చెక్క బొమ్మలాటకు చలోచలో!

  • 2373 Views
  • 35Likes
  • Like
  • Article Share

    మధుసూదన్‌రెడ్డి శానాల

  • వరంగల్‌
  • 7032642552
మధుసూదన్‌రెడ్డి శానాల

శతాబ్దాల చరిత్ర ఉన్న కళారూపం కొన్ని దశాబ్దాల పాటు అంతర్థానమైంది. ఆ కళను ప్రదర్శించగలిగిన వ్యక్తులు ఉన్నారన్న విషయం కూడా సమాజం స్మృతిపథంలోంచి చెరిగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఆ కళాకారులు వెలుగులోకి వచ్చారు. అజ్ఞాతవాసాన్ని వీడి ఆ కళారూపం తిరిగి జీవం పోసుకుంది. కానీ.. ఈ ఆనందం వర్తమానానికే పరిమితం! ‘చెక్కబొమ్మలాట’కు సంబంధించినంత వరకూ ఇదో విషాదకర వాస్తవం!!
పూర్వపు వరంగల్లు జిల్లా జానపద కళలకు, కళాకారులకు పట్టుగొమ్మ. తిరువనంతపురంలోని దాక్షిణాత్య జానపద విజ్ఞాన సంఘం (ఫోజిల్స్‌) గతంలో ఒకసారి దక్షిణ భారతదేశంలోని 32 జిల్లాల్లో జానపద కళారూపాల వివరాలు సేకరించింది. తెలంగాణలో వరంగల్లు, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో సంస్థ ప్రతినిధులు పర్యటించి, 70కిపైగా కళారూపాలను గుర్తించారు. వాటిలో ఒక్క వరంగల్లులోనే 56 కళారూపాలు వాళ్ల దృష్టికి వచ్చాయి. వాటిలో అతి ప్రాచీనమైంది.. తెలుగువారి అరుదైన వారసత్వ సంపద.. చెక్క లేదా కొయ్య బొమ్మలాట. అయితే.. తోలుబొమ్మలాట (దీని మీద పూర్తిస్థాయి వ్యాసాన్ని ‘తెలుగు వెలుగు’ అక్టోబరు, 2013 సంచికలో చూడవచ్చు) గురించి తెలిసినంతగా ఈ చెక్కబొమ్మలాట విశేషాలు చాలామందికి తెలియవు.
      భారతదేశంలో అక్కడక్కడ బొమ్మలాట ఆడేవారు ఉన్నారు. కానీ, మనిషి ఎత్తు బొమ్మలతో కథ చెప్పేవారు వరంగల్లు జిల్లాలో తప్ప మరెక్కడా లేరు అంటారు ఆచార్య జయధీర్‌ తిరుమలరావు. ఇక్కడ కూడా రెండు బృందాలే ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తున్నాయి. ప్రస్తుత జనగామ జిల్లా నర్మెట్ట మండలం అమ్మాపురంలో మోతె జగన్నాథం బృందం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం బూరుగుపేటలో మోతె రామస్వామి బృందం చెక్కబొమ్మలాటను కాపుగాస్తున్నాయి. వీళ్లంతా అన్నదమ్ముల పిల్లలే. రామస్వామి కుటుంబం కూడా అమ్మాపురం నుంచే బూరుగుపేటకు వలస వెళ్లింది. జగన్నాథం బృందంలో 11 మంది కళాకారులు ఉన్నారు. వీళ్లలో జగన్నాథం, ఉప్పలయ్య, కొండయ్య, నర్సయ్య కథ చెప్పగలరు. మిగిలినవాళ్లు వాద్య సహకారం అందజేస్తారు. మోతె రామస్వామి బృందంలోనూ పదిమంది ఉన్నారు. రామస్వామి, యాదగిరి కథ చెబుతారు. యాదగిరి మనవడు శంకర్‌ కూడా కథాగానంలో పట్టు సంపాదించుకున్నారు. వీళ్ల తర్వాత కథ చెప్పగలిగిన వాళ్లు ఇంకెవరూ లేరు.
చీకటిలోంచి వెలుగులోకి..
మోతె కుటుంబీకులు వందల ఏళ్ల నాడు అమ్మాపురానికి వచ్చి స్థిరపడ్డారు. చిందు యక్షగానాలు ఆడుతూ జీవించేవారు. చెక్కబొమ్మలాటనూ ప్రదర్శించేవారు. క్రమేణా ప్రదర్శనలు తగ్గాయి. బొమ్మలు మరుగునపడ్డాయి. జగన్నాథం తాతల కాలంలో జనగామ ప్రాంతానికి చెందిన గట్ల మల్లాల దొర సత్యనారాయణరావుకు ఆ బొమ్మల గురించి తెలిసింది. ఆయనకు ఆ కళ మీద ఆసక్తి ఉండటంతో బొమ్మలను బయటికి తీయించారు. అయితే, అవి బాగా లేకపోవడంతో అవుసలి రామయ్య అనే