తప్పకుండా ఆచార విధులు నిర్వహిస్తూ ఉండేవాడు. అయితే గిట్టనివాళ్లు అతనికి ఊళ్లో నిప్పు పుట్టకుండా చేశారు. దీంతో పండితయ్య ఎంతో ఆవేదన చెందాడు. ఇష్టదైవమైన పరమేశ్వరుణ్ని ప్రార్థించి, అగ్నిని తన ఉత్తరీయంలో మూటకట్టుకుని, గ్రామం చివర చేరుకుని, అక్కడ ఉన్న ఒక జమ్మి చెట్టుకు, తన ఉత్తరీయాన్ని వేలాడదీశాడు. తన అనుష్ఠాన బలాన్ని ఉపయోగించి ఊరిలో ఎక్కడా నిప్పు పుట్టకూడదని శపించాడు. తాను మాత్రం నిత్యాగ్నిహోత్రం చేసుకుంటూ ఉండేవాడు. శాప ప్రభావంతో గ్రామస్థులంతా అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఎందుకు ఇలా జరుగుతోందని తరచి తరచి చూస్తే, తమ తప్పు తెలిసివచ్చింది. వాళ్లందరూ అప్పటి విజయవాడ పాలకుడైన వేంగిరాజు అనంతపాలుణ్ని వెంటపెట్టుకుని, పండితయ్య దగ్గరికి వస్తారు. స్వయంగా మహారాజు కదలివచ్చి, నచ్చజెప్పటంతో పండితయ్య తన శాపాన్ని ఉపసంహరించుకుంటాడు. గ్రామంలో తిరిగి నిప్పు యథావిధిగా వెలిగింది. సంతోషించిన గ్రామస్థులు తమ తప్పుల్ని మన్నించాలని పండితయ్యను ప్రార్థిస్తారు. సన్మార్గవర్తనుడైన పండితయ్య కూడా ఎంతో సంతోషించి, గ్రామస్థులతో కలసి, తన పూర్వ నివాసానికి చేరుకుంటాడు. పల్లవకేతు భూపాలుడి శాసనంలో ఈ కథ కూడా ఉంది.
      అలా పండితయ్య నిప్పును తన ఉత్తరీయంలో బంధించి శమీవృక్షానికి కట్టిన ప్రాంతం, ఆ వృక్షం చారిత్రక ప్రసిద్ధి పొందాయి. శమీవృక్షం ఉన్న ఆ ప్రాంతం కాలకమ్రంలో జమ్మిదొడ్డిగా వ్యవహారంలోకి వచ్చింది. శమీవృక్షానికి జమ్మిచెట్టు అనే పేరు ఉండటం, కొంతమేర ఉండే స్థలాన్ని ‘దొడ్డి’గా వ్యవహరించే ప్రాచీన పద్ధతి కారణంగా ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చి ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ తొమ్మిదో శతాబ్దానికి చెందిన చాళుక్య సంప్రదాయాన్ని ప్రతిబింబించే నాట్యశిల్పాలు ఉన్నాయి. ఇప్పటికీ జమ్మిదొడ్డి ప్రాంతాన్ని స్థానికులు పవిత్రప్రాంతంగా ఆరాధనాభావంతో చూస్తారు. దసరా ఉత్సవాల్లో ఇక్కడ కూడా పూజాకార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా ఉత్సవాల చివరి రోజున చేసే శమీపూజను ఈ ప్రాంతంలో దేవస్థానం అధికారికంగా నిర్వహిస్తుంది. సంప్రదాయ పద్ధతిలో శమీవృక్షానికి పూజలు జరుగుతాయి.
చరిత్రకు సాక్ష్యాలు శాసనాలు
ఇంద్రకీలాద్రి చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే శాసనాలెన్నో లభించాయి. వీటిలో యుద్ధమల్లుడి బెజవాడ శాసనం, త్రికోటి బోయడి కిరాతార్జున స్తంభ శాసనం, పల్ల్లకేతు భూపాలుడి శాసనం, మహామాండలిక సింగదేవ మహారాజు శ్రీకనకదుర్గాలయ శాసనం, చట్టపుడు వేయించిన పార్థీశ్వరాలయ శాసనం విషయపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి.
