తెలుగు తిల్లికల ప్రకాశం

  • 1035 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఓరుగంటి మల్లిక్‌

  • అనుభవజ్ఞులైన పాత్రికేయులు,
  • మార్కాపురం,
  • 9966250595
ఓరుగంటి మల్లిక్‌

‘‘లిఖితమైన భాష ప్రధానమైంది... మనం ఉచ్చ రించే భాష దాని భ్రష్టరూపం అనే అపోహ చాలాకాలం ఉండేది, ముఖ్యంగా పండితుల్లో. దీని గురించి ఏమాత్రం ఆలోచించని మహా పండితులు ఉండేవారు అప్పట్లో. వాళ్లు మార్గ దర్శకులుగా ఉండబట్టి ఇలాంటి అభిప్రాయాలు సామాన్యుల్లోకి కూడా వెళ్లాయి. కానీ, అసలు మొట్టమొదట మనం మాట్లాడితేనే భాష ఏర్ప డింది. రాత అన్నది చరిత్రలో ఓ యాదృచ్ఛిక సంఘటన మాత్రమే’’ అంటారు భద్రిరాజు కృష్ణమూర్తి. ప్రాథమికంగా సంభాషణల ద్వారానే ఏ భాష అయినా అభివృద్ధి చెందుతుంది. మన తెలుగూ అలా ముందడుగు వేసిందే! తెలుగునాట ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం తనదైన ప్రత్యేక పలుకుబడితో అమ్మభాషకు కొత్తందాలు అద్దింది. భద్రిరాజు స్వస్థలమైన ప్రకాశం జిల్లా భాషను ఈ దృష్టితో పరిశీలిద్దాం.
కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణల్లో అందరూ మాట్లాడేది తెలుగే అయినా ప్రధానంగా మూడు మాండలికాలు గోచరిస్తాయి. అంతేకాదు, జిల్లాలవారీగా కూడా కొన్నికొన్ని మాండలిక భేదాలు, ప్రాంతీయ యాసలు కనిపిస్తాయి. అయితే ప్రకాశం జిల్లా- గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని మూడు ప్రాంతాల కలయికతో ఏర్పడటం వల్ల ఇది మూడు రకాల యాసలకు ఆటపట్టయ్యింది. 
      సమైక్య రాష్ట్రంలో భాగంగా ఫిబ్రవరి 2, 1970న ఒంగోలు జిల్లా ఏర్పడింది. టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీద రెండేళ్ల దానికి ‘ప్రకాశం జిల్లా’గా నామకరణం చేశారు. గుంటూరు జిల్లాలోని ఒంగోలు తాలూకా మొత్తంగాను, బాపట్ల తాలూకాలోని కొన్ని ప్రాంతాలు, నెల్లూరు జిల్లాలోని కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి తాలూకాలు, కర్నూలు జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం తాలూకాలు పూర్తిగా కలిపి ప్రకాశం జిల్లాను ఏర్పాటుచేశారు. దీనికి తగ్గట్టే మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాల్లో రాయలసీమ మాండలికం వినిపిస్తుంది. పొదిలి, కనిగిరి, కందుకూరుల్లో నెల్లూరు యాసలో మాట్లాడతారు. ఒంగోలు, చీరాల, అద్దంకిల్లో గుంటూరు శైలి పలుకులను ఆలకించవచ్చు. 
