తెలుగు అంటే రాగఝరి

  • 1041 Views
  • 0Likes
  • Like
  • Article Share

కర్ణాటక సంగీత లోకంలో నాలుగున్నర దశాబ్దాలుగా తన గానామృతాన్ని పంచుతున్న విదుషీమణి ఎం.ఎస్‌.షీల. జన్మతః కన్నడిగురాలైనా తెలుగంటే మక్కువతో మన భాషను నేర్చుకున్నారావిడ. తెలుగునాట అనేక కచ్చేరీలూ ఇచ్చారు. శాస్త్రీయ సంగీతానికి అందించిన సేవలకుగానూ షీల కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తెలుగుతో తన అనుబంధాన్ని గురించి షీల ‘తెలుగువెలుగు’తో ముచ్చటించారు. ఆవిడ ఏం చెప్పారో చదవండి...
త్యాగరాజ, మైసూరు వాసుదేవాచారి, శ్యామశాస్త్రి లాంటి వాగ్గేయకారుల సాహిత్యం తెలుగులోనే ఉంటుంది. అన్నమాచార్యుల కీర్తనలైతే తెలుగు తేనెల ప్రవాహాలే. ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకొని పాడితే గానం మరింత సుభగమవుతుంది. మా గురువుగారు ఆ కీర్తనల అర్థాలు వివరించేవారు. ప్రారంభంలో ఇలా కొంత తెలుగు నేర్చుకున్నాను. తెలుగునాట కచ్చేరీలు చేస్తున్న సమయంలో స్థానికుల మాటలను పరిశీలిస్తూ ఉండేదాన్ని. వాళ్లతో తెలుగులోనే మాట్లాడటానికి ప్రయత్నించేదాన్ని. భీమవరంలో మా మేనత్త ఉన్నారు. నేను కచ్చేరీలకు వెళ్లినప్పుడు, ఆమె బెంగళూరు వచ్చినప్పుడు తెలుగు భాష గురించి సందేహాలు అడిగి తెలుసుకునేదాన్ని. నా తెలుగు స్నేహితురాళ్లు కూడా అనేక పదాలకు అర్థాలు చెప్పేవాళ్లు. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడతాను. చదవగలను, రాయగలను కూడా. మరో విషయం ఏంటంటే లిపి, భాషల విషయంలో కన్నడ, తెలుగులకు చాలా సామ్యం ఉంది. అందువల్ల తెలుగు నేర్చుకోవడం అంత కష్టమనిపించలేదు. ముఖ్యంగా వాగ్గేయకారుల కీర్తనాసాహిత్యం చూశాక తెలుగు భాషంటే చాలా ఇష్టం ఏర్పడింది. పైగా తెలుగు రాగయుక్తంగా ఉంటుంది. మా అమ్మ కర్ణాటక సంగీతకారిణి. ఆమే నా మొదటి గురువు. తర్వాత ‘పద్మభూషణ్‌’ ఆర్‌.కె.శ్రీకంఠన్‌ (త్యాగరాజ పరంపరలోని వారు) దగ్గర నా అభ్యాసం కొనసాగింది. బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి సంగీతంలో స్నాతకోత్తర విద్య పూర్తిచేశాను. లలిత సంగీతం, నృత్యం కూడా అభ్యసించాను. 26 ఏళ్ల వయసులో ఆకాశవాణి ‘ఎ’ గ్రేడ్‌ కశాకారిణి అయ్యాను. తెలుగునాట విశాఖపట్నం, హైదరాబాదు, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, విజయవాడ, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల్లో కచ్చేరీలు చేశాను. విదేశాల్లో కూడా పర్యటించాను. పదిహేడేళ్ల కిందట నా భర్త సహకారంతో ‘హంసధ్వని క్రియేషన్‌’ సంగీత సంస్థను నెలకొల్పి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాను.
      తెలుగు రాష్ట్రాల్లో మల్లాది సోదరులు, హైదరాబాదు సోదరీమణులు, మృదంగ విద్వాంసులు రమణమూర్తి, శ్రీరంగం గోపాలరత్నంలతో ఆత్మీయ అనుబంధం ఉంది. నేదునూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఒకసారి తిరుమలలో అన్నమాచార్య సంకీర్తన పాడే అవకాశం లభించడం మర్చిపోలేనిది. అలాగే ‘మేఘదూతం’ రేడియో సంగీత నాటకంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ నాయకుడు, నేను నాయికగా చేశాం.
      పాశ్చాత్య సంగీత ప్రభావం నేటి యువత మీద పడుతోందన్నది కొంతవరకు నిజమే. అంతమాత్రాన శాస్త్రీయ సంగీతానికి వచ్చే ప్రమాద మేమీలేదు. ఇది చాలా పటిష్టం. నేటి యువతలో చాలామంది మన శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంటున్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా టీవీ ఛానళ్లు వాళ్లని ప్రోత్సహిస్తు న్నాయి. స్థానికంగా మంచి విద్వాంసులు లేకపోతే పక్కరాష్ట్రాలకు వెళ్లి మరీ నేర్చుకుంటున్నారు. కారణం, ఏ సంగీతానికైనా శాస్త్రీయ సంగీతమే పునాది.

 


వెనక్కి ...

మీ అభిప్రాయం