ఐలేసో జోర్సెయ్‌...ఐలేసా బార్సెయ్‌

  • 975 Views
  • 1Likes
  • Like
  • Article Share

    డా।। పిన్ని చక్రపాణి

  • విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు
  • నెల్లూరు
  • 9299301135
డా।। పిన్ని చక్రపాణి

ఓ చిన్న పడవేసుకుని సంద్రపు కెరటాలు, ఏటి ప్రవాహాలకు ఎదురెళ్లే జాలర్లది నిత్యం బతుకు పోరాటమే! ప్రాణాలను పణంగా పెట్టి చేసే ఆ యుద్ధం ఫలించి, వాళ్ల వలలకు ఇన్ని చేపలు చిక్కాయా ఆ రోజుకు సంతోషం! యాదృచ్ఛికమేమో కానీ, ‘పడవ’ పదానికి ఉన్న అర్థాల్లో ‘యుద్ధం’ ఒకటి! ఈ జీవన సమరంలో జాలర్లకు జËతయ్యేవి పాటలే!
నది
ఉన్నచోట నాగరికత ఉంటుంది. పల్లె జీవితం పరచుకుంటుంది. ఆ పల్లీయుల నోట పాట పరవళ్లు తొక్కుతుంది. జానపదుల జావళి మనసు నిండుగా వినిపిస్తుంది. వారు పాడుకునే పాటల్లో బతుకువాసన పచ్చిగా తగుల్తుంది. ఒక చేతిలో వల.. మరోచేతిలో తాటాకుబుట్టతో తెర పడవను విల్లులా వంచే వేటగాడు జాలరి. పాటే అతని జవం, జీవం.
      జాలరి అనేది దేశి శబ్దం. ‘జాల’ పదానికి ‘అరి’ ప్రత్యయం చేరి ఏర్పడిన రూపమిది. ప్రాచీన తెలుగు సాహిత్యంలో ‘జాలరి’ చాలాచోట్ల కనిపిస్తాడు. మహాభారతం ఆదిపర్వంలో నన్నయ ‘‘తెరల వలవైచి జాలరి దిగి దాని...’’ అంటూ అతణ్ని ప్రస్తావిస్తాడు. శాంతిపర్వంలో తిక్కన మత్స్యగంధిని వర్ణిస్తాడు. ఆ పర్వంలోనే మరో సందర్భంలో మూడుచేపల కథ చెప్పేటప్పుడు ‘‘జాలరులు సొచ్చిక్రందుకొనంగన్‌’’ అంటాడు. ‘‘జాలరి వలదగిలివచ్చు ఝషముల పోలెన్‌’’ అంటూ నన్నెచోడుడూ ఓ పోలిక తెస్తాడు. ఝషం అంటే చేప. శ్రీనాథుడూ తన ‘శివరాత్రి మాహాత్మ్యం’లో ‘‘యమునా నది సైకతమున జాలరి కన్య’’ గురించి చెబుతాడు. కవుల కల్పనలను అలా ఉంచితే, జాలర్లు అంటే ముందుగా గుర్తొచ్చేవి వాళ్ల ‘పడవ పాటలు’. జాతి సంస్కృతిలో ఈ పాటలకొక ప్రత్యేక స్థానం ఉంది. చేపల్ని వేటాడటానికి జాలర్లు పడవ, నావ, తెప్ప, దోనె లాంటి వాటిని ఉపయోగిస్తారు. సహజంగా పనికి పాట ఎప్పుడూ తోడుగా ఉండి శక్తిని అందిస్తుంది. అందుకే ‘‘పనిని దైవంగా భావిస్తే, ఆ దైవానికి చేసే అర్చనవంటిది పాట’’ అంటారు ఆచార్య కె.మునిరత్నం. నడిసంద్రంలో.. నదీగర్భాల్లో రోజుల తరబడి వేటలో నిమగ్నమయ్యే జాలర్లు పాటల ద్వారానే తమను తాము ఉత్సాహపరచుకుంటూ ఉంటారు.
అంసకదా నా పడవ
