తేనె తునకలు పలుకుబడులు

  • 1814 Views
  • 9Likes
  • Like
  • Article Share

    డా।। పి.ఎస్‌.ప్రకాశరావు,

  • తెలుగు ఉపాధ్యాయులు
  • కాకినాడ.
  • 9963743021
డా।। పి.ఎస్‌.ప్రకాశరావు,

భాషకు అందాన్నిచ్చే అంశాల్లో పలుకుబడులకు ప్రముఖస్థానం ఉంది. కానీ భాష వచ్చినంత మాత్రాన ఇవి అర్థం కావు. నిఘంటువుల సాయంతో పలుకుబడుల్లోని పదాల అర్థాలను కనుక్కోగలం కానీ భావాలను మాత్రం తెలుసుకోలేం. పూర్తి అవగాహన కలగాలంటే వాటి పుట్టుపూర్వోత్తరాలు తెలియాలి. చారిత్రక, సామాజిక, పౌరాణిక నేపథ్యం గల ఈ వివరాలు తెలుసుకోవడం ‘నల్లేరు మీద బండినడక’ కాదు. అయినా చూద్దాం..!
నల్లేరు మీద బండినడక 

సునాయాసంగా అని చెప్పే సందర్భాల్లో ఈ పలుకుబడిని వాడుతూ ఉంటారు. నల్లేరు ద్రాక్ష కుటుంబానికి చెందిన మొక్క. దీని కొమ్మలు పచ్చగా నాలుగు కోణాలతో ఉంటాయి. దీనికి నల్లేరుకాడ, వజ్రవల్లి, వనాలిక, హస్తిశుండి అనే పేర్లు కూడా ఉన్నాయి. పూర్వం ఆయుర్వేద వైద్యంలో దీన్ని వాడేవారు. ముఖ్యంగా విరిగిన ఎముకలు అతుక్కోవడానికి వాడటం వల్ల దీన్ని ‘అస్థిసంహారక’ అని కూడా పిలిచేవారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. పూర్వం రహదారులు గోతులతో అధ్వానంగా ఉండేవి. ప్రయాణాలు ఎక్కువగా ఎడ్లబళ్ల మీదే కాబట్టి బండి గోతిలో పడితే అందులో కూర్చున్న వాళ్లకు ఒళ్లు హూనం అయిపోయేది. అందుకని గోతుల్లోంచి బండి సాఫీగా ముందుకు సాగడానికి ఆ గోతుల్లో నల్లేరు తీగలు వేసేవారు. అవి మందంగా ఉండటం వల్ల బండి ఆ తీగలపై నుంచి కుదుపుల్లేకుండా సునాయాసంగా ముందుకెళ్లిపోయేది. అందుకని ఎక్కువ ప్రయాసపడకుండా జరిగిపోయే పనులను ‘నల్లేరు మీద బండి నడక’తో పోల్చడం ఆనవాయితీగా మారింది.
ఊరకరారు మహాత్ములు 
ఎప్పుడో కానీ మన ఇంటికి రానివారు అనుకోకుండా వచ్చినపుడు వారినుద్దేశించి ఇలా అంటారు. ఇది బమ్మెర పోతన పద్యపాదం. మహాభాగవతం దశమ స్కంధంలోనిది. యాదవుల పురోహితుడు గర్గుడు. ఇతడు బలరామకృష్ణులకు నామ సంస్కారం చేయడానికి రేపల్లెలోని నందుని ఇంటికి వెళ్తాడు. అప్పుడు నందుడు ఆయన్ని తగిన రీతిన గౌరవించి ‘‘ఊరక రారు మహాత్ములు/ వా రథముల యిండ్ల కడకు వచ్చుటలెల్లన్‌/ గారణము మంగళములకు/ నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మా’’ అంటాడు. ఈ మొదటి పాదమే జనుల నోళ్లలో నాని పలుకుబడిగా మారింది.
రామాయణంలో పిడకల వేట 
అత్యవసరమైన ముఖ్యమైన విషయాన్ని చర్చించే సందర్భంలో ఎవరైనా అప్రస్తుత అంశాన్ని తీసుకొస్తే ఈ పదబంధాన్ని ఉపయోగిస్తారు. నిజానికి ఇది పిడకల వేట కాదు. పిటకముల వేట. పిటకములు అంటే గౌతమబుద్ధుడు బోధించిన ధర్మసూత్రాలు. అవి మూడు. సుత్తపిటకం, వినయపిటకం, అభిదమ్మపిటకం. పిటకం అంటే చిన్నపెట్టె. జ్ఞానజ్యోతులను ఒక చిన్నపెట్టెలో పెట్టి రాబోయే తరాలకు అందించాలనేది వీటి లక్ష్యం. బౌద్ధమతానికి చెందిన పిటకాలసారం కోసం హిందూమతానికి చెందిన రామాయణంలో వెతికితే ప్రయోజనం ఏముంటుంది? ఆ సందర్భంలోనే ఈ పలుకుబడి పుట్టి ఉంటుందని పండితుల అభిప్రాయం.
రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్టు 
