పరాయి భాషలో పరీక్షలా..!?

  • 255 Views
  • 0Likes
  • Like
  • Article Share

    టి.ప్రభాకర్‌

  • చెన్నై
  • 9121229281
టి.ప్రభాకర్‌

తమిళనాడు ప్రభుత్వ విధానాలు అక్కడి తెలుగువారిని కలవరానికి గురిచేస్తున్నాయి. తెలుగు విద్యార్థులకు మాతృభాషలో పరీక్షలు రాసుకునే అవకాశం ఇక మీదట ఉండబోదంటూ ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. దీనిమీద స్థానిక తెలుగు సంఘాలు నిరసన వ్యక్తంచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల పాలకులు తమకు అండగా నిలబడాలని కోరుతున్నాయి.
ఆంధ్ర, తెలంగాణల తర్వాత అత్యధికంగా తెలుగువారు తమిళనాడులోనే ఉన్నారు. 2006లో డీఎంకే ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్బంధ తమిళం జీవోతో అక్కడ తెలుగు భాషకు కష్టాలు మొదలయ్యాయి. వీటిని ఎదుర్కొనేందుకు స్థానిక భాషాభిమానులు తమ శక్తిమేరకు ప్రయత్నిస్తూ వస్తున్నారు. తెలుగుకు పూర్వవైభవం రావాలని, మాతృభాషలోనే చదువుకునే వెసులుబాటు కల్పించాలని సమయం వచ్చినప్పుడల్లా గొంతెత్తుతున్నారు. న్యాయస్థానాల ద్వారానూ పోరాడుతున్నారు. ఈక్రమంలోనే గత మూడు సంవత్సరాల్లో అమ్మభాషలో పరీక్షలు రాసుకునే అవకాశాన్ని ఇక్కడి విద్యార్థులు పొందారు. కానీ, ఇక మీదట ఇలాంటి వెసులుబాటు ఉండదని తమిళనాడు విద్యాశాఖ మంత్రి సెంగొట్టయ్యన్‌ ఇటీవల తేల్చిచెప్పారు! 
      యాభై ఏళ్ల కిందటి గణాంకాల ప్రకారం తమిళనాడు జనాభాలో దాదాపు నలభై శాతం మంది తెలుగువారే. 1981 జనాభా లెక్కల ప్రకారం ఆ సంఖ్య 15 శాతానికి పడిపోయింది. 2001కి వచ్చేసరికి అది 5.65 శాతానికి చేరుకుంది. నిజానికి ఈ లెక్క వాస్తవ విరుద్ధం. ఓ పథకం ప్రకారం రేషనుకార్డులు, ఓటర్ల జాబితాల్లో కృష్ణయ్యను కృష్ణన్‌గా, సుబ్బమ్మను సుబ్బమ్మాళ్‌గా మార్చి.. తమిళులుగా చిత్రీకరించి, తద్వారా తెలుగువారి సంఖ్యను తగ్గించారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలోని అల్పసంఖ్యాక భాషల ప్రజలు ఏ భాషలో ఉత్తరాలు రాస్తారో, ఆ భాషలోనే ప్రభుత్వం ప్రత్యుత్తరాలు పంపాలని; ఓటర్ల జాబితాలను కూడా ఆయా భాషల్లోనే విడుదల చేయాలని జీవో నం.83 (1993) పేర్కొంది. దీన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇక పాఠశాలల్లోనైతే తమిళానిదే రాజ్యం!
సభలో ‘తెలుగు’ చర్చ
పాఠశాలల్లో అనుసరిస్తున్న నిర్బంధ తమిళ విధానం మీద ఇటీవల శాసనసభలో చర్చ జరిగింది. డీఎంకేకు చెందిన తళ్లి నియోజకవర్గ శాసనసభ్యులు వై.ప్రకాశ్‌ ఈ విషయం మీద గళమెత్తారు. తెలుగు విద్యార్థుల ఇబ్బందులను ఆయన సభ దృష్టికి తెచ్చారు. మాతృభాషలో చదువుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. దీనిమీద రాష్ట్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖల మంత్రి, హోసూరు ఎమ్మెల్యే పి.బాలకృష్ణారెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలో తెలుగు విద్యార్థులు ఇబ్బంది పడటానికి డీఎంకేనే కారణమన్నారు. వీళ్లిద్దరూ ఆ రోజు సభలో తెలుగులోనే మాట్లాడటం విశేషం. అనంతరం విద్యాశాఖ మంత్రి సెంగొట్టయ్యన్‌ మాట్లాడుతూ.. తమిళం నేర్చుకోవడానికి ఇతర భాషల విద్యార్థులకు రెండేళ్ల సమయం ఇచ్చామని, ఇక మీదట మినహాయింపులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు.
      తమిళ పాలకుల మాతృభాషాభిమానం ఇతర భాషీయుల గొంతు నొక్కేస్తోంది. వాళ్లని పరాయిభాషకే పరిమితం చేస్తోంది. ఈ ప్రభావం స్థానిక తెలుగువారి మీద ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలుగును రక్షించుకోవడానికి మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖతో ఆస్కా, మద్రాసు తెలుగు అభ్యుదయ సమాజం, అఖిల భారత తెలుగు సమాఖ్య తదితర సంస్థలు చేస్తున్న కృషి బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ఈ సమస్యకు రాజకీయ ఒత్తిడితోనే సరైన పరిష్కారం లభిస్తుందని, దీనికి అనుగుణంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకురావాలని, కేంద్రం కూడా చొరవ చూపాలని ఇక్కడి తెలుగు ప్రముఖులు, భాషాభిమానులు కోరుతున్నారు. వీరి మొరను ఆంధ్ర, తెలంగాణ పాలకులు ఆలకిస్తారా? తమిళనాట తెలుగును బతికిస్తారా?