తండేసేటప్పటి, నీటిని తోసేటప్పటి కిర్రు శబ్దాలు, లయబద్ధ సందళ్లు, తెప్ప నీటిలో దూసుకెళ్లేటప్పటి నురగ చప్పుళ్లు, అలల విరుపులు, కడలి మోతలే పడవ పాటలకు పక్కవాద్యాలు. పడవ పరుగులు, తెరచాప విన్యాసాలు వేటగాళ్లకు శక్తినందించే ఔషధాలు. పని జోరుగా సాగేటప్పుడు పాడే పాటల్లో గమనవేగం ఉంటుంది. పడవని నీటిలోకి దింపేటప్పుడు, కోల వేసేటప్పుడు, తెరచాప ఎత్తేటప్పుడు, వలను లాగేటప్పుడు వీటిని పాడుతుంటారు. ‘‘ఎల్లా సోరెల్ల మువ్వలా/ ఎల్లెల్ల ఓ బేలియల్లా/ హైలెస్సో సో బేలియల్ల/ కాకినాడ రేవులోన/ కన్నుగీటే చిన్నదాన/ రాయేపడవా/ రంగోన్‌ చిలకా    / కిలకిలా నవ్వు/ కిలాడి దానా/ పగోడి పడవ/ పారెల్లిపాయ’’ అంటూ పడవ వేగాన్ని హెచ్చించడానికీ ఓ పాటను అందుకుంటారు. ‘‘హైలో ఐలేసో/ అంసకదా నా పడవ/ సంద్రంలో నా పడవ/ చక్కనీ చుక్క/ గాలిలో నా పడవ/ గందరవ కన్నె...’’ అంటూ ఆ ఊపుతో సముద్రపు అలలని చీల్చుకుంటూ... అవలీలగా వేట కొనసాగిస్తారు. ఏ క్షణాన ఏ ముంపు ముంచుకొస్తుందోనని దిగులు చెందకుండా, బతికినన్నాళ్లూ నదిలా నవ్వుతూ గడపాలని జాలర్లు అనుకుంటారు. కాబట్టే వారి పాటల్లో చమత్కారం జోరుగుంటుంది.
పడవ మీద చేపలవేట అంటే ఒకరితోనే సాగేది కాదు. ఒక చేత్తో గెడెయ్యాలి! మరోచేత్తో వలను ఒడుపుగా విసరాలి. వల్లో పడ్డ చేపలను ఒబ్బిడి చేయాలి. ముఖ్యంగా వెన్నెల్లో పడవ జోరుగా సాగిపోతుంటే... ఒకరికొకరు ఎకసెక్కాలాడుకుంటూ పాటలు పాడుకుంటూ వేటాడతారు. పడవ పాటల్లో సరస శృంగార భావనలు ఎక్కువగా కనిపిస్తాయి. ‘‘రావూ నే రమ్మంటే! పోవు నే పొమ్మంటే/ రవ్వా చేసేదవేమిరా! నీవెంతో/ రాలుగాయై పోతివిరా!/ మల్లెపందిరికాడ మంచమేసి పరుపేసి/ తెల్లాదుప్పటి పరచినా - దానిపై/ మల్లె మొగ్గలు చల్లినా...’’ అంటూ పరవశించిపోతారు.
కాపాడవే తల్లి గంగా భవానీ
సాధారణంగా పడవ పాటలన్నింట్లో శబ్దార్థాల ప్రాధాన్యం సమంగా ఉంటుంది. పోటెత్తుతున్న సముద్రం మీద ఏలుబడి చేస్తూనే... అనంతసాగర దూరాలని అవలీలగా చేరువచేస్తూనే... సూర్యచంద్రులతో, చుక్కల గుంపులతో చెలిమిచేస్తూనే జాలర్లు వేటను వేడుకలాగా మలచుకుంటారు. తమ బతుకులోని శూన్యాన్ని పాటలాగా కట్టి అలలకు వినిపిస్తారు. అందుకే ఆ పాటలన్నీ సముద్రమంత గంభీరంగా ఉంటాయి. వాటిలో యథార్థ జీవితపు వ్యధార్థ కథనాలూ తొంగిచూస్తాయి.
పెద్దచేప చిన్న చేప
మింగేస్తే నాయమా!
పేదోడి శాకిరి
దోచేస్తే దరమమా
సావుకారి మా బదుకుల్ని
గుంజేస్తే నాయమా!
జాలరోడి నెత్తురంతా
పిండేస్తే దరమమా?