వడ్రంగిని పిలిపించి, అందమైన బొమ్మలను తయారు చేయించి ఇచ్చారు. దీనికి కృతజ్ఞతగా ఇప్పటికీ వీరు పాట రూపంలో ఆయన్ను కీర్తిస్తూ ఉంటారు. సత్యనారాయణరావు కొత్త బొమ్మలు సమకూర్చినప్పటి నుంచి చెక్కబొమ్మలాట తిరిగి ఊపందుకుంది మూడు నాలుగు దశాబ్దాల కిందటి వరకూ జగన్నాథం బృందం పరిసర జిల్లాల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చింది. నెలల తరబడి గ్రామాల్లో ఉంటూ తమ కళాకౌశలంతో పల్లీయులను అలరించేవారు. క్రమక్రమంగా ఆటకు ఆదరణ తగ్గడంతో బొమ్మలను పెట్టెల్లో దాచేసి, ఇతర పనుల్లోకి మరలిపోయారు. కొంతమంది కూలీ పనులకు వెళ్లగా, మరికొందరు గ్రామాల్లో తిరిగి వంట పాత్రలు అమ్మకం చేశారు. ఇలా 20 ఏళ్లు గడవడంతో అమ్మాపురం వాసులు సైతం వీళ్లు బొమ్మ లాట ఆడతారనే విషయమే మర్చిపోయారు. అయితే.. చిందు యక్షగానాన్ని మాత్రం ఓ సంప్రదాయంగా కొనసాగిస్తూ వచ్చారు. సిద్దిపేట జిల్లా బెక్కల్‌ రామలింగేశ్వర స్వామి జాతరలో ఏటా ప్రదర్శన ఇవ్వడం వీళ్లకో ఆనవాయితీ.
     స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం నష్కల్‌లో 1990లో ఆచార్య జయధీర్‌ తిరుమలరావు ‘దళిత కళారూపాల వారోత్సవాలు’ నిర్వహించారు. ఆ తర్వాత చిన్నపెండ్యాలలో ‘దళిత తాళపత్రాల పరిరక్షణ శిబిరా’న్ని ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన దళిత కళాకారులు కొంతమంది అమ్మాపురంలో చిందు యక్షగాన కళాకారులు ఉన్నారంటూ మోతే కుటుంబీకుల గురించి తిరుమలరావుకు చెప్పారు. ఆయన అదే రోజు అమ్మాపురం వెళ్లి వాళ్లను కలిశారు. మాటల మధ్యలో మోతే కుటుంబీకులు బొమ్మలు ఆడిస్తారనే విషయం బయటపడింది. దాంతో తిరుమలరావు ఆ కళాకారులను చిన్నపెండ్యాలకు తీసుకువచ్చారు. వెంటనే చెక్కబొమ్మలాట ప్రదర్శన ఏర్పాటు చేయించారు. ఈ ప్రదర్శనతో అప్పటికే పూర్తిగా అంతరించి పోయిందనుకుంటున్న కళారూపం వెలుగులోకి వచ్చినట్లయ్యింది. చెక్కబొమ్మలాటను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ కళాకారులతో తిరుమలరావు అనేక ప్రదర్శనలు ఇప్పించారు. తెలంగాణ రిసోర్స్‌ సెంటర్‌ అధ్యక్షులు ఎం.వేదకుమార్‌ కూడా చెక్కబొమ్మలాటను ప్రాచుర్యంలోకి తేవడానికి కృషిచేశారు. సీఫెల్‌తో కలిసి హైదరాబాదులో ప్రదర్శన ఏర్పాటు చేయించారు. ఉమ్మడి రాష్ట్రంలో పది జిల్లాల్లో ఆ కళారూపాన్ని ప్రదర్శింపజేశారు. కార్యశాలలు నిర్వహించారు. అప్పటి తెలుగు విశ్వవిద్యాలయం గిరిజన విజ్ఞాన పీఠాధిపతి భక్తవత్సలరెడ్డి సైతం అమ్మాపురం కళాకారులకు అండగా నిలబడ్డారు.  
బొమ్మలెలా ఉంటాయంటే..
ఈ బొమ్మలను బూరుగు కర్రతో తయారు చేశారు. సులువుగా కదిలేందుకు వీలుగా చేతులను తీర్చిదిద్దారు. మగ పాత్రల బొమ్మలు రెండు అడుగుల వరకు ఉండగా, స్త్రీ పాత్రల బొమ్మలు కొంచెం చిన్నవిగా కనిపిస్తాయి. ప్రదర్శన తీరుతెన్నులను బట్టి వాటిని అలంకరిస్తారు. పాత్రను బట్టి కొన్ని బొమ్మలకు రంగులు వేస్తారు. బరువుగా ఉండే ఈ బొమ్మలను పట్టుకుని ఆడించేందుకు వీలుగా సన్నని తీగలు ఏర్పాటు చేస్తారు. ఆ తీగల సాయంతో బొమ్మలను ఆడిస్తూ కథను చెబుతారు. రాముడు, కృష్ణుడు, లక్ష్మణుడు, సీత, మాయలఫకీరు, హనుమంతుడు, గోపికల బొమ్మలను మోతే కుటుంబీకుల దగ్గర చూడవచ్చు.
