ఆహా! ఏమి రుచి..

  • 1431 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తేలప్రోలు వెంకట నరసింహారావు

  • విశ్రాంత ఏజీఎం, నాబార్డు
  • హైదరాబాదు
  • 9603150038
తేలప్రోలు వెంకట నరసింహారావు

అలా సాయంత్రం షికారుకు వెళ్లిన నన్ను, దారి పక్కనే ఉన్న కల్యాణ మండపంలోని సందడి, ఆ తర్వాత అక్కడి భోజనశాల నుంచి వస్తున్న ఘుమఘుమలు ఆకర్షించాయి. ఆపై అలలుగా తేలివస్తున్న ‘వివాహ భోజనంబు, వింతైన వంటకంబు’ అన్న పాట మరింత ఆనందాన్ని కలిగించింది. ఒక్కసారిగా మనసులో సినీ రచయితలు, ఇతర కవీంద్రులు వర్ణించిన వంటకాలు, వాటి రుచులు కదలాడాయి.
      ‘మాయాబజారు’లోని ‘‘వివాహ భోజనంబు’’ పాట తెలుగువారు ఉన్నంత వరకూ నిలిచి ఉండే గీతం. రచయిత పింగళి నాగేంద్రరావు. ఇందులో ఆయన అన్నిటికంటే ముందుగా వడ్డించినవి గారెలు, బూరెలు, అరిసెలు. తర్వాత లడ్లు, జిలేబీలు. వాటి వెంట అప్పడాలు, పులిహోర దప్పళాలు ఇంకా పాయసాలు. అబ్బో ఎన్ని రకాలో! పింగళి సాహిత్యానికి ఎస్వీఆర్‌ నటన, మాధవపెద్ది గళం తోడై ఈ పాటకు శాశ్వతత్వాన్ని ఆపాదించాయి.
      అయితే, అన్ని తెలుగు రుచులనూ వర్ణించింది మాత్రం ఆరుద్రే. ‘పెళ్లిపుస్తకం’ లోని ‘‘భోజనం, వనభోజనం’’ పాటలో తెలుగు వంటకాలనే కాదు, వాటిని తినే పద్ధతిని కూడా ఆయన వివరించారు. ‘‘పప్పు దప్పళం, వేడి అన్నం, కాచిన్నెయ్యి కలిపి కొడదాం’’ అంటారు. మసాలా గారెలు, జిలేబీ బాదుషాలు, సమోసాలే కాదు.. పసందైన పూర్ణం బూరెలు తింటూ వయసుకు వచ్చిన ఆటలు ఆడుతూ, మనసుకు నచ్చిన పాటలు పాడుకోమంటా రాయన.. ఇంకా అసలు సిసలైన తెలుగు ట్రేడ్మార్కు మిరపకాయ బజ్జీని కొరకమని చెబుతారు. గోంగూర పచ్చడి, గొడ్డుకారం ముద్దను మినపట్టు ముక్కతో మింగి చూడమంటారు. ఇంతేనా? ఇంకా అల్లం చల్లిన పెసరట్టు-ఉప్మా, ఆపై అరిసెలు, బూరెలు, వడలు, ఆవడ బోండాలు, కజ్జికాయలు, కరకరలాడే జంతికలు.. అబ్బో! అంతేనా? అంతా శాకాహారమే అనుకుంటున్నారా? నోరూరించే కక్కలు ముక్కలు, చేపల కబాబులు కూడా ఉన్నాయి. ఆపై కారపు పచ్చడి, తీపి జాంగ్రీలు కూడా! ఇంత తిండి తిన్నవారు తమకు తెలియకుండానే హాయిగా ఆటలాడతారు, పాట పాడతారు, నృత్యం రాకపోయినా చేసేస్తారని చమత్కరిస్తారు.
      తనికెళ్ల భరణి ‘మిథునం’లోని పేరడీ ‘‘ఆవకాయ మన అందరిదీ, గోంగూర పచ్చడీ మనదేలే’’ గీతంలో కూడా ఎన్నో తెలుగు ఆహారాలు, ఊపాహారాలు ఇంకా వాటిని ఆరగించే పద్ధతులూ! ఇడ్లీల్లోకైతే కొబ్బరి చెట్నీ, పెసరట్టులోకి అల్లం ఉండాలి. పాయసమైతే వేడిగా, పులిహోర అయితే మర్నాడే తినాలి, అప్పుడే వాటి రుచి అంటారు. గుత్తివంకాయ కూర, గుమ్మడికాయ పులుసు ఉంటే ఎంతైనా తినొచ్చు, చివరికి ఆకులు కూడా నాకాల్సి వస్తుందంటారు. నిజమే కదా! ఈ పాటకి కొసమెరుపు మాత్రం ‘‘తిండి కలిగితే కండ కలదనీ గురజాడ వారు అన్నారూ, అప్పదాసు ఆ ముక్క పట్టుకొని ముప్పూటలు తెగ తిన్నారూ’’ అన్న పంక్తి. ఇన్ని రుచులుంటే ఎవరైనా అదే చేస్తారు! ఇంకా ‘సిరివెన్నెల’ అన్నట్టు అల్లం, పచ్చిమిర్చి ముద్దతో రుచిగా గుత్తివంకాయ కూర వండుకుని దానికి కొంచెం కొత్తిమీర తగిలించి గనుక తింటే మైమరచి ‘‘ఆహా! ఏమి రుచి’’ అనకుండా ఉంటారా? నిజంగా అది అమృతమే!
