అందివస్తున్న సాంకేతికత

  • 699 Views
  • 0Likes
  • Like
  • Article Share

ప్రపంచం అనేక భాషలకి నిలయం. ఓ భాష కనుమరుగు అయిపోయిందంటే.. మనిషిలో ఓ భాగం మాయమైపోయినట్టే! భాషలు అంతర్థానమవడానికి సాంకేతికత కూడా కారణం అన్న అపవాదు ఉంది. కానీ ఇప్పుడు అదే సాంకేతికత ప్రమాదంలో ఉన్న భాషలకి సాయం చేయడం సంతోషించదగ్గ విషయమే కదా! ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఓ ప్రయత్నం గురించే ఈ వివరణ అంతా!
ఆస్ట్రేలియాలో మూడొందలకు పైగా ఆదిమ భాషలు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు 140 మాత్రమే కొద్దోగొప్పో వినిపిస్తున్నాయి. అందులోనూ పద్దెనిమిది భాషలనే బడిలో బోధిస్తున్నారు. ఈ ఆదిమభాషలని పరిరక్షించేందుకు అక్కడ కోడెల్‌ అనే సంస్థ కృషి చేస్తోంది. భాషా పరిరక్షణలో భాగంగా ఆ సంస్థ నలభై వేల గంటల నిడివి కలిగిన మాటలను రికార్డు చేసింది. అది సరే! వీటిని అక్షరరూపంలోకి తీసుకురావడం ఎలా? ఆ భాషలు తెలిసినవారు సుమారు ఇరవై లక్షల గంటలు పనిచేస్తే కానీ, ఆ మాటలని వడపోసి రాత రూపంలోకి మార్చడం సాధ్యం కాదు! ఇలాంటి సమయంలో, సమస్యని పరిష్కరించేందుకు సాంకేతికతను ఉపయోగించుకోవాలన్న ఆలోచన వచ్చింది.
మాట నుంచి పదానికి ప్రయాణం
ప్రస్తుతం ‘స్పీచ్‌ టు టెక్ట్స్‌’ తరహా సాంకేతికత లేకపోలేదు. దీని ద్వారా మాటలని అక్షరరూపంలోకి మార్చవచ్చు. అయితే భిన్నమైన ఆదిమభాషలను నమోదు చేసేందుకు వీటి ప్రభావం సరిపోదు. అందుకే కోడెల్‌ సంస్థ గూగుల్‌తో కలిసి ఓ కార్యాచరణను రూపొందించింది. గూగుల్‌ తయారుచేసిన ‘టెన్సార్‌ ఫ్లో’ అనే సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఆదిమభాషలను గుర్తించే ప్రయత్నం చేస్తోంది. దాని వల్ల ఆయా భాషల్లోని మాటలను, అక్షరాలుగా తర్జుమా చేయడంలో పెద్దగా లోపాలు తలెత్తవు. ఇలా ఇప్పటికే ఆస్ట్రేలియాలో వినిపించే ఓ ఆరు భాషలు, ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి చెందిన మరో అయిదు భాషలని తర్జుమా చేసే పని మొదలైంది.
కేవలం భాషని అక్షరాలలోకి తర్జుమా చేయడమే కాకుండా, ఈ సాఫ్ట్‌వేర్‌తో ఇంకా చాలా పనులే చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు ఓ పరిశోధకుడు, తనకి అంతగా పట్టులేని భాషలో వివరాలు రాబట్టాలనుకున్నాడే అనుకుందాం. అందుకోసం ఎలాంటి ప్రశ్నలు సంధించాలో ఈ సాఫ్ట్‌వేర్‌ చెబుతుంది. భాషకి సంబంధించిన సాహిత్యాన్ని సేకరించేందుకు, నిఘంటువుల లాంటి నిధులను కూడగట్టేందుకు.. ఇలా రకరకాలుగా ఈ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడుతుంది. భాషల పరరిక్షణకు ఇలాంటి సృజనాత్మక ప్రయత్నాలే బాగా దోహదపడతాయి. 


వెనక్కి ...

మీ అభిప్రాయం