      క్రీ.శ.11వ శతాబ్దానికి చెందిన తూర్పు చాళుక్య వంశపు రాజు యుద్ధమల్లుడు వేయించిన శాసనం యుద్ధమల్లుడి బెజవాడ శాననంగా పేరుపొందింది. తెలుగు సాహిత్య చరిత్రలో ఈ శాసనానికి ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ఛందస్సుకు సంబంధించిన మధ్యాక్కర తొలిగా ఉపయోగించిన శాసనమిదే. ఇందులో మొదటి వైపు 17 పంక్తులు, రెండోవైపు 19 పంక్తులు, మూడోవైపు 10 పంక్తులు కనిపిస్తాయి. యుద్ధమల్లుడు నేటి గుంటూరు జిల్లా చేబ్రోలు నుంచి బెజవాడకు వచ్చి, అక్కడ ఒక అందమైన ఆలయాన్ని కట్టించినట్లు ఈ శాసనంలో ఉంది. అతని తాత అయిన మల్లపరాజు కూడా బెజవాడలో ఓ ఆలయాన్ని కట్టించినట్లు ఇందులో పేర్కొన్నారు. కలియమ బోయడు కుమారుడైన త్రికోటి బోయడి శాసనంలో ఇంద్రకీలాద్రికి సంబంధించిన విశేషాలు చాలా ఉన్నాయి. ఇంద్రకీలాద్రి మీద అర్జునుడు తపస్సు చేసుకునేందుకు స్థలం చూపించిన యక్షుడే త్రికోటి బోయడుగా జన్మించాడని, ఆ బోయడు తానేనని, తనకు పూర్వజన్మ జ్ఞాపకం రాగా, ఈ శాసనం వేయించానని అతను చెప్పుకున్నాడు. అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసినట్టుగా భావించిన ప్రాంతంలో, కిరాతార్జున ఘట్టానికి సంబంధించిన శిల్పాలతో, మొత్తం 21 పంక్తుల్లో, పూర్తిగా సంస్కృతంలో ఈ శాసనం ఉంటుంది. ప్రస్తుతం ఈ శాసనాన్ని పురావస్తు శాఖ ఇంద్రకీలాద్రి నుంచి తీసి, అక్కన్న మాదన్న గుహల ప్రాంతంలో భద్రపరిచింది.
అంబాకుండం... నవదుర్గలు
బెజవాడ దుర్గామల్లేశ్వరుల వివరాలు తెలియజేసే శాసనాల్లో ముఖ్యమైంది క్రీ.శ.1516 కాలం నాటి మహామండలేశ్వర సింగయదేవరాజు వేసిన కనకదుర్గాలయ శాసనం. సంస్కృతాంధ్ర భాషల్లో మొత్తం 240 పంక్తుల్లో ఈ శాసనం ఉంటుంది. దుర్గాదేవి ఆలయం ఉన్న కొండ ఉత్తర దిక్కుగా పర్వతభాగాన్ని తొలిచి, భక్తులు ప్రదక్షిణ చేసుకునే అవకాశం కల్పించినట్లు ఇందులో పేర్కొన్నారు. సర్వలోకాశ్రయ విష్ణువర్ధన మహారాజు 17వ రాజ్యపాలనా సంవత్సరంలో చట్టపుడు అనే సామంతరాజు పార్థీశ్వరాలయ శాననాన్ని వేయించాడు. పది పంక్తుల్లో ఉండే ఈ శాసనం ఇంద్రకీలాద్రి మీద పార్థీశ్వరస్వామిని ప్రతిష్ఠించినట్లు చెబుతుంది. క్రీ.శ.909 నాటి ఈ శాసనంలో పేర్కొన్న విష్ణువర్ధనుడు తూర్పు చాళుక్య రాజైన మొదటి భీముడని కొందరు చరిత్రకారుల అంచనా. ఇంద్రకీలాద్రి మీద గోవింద మఠం ప్రాంతంలో ఈ శాసనం లభించింది. ప్రస్తుతం ఈ ఆలయానికి సంబంధించిన చిహ్నాలేవీ ఇంద్రకీలాద్రి మీద కనిపించవు. అయితే, పర్వత శిఖరం మీద శిథిలమైన దేవాలయం తాలూకూ కొన్ని ఆధారాలు దొరికాయి. ఇదే పార్థీశ్వరాలయం అయి ఉండొచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ శిథిలాలకు అతి దగ్గరలో దక్షిణ దిశగా త్రికోటి బోయడు వేయించిన శిలాస్తంభ శాసనం ఉండటం, ఈ శిథిలాలయం కింద భాగంలోని గోవింద మఠం (కోనేరు) ప్రాంతంలోనే చట్టపుడు ప్రకటించిన శాసనాలు లభించటం తదితర ఆధారాలతో అవి పార్థీశ్వరాలయం చిహ్నాలేనని చరిత్రకారులు నిర్ధరిస్తున్నారు.  
