నుడికారాల వెలుగుర‌వ్వ‌లు

  • 1050 Views
  • 3Likes
  • Like
  • Article Share

జాతీయాలనేవి వ్యక్తుల లోకానుభవాలను ఆసరాగా చేసుకుని వ్యాప్తిలోకొస్తాయి. ఇవి జాతి సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరిస్తాయి. భాషలోని సొగసును పట్టినిలుపుతాయి. భాషామర్యాదనూ, సహజ సౌందర్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడతాయి. గ్రామీణ జీవన మాధుర్యం, వైవిధ్యమైన పద విన్యాసం, చమత్కారం, మమకారపు గాఢత, ఆచార వ్యవహారాల మౌలిక స్వరూపం ఇలా అనేక కోణాలను తడిమి చూసుకునేందుకు జాతీయాలు వీలు కల్పిస్తాయి. అలాంటి జాతీయాలు కొన్నింటిని పరిశీలిద్దాం.
జోడుగుర్రాల స్వారీ
ఒకే సమయంలో రెండు గుర్రాలమీద స్వారీ చేయడం అసాధ్యం. ఎంత తర్ఫీదిచ్చినా ఇది కుదరని పని. అలా చేయాలనుకోవడం ప్రమాదం కూడా. అందుకే ఈ జాతీయానికి ప్రమాదకరమనే అర్థం వాడుకలో ఉంది. అంతేకాదు సరైన ఆలోచన విధానం ఉన్నవాడు ఎప్పుడూ ఇలాంటి పిచ్చి పని చేయడు. అందువల్ల ‘జోడుగుర్రాలస్వారీ చేసేవాడు’ అంటే.. మాట, మనసు నిలకడ లేనివాడు, దురాశపరుడనీ వ్యవహారంలో ఉంది. 


పూచిన తంగేడు
సమృద్ధిని తెలియజేసేందుకు ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు. ఆకులు కూడా కనిపించనంతగా తంగేడు మొక్క విరగబూస్తుంది. సిరి సంపదలతో తులతూగుతున్న వాళ్లని పూచిన తంగేడులో పోలుస్తారు. ఒంటినిండా నగలతో వైభోగంగా కనిపించేవాళ్లనూ ఇలా అనడం కద్దు.


లంకమేత
అనవసర ప్రయాస అనే అర్థంలో దీన్ని వాడుతుంటారు. నదుల మధ్యలో ఏర్పడే సారవంతమైన భూభాగాన్ని లంక అంటారు. పాడి పశువులకు అవసరమైన గడ్డి అక్కడ బాగా దొరుకుతుంది. అయితే లంకకు చేరుకోవాలంటే పశువులు ఈదక తప్పదు. కడుపు నిండా మేత మేసిన తర్వాత మళ్లీ ఈదుకుంటూ ఇంటికి చేరాల్సిందే. ఇలా తిన్న తిండి మొత్తం ఈదటంలోనే హరించుకుపోతుంది. ఎంత కష్టపడినా ఫలితం లేనప్పుడు ‘‘లంకమేత... గోదారి ఈత’’ అంటుంటారు.


కంచి గరుడ సేవ
 ఎలాంటి ప్రయోజనమూ లేని పనులు చేసినప్పుడు దీన్ని ఉపయోగిస్తుంటారు. కంచిలో శ్రీ వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో భారీ ఇత్తడి గరుడ వాహనం ఉంటుంది. ఉత్సవమూర్తి కన్నా అది చాలా పెద్దగా ఉంటుంది. బ్రహ్మోత్సవాలప్పుడు స్వామిని ఊరేగించడానికి గరుడ వాహనాన్ని శుభ్రం చేయడంలో చాలా అలసిపోతుంటారు. అంతచేసినా గరుడుడేమన్నా వరాలిస్తాడా? అదే స్వామికి చేస్తే పుణ్యమన్నా దక్కుతుంది కదా! ఈ భావనలోంచి పుట్టుకొచ్చిన జాతీయమిది. ఎప్పుడైనా చేసిన పని వృథా అయితే ‘అది కంచి గరుడ సేవే అయ్యింది’ అని అంటుంటారు. 


చిదంబర రహస్యం
ఏమీ లేదు, ఏమీ తెలియదు అనే అర్థంలో దీన్ని ఉపయోగిస్తారు. చిదంబరం తమిళనాడులోని ప్రసిద్ధ శైవక్షేత్రం. ఇక్కడి గర్భగుడిలో నటరాజస్వామి విగ్రహం ముందు ఒక తెర ఉంటుంది. దర్శనానికి వెళ్లిన వాళ్లకి తెర, ఓ బంగారు బల్లి తప్ప విగ్రహం కనిపించదు. చిత్‌ అంటే బుద్ధి, జ్ఞానం; అంబరం అంటే ఆకాశం... జ్ఞానమార్గంలో భగవంతుడిని దర్శించుకోమని చెప్పడమే ఈ తెర ఉద్దేశం అంటారు వేదాంతులు. కానీ సామాన్యులకి అది సాధ్యమేనా? చాలా మందికి అది రహస్యంగానే మిగిలిపోతుంది కదా! అలా సామాన్య భక్తులు సృష్టించిన జాతీయం ఇది.


వెనక్కి ...

మీ అభిప్రాయం