ఆదిమభాషలకు అండదండలు

  • 649 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఎంతో పోరితే తప్ప, భాషకి సంబంధించిన చట్టాలను రూపొందించేందుకు ప్రభుత్వాలు ఇష్టపడవు. అది కూడా నామమాత్రంగానే! ఇక ఆదిమభాషల పరిరక్షణకు కట్టుబడే చట్టాలైతే చాలా అరుదుగా ఉంటాయి. కానీ కెనడాలో పాలకులే చొరవ తీసుకుని ఆదిమవాసుల భాషాహక్కుల సంరక్షణ కోసం ఓ చట్టాన్ని రూపొందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వాధికారులు ఓ ప్రణాళికను కూడా తయారుచేశారు. దాని ప్రకారం జూన్‌ 15 నుంచి ఆగస్టు 31 వరకు దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో అధికారులు పర్యటించారు. అక్కడ స్థానికంగా ఉండే ఇన్యుట్‌, మెటిస్‌ వంటి ఆదిమజాతుల వారిని కలుస్తారు. వారి అభిప్రాయాలు, ఆవేదనలను పరిగణనలోకి తీసుకుంటూ ఆదిమభాషల చట్టాన్ని రూపొందిస్తారు.
ప్రస్తుతం కెనడాలో లిబరల్‌ పార్టీ ప్రభుత్వం నడుస్తోంది. 2015లో జరిగిన ఎన్నికల సమయంలో ఈ పార్టీ, తాము అధికారంలోకి వస్తే ఆదిమభాషల పరిరక్షణ కోసం కఠినమైన చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చింది. ఆమేరకు 2019లో ఎన్నికలు వచ్చేలోగా ఈ చట్టాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. ‘‘కొన్ని భాషలను మాట్లాడటంలో మనదే ఆఖరి తరం. అందుకే ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అగత్యం చాలా ఉంది.... వాటిలో ఈ చట్టం ఒకటి’’ అంటారు కెనడా సాంస్కృతిక శాఖ మంత్రి మెలనీ. 2014 ఎన్నికల సమయంలో మన రెండు రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయిలోనూ భాషా సాహిత్యాలు, కళల పరిరక్షణ, అభివృద్ధికి అనేక హామీలిచ్చారు నాయకులు. మరి వాటిలో ఎన్నింటిని నిలబెట్టుకున్నారు? 


వెనక్కి ...

మీ అభిప్రాయం