గెడేసుకు బతికే జాలర్లు బొత్తిగా లౌక్యం తెలియనివాళ్లు. మంచీచెడు విచక్షణ ఉన్నా మంచితనంతోనే తప్ప మరోరకంగా ఈ లోకాన్ని చూడలేనివాళ్లు. దళారుల మోసానికి చిక్కి అప్పుల ఊబిలో కూరుకుపోతారు. భవిష్యత్తు యావత్తు గంగమ్మతల్లిపై వేసి బతుకీడ్చే ఈ బడుగు జీవితాలు ఇలా కొన ఊపిరితో కొట్టుకులాడుతుంటాయి.
      జీవుడి జరుగుబాటు ప్రకృతి కనుసన్నల్లో ఉంటుంది. నీటి మీద ఆధారపడి బతికే వారికి జలదేవతల అభయం లేకపోతే వేట ముందుకు సాగదనే ఓ నమ్మకముంటుంది. జాలర్లు గంగమ్మను కొలవడమేకాదు, వేటకోసమని వెళ్లి తిరిగిరాని వారిని ఆ తల్లే అక్కునచేర్చుకుందని ఊరటచెందుతారు. ‘‘కాపాడవే తల్లి గంగా భవానీ/ నీ పూజ చేసేము నిత్యకల్యాణీ/ రంగు గంతుల గంగ రంగైన గంగ/ ముందుగా నిను గొల్తు అమ్మ నా తల్లి’’ అంటూ మొక్కుకుంటారు. ‘‘ఏలియాలా! ఏలియాలా!!/ ఏలియాలా!/ ఐలేసా జోర్సెయ్‌! ఐలోసో బార్సెయ్‌/ గోదారి తల్లికి గొజ్జంగిపూదండ/ సరస్వతికి సన్నజాజి పూదండ/ కృష్ణవేణమ్మకు గేదంగిపూదండ/ కావేరికి చంద్రకాంతా దండ’’- నదులన్నీ స్త్రీ దేవతారూపాలే కాబట్టి, ఆ నదీమతల్లుల స్తుతి ఇలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.
పాటల్లో జీవన శకలాలు
జాలర్ల జీవితాలు నిరంతరం సవాళ్లతో కూడి ఉంటాయి. కాలం ఏటా ఒకేతీరుగా ఉండదు. ఉప్పెనలకు తట్టుకోవాలి. చలిగాలులను ఎదుర్కోవాలి. వరదలు సర్వాన్ని హరించినప్పుడు గుండెని దిటవు చేసుకోవాలి. వేట రోజూ కడుపు నింపదు. కడుపు కట్టుకుని బతకగల తెగువని కూడదీసుకోవాలి. ఆకలేసినా... దిగులు ముసిరినా జాలరికి పాటే కదా చుక్కాని! ఆ పాటలతోనే తాము పడిన ఒడిదుడుకులన్నీ మరచిపోయి బతుకుపోరుకి సరికొత్త ఉత్సాహాన్ని నింపుకుంటారు.
      జీవితాన్ని సముద్రంతో పోల్చడం, పడవని జీవిగా ఊహించడమూ... ఆటుపోట్లు, ఉప్పెనలూ, సుడిగుండాలూ, జీవిత పటిష్టతకీ, పరిణతికి కొలమానాలనీ, వాటిని అధిగమించి, తరించడమే జీవితమని వేదాంతులు చెబుతారు. జాలర్లు మాత్రం తమకు జీవనాధారమైన చేపలవేటనే తాత్త్విక పునాదిగా చేసుకుని.. దాని మూలసూత్రాలతోనే ఊరట పొందుతుంటారు ఇలా... ‘‘గట్టెక్కుతాదా నా తెప్ప/ కల్లోల జలధిలో మునిగిపోతుందా!/ పొంగుతూ వలదీసి/ బుంగనిండే దాక/ చేపలేరుక నేను/ చెంగున గట్టెక్కి/ నావ నట్టె బెట్టి/ నా ఇంటికెళ్లాను/ పిల్ల కంటబడితే/ వల్లు చల్లగుంది...’’!
      జాలరి పాటల్లో కొన్ని గడుసుగా, గమ్మత్తుగా సాగుతాయి. వినగానే జీవన మాధుర్యం ఉట్టిపడేటట్టుగా ఉంటాయి. ఎత్తుగడలోనూ, పదాల విరుపుల్లోనూ...మలుపుల్లోనూ గమకాల గమ్మత్తు వింత అనుభూతిని కలిగిస్తుంది.
      ‘‘ఐలేసో జోర్సెయ్‌/ ఐలేసా బార్సెయ్‌/ సన్నజాజి ఐలేసా/ సీరకట్టి ఐలేసా/ పొన్నపూలు ఐలేసా/ అహ కొప్పునెట్టి ఐలేసా/ సిన్నదొచ్చి ఐలేసా/ కన్నుగీటే ఐలేసా!’’- గాలి తోడుంటే పడవ హుషారుగా సాగుతుంది. పాట పాకాన పడిన కొద్దీ వేట జోరందుకుంటుంది. నసపెడుతున్న అలల మీద జానపదం పరుగులెట్టేసరికి ఎంత కష్టమైనా కాళ్ల ముందు చతికిలబడిపోతుంది. జీవితం పాటలాగా సాగితే ఆ హాయికి మించిన పెన్నిధి ఈ లోకంలో ఇంకేముంటుంది.
      ఇసుక పర్రలను తోడుతూ, చివికిన వలలను సరిచేసుకుంటూ, తెర పడవ చాటు వెన్నెల్లో చుక్కాని ఆడిస్తూ, నడి సంద్రపు నావ తీరం చేరే రోజెప్పుడోనని నిరీక్షిస్తూ, అల్లాడిపోయే ఆకలిపేగులను ఉపశమింపజేసే మంత్రకవాటాన్ని అన్వేషిస్తూ అల్లుకున్న పాటలు... ఆ పదాలూ జాలర్ల జీవితాల్లో ఆకాశమంత నిండుగా పరచుకుని ఉంటాయి. జీవికని నిలుపుకునే క్రమంలో శ్రమ నిష్ఫలమైనప్పుడు.. బతుకు గుదిబండగా మారినప్పుడు.. ఆ పరిస్థితుల నుంచి బయటపడేటందుకు పాట మాత్రమే సాయపడుతుంది. బతుకుపోరాటంలో వల విసిరినా, బరిసె విసిరినా అలవిగాని.. అలసిపోని జీవితానికి పాటే పెన్నిధి... పరమావధి.


వెనక్కి ...

మీ అభిప్రాయం