      ఇంద్రకీలాద్రి మీద అమ్మవారి ప్రధానాలయానికి దక్షిణ భాగంలో పూర్వం ఒక కోనేరు ఉండేది. దీన్ని అంబాకుండం అనే వారని చరిత్ర. చక్కటి లతలు, తుమ్మెదలు, తేనెటీగల ఝుంకారధ్వనితో ఈ ప్రాంతం ఎంతో మనోహరంగా ఉండేది. శ్రీనాథుడి కిరాతార్జునీయంలో ఈ ప్రస్తావన కనిపిస్తుంది. అయితే, ఇక్కడ బాగా చీకటిగా ఉండటం వల్ల ఈ కోనేరుని చీకటి కుండం అనే పేరుతో కూడా పిలిచేవారు. ఈ కోనేరు ఉన్న కొండ చరియల మీద ప్రాచీన శిల్పకళను ప్రతిబింబించేలా తొమ్మిది దుర్గల రూపాలు ఉంటాయి. వీటిని చింతామణి దుర్గలు అని పిలుస్తారు. ఈ శిల్పాల్ని ఎవరు చెక్కించారో తెలియదు. ప్రస్తుతం వీటిలో మూడు మాత్రమే లభిస్తున్నాయి. వీటిలో మొదటిది చాలా పెద్ద శిల్పం. పెద్దనాలుక, 18 భుజాలతో ఉగ్రరూపంలోని భద్రకాళీ శిల్పం. రెండోది పది భుజాలు, పది ముఖాలతో సింహవాహనం మీది మహాదుర్గాదేవి శిల్పం. మూడోది ఎనిమిది ముఖాలు, పదహారు భుజాలతో ఉన్న మహిషాసురమర్దిని శిల్పం. వీటితో పాటు భవానీ మంటపానికి వచ్చే మార్గంలో దక్షిణాభిముఖంగా కొండగోడపై మరికొన్ని శిల్పాలు కూడా ఉంటాయి. ఒక అస్పష్ట శాసనం కూడా ఈ గోడ మీద కనిపిస్తుంది.
      శ్రీనాథ మహాకవి రాసిన హరవిలాస కావ్యంలోని కిరాతార్జునీయ వృత్తాంతం పూర్తిగా ఇంద్రకీలాద్రికి సంబంధించిందే. ఇంద్రకీల పర్వతం మీద మారేడు చెట్ల నీడలో చంద్రకాంతమణి పీఠం మీద అర్జునుడు తపస్సు చేశాడని కవిసార్వభౌముడు చెబుతాడు.
వైయాఘ్రాజిన ఖండమధ్యమున ఠేవన్‌ బద్ధ
పద్మాసనుం
డాయింద్రాత్మజుడింద్రకీల శిఖరీంద్రారూఢ
బిల్వద్రుమ
చ్ఛాయా నిర్మల చంద్రకాంతమణి పాషాణ
ప్రదేశంబునన్‌
సాయంకాలము పూజసేయు
నభవున్సంధ్యానటున్‌ ధూర్జటిన్‌

ఇంద్రకీలాద్రి ప్రాకృతిక సౌందర్యాన్ని శ్రీనాథుడు అనేక పద్యాల్లో కళ్లకుకట్టాడు. ఆధునిక కాలంలోనూ వేటూరి, పోలవరపు కోటేశ్వరరావు, పింగళి కృష్ణారావు లాంటి ప్రముఖలు ఎందరో కృష్ణా ప్రవాహాన్ని, ఇంద్రకీల వైభవాన్ని తనవితీరా వర్ణించారు.
పోలీసుల ఆడపడుచు
తెలుగునాట జరిగే దసరా ఉత్సవాల్లో విజయవాడ ప్రభలకు గొప్ప ప్రాచుర్యం ఉంది. ఉత్సవం చివరిరోజున పదుల సంఖ్యలో వాహనాలను అలంకరించి, వాటిమీద వివిధ దేవతా వేషధారులు నిల్చుని ఉంటారు. రథాలకు ముందు తప్పెటగుళ్లు, బాజాభజంత్రీలు, భేతాళ నృత్యాలు, గారడీవిద్యలు, కోలాటాలు... ఒకటేమిటి చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ కళాకారులు అనుసరిస్తారు. నగర పెద్దలు పోటీపడి మరీ అత్యంత భారీ ఏర్పాట్లతో, మహా ఆర్భాటంగా ప్రభలు నిర్వహిస్తారు.
