చేనేత కళాకేతనాలు 

  • 1325 Views
  • 74Likes
  • Like
  • Article Share

చేనేత రంగంలో చెయ్యితిరిగిన తెలుగు నేతన్నలు జాతీయ స్థాయిలో మెరిశారు. కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ అందించే పురస్కారాలు, ప్రశంసా పత్రాలను 2016 సంవత్సరానికి గానూ మన రెండు రాష్ట్రాల నుంచి ఏడుగురు దక్కించుకున్నారు. చేనేత ఉత్పత్తుల విక్రయాల్లో కృషి చేస్తున్న ఓ సంస్థ కూడా ప్రశంసా పత్రానికి ఎంపికైంది. ఈ ఏడాది ఆగస్టు 7న జయపుర(రాజస్థాన్‌)లో వీరికి పురస్కారాలు ప్రదానం చేశారు. తెలుగువారి నేత నైపుణ్యానికి మరోసారి పట్టంకట్టించిన పురస్కార విజేతల సంక్షిప్త పరిచయాలివి..! 
110 వర్ణాల చీర!
‘ఇక్కత్‌’ వస్త్ర కళకు తెలంగాణ ప్రత్యేకతను జోడించి ‘తెలంగాణ ఇక్కత్‌ ఇచ్చంత్రం’ పేరుతో జెల్లా వెంకటేశం తయారు చేసిన చీరకు ‘సంత్‌ కబీర్‌ పురస్కారం’ లభించింది. ఈ చేనేత కళాకారుడి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెం. ఏడో తరగతి వరకు చదివిన వెంకటేశం తొమ్మిదేళ్ల వయసు నుంచి చేనేత వృత్తిలో ఉన్నారు. జర్మనీ, సౌదీ అరేబియా, ఇటలీ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ చేనేత సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ‘టై అండ్‌ డై’ విధానంలో ఆయన తయారుచేసిన ‘తేలియా రుమాల్‌’కు 2010లో జాతీయ చేనేత పురస్కారం లభించింది. ప్రాకృతిక, పర్యావరణ హితమైన, శరీరానికి హానికరం కాని నాణ్యమైన రంగులతో ఈసారి ఇక్కత్‌ చీరను నేశారాయన. 32 రకాల డిజైన్లతో, 110 వర్ణాల మిశ్రమం ప్రతిబింబించేలా ఆర్నెల్లు శ్రమించి ఈ చీరను రూపొందించారు.


వెచ్చగా.. చల్లగా..!
సహజ రంగులతో రూపొందించిన ‘తేలియా రుమాల్‌ డబుల్‌ ఇక్కత్‌ చీర’కు జాతీయ పురస్కారం అందుకున్నారు గజం శ్రీనివాస్‌. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన ఈయన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీలో డిప్లొమా పూర్తి చేశారు. ఆధునిక డిజైన్ల మీద కోయంబత్తూరులో శిక్షణ పొందారు. ఇక్కత్‌ చీర కోసం ముందు ఆయన.. ఆముదం గింజల పొట్టు, ఆవు పేడ, బూడిదను నువ్వుల నూనెలో కలిపి రంగులు తయారు చేసుకున్నారు. మేలు రకం నూలుకు ఆ రంగులద్ది, నువ్వుల నూనెతో శుద్ధి చేశారు. ఆ తర్వాత 21 రోజుల పరిశ్రమతో చీరను నేశారు. దీన్ని ధరించినవారికి చలికాలంలో వెచ్చగా, ఎండాకాలంలో చల్లగా ఉంటుందని శ్రీనివాస్‌ చెప్పారు. సుగంధ పరిమళాలను వెదజల్లడం దీని మరో ప్రత్యేకత అని అంటారాయన. గజం శ్రీనివాస్‌ తండ్రి రాములు కూడా తేలియా రుమాల్‌ వస్త్రాల తయారీతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 1983లో జాతీయ స్థాయిలో ‘విశ్వకర్మ’ పురస్కారం, 1990లో జాతీయ చేనేత పురస్కారం అందుకున్నారు. 


భగవద్గీత శ్లోకాలు, విష్ణు పాదాలు!
జామ్దానీ పద్ధతిలో భగవద్గీత శ్లోకాలతో చీరను రూపొందించి జాతీయ పురస్కారం అందుకున్నారు నల్లగొండ జిల్లా చండూరు వాసి గంజి యాదగిరి. అంచులో శ్రీమహావిష్ణువు పాదముద్రలు వచ్చేలా ఏడు నెలల పాటు శ్రమించి ఈ చీరను నేశారాయన. ఇంటర్మీడియట్‌ వరకు చదివిన యాదగిరి 30 ఏళ్లుగా చేనేత వృత్తిని కొనసాగిస్తున్నారు. ఒడిదొడుకులు ఎదురైనా తన నైపుణ్యానికి పదును పెట్టుకుంటూ, వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. మరో 30 మగ్గాలకు ఉపాధి కల్పిస్తున్నారు. ‘‘మా గురువు గజం అంజయ్య ప్రోత్సాహంతోనే పురస్కారం సాధించగలిగాను. మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేత వృత్తిని మలచుకుంటే ఎప్పటికీ ఆదరణ ఉంటుంద’’న్నారు యాదగిరి.


