అన్నం వండుకుంటాం... కూరలు బయట తెచ్చుకుంటాం రా!
మాంసమా... నాకు వండటం రాదు బాబూ! కావాలంటే మీరు బయట తినండి.
కూర చేయడం మనవల్ల కాదంటూ కర్రీపాయింట్లను పోషించే బ్రహ్మచారుల నుంచి కాపురానికి వచ్చిన కొత్త పెళ్లికూతుళ్ల వరకూ చాలామంది తరచూ చెప్పే మాటలివి. మరీ చేసుకోవాలనిపిస్తే కుర్రాళ్లు బంగాళదుంప వేపుడు, కోడిగుడ్డు పొరటులకు పరిమితమవుతారు. చేసేది లేక భర్తగారేమో టమాటా పప్పుతో సరిపెట్టుకుంటారు. ఎన్ని రోజులని తిన్నవే తింటారు? నాలుక చప్పబడిపోదూ!
అయితే మాత్రం... ఉరుకుల పరుగుల బతుకుల్లో వంట నేర్చుకునే సమయమెక్కడిది? ఎప్పుడైనా తీరిక దొరికినా ఊళ్లో ఉన్న అమ్మకో, అత్తకో ఫోను చేస్తే తప్ప గరిటె కదలదు. ఎందుకొచ్చిన తిప్పలు చెప్పండి! మనకొచ్చిందేదో చేసుకున్నామా... తిన్నామా... అంతే! మరీ కావాలంటే ఎలాగూ హోటళ్లు ఉన్నాయి కదా... ఇలా అనుకునే వాళ్లందరికీ ఓ మాట. ఎవర్నీ అడగకుండానే మీ అంతట మీరుగా అచ్చతెలుగు రుచులన్నింటినీ ఆస్వాదించవచ్చు. మీ ఇంట్లో కంప్యూటరో, కనీసం మీ ఫోన్లో అంతర్జాల సౌకర్యమో ఉంటే చాలు... పావుగంటలో పాకశాస్త్ర ప్రవీణులైపోవచ్చు. తెలుగింటి వంటల తయారీ పద్ధతులను చక్కటి తెలుగులో వివరించే వెబ్సైట్లు, బ్లాగుల్లోకి ఒకసారి వెళ్లండి... ఎన్నెన్ని వంటకాలను ఎంతెంత సులువుగా చేసుకోవచ్చో మీకే తెలుస్తుంది. రోజూ ఏదో ఒక కొత్త రుచిని కోరుకునే పిల్లల ముచ్చట తీర్చాలనుకునే అమ్మలకూ ఇవి ఉపయోగపడతాయి. సరికొత్త రుచులతో ప్రయోగాలు చేయాలనే ఔత్సాహికులూ వీటిని అనుసరించవచ్చు.
సాధారణంగా అందరికీ తెలిసినవే కాదు కొత్త కొత్త వంటకాలూ ఈ వెబ్సైట్లు, బ్లాగుల్లో తళుక్కుమంటాయి. ఆహార పదార్థాల తయారీ విధానాన్ని వివరించడంలో తమదైన సొంత శైలి, అభిరుచి, వైవిధ్యం చూపిస్తున్నారు వాటి నిర్వాహకులు. ఆకట్టుకునే చిత్రాలు, వీడియోలనూ జోడిస్తున్నారు. నలభీమపాకాలను నెట్టింట్లోకి తెచ్చి తేట తెలుగులో వడ్డిస్తున్న వారందరికీ అభినందనలు చెబుతూ కొత్త రుచులను ఆస్వాదించేద్దాం.