      విజయవాడ దసరా ఉత్సవాల్లో పోలీసుల ఆచారం ప్రత్యేకమైంది. ఇంద్రకీలాద్రి ఉన్న పాతబస్తీ అధికారికంగా ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి వస్తుంది. ఇక్కడి పోలీసులు దుర్గమ్మను తమ ఆడపడుచుగా, స్టేషన్‌ ప్రాంతంలోని రావిచెట్టును అమ్మ పుట్టినిల్లుగా భావిస్తారు. ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల్లో ఈ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు అమ్మకు పుట్టింటివారి పాత్ర పోషిస్తారు. కొండమీద దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యే ముందురోజే పోలీస్‌ స్టేషన్‌లో వేడుకలు మొదలవుతాయి. ఇక్కడి రావిచెట్టు ప్రాంతాన్ని సుందరంగా అలంకరించి, అమ్మకు పూజలు చేస్తారు. ఇక్కడ ఉన్న అమ్మవారి మూర్తిని కొండ మీదకు తీసుకువెళ్తారు. తమ ఆడపడుచుకు పసుపు కుంకుమలు, పట్టుచీర, సారె వెంటబెట్టుకెళ్తారు. వీరు తీసుకొచ్చిన పట్టుచీర అలంకరించిన తర్వాతనే కొండ మీద ఉత్సవాలు మొదలవుతాయి. ఆ రోజు ఎంతటి గొప్పవారు ఇచ్చిన చీరనైనా, పోలీసులు తెచ్చిన చీర తర్వాతనే అమ్మవారికి అలంకరిస్తారు. రథోత్సవంలో కూడా పోలీసుల పాత్రే ఎక్కువగా ఉంటుంది. అమ్మవారి రథాన్ని స్థానిక పోలీసు అధికారులే స్వయంగా లాగుతారు. ఉత్సవమూర్తులను కూడా కొండ మీద నుంచి పోలీసు వారే కిందకు తీసుకువస్తారు. తరతరాలుగా ఇందులో ఎటువంటి మార్పూ లేదు.
      దసరా చివరి రోజున కృష్ణానదిలో నిర్వహించే తెప్పోత్సవంలో పోలీసు అధికారులే ముఖ్యపాత్ర పోషిస్తారు. ఊరేగింపు అనంతరం ఉత్సవమూర్తులను రావిచెట్టు ప్రాంతానికి తీసుకువస్తారు. అక్కడ అమ్మవారు కొంత సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత, తిరిగి కొండమీదకు తీసుకువెళ్తారు. ఇలా, పోలీసు అధికారులే పుట్టింటి పాత్ర పోషించి, అమ్మవారి ఉత్సవాలు నిర్వహించటం మరెక్కడా కనిపించదు. కొండవీటి రెడ్డి రాజుల కాలం నుంచి ఈ ఆచారం వచ్చినట్టు పరిశోధకులు చెబుతున్నారు. రెడ్డి రాజుల కాలంలో విజయవాడ ప్రాంతంలో పనిచేస్తున్న మంగయ్య అనే సిపాయికి అమ్మవారు స్వప్నంలో కనిపించిందట. తాను దుర్గమ్మనని, తన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని చెప్పిందట. ఆమేరకు తవ్వకాలు జరిపిన మంగయ్యకు అమ్మవారి విగ్రహం లభించిందట. ఆ తర్వాత దాన్ని ప్రతిష్ఠ చేశాడన్నది ఓ గాథ. ఇలా, మంగయ్య నుంచి అమ్మ ఆరాధన ఆచారంగా వస్తోంది. కాలక్రమంలో సిపాయిలు రక్షకభటులుగా (పోలీసుగా) మారినా, ఈ ఆచారం మాత్రం మారలేదు. కులమతాలతో సంబంధం లేకుండా ఈ స్టేషన్‌లో పనిచేసే అధికారి ఎవరైనా సరే అమ్మకు స్వయంగా సారె సమర్పిస్తారు. ఇలా వెయ్యేళ్ల కిందటి చరిత్ర, వారసత్వ సంపదలైన శిల్ప సముదాయాలు, వైవిధ్య- విశేష ఆచారాలతో అలరారే ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, ఓ అఖండ సాంస్కృతిక దీపం కూడా!

 


వెనక్కి ...

మీ అభిప్రాయం