అర‌ణ్య ఘోష‌ను ఆల‌కించేదెవ‌రు

  • 1672 Views
  • 98Likes
  • Like
  • Article Share

    సాహితీసుధ

ఎన్నో కథలు వచ్చాయి కాని తెలుగులో వేటగురించి కథలు అల్లం శేషగిరిరావు రాసేవరకూ రానేలేదని చెప్పవచ్చునేమోనని నేను అనుకుంటున్నాను. ఇవి ఒట్టినే తమాషాకి రాసిన కథలు కావు. ఊసుపోక రాసినవీకావు. జీవితం గురించి ఈ రచయిత తీవ్రంగా ఆలోచిస్తున్నారనేది, జీవితంలో అన్యాయాల గురించి ఆందోళన చెందుతున్నారనేది ఈ వేటకథలు చదివితే తెలుస్తుంది.  - రావిశాస్త్రి

అడవిలో మృగాలు వాటి స్వభావరీత్యా వేటాడతాయి. అది వాటి ప్రాకృతిక ధర్మం కూడా. సంస్కారవంతుడైన మనిషి మృగంలా మారి బలహీనుణ్ని పీక్కుతినే అరాచకత్వం, బడుగుల మూలుగులను పీల్చేసే బలాధిక్యతల గురించి నిక్కచ్చిగా, నిజాయతీగా మాట్లాడే కథలు తెలుగులో తక్కువ కనిపిస్తాయి. అలాంటి అరుదైన కథలు రాసినవారు అల్లం శేషగిరిరావు. తెలుగు హెమింగ్వేగా ఆయన సుప్రసిద్ధులు.
      కాలం మారినా ఆదిమ కాలం నాటి క్రూరత్వం మాత్రం మారలేదు. సరికదా! అది ఆధిపత్యశక్తిని కూడగట్టుకుని బడుగుల మీదా, వారివారి నిస్సహాయతల మీదా ఏలుబడి చేసేందుకు ఎగబడుతోంది. నాగరిక ముసుగులో దాగిన ఈ అమానవీయతను ఉన్నది ఉన్నట్టుగా చూపెడతాయి శేషగిరిరావు కథలు. ఇవి మనిషిలోని జంతు ప్రవృత్తిని తేటతెల్లం చేస్తాయి. ఎవరూ చూడని కొత్తకోణాన్ని దర్శించేందుకు వీలు కల్పిస్తాయి. కొత్త ఎత్తుగడ, ఉత్కంఠ, ఆసక్తికర ముగింపూ, అటవీ సంబంధ విశేషాలూ, జంతువుల సహజ ప్రవర్తనాస్థితి.. ఇలాంటి అంశాలతో ఈ కథలు ఏకబిగిన చదివింపజేస్తాయి.
      రైౖల్వేలో గుమాస్తాగా పనిచేసిన అల్లం శేషగిరిరావు సమాజాన్ని నిశితంగా పరిశీలించారు. మనుషుల ధోరణుల్లోని మానవీయ, అమానవీయ కోణాలను, వాళ్ల అంతఃసంఘర్షణలను బాగా అర్థం చేసుకున్నారు. ఆ అవగాహనకు తనదైన భాష, శిల్పాలను జోడించి మంచి కథలు రాశారు. అవన్నీ 1980లో ‘మంచి ముత్యాలు’ పేరిట పుస్తకరూపంలో వచ్చాయి. మరిన్ని కథలను కలుపుకుని ‘అరణ్యఘోష’గా వెలువడ్డాయి. ఇటీవల కథాస్రవంతి (అరసం) వారు ‘అల్లం శేషగిరిరావు కథలు’ పేరిట ఎంపిక చేసిన వాటిని ప్రచురించారు. శేషగిరిరావు రాసినవి తక్కువే. వాటిలోనూ కొన్ని సుదీర్ఘంగా సాగుతాయి. అయితే.. విషయప్రాధాన్యం, వైవిధ్యం మూలంగా ఆ నిడివి పాఠకులను అంతగా బాధించదు. ‘మృగతృష్ణ, వఱడు, ది డెత్‌ ఆఫ్‌ ఎ మేనిటర్‌, జాతికుక్క, పులిచెరువులో పిట్టలవేట, అశ్వమేథం, నరమేథం, చీకటి’ తదితరాలు శేషగిరిరావు కథల్లో చెప్పుకోదగినవి.
మనిషికి ప్రతిబింబాలు
‘వఱడు’ కథ ‘దర్పణ్‌ సీరిస్‌’లో భాగంగా దూరదర్శన్‌లో సింగిల్‌ ఎపిసోడ్‌గా ప్రసారమైంది. వఱడు లాంటి దగుల్బాజి మనుషులు మన సమాజంలో ఉన్నారని హెచ్చరించిన ఈ కథ, నాటకంగానూ విశేష ఆదరణ పొందింది. వఱడంటే ‘ముసలినక్క’ అని నిఘంటు అర్థం. ముసలి నక్కలు వాటంతటవి వేటాడి తినలేవు కదా. దాంతో పగలంతా ఇతర జంతువుల ఉనికిని కనిపెట్టి, రాత్రిపూట పులిని వాటిమీదకి ఉసిగొల్పి చంపించేస్తాయట! పులి తినగా మిగిలిన మాంసంతో కడుపు నింపుకుంటాయట! ఈ కథలో దశరథరామయ్య అచ్చు వఱడు జంతు స్వభావానికి ప్రతీక. తన ఉద్యోగాన్ని నిలుపుకోవడం కోసం నిజాయతీపరుడైన చిన్నయ్య బతుకుదెరువు పోగొడతాడు. అయితే, అతను ఇలా ఎందుకు చేస్తాడో రచయిత ఎక్కడా చెప్పడు. మనిషిలో దాగుండే జంతుస్వాభావిక క్రౌర్యాన్ని చూపిస్తాడంతే!
      పులికోసం మాటేసిన కనకరాజుకి ఎంతకీ అది చిక్కదు. దాంతో నౌకరు రాముల్ని ఎరగా వేసి పులిని చంపుదామనుకుంటాడు. కానీ ఆ వ్యూహం తిరగబడి అతని కన్నకొడుకే ఆ మెకానికి బలైపోతాడు. ఈ కథ మానవత్వం లేని కనకరాజుని పులికంటే ప్రమాదకరంగా చూపిస్తుంది. ఇక్కడ మనుషులను చంపి తినేది పులికాదు, పులిరూపంలోని కనకరాజు. అందుకే ఈ కథకి ‘ది డెత్‌ ఆఫ్‌ ఎ మేనిటర్‌’గా పేరుపెట్టారు రచయిత. రాత్రి అడివంతా గాలించి శ్రమకోర్చి కొట్టుకొచ్చిన దుప్పిని ఫారెస్టుగార్డూ, సూరయ్య మోసంతో, అధికార మదంతో దోచుకున్నప్పుడు కసితోనూ, జ్వరంతోనూ కాగిపోయిన బైరిగాడి కథకి ‘మృగతృష్ణ’ అని పేరు! అయితే అందులో కనిపించేది దుప్పి వేట కాదు. అది అక్షరాలా బలహీనుడి మీద బలవంతుడి వేట!!
      ఒకరిది విలాసం కొరకు వేట. మరొకరిది జీవిక కోసం పోరుబాట. పులులను దర్జాగా వేటాడి, వాటి చర్మాలను కోటగోడలకి వేలాడదీసుకునే జమిందారీ మేరునగధీరులను ఏ చట్టాలూ బంధించలేవు. పిట్టలను కొట్టి బతికే బడుగుజీవులకే అన్ని శిక్షలూ అమలవు తుంటాయి. తన తండ్రిని ఉరితీస్తున్నారని తెలుసుకుని కూడా కడచూపు నోచుకోలేక పోయిన దురదృష్టవంతుడు డిబిరిగాడు. అతడి కన్నీటిగాథ ‘చీకటి’, ఆరిపోయిన చైతన్యాగ్ని కణాన్ని రాజేస్తుంది.
మనిషికి ప్రతిబింబాలు