లక్షల మందికి ఇష్టమైన వంటిల్లు gayatrivantillu.com
ముంబైలో ఉంటున్న సోమయాజుల గాయత్రీదేవి శర్మ నడుపుతున్న శాకాహార వంటల వెబ్సైట్ ‘గాయత్రి వంటిల్లు’. ఇందులో మూడు వందలకిపైగా వంటకాల వివరాలున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త వంటకాలూ వచ్చి చేరుతుంటాయి. ఈ వెబ్‌సైట్‌ను గూగుల్ ప్లస్ ద్వారా 17 లక్షల మంది అనుసరిస్తున్నారు. పది కోట్లకిపైగా వీక్షణలూ ఉన్నాయి. తక్కువ ఖర్చుతో, మామూలు సదుపాయాలున్న వంటగదిలో చేసుకోగల వంటలను (అదీ పోషక విలువలున్నవి) అందరికీ పరిచయం చేయడమే తన ఉద్దేశమని చెబుతారు గాయత్రి. మనింట్లో మనిషిలానో, స్నేహితురాలిలానో అవసరమైన చిన్నచిన్న జాగ్రత్తలతో సహా వంట చేసే పద్ధతిని విపులంగా, సులువుగా వివరించడం ఆమె ప్రత్యేకత. కొత్తగా నేర్చుకునే వారికి మరింత ఉపయోగకరంగా ఉండేందుకు వంటల వీడియోలనూ అందుబాటులో ఉంచుతున్నారు. వివిధ రాష్ట్రాల సంప్రదాయ వంటలనూ పరిచయం చేస్తుంటారు. ఆహారం, ఆరోగ్యం, ఆనందకరమైన జీవన విధానం గురించి పాఠకులతో గాయత్రి పంచుకునే విషయాలు ఈ వెబ్‌సైట్‌కు మరో ఆకర్షణ. అలాగే, మొబైల్ ఆప్ రూపంలో కూడా వంటల వివరాలను అందుబాటులో ఉంచుతున్నారు గాయత్రి. ‘ఇండియన్ తెలుగు రెసిప్డ్ గాయత్రి వంటిల్లు’ పేరిట ఉండే ఈ ఆండ్రాయిడ్ ఆప్‌ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
విలువైన వంటగది maavantagadi.com
అరటి అరిసెలు, మామిడి బొబ్బట్లు, రవ్వ బూరెలు, సగ్గుబియ్యం శనగ వడల నుంచి చింతచిగురు పప్పు, పుట్టగొడుగులు - గోంగూర కూర, ముల్లంగి కొబ్బరి కూర, మసాలా పీతల వేపుడు వరకూ నోరూరించే వంటకాలెన్నో కనపడతాయి ‘మా వంటగది’లో. పశ్చిమగోదావరి జిల్లా కన్నాపురానికి చెందిన మువ్వల రత్నకుమారి నడుపుతున్న ఈ వెబ్సైట్లో వివిధ రకాల శాకాహార, మాంసాహార పదార్థాల తయారీ విధానంతోపాటు ఊరగాయలు, వడియాలు, సూప్స్, సలాడ్స్, ఐస్‌క్రీమ్స్, బేకరీ ఐటమ్స్లాంటి వైవిధ్యమైన వంటలు ఎలా చేయాలో కూడా తెలుగులో వివరించారు. తెలుగింటి వంటల గురించి వివరిస్తూ వెబ్సైట్ ఎందుకు పెట్టాలనిపించిందని రత్నకుమారిని అడిగితే... ‘పెళ్లయిన తర్వాత మా అమ్మాయి వేరే రాష్ట్రం వెళ్లిపోయింది. రోజూ ఫోన్లు చేస్తూ ఆ కూర ఎలా వండాలి? రుచిగా రావాలంటే ఏం చేయాలని అడిగేది. మా అమ్మాయి స్నేహితులు కూడా ఫోన్లు చేసి వంటపై సందేహాలు తీర్చుకునే వారు. ఇదంతా చూస్తున్న మా అబ్బాయి అంతర్జాలంలో రాయవచ్చు కదా అని సలహా ఇచ్చాడు. ఈ విషయం మావారికి చెప్పగానే ల్యాప్‌టాప్ కొనిచ్చి ప్రోత్సహించార’ని చెబుతారు. మరోమాట... ఆరోగ్య, వంటింటి చిట్కాలకూ ‘మా వంటగది’లో చోటుంది.
