తాతల కథలు మనవళ్ల దరువులు

  • 1552 Views
  • 2Likes
  • Like
  • Article Share

    మధుసూదన్‌రెడ్డి శానాల

  • వరంగల్‌
  • 7032642552
మధుసూదన్‌రెడ్డి శానాల

గుండెలోపలి భావోద్వేగాలను తట్టి లేపి, చరిత్రను కళ్లముందు సాక్షాత్కరింపజేస్తుంది ఒగ్గు కథ. తెలంగాణ సాంస్కృతిక విరిమాలలో తంగేడుపువ్వు లాంటి ఈ కళారూపం వందల ఏళ్ల నాటిది. అయినాసరే, కాలానుగుణమైన మార్పుచేర్పులతో సరికొత్త జవసత్వాలను సంతరించుకుంటూ, వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. అనుభవజ్ఞులైన కళాకారుల చొరవకు ప్రభుత్వ ప్రోత్సాహం తోడవడంతో ఒగ్గుడోలు మీద తమదైన దరువు వేయడానికి యువతరమూ వరస కడుతోంది.
జానపద కళలు జాతి జీవనాడులు. సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ఆలవాలాలు. తెలుగునాట ఇలాంటి కళారూపాలు కోకొల్లలు. కానీ, కాలక్రమంలో వాటిలో చాలావరకు తమ ఉనికిని కోల్పోతున్నాయి. ముఖ్యంగా పోషిత- ఆశ్రిత కులాల వారసత్వ దీప్తులైన పటం కథల్లాంటివైతే వేగంగా అంతర్థానమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒగ్గు కథ- డోళ్ల విన్యాసాలు మాత్రం ఠీవీగా నిలబడుతున్నాయి. వర్తమానంలోనే కాదు భవిష్యత్తులోనూ మరింతగా వెలుగులీనేలా యువ కళాకారులను తీర్చిదిద్దుకుంటున్నాయి. 
      శివుడి డమరుకాన్ని పోలిన జగ్గు లేదా ఒగ్గు వాద్యాన్ని వాయిస్తూ చెప్పేదే ‘ఒగ్గు కథ’. యాదవ కులానికి ఉప కులస్థులైన ఒగ్గువాళ్లు దీన్ని చెబుతారు. మిగిలిన కళారూపాల మాదిరిగానే ఒకప్పుడు ఈ ఒగ్గుకథను నేర్చుకోవడానికి యువతరం ఆసక్తి చూపేది కాదు. అయితే చుక్క సత్తయ్య, మిద్దె రాములు ఈ కళ ద్వారా జాతీయస్థాయిలో జయకేతనం ఎగరవేసి, భావితరానికి స్ఫూర్తిబాటలు పరిచారు. ఒగ్గుకథను జనాకర్షం చేయడానికి చుక్క సత్తయ్య పలు మార్పులు చేశారు. పాటల రూపంలో చెప్పే కథల్లో ఆయన మాటలు ప్రవేశపెట్టారు. హావభావాల ద్వారా భాష రాని వారికి సైతం కథ అర్థమయ్యేలా చెప్పడం ప్రారంభించారు. గుక్క తిప్పుకోకుండా పలికే గొలుసుకట్టు మాటలు వాడుతూ ఒగ్గుకథను జనరంజకం చేశారు. క్రమంగా భక్తి, సామాజిక చైతన్య, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒగ్గు కళాకారుల ప్రాధాన్యం పెరగడంతో కొత్తవారికి శిక్షణ ఇవ్వాల్సిన ఆవశ్యకతను చుక్క సత్తయ్య గుర్తించారు.
కొత్త కెరటాలు... 694!