ఎప్పటినుంచో ప్రజల నోళ్లలో నలుగుతున్న పలుకుబడి ఇది. వినాల్సిందంతా విని అమాయకమైన ప్రశ్న వేసేవాళ్ల మీద దీన్ని ప్రయోగిస్తారు. నిజానికి ఎంత అమాయకుడికైనా ఇలాంటి అనుమానం రాదు. దీన్ని కొంచెం మార్చి ‘‘రామాయణాలంతా విని...’’ అంటే అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే లోకంలో ఎక్కువ ప్రచారంలో ఉన్నది వాల్మీకి రామాయణమే. దీనిప్రకారం రాముడికి సీత భార్యే అవుతుంది. కానీ వాల్మీకి రచించడానికి ముందే రామకథలు ప్రచారంలో ఉండేవి. వాటిలో భిన్న కథనాలు కనిపిస్తాయి. బౌద్ధరామాయణంలో సీత రాముడికి చెల్లెలూ, భార్యా కూడా. ఖోటాన్‌ రామాయణంలో ఆమె రామలక్ష్మణుల భార్య. జైన రామాయణంలో అయితే రావణుడి కూతురు. ఇలా ఒక్కో రామాయణంలో ఒక్కోవిధంగా ఉంటే అసలు రాముడికి సీత ఏమవుతుందనే ప్రశ్న తలెత్తకుండా ఎలా ఉంటుంది? ఇలా సుదీర్ఘ చర్చ చేసిన డా।। ఆరుద్ర ‘‘భక్తులు ఉన్నంతకాలం సీతారాములు ఉంటారు. భక్తులు ఏమవుతుందనుకుంటే సీత రాముడికి అదే అవుతుంది’’ అన్నారు ‘రాముడికి సీత ఏమవుతుంది’ అనే పుస్తకంలో.
నక్క తోక తొక్కి రావడం
ఎవరైనా ఒక పనిమీద వెళ్లినపుడు ఆ పని దిగ్విజయంగా పూర్తయితే వాళ్లు అదృష్టవంతులు అనే అర్థంలో ఈ పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇది నక్కతోక కాదు. నక్కకొమ్ము. బ్రౌన్‌ తెలుగు- ఇంగ్లీషు నిఘంటువులో ‘నక్క కొమ్ము తొక్కివచ్చినావు = యు ఆర్‌ ఇన్‌ లక్‌ టుడే’ అని సూచించారు. శ్రీహరి నిఘంటువులో ‘నక్క కొమ్ము తొక్కు = అదృష్టవంతుడగు’ అని ఉంది. ఇంతకీ నక్కకొమ్ములో నక్క అంటే అడవి జంతువూ కాదు, కొమ్ము అంటే శృంగమూ కాదు. నక్కదోస, నక్కనేరేడు, నక్కరేను (గజనిమ్మ) మొదలైన వృక్షజాతి విశేషాల్లోని నక్క వంటిదే ఈ ‘నక్క’ పదం. ఇక కొమ్ము అంటే పసుపు కొమ్ములోని ‘కొమ్ము’ లాంటిది. ‘మనుచరిత్ర’లో వరూధిని కుమారుడైన స్వరోచిని ఒక ఎరుకరాజు వేటకు ఆహ్వానిస్తూ నక్కకొమ్ము, ఇర్రి (లేడి) మొదలైన కానుకలిచ్చినట్టుగా ఉంది. ‘‘ఒక్క యెఱుకుఱేడు నక్కకొమ్మును నిఱ్ఱి/ గోరజంబు జున్ను జారపప్పు/ పీలిగరుల యంపకోలలు సెలవిండ్లు/ కానుకిచ్చి కరయుగంబు మొగిచి’’ అన్నది పెద్దన మాట. సూర్యరాయాంధ్ర నిఘంటువు కూడా నక్కకొమ్ము అంటే ‘ఒక విధమైన వనమూలిక’ అనే అర్థాన్నిచ్చింది.
తాంబూలాలిచ్చేశాం ఇక తన్నుకు చావండి 
గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని గుర్తుకు తెచ్చే మాటలివి. తుది నిర్ణయం జరిగిపోయింది.. ఇంకెవరూ ఆపలేరు అనే అర్థంలో ఈ మాటలు వాడుతూ ఉంటారు. వీటి నేపథ్యం ప్రాచీన ఆంధ్రదేశంలోని గ్రామీణజీవనంలో ఉంది. పూర్వం గ్రామమండలికి ప్రభుత్వం తరఫు అధ్యక్షుడిగా గ్రామాధికారి వ్యవహరించేవాడు. గ్రామంలో తలెత్తే వివాదాలను విచారించి తప్పు చేసినవారికి కఠినశిక్ష విధించేవాడు. భూమికౌలు లాంటి ఒప్పందాలను కుదిర్చేవాడు. ఆ ఒప్పందాలను ఉల్లంఘించే వారిని దండించేవాడు. ఈ బాధ్యతలను నిర్వర్తించినందుకు అతనికి తమలపాకులు, వక్కలతో కలిపి నాణేల రూపంలోనో వస్తురూపంలోనో కొంత ముట్టజెప్పేవారు. దీన్ని సంస్కృతంలో ‘తాంబూలం’ అనీ తెలుగులో ‘అడపగట్టు’ అనీ పిలిచేవారు. అప్పుడు ఆ లావాదేవీకి చట్టబద్ధత ఏర్పడేది. ఈనాడు రిజిస్ట్రేషన్‌ చేయించిన పత్రాలకు ఉన్న విలువ దానికి ఉండేది అన్నారు పి.వి.పరబ్రహ్మశాస్త్రి (‘ప్రాచీనాంధ్ర దేశచరిత్ర- గ్రామీణ జీవనం’ పుస్తకంలో) ఒకసారి గ్రామాధికారికి తాంబూలం చెల్లించేశాక ఏ పక్షంవారూ ఆ లావాదేవీని ఉల్లంఘించలేరు కాబట్టి ఈ పలుకుబడి ఏర్పడింది.
విస్సన్న చెప్పిందే వేదం
