సంతోషాలు నిండగా... ఆడి పాడే పండుగ

  • 2918 Views
  • 8Likes
  • Like
  • Article Share

    సృజన

  • అనంతపురం
  • 9652744104

ప్రకృతితో మమేకమైన భారతీయ జీవితానికి ప్రతీక... వెలుగుల రేడుతో మట్టిమనుషుల అనుబంధానికి గుర్తుగా సాగే సంబరాలకు వేదిక... బతుకుబాటలో తమతో కలిసి ప్రయాణిస్తూ, తమకు నిస్వార్థంగా సేవ చేసే మూగజీవాలకు జాసపదులు మనసారా కృతజ్ఞతలు తెలిపే వేడుక... సంక్రాంతి.  ఈ పండుగ వచ్చిందంటే చాలు తెలుగు పల్లెలన్నీ వింత అందాలను సంతరించుకుంటాయి. ఆటపాటలతో మైమరిచిపోతాయి. 
తెలుగువారు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి. పల్లెప్రజలకు ఇదొక మధురానుభూతి. భోగి, సంక్రాంతి, కనుము పేర్లతో మూడు రోజుల పాటు జరుపుకునే వేడుకల్లో ప్రాచీన సంప్రదాయ కళా ప్రదర్శనలు, విందులు, వినోదాలతో తెలుగు నేలంతా సందడే సందడి. ఆడబిడ్డల హడావుడి, అల్లుళ్ల సరదా అలకలు, బావామరదళ్ల సరాగాలతో తెలుగు లోగిళ్లు కళకళలాడే సమయమిది. పల్లెపట్టులన్నీ ముగ్ధమనోహరాలైన సుందరమందిరాలైౖ సంక్రాంతిలక్ష్మికి ఆతిథ్యమిచ్చే కాలమిది. 
      సూర్యుడు నెలకొక రాశి మారతాడు. కొత్తరాశిలో ప్రవేశించటాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. అలా సంవత్సరంలో సూర్యుడు 12 రాశులలో ప్రవేశిస్తాడు. అంటే ఏడాదికి 12 సంక్రాంతులు వస్తాయన్నమాట. అయితే, ద్వాదశ సంక్రాంతులన్నింటినీ పండుగలుగా జరుపుకోం. పుష్య మాసంలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే సంక్రాంతే మనకు పర్వదినం. ఆ రోజే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమౌతుంది.
      సంక్రాంతి రోజుల్లో ఇళ్లముందు తప్పనిసరిగా ఆవుపేడతో కళ్లాపిచల్లడం తెలుగింటి సంప్రదాయం. పచ్చదనాన్ని సంతరించుకున్న ఆ ముంగిలిని రంగవల్లులు తీర్చిదిద్ది వాటి మధ్యలో గొబ్బెమ్మలను అలంకరించడం ఆనవాయితి. ఆ గొబ్బెమ్మలను గుమ్మడిపూలతో అలంకరించి, పసుపు కుంకుమలతో పూజించడం ఆచారం. పండుగ రోజున గుమ్మాలను గోమూత్రంతో శుద్ధిజేసి పసుపుపూసి, గడపలను కుంకుమ బొట్లు పెట్టి, ద్వారాలకు లేత మామిడాకుల తోరణాలను కట్టడం మంగళప్రదం.