ఉప్పాడ జామ్దానీకి దన్ను
తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ గ్రామం పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది.. జామ్దానీ చీర. దేశవ్యాప్తంగా దీనికి మంచి గుర్తింపు ఉంది. జిల్లాలోని ఉ.కొత్తపల్లి మండలం ఉప్పాడ, వాకతిప్ప, కొత్తపల్లి గ్రామాలకు నిత్యం ఎంతోమంది వచ్చి ఈ చీరలు కొనుగోలు చేస్తుంటారు. దీనికి ఇంత గుర్తింపు రావడంలో వాకతిప్ప ‘వెంకట రామలక్ష్మి ఫ్యాబ్రిక్స్‌’ సంస్థ కృషి ఎన్నదగినది. దీనికి గుర్తింపుగా చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌లో జాతీయ ప్రశంసా పత్రం అందుకుంది. లొల్ల వెంకటరావు 1980లో తన నలుగురు కుమారులతో ఈ సంస్థను స్థాపించారు. అప్పట్లో ఉప్పాడ, బుటా చీరలను చెన్నై, కోల్‌కతా, దిల్లీలకు ఎగుమతి చేసేవారు. 1986 తర్వాత ఉప్పాడ జామ్దానీ చీరలకు ప్రాముఖ్యత పెరిగింది. అప్పటి నుంచి వెంకటరావు దాదాపు వెయ్యి రకాల డిజైన్లను రూపొందించి, 1200 చేనేత కుటుంబాలతో చీరలు నేయించడం ప్రారంభించారు. కుమారులతో కలిసి దేశవ్యాప్తంగా అమ్మకాలు చేయించారు. ఈ సంస్థ డిజైన్లు మరెక్కడా లభించవు. అందుకే రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు వీళ్ల చీరలంటే ఆసక్తి చూపుతారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ కుటుంబ సమేతంగా వచ్చి ఈ చీరలు కొనుగోలు చేశారు. 2017లో వెంకటరావు మరణించారు. దాంతో ఆయన పెద్ద కుమారుడు వీర వెంకట సత్యనారాయణ సంస్థ బాధ్యతలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు రూపొందిస్తూ సుమారు 2500 మంది నేతకార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఏడాదికి రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు వ్యాపారం సాగిస్తున్నారు. 

- గంపా రాజు, ఉ.కొత్తపల్లి


తొమ్మిది నెలల కృషి
జామ్దానీ సాంకేతికతతో పూల డిజైన్‌తో చీర రూపొందించి జాతీయ ప్రశంసా పత్రానికి ఎంపికయ్యారు చిలుకూరి శ్రీనివాసులు. ‘పాన్‌పటోలా’ పద్ధతిలో ఈ చీరను నేయడానికి తొమ్మిది నెలలు పట్టిందని శ్రీనివాసులు చెప్పారు. ఈయనదీ చండూరే. 27 ఏళ్లుగా పట్టు చీరల తయారీలో ఉన్నారు. స్థానికంగా వంద మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. 


కాలానుగుణంగా..
ప్రకృతి సిద్ధ రంగులతో డబుల్‌ ఇక్కత్‌ చీరను రూపొందించి జాతీయ ప్రశంసా పత్రం సాధించారు కందగట్ల భావనారుషి. ఈయన చండూరు వాసి. అయిదో తరగతి తర్వాత వృత్తిలోకి వచ్చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చీరలు రూపొందించడంలో మంచి పేరు తెచ్చుకున్నారు.


పట్టుదలతో సాధించారు
‘తేలియా రుమాల్‌ డబుల్‌ ఇక్కత్‌ చీర’కు జాతీయ ప్రశంసా పత్రం సాధించారు యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక వాసి చెరుపల్లి భావనారుషి. నలభై ఏళ్లుగా వృత్తిలో ఉన్నారు. తనకంటూ ఓ గుర్తింపు సాధించాలనే పట్టుదలతో ఆర్నెల్ల పాటు శ్రమించి, సహజ రంగులతో ఈ చీరను నేసినట్లు చెప్పారు భావనారుషి. 

- సూరెపల్లి రఘుపతి, చౌటుప్పల్‌ 


ఘన గోవర్ధనోద్ధరణం
చిన్న కన్నయ్య గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన దృశ్యాన్ని చీర మీద సృజించి జాతీయ పురస్కారం సాధించారు నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన పట్నం మునిబాబు. ఈయన 30 ఏళ్లుగా చేనేత వృత్తిలో ఉన్నారు. గోవర్ధనోద్ధరణ ఘట్టాన్ని స్వచ్ఛమైన వెండి జరీతో చీర మీదకి తెచ్చారు. 32 రంగుల్లో జాందానీ విధానంలో పూర్తిగా నూలుతో ఈ చీరను నేశారు. మునిబాబు కుటుంబానికి ఇది అయిదో పురస్కారం.

 - కొప్పోలు శ్యామ్‌కుమార్‌, వెంకటగిరి 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  హస్తకళలు