      ఇక ప్రదర్శన కోసం వెదురు కర్రలను పాతి, చుట్టూ తెల్లని పరదాలు కడతారు. పరదాకు వెనక, ముందు బల్లలు వేస్తారు. కథను నడిపించే కళకారులు వెనక ఉండి, పాటల రూపంలో కథ చెబుతూ.. దానికి తగిన బొమ్మలను తెర ముందు ఆడిస్తుంటారు. సాధారణంగా ప్రదర్శన రాత్రి పూట ఉంటుంది. ఏడెనిమిది గంటలకు ప్రదర్శన ప్రారంభమైతే అర్ధరాత్రి వరకూ సాగుతుంది. బృందంలోని మిగిలిన వాళ్లు వాద్యాలు వాయిస్తూ ప్రదర్శనను రక్తి కట్టిస్తుంటారు. వీక్షకుల దృష్టంతా కథపైనే ఉండేలా.. కేవలం బొమ్మలు మాత్రమే కనిపించేలా దీపాలు అమర్చుతారు.
మౌఖిక వారసత్వమే!
చెక్కబొమ్మలాట కళాకారులు రామాయణ, భారత కథలను ఎక్కువగా చెబుతారు. ‘కృష్ణలీల, భక్తప్రహ్లాద, ధర్మాంగధ, చెంచులక్ష్మి, గయోపాఖ్యానం, లవకుశ, భక్తరామదాసు, బాలనాగమ్మ, సారంగధర, జయంత జయపాల, పుండరీక, హరిశ్చంద్ర తదితర కథలు వాళ్లకు కంఠోపాఠాలు. ఇవన్నీ మౌఖిక కథలే.
      మోతె జగన్నాథం బృంద సభ్యులు హైదరాబాదు, మచిలీపట్నం, తిరుపతి, విజయవాడ, కర్నూలు తదితర ప్రాంతాల్లో చెక్కబొమ్మలాటను ప్రదర్శించారు. చెన్నై, దిల్లీ, అయోధ్య, గువాహటి(అసోం), షిల్లాంగ్‌(మేఘాలయ)ల్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. 2013లో వరంగల్లులో నిర్వహించిన ప్రపంచ వారసత్వ ఉత్సవాల్లో మోతె రామస్వామి బృందం ఇచ్చిన ప్రదర్శనకు మంచి గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా రామస్వామి చెప్పిన గొల్ల మల్లమ్మ కథ అనేకమందిని ఆకట్టుకుంది. చెక్కబొమ్మలాట ద్వారా కళారంగానికి మోతె ఉప్పలయ్య చేసిన సేవలకు గుర్తింపుగా 2014లో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాన్ని అందజేసింది. దీన్ని పన్నెండేళ్ల ముందు జగన్నాథాన్ని ప్రతిభా పురస్కారంతో గౌరవించింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా 2015లో రాష్ట్ర ప్రభుత్వమూ జగన్నాథాన్ని సన్మానించింది. తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చెక్కబొమ్మలాటను దృశ్యరూపకంగా నమోదుచేశారు. విడిగా వేదకుమార్‌ కూడా ఈ కళారూపాన్ని డాక్యుమెంటరీ చేయించారు.
      చెక్కబొమ్మలాట ప్రదర్శనకు వేదికను సిద్ధం చేయడం కష్టమైన పని. పెద్ద పెద్ద బల్లలు, వెదురు కర్రలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక బరువైన బొమ్మలను పట్టుకుని గంటల కొద్దీ నిల్చుని, తీగల సాయంతో వాటిని ఆడించడం మరింత కష్టం. కళమీద ఎంతో ప్రేమ, తపన ఉంటేనే ఆ పని చేయగలరు. మౌఖిక వారసత్వ సంపదలైన కథలను కాపాడుకోవడం మరో ఎత్తు. అమ్మాపురం కథకులంతా 60, 70 ఏళ్లు దాటిన వారే. జానపద కళలకు ఆదరణ తగ్గిపోవడంతో ఈ కళాకారుల పిల్లలు ఇతర పనుల్లో స్థిరపడిపోయారు. కుటుంబాలన్నీ పేదరికంలో మగ్గుతున్నాయి. ఈ కళాకారులకు ప్రభుత్వం తగిన ఆర్థిక సాయం చేయాలి. భవిష్యత్తు తరాలు ఈ కళను మనస్ఫూర్తిగా నేర్చుకునేందుకు ప్రోత్సాహకర వాతావరణాన్ని కల్పించాలి. చెక్కబొమ్మలాటకు మాత్రమే కాదు, తెలుగునాట మిణుకుమిణుకుమంటున్న జానపద కళలన్నింటికీ కావాల్సింది ఇలాంటి వెన్నుదన్నే!