భోగి రోజున మంటలు వేసి వాటి చుట్టూ చేతులు పట్టుకుని తిరుగుతూ పాటలు పాడుతూ చేసే నృత్యాలు కనులపండువగా ఉంటాయి. పిల్లలకు ఈరోజు తలపై రేగుపండ్లను ఉంచి అభ్యంగన స్నానం చేయిస్తారు.  గుమ్మడికాయ వంటకాలు భోగి పండుగ ప్రత్యేకత.
సంక్రాంతి సమయం... సస్యలక్ష్మి ఇంటికి చేరే సందర్భం. రైతులు ఆరుగాలం శ్రమించి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పంటలు పండిస్తారు. కానీ విత్తు నాటిన దగ్గర్నుంచి, పంటకోత వరకు పైరును ఎన్నో తెగుళ్లు ఆశ్రయించి నాశనం చేస్తాయి. వాటిని నీ బంగారు కిరణాలతో నీరుగార్చి మాకు సస్యసంపదను చేకూర్చమంటూ రైతులు సూర్యభగవానుణ్ని వేడుకుంటారు. ఆమేరకు కమలాప్తుణ్ని ఆరాధించి నైవేద్యం సమర్పిస్తారు. భానుడికి ఎదురుగా ఇంటి ముంగిట్లో ముగ్గు వేసి, మధ్యలో ఆవు పిడకల నుంచి పొయ్యి సిద్ధం చేస్తారు. దీనిపై కొత్తకుండ ఉంచి ఆవుపాలు, కొత్తబియ్యం, పెసరపప్పు, బెల్లం, కొబ్బరి తురుములతో పాయసం వండుతారు. దాన్ని భాస్కరుడికి నివేదించి ఇంటిల్లిపాదీ ప్రసాదంగా స్వీకరిస్తారు. 