తెలుగు విశ్వవిద్యాలయంలో చుక్క సత్తయ్య ఒగ్గు కథ పాఠాలు చెబుతూనే, గ్రామస్థాయిలో కళాకారులను తీర్చిదిద్దాలని భావించారు. ‘పరీక్ష’ల పరిధి దాటి క్షేత్రస్థాయిలో యువ ప్రతిభకు సానబెట్టేందుకు అధికారులను ఒప్పించారు. 2011లో తన స్వగ్రామం వరంగల్లు జిల్లా (ప్రస్తుతం జనగామ) లింగాలఘనపురం మాణిక్యపురంలో తొలి శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఓరుగల్లులోని తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరం ద్వారా 45 మందిని ఒగ్గు కళాకారులుగా తీర్చిదిద్దారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014లో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జనగామలో రెండో శిబిరం నిర్వహించారు. ఇందులో జనగామ, వడ్డిచెర్ల, కొత్తపల్లి, సిరిపురం గ్రామాలకు చెందిన 60 మంది ఔత్సాహికులు శిక్షణ పొందారు. చుక్క సత్తయ్య వయోవృద్ధులు కావడంతో ఆ తర్వాత ఆయన మనవడు రవికుమార్‌ ఈ శిబిరాల నిర్వహణ బాధ్యతను స్వీకరించారు. చిన్నరాంచర్ల, బచ్చన్నపేట, లద్నూర్‌, నారాయణపురం, తమ్మడపల్లి తదితర ప్రాంతాలకు చెందిన యువతను ఒగ్గుకథ వైపు నడిపించారు.
      కళను నవతరానికి చేరువ చేయడానికి తాము చేస్తున్న కార్యక్రమాల విశేషాలను రవి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. స్ఫూర్తిదాయకమైన ఈ కృషిలో తామూ భాగస్వాములవుతామంటూ సంబంధిత అధికారులు ముందుకు వచ్చారు. అలా ఆ శాఖ ఆధ్వర్యంలో 2016లో బచ్చన్నపేట మండలం ఇటికాలపల్లిలో ఓ శిబిరం ఏర్పాటైంది. ఇటికాలపల్లి, నక్కవానిగూడెం, రామచంద్రాపురం, కొమురవెల్లి, కాల్వపల్లి గ్రామాల యువకులు ఇందులో పాల్గొన్నారు. ఈ ఏడాది హైదరాబాదు లలితకళా తోరణంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిబిరం నిర్వహించారు. పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురంలో మరో శిబిరం ఏర్పాటు చేశారు. అలాగే, సత్తయ్య పర్యవేక్షణలో రవికుమార్‌ స్వచ్ఛందంగా కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌లలో అయిదు శిబిరాలు నిర్వహించారు. ఇలా ఇప్పటి వరకూ 694 మందిని తీర్చిదిద్దారు. వీళ్లలో తొంభై శాతం మంది 20- 25 ఏళ్ల లోపు వారే. డిగ్రీపట్టా పుచ్చుకున్న చాలామంది కుర్రాళ్లు ఈ శిబిరాల ద్వారా కళాకారులయ్యారు. 
శిక్షణ... దీక్ష
ఒగ్గుకథ- డోలు శిక్షణ శిబిరాలను ఇప్పటి వరకూ గొల్ల కురుమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిర్వహిస్తూ వచ్చారు. శిబిరం నిర్వహణ మీద ఆయా గ్రామస్థుల ఆసక్తిని పరిశీలించి వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఎవరైనా వ్యక్తిగతంగా నేర్చుకోవాలనుకుంటే శిక్షణ ఇవ్వడానికి తాము సిద్ధమంటారు రవి. సాధారణంగా శిక్షణ శిబిరం 15- 20 రోజుల పాటు కొనసాగుతుంది. ప్రారంభంలో ఒగ్గుడోలు ధరింపజేసి వ్యాయామం చేయిస్తారు. మొదట రెండు రోజులు డోలు విశిష్ఠత, పవిత్రత తదితర అంశాలను వివరిస్తారు. అనంతరం ఓ రోజంతా డిల్లం (లయ   బద్దంగా డోలు వాయించడం) నేర్పిస్తారు. తర్వాత 10- 15 రోజులు ఒగ్గు డోలు ధరించి చేసే వివిధ రకాల విన్యాసాలు అభ్యాసం చేయిస్తారు. డోలు విన్యాసాల మీద పట్టుచిక్కాక కథ చెప్పడం నేర్పుతారు. దీనికి గురువు దగ్గర 40 రోజుల దీక్ష చేయాలి. దీన్ని మండల దీక్ష లేదా లింగం కట్టడం అంటారు. ఈ దీక్ష చేసిన వారే కథ చెప్పడానికి అర్హులు. దీన్ని నేర్చుకునేందుకు కుల, లింగ భేదాల్లేవు.  
కొత్త విన్యాసాలు
ఒగ్గు డోలు నుంచి వచ్చే శబ్దాన్ని ఓంకారం అంటారు. డోలు మీద లయబద్ధంగా కొట్టడం ద్వారా వచ్చే విభిన్న శబ్దాల ఆధారంగా డిల్లం, కండెం తదితర దరువులున్నాయి. అలాగే డోలు వాయిస్తూ వేసే అడుగులను ‘ముందడుగు, అల్లిరాణి, గొల్లభామ, సమ్మెట, పాంచ్‌పటాకా’ లాంటి పేర్లుతో పిలుస్తారు. ఒగ్గుడోలు మూలాలను కాపాడుకుంటూనే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రవి 29 కొత్త విన్యాసాలను రూపొందించారు. వాటిలో ముఖ్యమైనవి.. ‘సూర్మాన్‌గుండు’- ముగ్గురు కళాకారులు ఒకరిపై ఒకరు నిలబడి డోలు వాయిస్తారు; ‘తొట్టి’-  గుర్రపు స్వారీ భంగిమ ప్రదర్శిస్తారు; రాట్నం 1, రాట్నం 2’- ఇద్దరు కళాకారులు ఒక వ్యక్తి నడుం చుట్టూ అటూఇటూ కాళ్లతో పట్టుకొని వెనక్కి వాలతారు. ఆ వ్యక్తి గిరగిరా తిరుగుతాడు; ‘కృష్ణావతారం’- శ్రీకృష్ణుడి కాళీయమర్దన ఘట్టాన్ని ప్రదర్శిస్తారు; ‘శివముద్ర’- నటరాజ తాండవ విన్యాసాన్ని ఆవిష్కరిస్తారు; ‘విష్ణుముద్ర’- పాలసంద్రంలో విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న భంగిమ ప్రదర్శిస్తారు; ‘యాదాద్రి’- సుమారు ఆరుగురు కళాకారులు పర్వతం ఆకారంలో నిలుచుంటారు; ‘శ్రీశైల పర్వతం’- నలుగురు కళాకారులు పర్వతం ఆకారంలో నిలబడి జాతీయ జెండాను ప్రదర్శిస్తారు. కళాకారులు చిరుతపులి చారల వస్త్రాలు, పసుపు (బండారి) రంగు రుమాలు ధరించి శివరూపంలో కనిపించడం కూడా రవి ప్రవేశపెట్టిన పద్ధతే. 
కథకులంటే మాటకారులు
