అమ్మా మాయమ్మో
 

  • 755 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। నాగశేషు

  • నెల్లూరు
  • 9985509053

బోనాలంటే ఊరూవాడా జానపదాలు పరవళ్లు తొక్కుతాయి. జనసాగరాన్ని భక్తిసంద్రంలో మునకలు వేయిస్తాయి. అలాంటి పాటల్లో ప్రాచుర్యం పొందిన ఓ రెండు...!
అమ్మా బైలెల్లినాదో నాయనా తల్లీ బైలెల్లినాదో...(2)
లష్కరులో బోనాలమ్మో మా యమ్మా కదిలొచ్చే మాంకాళమ్మో (2) 
పోతరాజు లెగరంగ... అమ్మా మాంకాళి 
శివసత్తులూగంగా... తల్లీ మాంకాళి (2)
లష్కరులో బోనాలు అమ్మా మాంకాళి 
డప్పులతో జనాలు అమ్మా మాంకాళి
లష్కరులో బోనాలు డప్పులతో జనంతో ।।అమ్మా బైలెల్లినాదో।।
పోరగాళ్లు పొట్టెగాళ్లు అమ్మా మాంకాళి
తీన్‌మారు ఆడుకుంట తల్లీ మాంకాళి
చారుమినారు కాడ అమ్మా మాంకాళి 
గల్లిగల్లి లొల్లిలొల్లి తల్లీ మాంకాళి 
చారుమినారు కాడ గల్లిగల్లి లొల్లిలొల్లి ।।అమ్మా బైలెల్లినాదో।।
కల్లుసాక కోడిపుంజు అమ్మా మాంకాళి
కొత్తచీర కొత్తరైక అమ్మా మాంకాళి
సంకపిల్లనెత్తుకొని అమ్మా మాంకాళి
నిన్ను చూడవత్తుమమ్మా తల్లీ మాంకాళి
సంకపిల్లనెత్తుకొని నిన్ను చూడవత్తుమమ్మా ।।అమ్మా బైలెల్లినాదో।।
లష్కరులో బోనాలమ్మో మా యమ్మా కదిలొచ్చే మాంకాళమ్మో (2)
యమ్మమ్మో మాయమ్మో.... తల్లీ మాంకాళమ్మా...
మా పిల్ల పాపలనమ్మో మాయమ్మ చల్లంగ దీవించమ్మో... (4)
లష్కరులో బోనాలమ్మో మా యమ్మా కదిలొచ్చే మాంకాళమ్మో (2)
* * *
ఎల్లు ఎల్లాయి రాయె ఎల్లమ్మా... మా కన్నతల్లి రాయె ఎల్లమ్మా (2)
బంగారు కొండ వరకు ఎల్లమ్మా బయలెల్లి రావమ్మా (2)
పొద్దెల్లిపోతున్నది ఎల్లమ్మా పోరగాళ్లు ఏడుస్తున్నరే 
ఎల్లూ... మా తల్లి ।।ఎల్లు ఎల్లాయి రావె।।
తీగబారె తీగబారె అమ్మ రేణుకా మాయ రేణుకా
ఏమేమి తీగబారె అమ్మ రేణుకో మాయ రేణుకా (2)
నీ బోనాల పండుగొచ్చె అమ్మ రేణుకో మాయ రేణుకా
మా పల్లెంతా తీగబారె అమ్మ రేణుకో మాయ రేణుకా (2)
అబ్బబ్బ మాయమ్మ ఎల్లమ్మా రావే ఎల్లమ్మ రావే
ఎల్లమ్మ నీకు మా బోనాలతోని జనాలతోని (2)
డమడమ డప్పుల్ల చప్పులతోని చిన్నళ్లతోని
నీ ముందుకొచ్చినం మాట్లాడు తల్లీ మందలించు తల్లీ... (2)
ఎల్లూ.... మా తల్లీ ।।డమడమ।।
సక్కాని పుడకలంట ఎల్లమ్మా సన్నని రైకలంట ఎల్లమ్మా (2)
తెల్లతీర జాలికొంగు ఎల్లమ్మా కుంకుమ బొట్టులాయె (2)
పాలకొబ్బరి కాయలు ఎల్లమ్మా పసుపుగంధాలు తెత్తిమి మా తల్లీ(2)
పరికిట్లో పట్టు పరచి ఎల్లమ్మా పట్నంను పట్టినాము (2)
రావమ్మా రావమ్మా ఎల్లమ్మా పట్టు దిగి దిగిరావు (2)
చేసేటి పూజలన్నీ ఎల్లమ్మా నీకు జేయ వచ్చినాము ఎల్లమ్మా (2)
నీ కాలిగజ్జె ఘల్లుమంటె అమ్మ రేణుకో మాయ రేణుకా (2)
మా కరీంనగరు దద్దరిల్లె అమ్మ రేణుకో మాయ రేణుకా (2)
నాగుబాము పట్టినావు అమ్మరేణుకా మాయరేణుకా
నువ్వు నటికట్లు కట్టినావు అమ్మ రేణుకా మాయరేణుకా
జెర్రిపోతుల పట్టినావు అమ్మరేణుకా మాయరేణుకా
నీవు జడకొప్పులల్లినావు అమ్మరేణుకా మాయరేణుకా
నీదు చిప్పదాటి కల్లంతా అమ్మరేణుకా మాయరేణుకా
మా బిందెల్ల తెచ్చినవు అమ్మరేణుకా మాయరేణుకా
కోడిపుంజు గొర్లన్నీ అమ్మరేణుకా మాయరేణుకా
కొట్టుకుంట కోసినాము అమ్మరేణుకా మాయరేణుకా
మా పిల్ల జెల్ల చల్లగుంచు అమ్మరేణుకా మాయరేణుకా
మా గొడ్డుగోద చల్లగుంచు అమ్మరేణుకా మాయరేణుకా
పాడిపంట మంచిగియ్‌ అమ్మరేణుకా మాయరేణుకా
మా పల్లెనంతా కాపాడు అమ్మరేణుకా మాయరేణుకా
మల్లచ్చె ఈ దినము అమ్మరేణుకా మాయరేణుకా
నిన్ను మరువకుండ గొలుతము అమ్మరేణుకా మాయరేణుకా
ఎల్లమ్మా తల్లీ... నీకు ఏరెవ్వరే ఏరెవ్వరే
నా తల్లీ ఎల్లమ్మా నీకు ఎదురెవ్వరే (4)


వెనక్కి ...

మీ అభిప్రాయం