పుల్లనీ పుల్లట్టు
ఇప్పుడు ఎక్కడ చూసినా ‘దోసె’లే కనపడుతున్నాయి. అచ్చతెలుగు ‘అట్ల’ ఆరగింపులు అరుదైపోతున్నాయి. అందుకే కాబోలు ‘బాబీ’ చిత్రంలో మనదైన పుల్లట్టును గుర్తుచేశారు భారతీబాబు. ‘‘పుల్లనీ పుల్లట్టు పంటికంటగానే జివచచ్చిన జన్మకే జీవమొచ్చెరా/ వేసేటి అట్ల మీద యావ పుట్టగానే ఏసీలో తిండి మీద ఎగట్టు పుట్టెరా’’ అన్న ఆయన మాటతో అందరూ ఏకీభవించాల్సిందే. రుచీపచీ లేని తిండితో పొట్ట నిండుద్ది కానీ, తిన్నామన్న తృప్తి దొరుకుద్దా? అందుకే ‘‘రాతిరోలులోన పిండి రవ్వలోన కలిపి/ రేకుపెనం మీద రవ్వంత నూనె దులిపి/ కట్టెపొయ్యి మీద దాన్ని అట్లకాడ తో కాల్చి/ పొడికారం పైన చల్లి పొగసూ రకుండా దీసి/ కాలుతున్న అట్టు ముక్క నాలిక మీదెట్టుకుంటే/ నషాళానికెక్కి మంచి హుషారు పుట్టిస్తదిరా పుల్లట్టు/ కట్లెట్లు, పిజ్జాలు దీనిముందు దిగదుడుపు’’ అంటే కాదనేదెవరు? ‘‘హాటుడాగ్సు, బర్గర్లని ఇంగిలిపీసు మరిగినోడు/ ఫాస్టుఫుడ్డు తిన్నాక టేస్టు మర్చిపోతాడు/ తెలుగింటి పుల్లట్టు తిన్నోడు ఎవడైనా ఓ../ పదేళ్లయినా మరిచిపోడు పదేపదే అడుగుతాడు’’ అంటూ ఈ పాటకు మహాపసందైన ముక్తాయింపునిచ్చారు రచయిత. 
      అయితే.. వీళ్లందరికీ భిన్నంగా అతిథిని ఇంటికి పిలిచి చక్కటి భోజనంతో పాటు, జానపదపు పలుకుబడులనూ వడ్డించింది మాత్రం సీనియర్‌ సముద్రాలే. ‘‘రారోయి మా ఇంటికి’’ అని పిలుస్తూ నిల్చోటానికి నిమ్మ చెట్టు నీడ, కూర్చోటానికి ‘కురిసీల పీట’, తొంగుంటే పట్టెమంచం పరుపుంది అని చెబుతారు. ఆకలేస్తే సన్నబియ్యం కూడున్నదనీ, అందులోకి అరకోడి కూరన్నదనీ, ఆపైన రొయ్య పొట్టు చారున్నదనీ అంటే ఎవరైనా వద్దంటారా? సముద్రాల వారి భోజనం ఇంకా పూర్తి కాలేదు! ఇంకా రంజైన మీగడ పెరుగు, నంజుకోడానికి ఆవకాయ ముక్క కూడా ఉన్నాయి. ఇంత పసందైన భోజనం పెడితే ఏ తెలుగువాడైనా నాలుగు ముద్దలు ఎక్కువ తినకుండా ఉండగలడా? అందుకే పాట చివరలో వ్యంగ్యాన్ని కూడా జోడిస్తారు సముద్రాల- రోగమొస్తే ఘాటైన మందున్నదనీ, ఆఖరుగా సాగనంపటానికి వల్లకాటి దిబ్బ కూడా ఉందంటూ! సాహో!!
ఆనాటి రుచులు
