చిన్ని పూవు తేనె

  • 949 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కట్టా నరసింహులు

  • కైఫియ్యత్తు కతల రచయిత
  • తిరుపతి
  • 9441337542
కట్టా నరసింహులు

కైఫా అంటే సమాచారం, ఆ శబ్దం నుంచి నామవాచక రూపంలో ‘కైఫియ్యత్తు’ ఏర్పడింది. ‘సమాచారం అందిస్తుంది’ అని దానికి అర్థం. ఆంగ్లేయుల కాలంలో కల్నల్‌ కాలిన్‌ మెకంజీ - మన ప్రాంత సమాచారం చాలా సేకరించాడు. ఆ సమాచారాన్ని జల్లెడ పట్టి నిగ్గును పేర్చుకుంటూ పోతే చరిత్ర, సంస్కృతి, ఆచారవ్యవహారాలు, తిండి, బట్ట, ఆలయాలు, శాసనాలు, కాలువలు, చెరువులు, నదులు, అడవుల్లో దొరికే కలప, అక్కడ సంచరించే జంతువులు ఇలా ఒక విజ్ఞానసర్వస్వం మన ముందు నిలుస్తుంది. మెకంజీ సేవ అలాంటిది. ఆయన సేకరించిన ‘చిన్ని పూవుతేనె’ కథా కమామిషు ఇది.
తూర్పుగోదావరి
జిల్లాలోనిది పిఠాపురం, దీనికి తూర్పుగా ఆరుకోసుల దూరంలో పొన్నాడ, తొండంగి, వేమవరం గ్రామాలున్నాయి. వీటికి ఉత్తర దక్షిణాలుగా పదికోసుల దూరం అడవి వ్యాపించి ఉండేది. ఆ ప్రాంతం నుంచి సముద్రం పావుకోసు దూరంలో ఉంటుంది. ఇక్కడి అడవిని ‘కోన’ అని పిలిచేవారు. 
      ఈ కోనలో ఆవులు, ఎడ్లు తిరుగుతూ ఉంటాయి. అవి మనుషులకు మచ్చికైనవి కావు. మనుషుల చప్పుడు వింటూనే జింకల్లా గంతులు వేస్తూ దూరంగా పరుగులుతీస్తాయి. వీటి కొమ్ములు తిన్నగా ఉంటాయి. పగటి వేళ అడవిలో ఉంటాయి. గడ్డి తింటాయి. ఇక్కడ దోమలు అధికం. చీకటిపడితే ఈ దోమల దాడికి పశువులు ఉండలేవు. సముద్రతీరానికి చేరుకుంటాయి. అలల సమీపంలో పడుకుంటాయి. అంతేకాదు, ఈ ప్రాంతంలో ఉండే పైరు పంటల్ని మేస్తాయి. తిరిగి సూర్యోదయానికి ముందే అడవిలోకి వెళ్లిపోతాయి. ఈ పశువుల కోసం తెల్లదొరలు మాటువేస్తారు. తుపాకీతో కొట్టి పడవేసి తీసుకుపోతారు. దోమపోటు కారణంగా పులుల సంచారం ఇక్కడ ఉండదు. తేనె సేకరించే కాలంలో మనుషులు రాత్రింబవళ్లు తిరుగుతూ ఉంటారు. అడవిలోని పిశిణిగ, గొల్గు, దోర్ని పండ్లను సమీప గ్రామాల్లో అమ్ముకుని కొందరు జీవనం చేస్తుంటారు.
      ఈ కోనలో కుంకుడు చెట్లు విస్తారం. పది పదునైదు జేనల వ్యాసంతో కుంకుడు చెట్టు కాండం ఉంటుంది. కుంకుడు కాయల్ని తలంటుకొనేందుకు ఉపయోగిస్తారు కదా! పిశిణిగ, దోర్నిగ, గోల్గు అనేవి పొదలుగా పెరిగే వృక్షజాతి! వీటి పండ్లను తింటారు. పాల చెట్టు ఈ కోనలో విస్తారంగా పెరుగుతుంది. పాల చెట్టు ప్రధాన కాండం 40-50 జేనల వ్యాసం ఉంటుంది. ఈ చెట్టు రెండు నిలువుల ఎత్తు పెరుగుతుంది. పాలచెట్లకు తొర్రలు ఏర్పడతాయి. ఈ తొర్రల్లో మనుషులు హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. ఏటి కాలువలకు, తొర్రలున్న పాలచెట్టు కాండాలను తూములుగా ఉపయోగిస్తారు. ఈ కోనలో పాలచెట్లు అధికంగా ఉండటంతో ‘పాల అడవి’ అని కూడా అంటారు. ఈ అడవిలో మరోరకం చెట్లు కూడా ఉన్నాయి. వాటిని ‘చిన్ని చెట్లు’ అని పిలుస్తారు. ఇవి కేవలం నిలువెత్తు ఉంటాయి. ఈ చెట్ల కాండం జానెడు వలయం మించి ఉండదు. ఈ చెట్లకు తెల్లగా ఉండే చిన్న పూవులు కాస్తాయి. 
