జానపద గజ్జెల సవ్వడి 

  • 778 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। నాగశేషు

  • నెల్లూరు
  • 9985509053

కుర్వడోళ్లు, ఒగ్గుడోళ్లు, రాజన్నడోలు, జమిడికలు, డప్పుల దరువులు.. థింసా, గుస్సాడీ, పేరిణి, బంజారా నృత్యాల జోరులు.. బుర్రకథ, చిందు యక్షగానం, ఒగ్గుకథ, చిరుతల రామాయణం, కాకిపడుగలు, తోలుబొమ్మలాటల మెరుపులు.. కోలాటాలు, పులివేషాల సందళ్లు... అంతేనా, ప్రాచీన మెట్ల కిన్నెర, ఢోలకి, కిక్రి అబ్బురాలు.. ఇలా తెలంగాణ నేల మొత్తం జానపద కళారూపాలతో పులకించిపోయింది. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఆగస్టు 22 నుంచి 31 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ‘జానపద జాతర’ వేడుకలు పల్లెకళలకు పట్టంకట్టాయి.

పల్లె ప్రజల జీవన పరిమళాన్ని జానపద కళలు చవిచూపిస్తాయి. తాళం, లయ, వాద్యం, నృత్యం, అభినయం, ఆహార్యం, లయబద్ధమైన కదలికలతో కూడిన ఈ కళలు సామాన్యుల కళాతృష్ణను కళ్లకుకడతాయి. అయితే, ప్రపంచీకరణ నేపథ్యంలో ఇవి క్రమంగా తెరమరుగవుతున్నాయి. వీటిని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం మూడేళ్ల నుంచి ‘జానపద జాతర’ను నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక, పర్యాటక, పౌరసంబంధాల శాఖల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు నిర్వహించారు.
      కోలాటాలు ఆడుతూ, చెక్కభజనలు, నృత్యాలు చేస్తూ, డప్పులు వాయిస్తూ, వివిధ కళారూపాలు ప్రదర్శిస్తూ కళాకారులు నిర్వహించిన ర్యాలీలు ఈ వేడుకల్లో అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కళల గొప్పదనాన్ని తెలియజెప్పాయి. తర్వాత స్థానిక కళాక్షేత్రాలు, ఇతర వేదికల్లో కళాకారులు తమ ప్రదర్శనలతో అందరినీ మైమరపింపజేశారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, పౌరసంబంధ, రెవెన్యూ అధికారులు, స్థానిక నేతలు ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జానపద కళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని పిలుపునిచ్చారు.
హృదయావిష్కరణలు
‘ప్రపంచ జానపద దినోత్సవం’ సందర్భంగా ఆగస్టు 22న నిజామాబాదు జిల్లా కేంద్రం నుంచి ఈ వేడుకలు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఈ సందర్భంగా డప్పుకొట్టి కళాకారులను ఉత్సాహపరిచారు. ముఖ్య అతిథి, జిల్లా కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావు చిందుఎల్లమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో కళాకారుల పాత్ర ఎనలేనిదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి భూపాలపల్లిలో ‘జానపద జాతర’కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారులు పోషించిన పాత్రను గుర్తుచేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘జానపద జాతర’లో జిల్లా కలెక్టర్‌ శ్వేతా మొహంతి, ఎమ్మెల్యే చిన్నారెడ్డి పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో కళాకారుల ర్యాలీని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. పల్లె జీవన విధానానికి అద్దంపట్టే జానపదాలను అందరూ ఆదరించాలని ఆకాంక్షించారు. జనంలోంచి పుట్టుకొచ్చిన కళలే జానపదాలని అన్నారు జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్‌ అధ్యక్షులు బండారి భాస్కర్‌. గద్వాలలో ‘జానపద జాతర’ ర్యాలీని ఆయన ప్రారంభించారు. చెక్కభజన చేస్తూ కళాకారులు ప్రదర్శన నిర్వహించారు. పెద్దపల్లిలో బోనం ఎత్తుకుని వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం నుంచి కళాకారుల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. నిర్మల్‌లో కలెక్టరేట్‌ నుంచి ప్రదర్శనను జిల్లా కలెక్టర్‌ ఎం.