సినీ గీతాల్లోనే కాదు, ప్రాచీన కావ్యాల్లోనూ వంటకాలూ, వాటి రుచుల ప్రసక్తి లేకపోలేదు. ఏదైనా కృతిని రచించమని రాయలవారు కోరినప్పుడు, అలా రాయడానికి అవసరమైన పరిస్థితులను పేర్కొంటూ పెద్దన చెప్పిన ‘‘నిరుపహతి స్థలంబు...’’ అనే చాటుపద్యం సుప్రసిద్ధం. అందులో ‘‘ఆత్మకింపైన భోజనం’’ కూడా ఒక అవసరమేనంటాడు జిగిబిగి అల్లికల అల్లసాని. కంటికి, నోటికీ బాగుంటేనే కదా ఆత్మకి ఇంపయ్యేది! అలాగే ‘‘గారెలు లేని విందు, సహకారము లేని వనంబు... కొఱగానివి పెమ్మయ సింగ ధీమణీ’’ కూడా ప్రసిద్ధమే. ‘‘చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారతో మెక్కిన భంగి...’’ నీ రూప సుధారసాన్ని జుర్రెద! అన్నది ‘దాశరథీ శతకం’లో రామదాసు మాట. ‘‘సత్కావ్య నిర్మాణ చాకచక్యంబన్న షడ్రసోపేత భోజనము మాకు’’ అంటారు తిరుపతి వేంకటకవులు.
      ఎంతమంది ఎన్ని విధాలుగా అన్నపానాదులను వర్ణించినా, శ్రీనాథుడు చెప్పినట్లుగా ఇంకెవ్వరూ చెప్పలేదంటే అతిశయోక్తి కాదు. కాశీఖండ కావ్యంలోని ఒక ఘట్టంలో శివరాత్రి నాడు ఓ భక్తుడు శివుడికి సమర్పించిన నైవేద్యంలో అనేక పదార్థాలుంటాయి. అందులో మిరియపు పొడి చల్లినవి, సైంధవ లవణంతో చేసినవి, ఆవపిండి పెట్టినవి, ఇంగువ వాడినవి, చింతపండు పులుసుతో లేదా నిమ్మరసంతో చేసినవి, లేత కొత్తిమీరతో చేసినవి... ఇలా ఎన్నెన్ని రకాలో! ఈ కావ్యంలోనే వేరొక చోట గుణనిధి తన తల్లి పెట్టే భోజనాన్ని గుర్తుచేసుకుంటూ ‘‘గిన్నెలో బెరుగును వంటకంబును వడ పిండియులుం గుడువంగ బెట్టు...’’ అంటాడు. శ్రీనాథుడు రుచికరమైన పదార్థాలనే కాదు, రుచించని వాటిని కూడా చెప్పాడు. ముఖ్యంగా ఆయన పల్నాటి సీమకు వెళ్లినప్పుడు చెప్పిన చాటుపద్యాలు చాలా ప్రసిద్ధం. ‘‘జొన్నన్నము, జొన్నకలి, జొన్న యంబలి, జొన్నలు తప్ప సన్నన్నము సున్నసుమీ పన్నుగ పలనాటి సీమ ప్రజలందరకున్‌’’ అంటాడు. అన్నింటి కన్నా మిన్న ఈ వ్యంగ్యాస్త్రం... అప్పుడెప్పుడో పూతన విషపు పాలు తాగి గొప్పలు పోవద్దయ్యా కృష్ణయ్యా, పల్నాటి సీమలో చింతాకు వేసి వండిన వేడి బచ్చలి కూర తింటే నీ పస తెలుస్తుందని చెబుతాడు. 
      ఇక చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు చెప్పిన పకోడీ పద్యాల్లోని హాస్య ప్రియత్వాన్ని మచ్చుకు చూడండి.. ఇవి పకోడీల కంటే మధురంగా ఉంటాయి. ‘‘ఆ కమ్మదనము నా రుచి యా కరకర యా ఘుమఘుమ మా పొంకములా రాకలు పోకలు వడుపులు నీకే దగు నెందులేవు నిజము పకోడీ’’! నిజమే కదా. 
      చివరగా ఒక సూక్తి.. భాస్కర శతకంలోనిది. ‘‘చదువది ఎంత కల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణసంయుతు లెవ్వరు మెచ్చరెచ్చటన్‌ బదునుగ మంచికూర నలపాకము చేసిన నైన నందు నింపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా’’. ఎలాంటి పాకమైనా ఎవరు వండినా అందులో ఉప్పు లేకుంటే రుచి ఎలాగైతే ఉండదో.. అలాగే ఎంత చదువు చదివినా కొంచెం లౌక్యం లేకుంటే చెల్లదు కదా!

* * *

      ఊహల్లోనుంచి బయటపడి త్వరితగతిన ఇంటి దారి పట్టాను, మనసులో మెదిలిన రుచుల్లో కొన్నింటినైనా ఆస్వాదిద్దామని!!!


వెనక్కి ...

మీ అభిప్రాయం