మా తాతలు తండ్రుల నుంచి వారసత్వంగా కళను నేర్చుకున్నాం. యక్షగానంతో పాటు చెక్కబొమ్మలాట ఆడేవాళ్లం. 50 ఏళ్ల కిందట టిక్కెట్లు పెట్టి మరీ రాత్రంతా ప్రదర్శన ఇచ్చేవాళ్లం. జనం పెద్ద సంఖ్యలో వచ్చి చూసేవారు. క్రమక్రమంగా ఆదరణ తగ్గడంతో ప్రదర్శనలు నిలిపేశాం. ప్రభుత్వాల ప్రోత్సాహమూ లేకపోవడంతో ఏమీ చేయలేకపోయాం. జయధీర్‌ తిరుమలరావు, ఎం.వేదకుమార్‌ మాతో అనేక ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇప్పించారు. కళను పొగొట్టుకోవద్దని మా పిల్లలకు నేర్పేందుకు ప్రయత్నిస్తే, వారు సహకరించట్లేదు. వాళ్లంతా వేర్వేరు పనులు చేసుకుంటూ బతుకుతున్నారు.

- మోతె జగన్నాథం


ఒకే ఒక్కడు
బూరుగుపేటకు చెందిన మోతె యాదగిరి మనుమడు శంకర్‌.. నేటి తరంలో చెక్కబొమ్మలాట కథను చెప్పగల ఏకైక వ్యక్తి. 32 ఏళ్ల ఈయన వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్‌. కుటుంబ వారసత్వమైన కళను కొనసాగించాలనే ఉద్దేశంతో ఆరు కథలను నేర్చుకున్నారు. లవకుశ, బాలనాగమ్మ, చెంచులక్ష్మి- ఆదిలక్ష్మి, సత్యవతి, భక్తరామదాసు, శ్రీరాముడి పట్టాభిషేకం కథలను చెప్పగలరు. తాతలతో కలిసి ఇప్పటికే పలు ప్రదర్శనలూ ఇచ్చారు. తన కుమారుణ్ని సైతం ఈ ప్రదర్శనలకు తీసుకెళ్తూ, కథ చెప్పడం నేర్పుతున్నారు. సొంత ఇల్లు కూడా లేని శంకర్‌.. అప్పులు చేసి మరీ పాతకాలం నాటి బొమ్మలను బాగు చేయించారు. నకాశీ కళాకారులతో వాటికి కొత్త నగిషీలు అద్దించారు.


తోలుబొమ్మలకు తోబుట్టువులు ఈ చెక్కబొమ్మలు. ఈ కళారూపం ఉందని తెలిసినప్పటి నుంచి దాన్ని కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాం. కొండయ్య, జగన్నాథంల దగ్గర తోలుబొమ్మలు కూడా ఉండేవి. కానీ చెక్కబొమ్మలు అరుదైనవి, వాటిని ఆడేవారు అసలే లేరు. అందుకే చెక్కబొమ్మలే ఆడాలని సూచించాం. వారి పిల్లలకు కూడా నేర్పించమని కోరాం. కానీ అమ్మాపురం యువత ఆసక్తి చూపలేదు. బూరుగుపేటలో శంకర్‌ నేర్చుకున్నారు. ఈ కళకు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. ఆయా మండల, జిల్లా కేంద్రాల్లో సంక్రాంతి, దీపావళి, ఉగాది.. ఇలా ప్రతి పండగప్పుడు ప్రదర్శన ఏర్పాటు చేయించాలి. ఆ దిశగా కృషి చేస్తున్నాం. అలాగే, ఈ కళాకారులకు పింఛన్లు అందజేయాలి.    

- ఆచార్య జయధీర్‌ తిరుమలరావు


 


వెనక్కి ...

మీ అభిప్రాయం