చిత్తూరు జిల్లాలోని తమిళ బడులను ప్రోత్సహిస్తున్న మాదిరిగా తమిళనాడులో తెలుగు పాఠశాలలను ప్రోత్సహించాలి. దీని మీద తమిళనాడు ప్రభుత్వంతో తెలుగు రాష్ట్రాల పాలకులు సంప్రదింపులు జరపాలి. తెలుగు బడుల్లో ఖాళీగా ఉన్న తెలుగు ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలి. తమిళనాడులో ‘తెలుగు’ పరంగా జరుగుతున్న అన్యాయాలపై ఒక కమిటీని వేసి పరిష్కార మార్గాలను అన్వేషించాలి.  

- కృష్ణారావు, అధ్యక్షులు, ద్రావిడ దేశం


డీఎంకే తీసుకొచ్చిన జీవో కారణంగానే మాతృభాషలో పరీక్షలు రాసుకోలేని పరిస్థితి మైనారిటీ విద్యార్థులకు వచ్చింది. మా ప్రభుత్వం చొరవ తీసుకుని పిల్లలు రెండు సార్లు తమ మాతృభాషలో పరీక్షలు రాసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ విషయంలో నేను ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, విద్యాశాఖ మంత్రి సెంగొట్టయ్యన్‌తో మాట్లాడాను. ఉపాధ్యాయుల కొరత, ఇతర అంశాలను విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాను. మా ప్రభుత్వం తెలుగుతోపాటు ఇతర మైనారిటీ భాషల అభివృద్ధికి కట్టుబడి ఉంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీఆర్‌, అమ్మ జయలలిత తెలుగు, ఇతర మైనారిటీ భాషల అభివృద్ధికి కృషిచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా అదేదారిలో నడుస్తున్నారు. 

- పి.బాలకృష్ణారెడ్డి, రాష్ట్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖల మంత్రి


ఏ రాష్ట్రమైనా తమ భాషతోపాటు అందరి మాతృభాషలను రక్షించాలి. ఆ లక్ష్యంతో ప్రభుత్వాలు పాటుపడినప్పుడే భాషలన్నీ బతికి బట్టకడతాయి. నిర్బంధ తమిళం జీవో వల్ల ఇక్కడి తెలుగుతోపాటు కన్నడం, మలయాళం తదితర అల్ప సంఖ్యాకుల భాషలకు ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి. నిర్బంధ తమిళం జీవోను రద్దుచేయాలని విజ్ఞప్తి చేయాలి. లేకపోతే త్రిభాషా సూత్రాన్ని అమలుచేసేలా చర్యలు చేపట్టాలి. 