తుపాకీ చప్పుళ్లతోనూ, కొండగొర్రె అరుపులతోనూ, పులి గాండ్రింపులతోనూ, దగాపడ్డ దీనుడి మూలుగులతో ప్రతిధ్వనించే శేషగిరిరావు ఏ కథలోకి తలదూర్చినా వేదనాభరిత ‘అరణ్యఘోష’ వినపడుతూ ఉంటుంది. ఉదాత్తంగా, గంభీరంగా సాగిపోయే ఈ కథలు ప్రాకృతిక సౌందర్యాన్ని కొత్తకోణంలో చూపిస్తాయి. వైవిధ్య పక్షి జాతుల ప్రస్తావన అక్కడక్కడ మనసును ఉల్లాసపరుస్తుంది. ఉల్లంకి పిట్టలూ, తీతువ పిట్టలూ, పరదలూ, గూడకొంగలూ, పాములవార (పెద్ద కొంగలు).. ఇలా పక్షులూ, వాటి గమనాలనూ గమ్మత్తుగా వివరిస్తారు రచయిత. వేటను వర్ణించేటప్పుడు మాత్రం భయానక వాతావరణాన్ని సృష్టిస్తారు. వేటాడేది మనిషి అయినా, మృగమైనా.. పచ్చని అడవి రక్తంలో స్నానించినట్టు ఓ భీతావహ చిత్రం కళ్లముందు కదలాడేటట్టు కథని నడిపిస్తారు.
      జంతువుల వేట నేపథ్యంలో మనిషిలో దాగుండే క్రూరత్వాన్ని, నాగరిక సమాజంలో మానవ స్వభావాన్ని మృగాలవైపునుంచి చెప్పుకొస్తాయి అల్లం శేషగిరిరావు కథలు. సాహిత్యంలో వీటిని ‘వేటకథలు’ అన్నారు. కానీ, చారిత్రకంగా వేట అసలు అర్థాన్ని నిర్వచించగలిగితే ఇవి సమాజంలోని ఆధిపత్య శక్తుల చేతుల్లో నానా హింసలకు గురైన బడుగుల జీవితాలను కళ్లకుకట్టే యాథార్థ గాథలని అర్థమవుతుంది. ఇదే మారణ హోమం ఇప్పటికీ కొనసాగుతుందని ఈ కథలు చదివితే పాఠకులు కచ్చితంగా ఓ నిర్ణయానికొస్తారు. వీటి తర్వాత కె.ఎన్‌.వై పతంజలి వేటకథలూ ప్రసిద్ధమైనవి. పూసపాటి కృష్ణంరాజు ‘దివాణం సేరీవేట’ కథాసంకలనమూ వచ్చింది. పూర్ణచంద్ర తేజస్వి కన్నడ ‘పరిసర కతెగళు’కు శాఖమూరి రామగోపాల్‌ తెలుగు అనువాదాలైన ‘పర్యావరణ కథలు’ కూడా జంతువుల వేట నేపథ్యంగా వచ్చినవే.
      జానెడుపొట్ట కోసం దేవులాడుకొనే దీనుల పోరాటాలు.. దిక్కూమొక్కూ లేని అడవిలోనైతేనేంటీ! నాగరికత నేర్చిన మనుషుల మధ్యనైతేనేంటీ! కాలమే దైతేనేంటీ! ఎక్కడ మొదలవుతాయో అక్కడే ఆరిపోతుంటాయి. బతుకే బలిపీఠంగా మారుతున్న నేటి సమాజంలో ఆధిపత్యం మీద బరిసె విసిరేవాడెప్పుడూ ఓడిపోతూనే ఉంటాడు. క్రూరమృగాలకు ఎదురు నిలిచిన అసలు సిసలు వేటగాడు, మానవమృగ కోరలకి చిక్కి అల్లాడిపోయిన చీకటి కోణాలెన్నింటినో వెలుతురు బాట పట్టించారు అల్లం శేషగిరిరావు. ఆయన తర్వాత మళ్లీ ఇలాంటి కథలు రాలేదు. బడుగుల బతుకులూ తెరిపిన పడలేదు.


వెనక్కి ...

మీ అభిప్రాయం