ఒక ప్రముఖుడూ, నిష్ణాతుడూ అయిన వ్యక్తి చెప్పిన విషయానికే ప్రామాణికత ఉంటుందని చెప్పే సందర్భంలో వినపడే మాట ఇది. బ్రాహ్మణుల్లో చాలామంది వేదాన్ని బట్టీపట్టి అప్పగించేవాళ్లేగానీ ఆ మంత్రాలకు అర్థం చెప్పలేరు. కానీ పిఠాపురం రాజా వేంకట కుమార మహీపతి గంగాధరరామారావు ఆస్థానంలోని ఇంద్రగంటి విశ్వపతిశాస్త్రి వేదవేదాంగాల్లో మహాప్రామాణికులు. విస్సన్న అంటే ఆయనే. వారి ప్రతిభాపాటవాలను అనుసరించి ఏర్పడిందే ఈ పలుకుబడి. ఈయన తర్వాత బులుసు పాపయ్యశాస్త్రి అంతటి ప్రజ్ఞ గలవారట.
పెరుగును వడ్లును పిసికినట్లు
ఉడికిన అన్నాన్నీ పెరుగునీ కలిపి తింటే రుచి తెలుస్తుంది. అంతేకానీ వడ్లూ పెరుగూ కలిపి తింటే రుచేం తెలుస్తుంది. అవి రెండూ ఒకదానితో ఒకటి కలవవు. తినడానికి అనుకూలంగా కూడా ఉండవు. అవి వ్యర్థమవుతాయి. అలాగే కవిత చెప్పినప్పుడు పదానికీ, అర్థానికీ సామ్యం కుదిరితేనే పాఠకుడికి రసాస్వాదన కలుగుతుంది. కానీ రెంటికీ పొంతన లేని కవిత బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఏర్పడిందే ఈ పలుకుబడి. ఇప్పుడు వాడుకలో కనిపించదు గానీ ఒకప్పుడు విరివిగా వాడుకలో ఉన్న దాఖలాలున్నాయి. పాల్కురికి సోమన పండితారాధ్య చరిత్రలో ‘‘వడ్లును పెరుగు బిసుకు చందపు బిలిబిలి కృతుల్‌ కృతులె’’ అన్నాడు (అవతారికలో). మడికి సింగన ‘సకలనీతి సమ్మతం’ (ప్రాచీన కావ్యాల నుంచి ఏర్చికూర్చిన పద్యాలు)లో ‘‘పెనచి వడ్లును పెరుగును బిగిసినట్లు/ కెలను నవ్వంగ బిలి బిలి కృతులు సెప్పి’’ అన్నాడు. పిల్లలమర్రి పినవీరభద్రుడు కూడా ‘‘సొరిది ననాచారంబుల- మురువ గుచుం ప్రథమ పాదమున కలిమి మహిమన్‌/ పెరుగున వడ్లును కలిపిన/ కరణిని వర్ణాశ్రమములు కత్తింగియున్‌’’ అని చెప్పాడు. కవిత్వంలోనే కాదు వచన ప్రయోగాలూ ఉన్నాయి. రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ తన నాటకోపన్యాసాలులో ‘‘కానీ ఆ రాగముల పేళ్లు ఎన్నోచోట్ల రాగమును భావమును పరస్పర మిత్రములుగా నుండ వీలులేక పెరుగును వడ్లును కలిపినట్లుండుట త‌ట‌స్థించిన‌ది.’’ అన్నారు.
కలికి గాంధారి వేళ
కలికి అంటే అందమైన స్త్రీ. గాంధారి చాలా అందమైనదట. కానీ తనకు ఇష్టం లేకపోయినా ధృతరాష్ట్రుణ్ని చేసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచీ తనను తాను హింసించుకోవడం మొదలుపెట్టింది. కళ్లకు గంతలు కట్టుకుని అంధురాలిలా తయారైంది. పరిచారికలు అందుబాటులో ఉండేవారు కాబట్టి పగటి కృత్యాలన్నీ యథావిధిగా జరిగిపోయేవి. కానీ దాంపత్యజీవితానికి సంబంధించిన కార్యకలాపాల మాటేంటి? అర్ధరాత్రి ఒంటిగంటా రెండూ మధ్య, లోకమంతా గాఢనిద్రలో మునిగి ఉన్నప్పుడు గాంధారి నిద్ర లేచేది. కళ్లకు కట్టుకున్న గంతలు విప్పేసేది. పరిచారికలు ఆమెకు స్నానం చేయించేవారు. స్నానమయ్యాక కొత్తబట్టలు కట్టుకుని భర్తను చేరుకునేది. ఈ సమయమే కలికి గాంధారివేళ. 
      ఇలా రాణివాసంలో ప్రతిరాత్రీ జరిగేది. ఇది అతి రహస్యం. సేవకురాళ్లకు తప్ప రాజకుటుంబికులెవరకీ తెలియదట. నమ్మకస్థులే కాబట్టి విషయం బయటికి పొక్కేదికాదు. ఒకవేళ ఎవరైనా వెల్లడించినట్లు తెలిస్తే వారి జీవితం అక్కడితో ముగిసిపోయేది. కానీ ఆ పరిచారికల కుటుంబాల్లో ఒక తరం నుంచి మరో తరానికి ఈ రహస్యం అంచెలంచెలుగా చేరుతూ వచ్చింది. ఆ కుటుంబాలకే చెందిన ఓ పాలేరు ‘‘దీన్ని నాకు మా ముత్తవ్వ చెప్పింది’’ అని గుడిపూడి సుబ్బారావు (‘మునగాల పరగణా కథలు- గాథలు’ రచయిత)తో అన్నాడట. ఇది వాస్తవమా కాదా! అనే దాన్ని పక్కనబెట్టి మనకో మంచి పలుకు బడి దొరికినందుకు సంతోషిద్దాం. దీవి సుబ్బారావు (తెలుగు అకాడమీ విశ్రాంత సంచాలకులు) దీన్ని గ్రంథస్థం చేశారు.