ఈనాడు ‘రుచులు’ http://www.eenadu.net/ Specialpages/ruchulu/Ruchuli.aspx
శాకాహారం, మంసాహారం, అల్పాహారం, పిండివంటలు, పచ్చళ్లు, పళ్ల రసాలు, స్వీట్లు, సూపులు, సలాడ్లు, బేకరీ పదార్థాలు... ఇలా పది విభాగాల్లో వందల వంటకాలకు వేదిక ‘ఈనాడు’ దినపత్రిక వెబ్‌సైట్‌లోని ‘రుచులు’. ముల్లంగి రోటి, పనీర్ అచరి, చంద్రవంకలు తదితర ప్రత్యేక పదార్థాలూ కనిపిస్తాయి. వసుంధర, ఆదివారం అనుబంధాల్లో ప్రచురితమయ్యే వంటల వివరాలు ఎప్పటికప్పుడు వీటికి జతకూడతాయి.
షడ్రుచుల విందు shadruchulu.com
చికెన్‌తో మామూలుగా కూర, వేపుడు, బిర్యానీ చేసుకుంటాం. కానీ, చికెన్ శనగపప్పు కలిపి కూర చేస్తే చాలా బాగా ఉంటుంది. దీన్ని తెలంగాణలో ఎక్కువగా చేసుకుంటారు. దీంతోపాటు పచ్చిపులుసు కూడా ఉంటే ఓహో... ఇలా మంసాహార వంటలతో పాటు, గుత్తి వంకాయ కూర లాంటి నోరూరించే శాకాహార వంటల తయారీ వరకూ అన్నింటి వివరాలనూ అందించడంలో సిద్ధహస్తులు జ్యోతి వలబోజు. తెలుగు, ఆంగ్ల భాషల్లో ఆమె నిర్వహిస్తున్న వెబ్సైట్ ‘షడ్రుచులు’. పేరుకి తగ్గట్టుగానే అన్ని రకాల రుచులూ ఉంటాయిక్కడ. పండగ పూట ప్రత్యేక ప్రసాదాల తయారీ విధానం దగ్గర్నుంచీ మొఘలాయి వంటలు, నూడుల్స్, పాస్తాలు, పది రకాల పులిహోరలు, ఓట్స్, సోయా వంటి వాటితో ఆరోగ్యకరమైన పదార్థాలను తయారు చేయడం వరకూ అన్నింటినీ వివరించారు. ‘మామిడి పానకం’ వంటి తీపి పదార్థాల ముచ్చట్లు అదనం. కొన్నేళ్ల కిందటి మాట... అంతర్జాలంలో తెలుగు రాయడం చాలా సులువన్న సంగతి తెలుసుకున్న జ్యోతి ‘షడ్రుచులు’ పేరిట బ్లాగు ప్రారంభించారు. అది ప్రాచుర్యంలోకి వచ్చాక వెబ్‌సైట్‌గా మార్చారు. ‘సరదాకు మొదలుపెట్టినా... ఆదాయం అంటూ లేకపోయినా... ఈ వెబ్సైట్ నాకొక గుర్తింపుగా మారింద’నే జ్యోతి, వివిధ పత్రికల్లో వంటల శీర్షికలను నిర్వహిస్తున్నారు.
సంప్రదాయ వారధి ruchi-thetemptation.blogspot.com
అరటి దూట పెరుగు పచ్చడి, బీరకాయ అట్టు, పాఠోళీ, కందబచ్చలి కూర, కందట్టు, కాకరకాయ ఒరుగులు, అరటిపువ్వు వడలు, ఉప్పుడు పిండి, దిబ్బరొట్టె, పనసపొట్టు ఆవకాయ, పనసగింజల కూర... ఈ తెలుగు వంటకాల పేర్లు ఈ తరంలో చాలామందికి తెలియవు. ఇలాంటి సంప్రదాయ రుచులతోపాటు పోషక విలువలున్న మరిన్ని ఆధునిక శాకాహార వంటలని కూడా సవివరంగా అందిస్తున్నారు ‘రుచి’ బ్లాగులో తృష్ణ. హైదరాబాదుకు చెందిన ఆమె ఎంఏ ఆంగ్లం, హిందీల్లో స్నాతకోత్తర పట్టాలనందుకున్నా అచ్చతెలుగులో వంటల ముచ్చట్లు రాస్తుండటం విశేషం. వంటింట్లో రకరకాల ప్రయోగాలు చేయడం తృష్ణకు ఇష్టమైన పని. ఆ ఆసక్తే 2010లో ఆమెతో బ్లాగును ప్రారంభింపజేసింది. ‘మీ బ్లాగు వల్ల నేను సులువుగా వంట చేయగలుగుతున్నాను. చాలా నేర్చుకున్నాను. కృతజ్ఞతల’ంటూ వీక్షకుల దగ్గర నుంచి వచ్చే సందేశాలు తనకు చాలా తృప్తినిస్తాయనే తృష్ణ... ‘నా వంటలకు ప్రేరణ మా మామ్మ’ అని అంటారు. చిన్నప్పుడు ఆవిడ దగ్గర కూర్చుని ఏ కూర ఎలా చేస్తారని అడిగి అన్నీ రాసుకునే వారట.