      ఈ అడవిలో తేనె బహువిస్తారంగా దొరుకుతుంది. పెద్ద ఈగలు, చిన్న ఈగలు అని తేనెటీగలు రెండు రకాలు. ఇక్కడ చిన్న తేనెటీగలు తుట్టెలు పెట్టుకుంటాయి. పాల చెట్టు తొర్రల్లోను, చిన్ని చెట్ల మీద ఈ తుట్టెలు కట్టుకుంటాయి. తేనె కోసం వచ్చే వాళ్లకు అడవిలో చిన్ని చెట్ల మీద ఉండే తేనె తుట్టెలు కనిపిస్తాయి. తొర్రల్లో ఉండే తేనె తుట్టెల్ని మాత్రం విడిచి పెడతారా? చిన్ని చెట్ల మీద చిన్న తేనెటీగలు తుట్టెలు నిర్మించుకొనే దృశ్యం కంటికి ఆనందంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ సేకరించే తేనె ‘చిన్ని పూవు తేనె’ గానే పేరు పొందింది.
      ఈగలు చిన్ని చెట్టు మీద, పాల చెట్టు తొర్రల్లో తుట్టెలు నిర్మించుకుంటాయి కదా! అయితే, గుడ్లు పెట్టి పిల్లల్ని కనేందుకు మాత్రం చిన్నిచెట్లను ఉపయోగించుకోవు. పాల చెట్టు తొర్రల్నే వాడుకుంటాయి. దీనికో కారణముంది. తుట్టెల బరువుకు చిన్నిచెట్టు కొమ్ములు వంగవచ్చు, విరిగిపోవచ్చు. పాలచెట్టు తొర్రలు బలంగా, రక్షణ కవచంగా ఉంటాయి. అదీ ఆ ఈగల తెలివి.
      ఈగలు వేలకొద్దీ పువ్వుల నుంచి పుప్పొడిని సేకరించి తుట్టెల్లో దాచి ఉంచితే అది తేనె అవుతుంది! ఇక్కడి తేనెటీగలు పూవుల మకరందాన్ని రెండు విధాల సంపాదిస్తాయి. చిన్నిచెట్ల పూవుల నుంచి, వరి పొలాల నుంచీ దాన్ని సేకరిస్తాయి. వరి పొట్టకు వచ్చే ముందు పూతకు వస్తుంది. ఆ పూతలో పుప్పొడి (పువ్వారు) ఉంటుంది. ఈ పువ్వారును ఈగలు సేకరించి దాచి ఉంచుతాయి. ఈ వరి పువ్వారుతో తయారయ్యే తేనె మధురమైందే కాక ఆరోగ్యకారకమైంది. ఈ తేనె కోసం పిఠాపురం మహారాజా అర్రులు చాచేవారు. ఆ రుతువు రాగానే రాజావారు తేనె కోసం మాటు వేస్తారు. తమ మనుషుల్ని అడవిలో ఉంచుతారు. వారు తేనె సేకరిస్తారు. వరిపువ్వారుతో వచ్చే తేనె సురేకారపు ఉప్పు కణికల్లాగా ఉంటుంది. ప్రజలు తమ ఆరోగ్యం కోసం వేసవి కాలంలో రెండు మూడు డబ్బు(ఒక రకం రాగి నాణెం)ల ఎత్తు పువ్వారు తేనె ఆరగిస్తారు. వేలంపాట పాడి కొందరు తేనెను సేకరించి బయటికి తీసుకువెళ్లి అమ్ముతుంటారు.
      ఆషాఢమాసంలో ఒకమారు తేనె సేకరిస్తారు. ఈ తేనెలో వరిపువ్వారు ఉండదు. రుచి తక్కువ, పంట కూడా తక్కువే. మార్గశిర కార్తీక మాసాల్లో లభించే తేనె వరిపువ్వారుతో తయారవు తుంది. బహుమధురంగా ఉంటుంది. పాల తొర్రల్లో ఉండే తుట్టె నుంచి ఎనిమిది నుంచి పన్నెండు వీసెల తేనె వస్తుంది. ఈ తేనె గడ్డ కట్టి పలుకులుగా ఉంటుంది. పలుచగా ఉండదు.
      చిన్ని పూవు తేనె- కథ ఇంత ఉంది. కైఫియ్యత్తు కాలగర్భంలో దాగి ఉన్న ఈ కథ చరిత్రలో చేరిపోయిందా! అందరికీ తెలిసే అవకాశం ఉందా!

(ఏపీ ఆర్కైవ్స్‌ ఆర్‌.నం.1084- రాజమహేంద్రవరం జిల్లా పిఠాపురం తాలూకా కోన అడవి కైఫియత్తు ఆధారంగా) 


వెనక్కి ...

మీ అభిప్రాయం