ప్రశాంతి డప్పు వాయించి ప్రారంభించారు. తెలంగాణ నుంచి ఎందరో జానపద కళాకారులు దేశ విదేశాల్లో పేరు తెచ్చుకున్నారని కొనియాడారావిడ. నల్గొండ పెద్ద గడియారం చౌరస్తాలో కోలాటం, బంజారా నృత్యాలు, విభిన్న వేషధారణలతో కళాకారులు అలరించారు. కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పాశ్చాత్య సంప్రదాయ ప్రభావంతో జానపద కళలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కామారెడ్డి కలెక్టర్‌ సత్యనారాయణ. స్థానికంగా కళాకారుల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.
      కష్టంలో, ఆనందంలో, వేడుకల్లో సందర్భానుసారం మనిషి హృదయం లోతుల నుంచి జాలువారినవే జానపదాలని చెప్పారు ఆదిలాబాదు జిల్లా సంయుక్త కలెక్టర్‌ సంధ్యారాణి. ఇక్కడ గుస్సాడీ నృత్యాలు చేస్తూ కళాకారులు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత చించుఘాటు గ్రామానికి చెందిన కళా కుటుంబం కుమ్ర లింగన్న, రాజు, రాము, మారుతిలు ప్రాచీన కిన్నెర, ఢోలకి, డహ్మి, కిక్రి వాద్యాలతో అందరినీ మంత్రముగ్ధం చేశారు. సామాజిక స్థితిగతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలను చైతన్యవంతం చేయడానికి కళారూపాలు తోడ్పడతాయని వరంగల్‌ అర్బన్‌ జిల్లా సంయుక్త కలెక్టర్‌ దయానంద్‌ చెప్పారు. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల ‘జానపద జాతర’ను హన్మకొండ ఆర్ట్స్‌ కళాశాల ఆడిటోరియంలో ఆయన ప్రారంభించారు. జానపద కళలు నేర్చుకోవడం ఆషామాషీ కాదని, అందుకు కఠోర సాధన అవసరమని సూర్యాపేట జిల్లా సంయుక్త పాలనాధికారి సంజీవ రెడ్డి పేర్కొన్నారు.
ఆర్థికంగా ఎదగాలి
జానపద కళాకారులు ఒక వైపు కళను బతికిస్తూనే తమ పిల్లల్ని చదివించాలని, వాళ్ల నుంచి ఉన్నతాధికారులు రావాలని ఆశాభావం వ్యక్తంచేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి. ‘జానపద జాతర’ ముగింపు వేడుకలను ఆగస్టు 31 హైదరాబాదులోని రవీంద్రభారతిలో నిర్వహించారు. మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన సభకు రమణాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ రుణాలు అందుకొని కళాకారులు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ తెలుగు మహాసభల మాదిరిగానే జానపదకళల మహాసభలు కూడా నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బుర్రకథ ప్రధాన పాత్ర పోషించిందన్నారు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అయాచితం శ్రీధర్‌. ముగింపు వేడుకల్లో భాగంగా యాభై అయిదు బృందాలు ప్రదర్శించిన దాదాపు ముప్పైకి పైగా జానపద కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు బి.శివకుమార్‌ ‘మాయల ఫకీరు’ ఏకపాత్రాభినయంతో అలరించారు.
      జాతిజనుల అస్తిత్వానికి, వాళ్ల అనుభూతులకి ప్రతీకలు జానపద కళలు. అవి కనుమరుగు కావడమంటే ఓ సంస్కృతి కాలగర్భంలో కలవడమే. అందుకే వాటిని పరిరక్షించుకోవాలి. ఆ బాధ్యతను అందరికీ గుర్తుచేయడానికి, కళాకారుల్లో ఉత్సాహం నింపడానికి ‘జానపద జాతర’ లాంటి కార్యక్రమాలు తోడ్పడతాయి.

 


వెనక్కి ...

మీ అభిప్రాయం