ప్రధానంగా ఆ మూడు...
రాయలసీమ మాండలికంలో భాషోచ్చారణలో స్థిరత్వం కనిపిస్తుంది. అంటే అక్షరాల్లో రాసినట్లుగానే పలుకుతారు. నెల్లూరు తెలుగులో చిన్నపాటి విరుపుడు యాస ఉంటుంది. కోస్తాంధ్ర భాషలో కొద్దిపాటి దీర్ఘపుయాస కనిపిస్తుంది. గుంటూరు ప్రాంత ప్రజల స్వర విశేషం నెల్లూరు ప్రాంతీయుల స్వర విశేషంతో భేదిస్తుంది. కాబట్టి ప్రస్తుత ప్రకాశం జిల్లాలో ఈ మూడు స్వర విశేషాలు వాటి ఆదాన ప్రాంతాలకు అనుగుణంగా కొనసాగుతున్నాయి.
      పదప్రయోగాల దగ్గరికి వచ్చేసరికి ప్రకాశం జిల్లాలోని మూడు ప్రధాన ప్రాంతాల మధ్య ఆసక్తికర భేదాలు, పోలికలు కనపడతాయి. ఉపాధ్యాయుణ్ని గిద్దలూరు- మార్కాపురాల్లో (‘గిమా’) పంతులయ్య అంటారు. ఒంగోలు- చీరాల (‘ఒంచీ’), పొదిలి- కందుకూరుల్లో (‘పొకం’) మాత్రం ఆయన అయ్యవారు అవుతాడు. ‘గిమా’లో స్వామి అని పిలిపించుకునే పురోహితుడు.. ‘ఒంచీ’లో పంతులుగారు, ‘పొకం’లో అయ్యవారు అంటే పలుకుతాడు. ‘ఒంచీ’, ‘పొకం’ల్లోని యర్రగడ్డలు.. ‘గిమా’లో ఉల్లిగడ్డలుగా సుపరిచితాలు. ‘గిమా’, ‘పొకం’లలో బుడంకాయలను వండుకుంటే, వాటినే దోసకాయల పేరిట రుచిచూస్తారు ‘ఒంచీ’ వాసులు. ఇలా... బర్రె (‘గిమా’, ‘పొకం’)- గేదె (‘ఒంచీ’); పునాది (‘ఒంచీ’)- గునాది (‘గిమా’, ‘పొకం’); గడ్డపార (‘గిమా’)- గడ్డపలుగు (‘ఒంచీ’, ‘పొకం); చిలుకు (‘గిమా’)- గొళ్లెం (‘ఒంచీ’, ‘పొకం’); మందార పువ్వు (‘గిమా’, ‘ఒంచీ’)- దాసాని పువ్వు (పొకం) తదితర మాటల్లోనూ ఈ బేధాలు కనిపిస్తాయి. ఇక క్రియాపదాల్లో ప్రధానంగా పశ్చిమ ప్రకాశం, తూర్పు ప్రకాశం అనే ప్రాంతీయ భేదాలు కనిపిస్తాయి. అయితే గ్రామ ప్రాంతాల్లో ఈ భేదం కనిపించినా పట్టణ ప్రాంతాల్లో మిశ్రమంగా కనిపిస్తాయి. ‘వాడు వచ్చినాడు/ వచ్చిండు’ అని పశ్చిమ ప్రకాశంలో అంటే.. తూర్పువాసులు ‘వచ్చాడు’ అని చెబుతారు. ‘వచ్చినారు- వచ్చిన్రు/ వచ్చినాయి- వచ్చినయ్‌/ వచ్చినాను- వచ్చిన/ వచ్చినాము- వచ్చినం’ లాంటివి పశ్చిమ పలుకులు అయితే, ఇటుపక్క ‘వచ్చారు, వచ్చాయి, వచ్చాను, వచ్చాము’ అంటారు. 
      యర్రగొండపాలెం ప్రాంతంలో ప్రశ్నలు కాస్త దీర్ఘం తీసి అడుగుతుంటారు. ఇదే ప్రాంతంలో గిరిజనుల మాటతీరు ఇంకాస్త ప్రత్యేకంగా ఉంటుంది. పొట్టిపొట్టి పదాలు ఉపయోగిస్తారు. కంభం, బేస్తవారిపేట ప్రాంతాల్లోని గ్రామాల్లో ‘చేచ్సారు, వచ్సారు’ (చేస్తారు, వస్తారు).. ఇలా పలుకుతారు. మర్కాపురం, యర్రగొండపాలెం ప్రాంతాల్లో ‘తిన్నడు, పోయిండు, వచ్చిండు, చేసిండు’ లాంటి ప్రయోగాలు ఎక్కువగా వినిపిస్తాయి. 
      ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో (మార్కాపురం తదితర చోట్ల) ‘ఏంది’ (ఏంటి), ‘యాడికి’ (ఎక్కడికి), ‘ఎంటికి’ (ఎందుకు), పద్దాకల (అస్తమానం), ‘యాసరిక’ (విసుగు), ‘అట్టగాదు/ అట్టాగాదు’ (అలాకాదు), ‘మట్టెకాయలు’ (గోరుచిక్కుళ్లు), ‘జేజయ్య/ జేజినాన్న, జేజెమ్మ’ (తాతయ్య, నాయనమ్మ), ‘కక్కయ్య, కక్కమ్మ’ (బాబాయ్‌, పిన్ని), ‘మంపు’ (మైకం) లాంటి మాటలు వ్యవహారంలో ఉంటాయి. ఇటు ఒంగోలు- చీరాల ప్రాంతాల్లో అయితే ‘దబుక్కన’ (వెంటనే), దబ్బున (త్వరగా), ‘చెవతన్నాడు’ (చెబుతున్నాడు), ‘రాగాక/ రాబాక’ (రావద్దు), ‘వచ్చిండ్లా’ (వచ్చాడు/ వచ్చాను కదా), ‘కిండలు’ (వెధవచేష్టలు), ‘తలికి’ (లోపు) లాంటి పదాలు వినపడతాయి. ‘ఉర్లగడ్డలు’ (బంగాళాదుంపలు), ‘బొరుగులు’ (మరమరాలు) లాంటి రెండు ప్రాంతాల్లోనూ వాడుకలో ఉన్నాయి. 
అచ్చతెలుగు పదబంధాలు
ఏ భాషకైనా సొగసునూ, శక్తిని కలిగించేవి సామెతలు, జాతీయాలు. ప్రకాశం జిల్లాలో జాతీయాల వాడుకలో తూర్పు వైపు కోస్తా ప్రభావం, పశ్చిమ దిక్కున రాయలసీమ ప్రభావం ఎక్కువ. ఏమీలేదని చెప్పడానికి ‘సింగినాదం జీలకర్ర’ (పశ్చిమ ప్రాంతంలో), ‘గాడిదగుడ్డు’ (తూర్పుప్రాంతంలో) అంటారు. బాగా కోపం రావడాన్ని ‘మండింది’ అనీ, శాపనార్థాలు పెట్టడాన్ని ‘సాసించడం’ అనీ అంటారు. 
      ఇక సామెతల్లో కూడా మాండలిక పదాలు కనిపిస్తాయి. ‘అగ్గున అయితే అంగడికి వస్తుంది’ (అగ్గున- చవుక, అంగడి- పచారికొట్టు), ‘ఆవును కొని తలుగుకు లొంగినట్లు’ (తలుగు- పలుపుతాడు), ‘కలుపు తీయడానికి తిల్లిక కావాలా?’ (తిల్లిక- దీపం), ‘కూడూ, గుడ్డా అడక్కపోతే బిడ్డను సాకినట్లు సాకుతానన్నాడంట’, ‘తొర్రోడు మెచ్చేది ఊరిబిండి’ (పచ్చడి), ‘పెడద్రానికి, పెద్దరోగానికి మందులేదు’ (పెడద్రం- మూర్ఖపు పట్టుదల, పెద్ద రోగం - కుష్టు), ‘పొయ్యి సెగ పొంత కుండకు తగలక మానదు’ (పొంత కుండ అంటే పొయ్యికి రెండువైపులా గడ్డలు, మూడో వైపు పెద్దకుండ పెట్టి నీళ్లు కాచుకోవడానికి ఉపయోగించేది) లాంటి సామెతలు ఇక్కడ తరచూ వినపడతాయి. మొత్తం మీద ప్రకాశం జిల్లా తెలుగు ఓ త్రివేణీ సంగమం. 


వెనక్కి ...

మీ అభిప్రాయం