- మాడభూషి సంపత్‌కుమార్‌, తెలుగు శాఖ అధ్యక్షులు, మద్రాసు విశ్వవిద్యాలయం


తమిళనాడు అసెంబ్లీలో అధికార, విపక్షాల సభ్యులు నిర్బంధ తమిళం అంశంపైనే దృష్టిపెట్టారు. రాష్ట్రంలో ద్విభాషా సూత్రంతో తెలుగుకు అన్యాయం జరుగుతున్న విషయంపై మాట్లాడలేదు. నిర్బంధ తమిళానికి మేము వ్యతిరేకం కాదు. అల్పసంఖ్యాకుల భాషల పరిరక్షణకు అవకాశం కల్పించాలని రాజ్యాంగంలోని అధికరణ 30 చెబుతోంది. దాన్ని పట్టించుకోలేదనే మా ఆవేదన. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తమిళ పాఠశాలల్లో విద్యార్థులు తమిళం నేర్చుకుంటున్నారు. ఆ పద్ధతిలోనే తమిళనాడులోని తెలుగు విద్యార్థులు తెలుగు నేర్చుకునే వెసులుబాటు కల్పించాలి. 

- డాక్టర్‌ సీఎంకే రెడ్డి, అఖిలభారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు


మా డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తే అల్పసంఖ్యాకుల భాషలకు ప్రాధాన్యం దక్కుతుంది. విద్యార్థులు అమ్మభాషలో చదువుకునే వెసులుబాటు కల్పిస్తాం. ఇటీవల కృష్ణగిరి పర్యటనలో పార్టీ అధ్యక్షులు ఎంకే స్టాలిన్‌ కూడా ఈ విషయాన్ని స్థానిక తెలుగు, కన్నడ సంఘాల నేతలకు తెలిపారు. శాసనసభలో కూడా తెలుగులో మాట్లాడటాన్ని స్టాలిన్‌ ప్రోత్సహించారు. 

- వై.ప్రకాశ్‌, శాసనసభ్యులు


నిర్బంధ తమిళం విషయంలో జరిగిన అన్యాయం మీద తెలుగు సంఘాలు, ఉపాధ్యాయులు, భాషాభిమానులు సకాలంలో స్పందించ లేకపోయారు. దాని పర్యవసానాలు విద్యార్థులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తెలుగు రాష్ట్రాల పాలకులూ సరైన సమయంలో సరైన పద్ధతిలో స్పందించలేదు. రాష్ట్రంలో 2005 వరకు తెలుగులో చదువుకునేందుకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాలేదు. 2006లో నిర్బంధ తమిళ విధానం వచ్చింది. దానివల్ల అల్పసంఖ్యాకుల భాషలకు కలిగే నష్టం మీద సామాజిక కార్యకర్త ట్రాఫిక్‌ రామస్వామి న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. ఇతరుల సహకారం లేకపోవడంతో ఓడిపోయారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా అదే ఫలితం వచ్చింది. ఆ తర్వాత జరిగిన నష్టం ఏంటో తెలుగువారికి తెలియడానికి పదేళ్లు పట్టింది. ఈ పరిస్థితుల్లో చట్ట సవరణ, త్రిభాషా సూత్రం అమలు, తెలుగు సంఘాల ఐక్యపోరాటం, దానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సహకారం సమకూరితేనే రాష్ట్రంలో మళ్లీ తెలుగు వర్ధిల్లుతుంది. 

- తూమాటి సంజీవరావు, చెన్నై, తెలుగు ప్రకాశం సంపాదకులు


 


వెనక్కి ...

మీ అభిప్రాయం