కట్టమీద మైసమ్మ ఉయ్యాలో

  • 526 Views
  • 0Likes
  • Like
  • Article Share

తూరుపున వానలు ఉయ్యాలో- తురిమి తురిమి కొట్టె ఉయ్యాలో
దక్షిణపు వానలు ఉయ్యాలో- దంచి కొట్టినాయి ఉయ్యాలో
పడమటి వానలు ఉయ్యాలో- పారికొట్టినాయి ఉయ్యాలో
ఉత్తరపు వానలు ఉయ్యాలో- ఉరిమికొట్టినాయి ఉయ్యాలో
ఆవాన ఈవాన ఉయ్యాలో- కట్టమునుగవచ్చె ఉయ్యాలో
కట్టమీద మైసమ్మ ఉయ్యాలో- కట్టనిలుపావమ్మ ఉయ్యాలో
గొర్లమందనిస్త ఉయ్యాలో- కట్టనిలుపావమ్మ ఉయ్యాలో
మీకున్న గొర్లమందలు ఉయ్యాలో- మాకు లేవారాజ ఉయ్యాలో
బర్లమందాలిస్త ఉయ్యాలో- కట్టనిలుపె మైసమ్మ ఉయ్యాలో
నీకున్న బర్లమందలుయ్యాలో- నాకు లేవారాజ ఉయ్యాలో
పెద్దకొడుకునైన ఉయ్యాలో- ఇస్తవా ఓరాజ ఉయ్యాలో
పెద్దకొడకునిస్తె ఉయ్యాలో- పేరుకెవ్వరు లేరు ఉయ్యాలో
నడిపికొడుకునైన ఉయ్యాలో- ఇస్తవా ఓరాజ ఉయ్యాలో
నడిపికొడుకునిస్తె ఉయ్యాలో- నడుకకెవ్వరు లేరు ఉయ్యాలో
చిన్నకొడుకునైన ఉయ్యాలో- ఇస్తవా ఓరాజ ఉయ్యాలో
చిన్నకొడుకునిస్తె ఉయ్యాలో- సృష్టికెవ్వరు లేరు ఉయ్యాలో
ఒక్క కోడలునైన ఉయ్యాలో- ఇస్తవా ఓరాజ ఉయ్యాలో
పెద్దకోడలునిస్తె ఉయ్యాలో- పేరుకెవ్వరూ లేరు ఉయ్యాలో
నడిపికోడలునైన ఉయ్యాలో- ఇస్తవా ఓరాజ ఉయ్యాలో
నడిపికోడలునిస్తె ఉయ్యాలో- నడకకెవ్వరు లేరు ఉయ్యాలో
చిన్నకోడలునైన ఉయ్యాలో- ఇస్తవా ఓరాజ ఉయ్యాలో
చిన్న కోడలునైతే ఉయ్యాలో- ఇస్తనానిచెప్పె ఉయ్యాలో
అక్కడనుండి ఆరాజు ఉయ్యాలో- ఇంటికే వచ్చెను ఉయ్యాలో
తలకుపోసుకోవె ఉయ్యాలో- నాచిన్ని నాగేంద్ర ఉయ్యాలో
అప్పుడేపోసుకున్న ఉయ్యాలో- ఇప్పుడెందుకు మామ ఉయ్యాలో
చీరకట్టుకోవె ఉయ్యాలో- నాచిన్ని నాగేంద్ర ఉయ్యాలో
అప్పుడే కట్టుకొన్న ఉయ్యాలో- ఇప్పుడెందుకు మామ ఉయ్యాలో
బొట్టుపెట్టుకోవె ఉయ్యాలో- నాచిన్ని నాగేంద్ర ఉయ్యాలో
అప్పుడే పెట్టుకున్న ఉయ్యాలో- ఇప్పుడెందుకు మామ ఉయ్యాలో
అక్కడనుండి అక్కెమ్మ ఉయ్యాలో- చెరువుకు పోయెనూ
ఉయ్యాలో
బ్రహ్మణక్కల్లారా ఉయ్యాలో- చెరువుకు వస్తారా ఉయ్యాలో
ఇప్పుడే పోయివస్తిముయ్యాలో- ఇగజూడుచుట్టలు ఉయ్యాలో
అక్కడినుండి అక్కెమ్మ ఉయ్యాలో- కోమటివాడకుబోయె
ఉయ్యాలో
కోమటక్కల్లారా ఉయ్యాలో- మంచినీళ్లకొస్తరా ఉయ్యాలో
ఇప్పుడే తెచ్చుకున్నాం ఉయ్యాలో- ఇగజూడు చుట్టలు ఉయ్యాలో
అక్కడనుండి అక్కెమ్మ ఉయ్యాలో- హంసలవాడకుబోయె
ఉయ్యాలో
హంసలక్కల్లారా ఉయ్యాలో- మంచినీళ్లకొస్తరా ఉయ్యాలో
ఇప్పుడే తెచ్చుకున్నాం ఉయ్యాలో- ఇగజూడు చుట్టలు ఉయ్యాలో
అప్పుడు అక్కెమ్మ ఉయ్యాలో- బిందెముంచాపోయె ఉయ్యాలో
పాదాల వెంటొచ్చె ఉయ్యాలో- బిందెమునగదు మామ
ఉయ్యాలో
ఆటేటుపోరాదె ఉయ్యాలో- అంగనాలున్నాయి ఉయ్యాలో
మోకాళ్ల వెంటొచ్చె ఉయ్యాలో- బిందెమునగదు మామ
ఉయ్యాలో
అటేటుపోరాదె ఉయ్యాలో- అంగనాలున్నాయి ఉయ్యాలో
నాతలమునగొచ్చె ఉయ్యాలో- నీతలతేలొచ్చె ఉయ్యాలో
నీతల తేలింది ఉయ్యాలో- నాతల మునిగింది ఉయ్యాలో
ఆకాశానపొయ్యేటి ఉయ్యాలో- అడవిపక్షుల్లారా ఉయ్యాలో
మా అమ్మనాన్నలకు ఉయ్యాలో- బిడ్డలేదని చెప్పు ఉయ్యాలో
తొట్టెలో బాలలకు ఉయ్యాలో- తోడులేదని చెప్పు ఉయ్యాలో
పడుకున్న పాపలకు ఉయ్యాలో- పాలివ్వలేనమ్మ ఉయ్యాలో
మా అన్నవదినెలకు ఉయ్యాలో- వందనం చెప్పుడీ ఉయ్యాలో
కట్టమీదమైసమ్మ ఉయ్యాలో- కనికరించుముతల్లి ఉయ్యాలో

- డా।। ఆర్‌.కమల సేకరించి ప్రచురించిన ‘బొడ్డెమ్మ- బతుకమ్మ పాటల్లో’ ఒకటి


వెనక్కి ...

మీ అభిప్రాయం