సర్వం జగన్నాథం
కులమత పట్టింపులు లేకుండా ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఈ పలుకుబడిని ఉపయోగిస్తుంటారు. జగన్నాథం అంటే జగత్తు అంతటికీ నాథుడైన శ్రీకృష్ణుడి ఆలయం. ఇది పూరీలో ఉంది. శ్రీకృష్ణుడు నిర్యాణం పొందిన తర్వాత కాష్టం మీద దేహం కాలేటప్పుడు సముద్రం పొంగిందట. అసంపూర్తిగా కాలిన దేహభాగాన్ని మునులు ఒక కొయ్యలో ప్రతిష్ఠించారట. పూరీలో ఈ విగ్రహరూపాన్నే ఆరాధిస్తారు. ఈ ఆలయంలో నిత్యమూ ఏడుసార్లు నైవేద్యం జరుగుతుంది. ఈ నైవేద్యంలో అన్నం, పప్పు, కూరలు, చారు, పులుసు, పరమాన్నం, వడలు, అరిసెలు మొదలైనవన్నీ ఉంటాయి. ఈ ప్రసాదాలు నైవేద్యాలు అయ్యేవరకూ నియమం గల పండాల (జగన్నాథుడి ఆలయంలోని పూజారులు) ఆధీనంలో ఉంటాయి. ఆ తర్వాత వాటిని వర్ణభేదం లేకుండా ఎవరికైనా స్వాధీనం చేయవచ్చు. ఏనుగుల వీరాస్వామయ్య తన ‘కాశీయాత్ర చరిత్ర’లో ఈ సంగతి తెలియజేశారు. దీన్నిబట్టే ఈ పలుకుబడి వాడుకలోకి వచ్చింది.


