కలం యోధుడు

  • 248 Views
  • 0Likes
  • Like
  • Article Share

తెలంగాణ ఉద్యమకారుడిగా, పాత్రికేయుడిగా, రచయితగా తనదైన ప్రత్యేకత చాటుకున్నారు ఆదిరాజు వెంకటేశ్వరరావు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో రైతు కుటుంబంలో 1938లో ఆయన జన్మించారు. తొలుత విద్యాశాఖలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొని 21 రోజుల పాటు ముషీరాబాదు జైల్లో ఉన్నారు. ఆ సమయంలో ‘పీపుల్స్‌ స్ట్రగుల్‌’ అనే పుస్తకం రాశారు. పాత్రికేయుడిగా నాలుగు దశాబ్దాలకు పైగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఉదయం, గోలకొండ, దక్కన్‌ క్రానికల్‌, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ లాంటి పత్రికల్లో హైదరాబాదు, దిల్లీల్లో పనిచేశారు. స్వయంగా జనతా, రాజధాని పత్రికలు నడిపారు. ఎన్నో వ్యాసాలు రాశారు. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి, ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలను కూడా ఆయన అక్షరబద్ధం చేశారు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై ఆదిరాజు విశ్లేషణలు ప్రజలను చైతన్యవంతం చేశాయి. తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో ఆయన 15 పుస్తకాలు రాశారు. తెలంగాణ పోరాటం, హంతకులు ఎవరు?, ఆంధ్రా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రోద్యమాలు- కొన్ని గుణపాఠాలు, తెలంగాణ రాష్ట్రోద్యమాలు, నక్సలిజం-పెరిగిపోతున్న అరాచకాలు లాంటి పుస్తకాలు తెలుగులో వెలువరించారు. ఆంగ్లంలో ‘గాంధీ టు గాంధీ’, ‘ది రైట్‌ ప్రైమ్‌ మినిస్టర్‌- ఎ పొలిటికల్‌ బయోగ్రఫీ ఆఫ్‌ పీవీ, నేతాజీ సుభాష్‌ బోస్‌, నెహ్రూస్‌ గాంధీస్‌ గ్రూప్స్‌, వై తెలంగాణ ఎ సెపరేట్‌ స్టేట్‌, సిఖ్స్‌ అండ్‌ ఇండియా- ఐడెంటిటీ క్రైసిస్‌ లాంటి గ్రంథాలు ప్రచురించారు. ‘గాంధీ టు గాంధీ’ని అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌ ఆవిష్కరించడం విశేషం. 1975- 77 కాలంలో జరిగిన ఎన్‌కౌంటర్ల మీద ఆదిరాజు రాసిన పుస్తకం సంచలనం సృష్టించింది. ఆయన సేవలకి గుర్తింపుగా తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం ప్రదానం చేసింది. ఉద్యమంలో చేసిన కృషికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది పురస్కారం ప్రకటించింది. ఆదిరాజు జూన్‌ 14న అనారోగ్యంతో కన్నుమూశారు. 
 


వెనక్కి ...

మీ అభిప్రాయం