సంబరాల సంక్రాంతి
సంక్రాంతి రోజున తెలుగు వారి సంబరాలు అంబరాన్నంటుతాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దులవారి సన్నాయిమేళాలు, కోడి పందేలు, పొటేళ్ల పందేలు, కోలాటాలతో ఆ వేళ జనపదాలన్నీ ఆనందడోలికల్లో తేలియాడతాయి. ‘హరిలో రంగహరి’ అంటూ అందరికీ వీనులవిందునందించే హరిదాసులు మన సాంస్కృతిక రాయబారులు. నుదుట ఊర్ధ్వపుండ్రం, తలపాగా దానిపైన పొందికగా అమర్చిన గుండ్రని పాత్ర, చేతుల్లో చిడతలు, కాళ్లకు గజ్జెలు పంచెకట్టుతో కూడిన వారి వేషధారణ కనులకూ విందునందిస్తుంది. మధురమైన గాత్రంతో చిడతలు వాయిస్తూ ఆనందపారవశ్యంతో వారు హరికీర్తనలు పాడుతుంటే ఆహా అనకుండా ఉండలేం. అదే సమయంలో చూడముచ్చటైన అలంకారాలతో దర్జాను ఒలకబోసే గంగిరెద్దులు ఊరంతా కలయతిరుగుతుంటే ఆ ముచ్చటను మాటల్లో వర్ణించలేం. ఇక జానపదులు గుంపులుగా కోలలను తడుతూ లయబద్ధంగా సాగుతున్న పాట, దరువుకు అనుగుణంగా వేసే కోలాటం ఈ పండుగ మరో ప్రత్యేకత.
      సంక్రాంతికీ కోడిపందేలకూ అవినాభావ సంబంధం. పల్లెలోని మగవారు ఊరికి సమీపంలోని తోపుల్లో చేరి కోడిపందేలు ఆడతారు. పండుగకు కొన్ని నెలల ముందు నుంచే పందాలరాయుళ్లు కోడిపుంజులకు ప్రత్యేక ఆహారాన్ని అందిస్తూ వాటిని బలిష్ఠంగా తయారు చేస్తారు. సంక్రాంతినాడు వాటికాళ్లకు కత్తులు కట్టి బరిలోకి దింపుతారు. కోళ్లరంగును బట్టి కాకి, డేగ, నెమలి వంటి వివిధపేర్లతో పిలుస్తారు. ప్రస్తుతం కోడిపందేలపై నిషేధం ఉన్నా సంక్రాంతి సందర్భంగా అక్కడక్కడ ఆడుతూనే ఉంటారు. కోడిపందేల్లో గెలిచిన వారి గురించి ‘గెలిచినందుకేం మిగిలిందంటే మీసం మిగిలింద’ని ఎవరో చమత్కరించారట! అంతేమరి పందెంలో గెలిచినవాడి చుట్టూ వందిమాగధులు మూగుతారు. వీళ్లని సంతృప్తి పరిచేందుకు మరింత ఖర్చు పెట్టాలిగా! అందుకని. 
      పల్లెప్రజలు కనుము పండుగను సంక్రాంతి పార్న అని పిలుస్తారు. ‘పారణ’ అనే పదానికి రూపాంతరమే పార్న. పారణ అంటే వ్రతం, ఉపవాసం తరువాత తీసుకునే తీర్థప్రసాదాలు. ఈ అర్థం ఇప్పుడు పూర్తిగా మారి మాంసాహార విందుభోజనంగా మిగిలిపోయింది. కనుము పశువుల పండుగకూడా. రైతులు పశువులకు స్నానం చేయించి, వాటిని అలంకరించి పూజించి తమకు వ్యవసాయ పనుల్లో సాయపడ్డందుకు కృతజ్ఞతలు చెబుతారు. వాటికి పొంగలిని ఆహారంగా పెడతారు. కొన్నిచోట్ల దేవాలయానికీ తీసుకెళ్తారు. కోడి పందేల్లాగానే ఎడ్లపందేలు కూడా నిర్వహిస్తారు. 
సంక్రాంతి వేడుకల్లో చివరి అంకం పారువేట. ఇది రెండు రకాలు. మొదటిది బలమైన ఎద్దుల కొమ్ములకొసకు పారితోషికాన్ని వేలాడదీస్తారు. ఆ ఎద్దును లొంగదీసుకుని ఆ సొమ్మును అందుకున్నవారు విజేతలు. ఇది తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు లాంటిది. ఇది ప్రాణాంత క్రీడ. పొగరుబోతు గిత్తలు కొమ్ములతో కుమ్మితే ప్రాణాలు పోయే ప్రమాదమూ ఉంటుంది. అయితే... ఉత్సాహవంతులైన యువకులు అందరి దృష్టిలో పడాలని, ముఖ్యంగా అమ్మాయిల ముందు తమ ధైర్యసాహసాలను ప్రదర్శించాలన్న ఉద్దేశంతో ఈ పోటీల్లో పాల్గొంటారు.
      రెండోరకం పారువేట ప్రధానంగా స్త్రీల కోసం ఏర్పాటైంది. దీన్ని నదీతీర గ్రామాల్లో ఏటి ఇసుకలో ఏర్పాటు చేస్తారు. శీతకాలపు ఆహ్లాదకరమైన వాతావరణంలో సాయంకాలంపూట ఇసుకతిన్నెల వద్దకు ఆడవాళ్లంతా చేరి పెద్దవలయంగా ఏర్పడతారు. మధ్యలో నాలుగైదు చెవుల పిల్లుల్ని వదులుతారు. వీళ్లు కొట్టే చప్పట్లకు, కేకలకు అవి బెదిరి పరుగెడతాయి. చుట్టూ జనమే కాబట్టి బయటికిపోలేక అవి అలసిపోయి ఎవరికో ఒకరికి చిక్కుతాయి. వారే విజేతలు. 
      సంతోషాలను మోసుకొచ్చే సంక్రాంతి నాడు జానపదులాడుకునే ఆటల ముచ్చట్లివి. వీటిని మన తెలుగు కవులు సమయం వచ్చినప్పుడల్లా తమ రచనల్లో వర్ణించారు. నన్నెచోడుడి కుమారసంభవం కావచ్చు... వినుకొండ వల్లభుని క్రీడాభిరామమూ కావచ్చు... ఎందులోనైనా సరే, సంక్రాంతి సంబరాల వర్ణనలు మనోహరంగా ఉంటాయి. ఆధునిక నాగరికత ధూళిలో కొన్ని సంప్రదాయాలు కనుమరుగవుతున్నా... సంక్రాంతి శోభ మాత్రం ఇప్పటికీ మన పల్లెలను అంటిపెట్టుకునే ఉంది.  

 

* * *


వెనక్కి ...

మీ అభిప్రాయం