నూట పదహార్లు
పెళ్లిళ్లలోనూ సన్మానాల్లోనూ, కవులకూ రచయితలకూ పారితోషికాలిచ్చేటప్పుడు ఈ మాట వింటూ ఉంటాం. పూర్వం ఈ మొత్తం ఎక్కువ అనుకున్నవాళ్లు అర్ధనూటపదహార్లు ఇచ్చేవారు. తక్కువ అనుకునేవారు ఇంకొక వెయ్యి కలిపి ‘వెయ్యినూట పదహార్లు’ ఇచ్చేవారు. ఈ నూట పదహార్లు చరిత్ర పూర్తిగా తెలియడం లేదు. పూర్వం సంస్థానాల్లోని పండితులకు ఇచ్చే సంభావనలను బట్టి ఈ మాట వ్యవహారంలోకి వచ్చి ఉండవచ్చని ఒక ఊహ. 
      హైదరాబాదు రాజ్యంలో చెలామణీలో ఉండే రూపాయలను సిక్కా లేదా హాలీ రూపాయలనేవారు. వీటిని ఇతర ప్రాంతాల్లో మార్చుకోవాలంటే కొంత ఖర్చయ్యేది. అంటే వంద సిక్కాలను బ్రిటీషు ఇండియాలో మార్చుకోవాలంటే పదహారు రూపాయలు ఖర్చయ్యేది. అందుకని నిజాం ప్రభువులు ఇతర ప్రాంతాల కవిపండితులకు వంద రూపాయల సంభావన ఇవ్వాలనుకున్న ప్పుడు, మారకం ఖర్చుతో కలిపి నూటపదహారు రూపాయలిచ్చేవారట. అందువల్ల అప్పటినుంచే ఈ నూటపదహారు మర్యాద ఏర్పడిందని ఓ పండితుని ఉవాచ. కానీ ఇది సరికాదనీ విజయనగర సంస్థానం కాలంనుంచే ఇది ఉందనీ మరో పండితుడు సోదాహరణంగా వివరించారు. భట్టుమూర్తి ‘‘లొట్ట యిదేటిమాట..’’ అనే పద్యంలో ఈ ప్రయోగం చేశాడట. ఈ ఉట్టంకింపు గురజాడ శ్రీరామమూర్తి ‘కవిజీవితములు’ లోనిది. కాబట్టి ఈ ప్రయోగం వందల ఏళ్లనాటిదే అన్నారీయన. ఇదంతా విశ్లేషించి డా।। తిరుమల రామచంద్ర ‘‘మొహంజదారో తవ్వకాలలో దొరికిన ప్రాచీనజాతి వారి గృహోపకరణాలలో దువ్వెన కూడా ఒకటి. దానికి పండ్లు నూటపదహారు ఉన్నాయని ఇండియన్‌ యాంటిక్వెయిరీ (1913)లో ఎవరో పండితులు రాశారు. ఛాందోగ్యోపనిషత్తులో నూటపదహారు సంవత్సరాల ఆయుష్షు కోసం పలుపాట్లు పడినట్లు కొన్ని మంత్రాలున్నాయి’’ అన్నారు. దీని గురించి సమగ్ర పరిశోధన జరగాల్సి ఉంది.

 


వెనక్కి ...

మీ అభిప్రాయం