భాషాబోధన గెలుపు సాధన

  • 1558 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం త్వరలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) నిర్వహించనుంది. తెలుగు భాషా పండితులు, పాఠశాల సహాయకుల ఉద్యోగాల సాధనలో ‘తెలుగు బోధన పద్ధతులు’ అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో ‘భాష- మాతృభాష- బోధన’లకు సంబంధించిన వివిధ భావనలను పరిశీలిద్దాం.
జీవజాతులన్నింట్లో మానవుడికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. దానికి కారణం భాషా సామర్థ్యం. భాషతోనే మనిషి మానవుడయ్యాడనే నానుడి ఉంది. మానవుడు మొదట సంభాషణను అలవరచుకున్నాడు. తన అనుభవాలను ముందు తరాల వారికి అందించడానికి తర్వాత లిపిని కనిపెట్టాడు. అలా భాషకు నిశ్చిత స్థితిని కల్పించాడు. భావద్యోతకమైన ధ్వనే భాష. ఇదో భావవాహకం.

* భావ వ్యక్తీకరణకు ధ్వని మూలం. ధ్వనికి భావం లేదా అర్థం ముఖ్యం. భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే అర్థవంతమైన కంఠధ్వనుల సముదాయమే భాష.

* భాష- భావం నాణేనికి రెండు వైపులు. ‘భాష’ మనిషికి శరీరం లాంటిదైతే భావం ప్రాణం.

* ‘భాష్‌’ అనే ధాతువు నుంచి భాష పుట్టింది. ‘భాష్యతే ఇతి భాషః’. భాషింపబడేది భాష. భాషించడమంటే మనసులోని భావాలను కంఠధ్వనుల ద్వారా తెలియజేయడం.

* భాషోచ్చారణకు నాలుక ప్రధానంగా తోడ్పడుతుంది. భాషకు పర్యాయపదం ‘టంగ్‌’

* భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే అర్థవంతమైన కంఠధ్వనుల సముదాయమే భాష.

* భాషను భౌతిక, రసాయనిక, శారీరక, సాంస్కృతిక, భాషా శాస్త్రాలకు సంబంధించిన అంశంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. శబ్దతరంగాలు, శారీరక రసాయనాలు, కండరాల కదలికల ఫలితమే భాష. సమాజం దీన్ని  సంస్కరిస్తుంది. మానవ నాగరికతా పరిణామ క్రమంలో తగిన రూపం పొంది, ప్రజల నాలుకల మీద ఓ భాషగా అది నర్తిస్తుంది.

* ‘‘అలవోకగా ఉత్త్పన్నమయ్యే కంఠ ధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై, సహజాతేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాల్ని, ఆలోచనల్ని, వాంఛల్ని తెలియజేసేది భాష’’ - ఎడ్మండ్‌ సఫేర్‌

* ‘‘భాష అనంతమైన వాక్యాల సముదాయం’’ - ఎమ్మెన్‌ బాక్‌

* ‘‘యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతీ పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష’’ - స్టర్ట్‌వర్ట్‌

* ‘‘వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష’’ - హాకెట్‌

* ‘‘మానవులు భాషాపరమైన ప్రవర్తనను అలవరచుకోవడానికి సహకరించే మేధాశక్తే భాష’’ - కాంత్‌, డెస్‌క్రేట్స్‌

* ‘‘భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం’’ - చామ్‌స్కీ

* ‘‘భాష ఒక అంశం లేదా లక్షణం కలిగిన విషయం కాదు, సమాజంతో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో, అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ’’  - ఎస్‌.కె.వర్మ, ఎన్‌.కృష్ణస్వామి

* ‘‘మనసులోని భావపరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష’’ - హిందీ భాషావేత్త రామచంద్ర వర్మ

* ‘‘భాష ఓ బహుముఖ వ్యవస్థ’’ - ఫిర్త్‌

* ‘‘బహుభాషాభ్యసనం విద్యార్థి బుద్ధిని ఇనుమడింపచేసి, వాక్చాతుర్యాన్ని మెరుగుపరచి జ్ఞానాన్ని అభివృద్ధి చేసి సహృదయతను పెంపొందిస్తుంది’’ - డాక్టర్‌ విల్జియన్‌

మాతృభాష ప్రత్యేకత

* శిశువు తల్లి ఒడిలో పెరుగుతూ ఆమె నుంచి స్వతహాగా నేర్చుకునేది మాతృభాష. అప్రయత్నంగా నేర్చుకొని జీవితాంతం ఉపయోగించే భాష ఇది.

* అసంకల్పితంగా వ్యక్తీకరించే భాషాధ్వనుల రూపమే మాతృభాష. ఆంతరంగికాలైన మానసిక ప్రవృత్తులను ఇది కదిలిస్తుంది.