అదిరిపోయే సీమ వంట seemavanta.blogspot.com
కర్ణాటకకు దగ్గరగా ఉత్తర రాయలసీమ ప్రాంతంలో పుట్టి పెరిగిన లక్ష్మీదేవి నిర్వహిస్తున్న బ్లాగు ఇది. ఉగ్గాణి, బియ్యప్పిండి తపిలెంటు, మామిడికాయ సికర్ణి, బిసి ఉప్పినకాయ, మటిక్కాయ కూర, సండిగి గొజ్జు, నూల ఉంటలు, కొబ్బెర చిన్ని లాంటి సీమ వంటలని పరిచయం చేస్తున్నారు. ‘ప్రతి మాధ్యమంలోనూ ఉత్తరాది, విదేశీ వంటకాల గురించి ప్రచారం ఎక్కువగా జరుగుతుంటుంది. మన ప్రాంతాలకు సంబంధించిన వంటలు అప్పుడప్పుడూ కనిపించినా... మా ఇంట్లోనూ, బంధుమిత్రుల ఇళ్లలోనూ తయారయ్యే వంటల గురించి మిగిలిన వారికి తెలియదనిపించింది. వాటిని వివరించడానికే బ్లాగు పెట్టాన’ని చెప్పే లక్ష్మీదేవి... తెలుగులో రాయడం వల్ల గూగుల్ లాంటి శోధన యంత్రాల్లో తెలుగులో సమాచారం వెతికే వారిని త్వరగా చేరుకోవచ్చంటారు.
నిజంగా పాకవేదమే paakavedam.blogspot.com
పాకశాస్త్రాన్ని వేదమంత పవిత్రంగా భావించే కౌటిల్య రాస్తున్న బ్లాగు ఇది. చింతకాయ పచ్చడి, బీరకాయ బండపచ్చడి, పులిహోర గోంగూర కుండ పచ్చడి, పెసరకట్టు, ఆవమజ్జిగ, తేనెతొనలు, పేలపిండి లాంటి తెలుగింటి వంటలని వివరించిన విధానం ఆకట్టుకుంటుంది. వంట ఆరంభం నుంచీ చివరిదాకా తీసుకోవలసిన జాగ్రత్తలను పక్కనే ఉండి చెబుతున్నట్లుగా ఉంటుంది. సందర్భానుసారంగా ఆయా వంటల పుట్టుపూర్వోత్తరాలు, సాహిత్యంలో వాటి ప్రస్తావన వంటి అంశాలతో ఉండే వ్యాఖ్యానం పాఠకులకి బహు రుచికరం. గుంటూరుకు చెందిన ఈ యువ వైద్యుడు వంటల బ్లాగును ఎందుకు నిర్వహిస్తున్నారంటే... ‘నేను చదువుకునే రోజుల్లో బయట సరైన భోజనం దొరక్క ఇబ్బంది పడేవాణ్ని. అందుకే అమ్మ, పెద్దమ్మలను అడిగి వంట నేర్చుకున్నా. రుచిగా వంట చేసుకోవడానికి ఉండే కిటుకులను అంతర్జాలంలో వివరిస్తే దేశవిదేశాల్లో ఉండే బ్రహ్మచారులకు, మహిళలకు ఉపయోగంగా ఉంటుందనిపించింద’ని చెబుతారు. కౌటిల్య వంటల ముచ్చట్లను చదివి తన చేతి వంటను రుచి చూడాలన్న ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచో బ్లాగర్లు ఆయన ఇంటికి వస్తుంటారు. ‘నేను ఫలానా తెలుగు బ్లాగరు భర్తని. మా పెళ్లయిన ఇన్నేళ్లకు ఇవాళ మా ఆవిడ అద్భుతమైన భోజనం పెట్టింది. ఇదంతా మీ బ్లాగు పుణ్యమే’నంటూ ఆయనకు వచ్చే ఫోన్లూ కోకొల్లలు.