ప్రస్తుతం ఒగ్గు కళాకారులకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈమధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ప్రతి సాంస్కృతిక కార్యక్రమాన్నీ ఒగ్గుడోలు విన్యాసాలతో ప్రారంభిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలకు ఆహ్వానాలు అందుతున్నాయి. పల్లెల్లో గ్రామదేవతల ప్రతిష్ఠ, బీరప్ప, ఎల్లమ్మ, మల్లన్న ఆలయ ప్రారంభోత్సవాలు, బోనాలు, బతుకమ్మ, ఇతర సామూహిక పండగలప్పుడు డోలు కళాకారులు తప్పక ఉండాల్సిందే. అలాగే గొల్ల కురుమల ఇంట్లో వివాహం, పండగలు, మరణాలు ఇలా అన్ని సందర్భాల్లో కథలు చెప్పిస్తారు. అయిదు లేదా ఏడు లేదా పదిహేను రోజుల పాటు కథ కొనసాగుతుంది.  
      ఆటపాటల సమ్మిళితమైన ఒగ్గు కథ ‘గంగ’ ప్రార్థనతో ప్రారంభమవుతుంది. గంగమ్మను ‘శాంభవి రాణి’ అంటారు. ‘‘‘శరణు శరణు మాయమ్మ.. రాణి..శాంభవి రాణి.. శాంభవి రాణి.. కరుణ చూడుమా కన్నతల్లి’’ అనే గేయంతో కథను ప్రారంభిస్తారు. కథ చెప్పే వారు పలు పాత్రలకు అనుగుణంగా వివిధ వేషాలు ధరిస్తారు. కథాగాయక బృందంలో నలుగురు లేదా ఆరుగురు ఉంటారు. ఒకరు ప్రధాన కథకుడు, ఇద్దరు వాద్య  కారులు, మరొకరు వారికి సహాయకుడు. వాద్యకారుల్లో ఒకరు డోలు, మరొకరు తాళాలు వాయిస్తూ వంత పాడతారు. ప్రధాన కథకుడు గజ్జెలు కట్టుకుని చేతుల్లో ఒగ్గును పలికిస్తూ కథాగానం చేస్తారు. కథకు అనుగుణంగా ముఖకవళికలను మారుస్తుంటారు. సాధారణంగా గొల్లకురుమలు ‘మల్లన్న, బీరప్ప, ఎల్లమ్మ కథలు’ ఎక్కువగా చెప్పించుకుంటారు. ఇవే కాకుండా వాళ్ల కోరిక మేరకు ‘కీలుగుర్రం, కాటమరాజు, పెద్దిరాజు, సువర్ణసుందరి, సారంగధర, బయ్యమ్మ, కనకతార, గిరిజావతి, నలమహారాజు, చిరుతొండనంబి, మండోదరి, మార్కండేయ పురాణం, కాంభోజ రాజు, అల్లిరాణి, మన్మథరాజు, లింగ మహారాజు, నల్లపోచమ్మ, బాల నాగమ్మ, హరిశ్చంద్ర, లవంగ మహారాజు’ కథలూ చెబుతారు. ఒగ్గు కథలకు ప్రత్యేక లిఖిత రూపాలేవీ లేవు. గురువు చెప్పేది వింటూ కొత్త వాళ్లు నేర్చుకుంటారు.  గొలుసుకట్టు మాటలు, సామెతలు ప్రయోగించే నైపుణ్యం ఉన్నవారు కథకులుగా రాణిస్తారు. 
      ప్రాచీన కళారూపాలు చాలా వరకు కనుమరుగవడానికి కారణం తర్వాతి తరాలు వాటి పట్ల ఆసక్తి చూపక పోవడమే. కాలానుగుణంగా మార్పులు సంతరించుకోకపోవడం, ప్రజల్లో ఆదరణ కొరవడటం, సరైన జీవిక అందించక పోవడం వల్లే జానపద కళలు అంతర్థాన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే ఒగ్గుకథ ఈ అడ్డంకులన్నింటినీ అధిగమించి నిలిచింది. ఇందుకు పాలకుల మద్దతు ఓ కారణమైతే.. కళను కొత్తతరానికి చేరువ చేయాలనుకున్న చుక్క సత్తయ్య దీక్ష మరో కారణం. మిగిలిన కళారూపాలకు చెందిన సీనియర్‌ కళాకారులూ ఇలాంటి చొరవే తీసుకోవాలి. వాళ్లకి ప్రభుత్వం అండదండలందించాలి. అప్పుడే తరతరాల జాతి వారసత్వ సంపదలైన జానపద కళలన్నీ భావితరాలకు అందుతాయి.

 


వెనక్కి ...

మీ అభిప్రాయం