* ‘‘శిశువు తన అభిప్రాయాల్ని, సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష’’ - మహాత్మాగాంధీ

* ‘‘పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాల్లేని సౌధం లాంటిది’’  - విశ్వకవి రవీంద్రుడు

* ‘‘ఆనందానుభూతితోపాటు జ్ఞానాన్ని కూడా పెంచుకోవడానికి, సృష్టికర్తలా సృజనాత్మకశక్తితో కొత్త సృష్టి చేయడానికి మాతృభాష మానవుడికి ఒక సాధనమవుతుంది’’ - డబ్ల్యు.ఎమ్‌.రైబర్న్‌

* ‘‘భాషా ప్రయోజనాలైన భావగ్రహణ, భావ వ్యక్తీకరణలకు ఏ భాషపై వ్యక్తి ఎక్కువగా ఆధారపడి ఉంటాడో, ఇతర భాషలను నేర్చుకొనేటప్పుడు కూడా మొదట ఆయా భాషల్లో వెల్లడి అయిన భావాలను గ్రహించడానికి, ఏ భాషలోకి ఆ భావాలను మానసికంగా పరివర్తన చేసుకుంటాడో, ఆయా భాషల్లో భావాలను వెల్లడించదలచినప్పుడు కూడా ముందుగా ఏ భాషలో భావాలను మానసికంగా భావిస్తాడో అలాంటి మూలాధారమైన భాషే మాతృభాష’’ - రామచంద్రుని వేంకట శేషయ్య

* ‘‘పిల్లల మనసులు వికసించి, విద్యను స్వతంత్రంగా అవగాహన చేసుకొనే పరిపక్వత వచ్చేవరకు మాతృభాషలోనే విద్యను బోధించాలి. తద్వారా పిల్లల మానసిక శక్తులకు పరిపూర్ణ వికాసం కలుగుతుంది’’ - విశ్వనాథ

* ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని మొదట ‘క్రీడాభిరామం’లో, తర్వాత ‘ఆముక్త మాల్యదావతారిక’లో పేర్కొన్నారు.

* ‘తెలుగును నికోలో-డి-కాంటి ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’గా అభివర్ణించాడు.

* ‘‘తెలుగదేలయన్న దేశంబు తెలుగేను/ తెలుగు వల్లభుండ తెలుగొకండ/ ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి/ దేశ భాషలందు తెలుగులెస్స’’ - రాయలు

* ‘‘తెలుగు విభిన్న సంస్కృతులను తనలో లీనం చేసుకొనే సమర్థత కలది. ఎంతో సమన్వయ శక్తి కలిగింది’’ - జె.బి.యస్‌.హాల్డెన్‌

* ‘‘భారతీయులకు జాతీయ భాషగా నిజమైన ప్రయోజనకారిగా ఉండాల్సి వస్తే ఆ గౌరవం పొందడానికి తెలుగు భాషకు గల అర్హత మరి ఏ ఇతర భారతీయ భాషలకు లేదు, ముఖ్యంగా విజ్ఞాన సాంకేతిక పదజాలానికది పుట్టినిల్లు కాగలదు’’ - జె.బి.యస్‌.హాల్డేన్‌

* వ్యక్తిత్వం, లిపి, వర్ణమాల, ఉచ్చారణ, స్పష్టత, శ్రావ్యత, మాధుర్యం, సంధి, సారళ్యం, సౌకుమార్యం, గాంభీర్యం, జంట కట్టడం, యతిప్రాసలు, ఇతర దేశీయుల ప్రశంసలు.. ఈ 14 అంశాల్లో తెలుగు భాష విశిష్టతను గమనించవచ్చు.

బోధన.. లక్ష్యాలు

* అభ్యసన ప్రధాన ఉద్దేశం విద్యార్థి మూర్తిమత్వ వికాసం. మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు దీన్ని మూడు రంగాలుగా విభజించారు. అవి... జ్ఞానరంగం, మానసిక చలనాత్మకరంగం, భావావేశరంగం

* బోధనా లక్ష్యాలను కూలంకషంగా విశ్లేషించిన మొట్టమొదటి విద్యావేత్త.. డాక్టర్‌ బెంజమిన్‌ బ్లూమ్‌.

* విద్యాలక్ష్యాల వర్గీకరణ (టాక్సానమీ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ఆబ్జెక్టివ్స్‌) ప్రచురించింది.. బెంజమిన్‌ బ్లూమ్‌.

* జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలను వివరించింది.. బెంజమిన్‌ బ్లూమ్‌.

* భావావేశ రంగానికి చెందిన ప్రవర్తనా లక్ష్యాలను పేర్కొన్నది.. క్రత్‌హోల్‌

* చలనాత్మక రంగంలోని ప్రవర్తనా లక్ష్యాలను పేర్కొన్నది  - డేవ్‌, సింప్సన్‌, హారో

* బ్లూమ్‌ వర్గీకరణ ప్రకారం విద్యావ్యవస్థలోని వివిధ సందర్భాల్లో, వివిధ స్థాయిల్లో అనుసరించేవి... గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు.

* విద్యావ్యవస్థ సాధించాల్సిన అంతిమ ధ్యేయాలు ‘గమ్యాలు’.

* పాఠశాల కార్యక్రమాల ద్వారా సాధించగలిగేది ‘ఉద్దేశాలు’.

* బోధనాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తనా మార్పులను సూచించేవి ‘లక్ష్యాలు’.

* లక్ష్యాన్ని విశదీకరించే నిర్దిష్టమైన సూక్ష్మరూపమే ‘స్పష్టీకరణ’.    

* ‘‘శైశవదశ నుంచి జీవితాన్ని తీర్చిదిద్ది ఆత్మవిశ్వాసాన్ని కలిగించి.. జాతి అభివృద్ధికి, దేశాభ్యుదయానికి, లోకోద్ధరణకు కూడా వ్యక్తిని సమర్థుడిగా చేసే శక్తి మాతృభాషకు మాత్రమే ఉంది’’- వి.బి.బల్లార్డ్‌

 


వెనక్కి ...

మీ అభిప్రాయం