ఆహారం... ఆరోగ్యం drgvpurnachand.blogspot.com
ఆయుర్వేద వైద్యులైన డా।। జి.వి.పూర్ణచందు సాహిత్యాభిలాషి, బహు గ్రంథ రచయిత. ‘తరతరాల తెలుగు రుచులు’ పేరిట ఆయనో పరిశోధన గ్రంథం కూడా వెలువరించారు. పరిశోధనలో తెలుసుకున్న విషయాలను సరళీకరించి తన బ్లాగులో అందుబాటులో ఉంచుతున్నారు పూర్ణచందు. ఎటువంటి ఆహార పదార్థాలకి ఎలాంటి గుణాలు ఉంటాయి, వేటిని ఎలా వండుకోవాలన్న అంశాలపై వ్యాసాలను ప్రచురించే ఈ బ్లాగు ఆసక్తికరం. ఉపయోగకరం.
బ్రహ్మచారుల కోసమే nalabhima.blogspot.com
అమెరికాలో ఉంటున్న భాస్కర్ రామరాజు ఈ బ్లాగు రచయిత. ‘ఇవ్వాల్టి బ్రహ్మచారి రేపటి సంసారి కాబట్టి సులభ పద్ధతిలో వంట ఎలా చేసుకోవాలో బ్రహ్మచారులకే కాదు, పెళ్లయిన వారికీ తెలియజేయడం కోసమే ఈ బ్లాగు అంకింత’మంటారు ఆయన. అందరిలా మామూలు మాటల్లో కాకుండా చాలా సరదా వ్యాఖ్యానంతో విలక్షణంగా సాగే ఈ బ్లాగుకు బ్రహ్మచారులతోపాటు వంటలో చేయి తిరిగిన అతివలూ అభిమానులే!
అభిరుచి lathasrecipes.blogspot.com
నూట యాభైకి పైగా వంటకాల వివరాలు ఉన్నాయి. అన్నింటినీ అత్యంత సులువుగా చేసుకునే పద్ధతిని వివరించారు బ్లాగర్ లత. మధ్యాహ్న భోజన బాక్సులను పొద్దున్నే సర్దుకుని వెళ్లేవారికి ఉపయోగపడే రుచికరమైన అన్నం రకాలు ముప్ఫైదాకా పరిచయం చేశారు. తక్కువ సమయంలో చేసుకోగలిగే మైక్రోవేవ్ వంటకాలనూ వివరించారు.
‘విందు పసందు’ (www.vindu-pasandu.blogspot.com), ‘వంటల వాకిలి’ (www.ruchulalokam. blogspot.com), ‘ఆంధ్రుల వంటలు’ (www.andhrula-vantalu.blogspot.com), ‘నానీస్కిచెన్’ (www.nani-kitchen.blogspot.com), ‘అత్తమ్మాస్హట్’ (www.attammahut.blogspot.com) లాంటి బ్లాగులు కూడా అంతర్జాలంలో తెలుగు వంటకాల ఘుమఘుమలను వ్యాపింపజేస్తున్నాయి.
తెలుగు నా అమ్మభాష
తెలుగు, హిందీ, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలను. ఒడియా, మరాఠీలను అర్థం చేసుకోగలను. కానీ, నా వెబ్‌సైట్‌లోని వీడియోల్లో తెలుగులో మాత్రమే వంట తయారీ విధానాలను వివరిస్తా. కారణం... తెలుగంటే నాకిష్టం. అది నా అమ్మభాష. ఇంట్లో పిల్లలతో తెలుగులోనే మాట్లాడతా. అందుకే ఏళ్ల పాటు ముంబైలో ఉన్నా మా పిల్లలకు చక్కటి తెలుగు అబ్బింది. ప్రతి ఒక్కరూ వారి మాతృభాషను ప్రేమించాలి.
- గాయత్రి
మన వంటల గురించి చెప్పాలని...
చాలా వంటల బ్లాగులు, వెబ్సైట్లలో స్వీట్లు, ఉత్తరాది, కాంటినెంటల్ వంటకాలే కనపడతాయి. అలాగే పుస్తకాల్లో కూడా పంజాబీ, తమిళ్, గుజరాతీ, రాజస్థానీ వంటల వివరాలే ఎక్కువ ఉంటాయి. మన తెలుగు వంటల పుస్తకాలు జాతీయ స్థాయిలో చాలా తక్కువగా కనపడుతూ ఉంటాయి. అందుకే, నా బ్లాగులో ప్రత్యేకంగా తెలుగు వంటల గురించే ఎక్కువగా రాయాలనుకున్నా. ఇవాళ ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో సగానికి పైగా వాటికి మనం తినే ఆహారమే కారణం. అందుకే మంచి ఆరోగ్యానికి సహకరించే వంటకాల తయారీని వివరించాలన్నది నా కోరిక.
- తృష్ణ
అమ్మకు దూరంగా ఉన్నా...
మనవైన వంటకాల ముచ్చట్లను అచ్చతెలుగులో చూస్తే అందరికీ సంతోషమే. తెలుగు అనగానే మనది అన్న అభిప్రాయం, నమ్మకం, సంతోషం కలుగుతాయి. అందుకే మన అమ్మభాషలో బ్లాగులు, వెబ్సైట్లు మంచి ప్రాచుర్యం పొందుతున్నాయి. దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారు అప్పటికప్పుడు తమకు నచ్చిన, తమ ప్రాంతపు వంటకాలను అంతర్జాలం ద్వారా తెలుగులోనే వెతికి పట్టుకుని, వాటిని నేర్చుకుని తయారు చేసుకోగలుగుతున్నారు. వీటివల్ల అమ్మకు దూరంగా విదేశాల్లో ఉన్నామన్న దిగులు వారిలో తగ్గుతోంది. ఫోన్ బిల్లు కూడా తగ్గుతుంది.
- జ్యోతి వలబోజు
యూట్యూబ్‌లోనూ...
వెబ్సైట్ చూసేవాళ్లలో చాలామంది సాంప్రదాయ తెలుగు వంటలు చేసే విధానంపై సలహాలు అడుగుతారు. అన్ని రకాల తెలుగు వంటల తయారీ విధానాలు తెలుగులో వివరిస్తూ వీడియోల రూపంలో యూట్యూబ్‌లో పెడుతున్నా. ఇప్పటి వరకూ రెండొందలకు పైగా వీడియోలను అక్కడ అందుబాటులో ఉంచా. వెబ్సైట్ పెడతానని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది ‘మా వంటగది’ని లక్ష మందికిపైగా చూశారు అని తెలిసిన రోజు చాలా ఆనందమేసింది.
- రత్నకుమారి
ఆరోగ్యప్రదాయిని
సంప్రదాయ తెలుగు భోజనం... సమతౌల్య ఆహారం. ప్రొటీన్లూ, కొవ్వులూ, పిండిపదార్థాలూ, విటమిన్లూ సమపాళ్లలో ఉంటాయి. మనసులోని భావాన్ని చక్కగా మాటల్లో పొందుపరచగలిగే భాష తెలుగు. అందుకే బ్లాగును తెలుగులోనే నిర్వహిస్తున్నా. దీన్ని వల్ల వంటల్లో వాడే పదార్థాలు, కొలతలు, చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలను విపులంగా, అందరికీ అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నా. తెలుగులో రాస్తే మన భాష, సంప్రదాయాలు నిలబడతాయి.
- కౌటిల్య